ఫీజు బకాయిలు 530 కోట్లు
► ఇంకా విడుదల కాని 2015-16 నిధులు
► పాసవుట్ విద్యార్థులకు
► సర్టిఫికెట్లు ఇవ్వని కళాశాలలు
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు భారీగా పేరుకుపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులను ప్రభుత్వం ఇప్పటికీ పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడం, ఇందుకు ప్రతిగా కోర్సులు పూర్తయిన విద్యార్థుల సర్టిఫికెట్లు ఇచ్చేందుకు కాలేజీలు నిరాకరిస్తుండటంతో విద్యార్థులు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. కంపెనీలు ఇం టర్వ్యూలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావా లని పేర్కొంటుండగా కళాశాలల తీరుతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 2015-16 విద్యాసంవత్సరంలో వివిధ సంక్షేమశాఖల్లో రూ.530 కోట్లు రీయింబర్స్‌మెంట్ నిధులు పెండింగ్‌లో ఉన్నాయి.
ట్రెజరీల్లోనే బ్రేక్...
పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి 2015-16 వార్షిక సంవత్సరంలో వచ్చిన దరఖాస్తుల పరిశీలన దాదాపు పూర్తయింది. బ్యాంకు ఖాతాలు సరిపోలక పోవడం, దరఖాస్తుల్లో పొరపాట్లతో దాదాపు 10% దరఖాస్తులు ఇంకా కళాశాలల యూజర్ ఐడీల్లో పెండింగ్‌లో ఉన్నాయి. పరిశీలన పూర్తయిన దరఖాస్తులు సంక్షేమ శాఖ అధికారుల లాగిన్ నుంచి ట్రెజరీ అధికారుల ఖాతాకు బదలాయిం చారు. అనంతరం సంక్షేమాధికారులు దరఖాస్తుల సమర్పణకు టోకెన్ నంబర్లూ పొందారు.
ఈ ప్రక్రియ 5 నెలల క్రితమే ముగిసినా... నిధులు ఇప్పటికీ విడుదల కాలేదు. ట్రెజరీల్లో నిధుల విడుదలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో రీయింబర్స్‌మెంట్ విడుదల కాలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఫీజు బకాయిల కోసం ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు ఒత్తిడి తీవ్రం చేయడంతో ఒకట్రెండు రోజుల్లో రూ.300 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని సర్కారు ఇటీవల హామీ ఇచ్చింది. ఇందుకు కళాశాలల యాజమాన్యాలు సమ్మతించినప్పటికీ నిధులు ఇప్పటికీ విడుదల కాలేదు.
సంక్షేమ శాఖల వారీగా
ఫీజు బకాయిలు..(రూ. కోట్లలో)
శాఖ బకాయిలు
ఎస్సీ 74.50
బీసీ 208.00
ఎస్టీ 82.05
మైనార్టీ 84.15
ఈబీసీ 81.22
వికలాంగ 0.15
మొత్తం 530.07