రాష్ట్ర బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి కేటాయింపులు పెరగనున్నాయి. దీనిపై కొంతకాలంగా సీఎం కేసీఆర్ మొదలుకొ...
బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖలకు పెరగనున్న నిధులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి కేటాయింపులు పెరగనున్నాయి. దీనిపై కొంతకాలంగా సీఎం కేసీఆర్ మొదలుకొని కింద వరకు వివిధ స్థాయిల్లో సాగిన కసరత్తు కొలిక్కి వచ్చింది. ప్రస్తుత బడ్జెట్‌లో కంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో సంక్షేమ శాఖల కు అదనంగా 20శాతం నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. సంక్షేమ శాఖలు సమర్పించిన ప్రతిపాదనలు, ఆయా శాఖల మం త్రులు, కార్యదర్శులు, అధికారుల తర్జనభర్జనల అనంతరం సంక్షేమరంగానికి రూ.28 వేల కోట్ల వరకు బడ్జెట్ కేటాయించవచ్చని తెలుస్తోంది.
ఎస్‌సీ అభివృద్ధి శాఖకు రూ.6వేల కోట్లు, ఎస్సీ ఉపప్రణాళిక కింద రూ.10వేల కోట్లు, గిరిజన సంక్షేమశాఖకు రూ.1,800 కోట్లు, ఎస్టీ ఉపప్రణాళిక కింద రూ.6,100 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.2,200 కోట్ల మేర ఆయా శాఖలు ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో షెడ్యూల్డ్ కులాల ఉపప్రణాళిక కింద రూ.8,089 కోట్లు, ఎస్సీ శాఖకు రూ.4 వేల కోట్లు, షెడ్యూల్డ్ తెగల ఉపప్రణాళిక కింద 5,036 కోట్లు, ఎస్టీశాఖకు 1,142 కోట్లు, బీసీ సంక్షేమశాఖకు రూ. 2,020 కోట్లు కేటాయించారు.
విడిగా బీసీ సబ్‌ప్లాన్ యోచన...
వెనుకబడిన తరగతుల సంక్షేమానికి బడ్జెట్‌లో విడిగా ఉపప్రణాళిక కింద నిధులు కేటాయించాలని కొంతకాలంగా బీసీ సంఘా లు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నా యి. ప్రత్యేక ప్రతిపత్తితో బీసీ సబ్‌ప్లాన్‌కు నిధులు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అయితే, దీన్ని బీసీ సంక్షేమశాఖ బడ్జెట్‌లో కాకుండా విడిగా విధా న ప్రకటనగా తీసుకురావాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈక్రమంలో బడ్జెట్‌లో బీసీ సబ్‌ప్లాన్ ఉంటుందా లేదా అన్నది స్పష్టం కాలేదు. సంచార జాతుల సంక్షేమానికి ఫెడరేషన్ ఏర్పాటు చేసి రూ.5కోట్లు కేటాయించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.