సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటన రాష్ట్ర బడ్జెట్‌పై ప్రభావం చూపింది. ఎన్నికలకు ముందు ఇదే ఆఖరి, పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో కొత్త పథకాలుంటాయనే అంచనాలకు తెరపడింది. అందరి దృష్టి జాతీయ రాజకీయాల వైపు మళ్లడంతో ఈసారి కొత్త పథకాలు, కొత్త ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిదని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకుంది.
శాఖలవారీగా ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రాజ్యాంగ నిబంధనలు, అసెంబ్లీ నియమావళి అడ్డుగా ఉండటమే ఇందుకు కారణం. 2018–19 రాష్ట్ర బడ్జెట్‌తోపాటు వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టే అంశాలపై మంత్రులు, ఆర్థికశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, ఈసారి బడ్జెట్‌లో వ్యవసాయదారుల కోసం మరిన్ని కార్యక్రమాలు, పథకాల కోసం నిధులు కేటాయిస్తున్నదని ముఖ్యమంత్రి చెప్పారు. వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నందున వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.
దీని సాధ్యాసాధ్యాలపై సమావేశంలో చర్చ జరిగింది. అయితే మొత్తం ప్రభుత్వానికి ఒకే బడ్జెట్ ఉండాలని, శాఖలవారీగా ప్రత్యేక బడ్జెట్లు ప్రవేశ పెట్టడానికి రాజ్యాంగ నిబంధనలు అంగీకరించవని అధికారులు వెల్లడించారు. అసెంబ్లీ నియమావళిలోని రూల్ నంబర్ 150 ప్రకారం ఆదాయ, వ్యయాలు మాత్రమే బడ్జెట్ కిందకు వస్తాయని వివరించారు. ఇతరత్రా ప్రణాళికలు, వివరణలన్నీ పద్దుల కిందకే వస్తాయిగానీ, ప్రత్యేక బడ్జెట్ కింద పరిగణించడానికి వీలు లేదని అధికారులు తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒకసారి వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టడం వివాదాస్పదమైందని అధికారులు చెప్పారు. కేంద్రంలోనూ రైల్వే బడ్జెట్‌ను ప్రధాన బడ్జెట్‌లోనే కలిపి ప్రవేశపెడుతున్న విషయాన్ని సీఎంకు వారు వివరించారు. దీంతో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు సీఎం ప్రకటించారు. వ్యవసాయరంగానికి ఇస్తున్న ప్రాధాన్యత, ప్రవేశ పెడుతున్న పథకాలు, వెచ్చిస్తున్న నిధులను బడ్జెట్‌లోనే వివరించాలని సీఎం చెప్పారు.
కొత్త పథకాలకు బ్రేక్...
వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందించే పథకాన్నే అత్యంత ప్రతిష్టాత్మకంగా బడ్జెట్‌లో ఆవిష్కరించాలని నిర్ణయించారు. ఎకరానికి రూ. 8 వేల చొప్పున 76 లక్షల మంది రైతులకు సాయం అందించే ఈ పథకానికి దాదాపు రూ. 11 వేల కోట్లను ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించనుంది. కల్యాణలక్ష్మి పథకం కింద అందిస్తున్న ఆర్థిక సాయాన్ని రూ. లక్షకు పెంచడం మినహా కొత్త పథకాల జోలికి వెళ్లకూడదని సూచనప్రాయంగా నిర్ణయించారు.
రాష్ట్రంలోని నిరుద్యోగులకు రూ. 2,000 చొప్పున నెలసరి భృతి అందించేందుకు చేసిన ప్రాథమిక కసరత్తును సైతం ప్రభుత్వం తాత్కాలికంగా పక్కనబెట్టింది. బడ్జెట్‌లో ఈ అంశాన్ని పొందుపరచాలా వద్దా అనేది ముఖ్యమంత్రి తుది నిర్ణయంపై ఆధారపడి ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే ఆసరా పెన్షన్లను రూ. 500 చొప్పున పెంచే ప్రతిపాదన కూడా పునరాలోచనలో పడింది.
Comments
Please login to add a commentAdd a comment