వ్యవసాయంపై నేడు సీఎం సమీక్ష
సంగారెడ్డి జోన్:
రైతుల క్షేత్రస్థాయి ఇబ్బందులతో పాటు గిట్టుబాటు ధర, ఉచిత ఎరువుల పంపిణీ పథకం అందజేయనున్న నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. 31 జిల్లాల వ్యవసాయ శాఖకు చెందిన సిబ్బంది మొదలుకొని ఉన్నతాధికారుల వరకు సమీక్షకు హాజరుకానున్నారు. వ్యవసాయాన్ని లాభాల బాట పట్టించడం ఎలా? పెట్టుబడుల తగ్గుదల, ఎరువుల కొనుగోలుకు ఎకరాకు రూ.4 వేలు చొప్పున రైతు ఖాతాల్లో జమ చేయడం తదితర అంశాలపై సీఎం చర్చించనున్నట్టు తెలుస్తోంది.
ఈక్రమంలో జిలా ్లకు చెందిన రైతుల బ్యాంకు, ఆధార్‌నెంబర్లుతో పాటు డిమాండ్ ఉన్న ఎరువులు, విత్తనాల తదితర విషయాలపై పూర్తిస్థాయి నివేదికలు సిద్ధం చేయడంలో సోమవారం వ్యవసాయాధికారులు తనమనకలయ్యారు. ఇప్పటికే ఎరువులు, విత్తనాల పంపిణీ కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, వ్యవసాయ శాఖ సంయుక్తంగా 90 కేంద్రాలు ఎంపిక చేశారు. ఒక్కో మండలంలో మూడు మండలాలను ఎంపిక చేసి ఆధార్ నెంబర్ ఆధారంగా సబ్సిడీపై రైతులకు విత్తనాలు అందించనున్నారు.
భూ సంరక్షణశాఖ పునరుద్ధరణ జరిగేనా?
తెలంగాణ ప్రాంతం ఎత్తుపల్లాలతో ఉండటమే కాకుండా నిజాం కాలంలో అనేక గొలుసుకట్టు చెరువుల నిర్మాణం జరిగింది. వర్షకాలంలో ఎగువ ప్రాంతం నుంచి భూసారం కొట్టుకుపోకుండా కాంటూర్ బండింగ్, చెక్ డ్యామ్‌లు, రాతి కట్టడాలను భూసంరక్షణశాఖ చేపట్టేంది. గతంలో ప్రత్యేక డివిజన్‌లో ఏడీఏ, నలుగురు ఏఓలు, ఒక ఏఓ, నలుగులు ఏఈఓలు పనిచేసేవారు. శాఖ నిర్వహణకు కేంద్రం కూడా నిధులు అందించేది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారుల అవగాహన లోపం వల్ల భూ సంరక్షణశాఖను వ్యవసాయశాఖలో విలీనం చేయడం వల్ల ఆర్‌ఏడీపీకి చెందిన రూ.1.30 కోట్లు వృథా అయ్యాయి. ఈక్రమంలో పీఎంఎస్‌కె కింద రూ.1.43 కోట్లు ఏడీఏల ఖాతాల్లో మూలుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.
భారీ ప్రాజెక్టులు కష్టమే..
జిల్లాలోని ప్రత్యేక భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో బహుళార్థక ప్రాజెక్టులు చేపట్టడం కష్టతరమని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈక్రమంలో చిన్నచిన్న ప్రాజెక్టుల వల్ల భూసారాన్ని కాపడంతో పాటు నీటి నిల్వల పెరుగుదల సాధ్యపడుతుందని భావిస్తున్నారు.