చేనుకు 'చేవ'.. రైతుకు రొక్కం | telangana cm kcr free fertilisers to farmers | Sakshi
Sakshi News home page

చేనుకు 'చేవ'.. రైతుకు రొక్కం

Published Fri, Apr 14 2017 3:08 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

చేనుకు 'చేవ'.. రైతుకు రొక్కం - Sakshi

చేనుకు 'చేవ'.. రైతుకు రొక్కం

కరువు తీరా ఎరువు.. అన్నదాతలకు సీఎం కేసీఆర్‌ ‘ఉచిత’ వరం
ఎకరానికి రూ. 4 వేల చొప్పున సాయం
55 లక్షల మంది రైతులకు.. 26 లక్షల టన్నుల ఎరువులు అందిస్తాం
ఏటా మే నెలాఖరులోగా రైతుల ఖాతాలో జమ
వచ్చే ఏడాది ఖరీఫ్‌కు ముందు నుంచే అమలు
ఆరునూరైనా అమలు చేసి తీరుతాం
లంచాలు, పైరవీలేమీ లేకుండా చర్యలు
గ్రామ రైతు సంఘాలకే పథకం బాధ్యతలు
రైతులు, వారి భూముల వివరాలు కంప్యూటరైజ్‌
దేశంలోనే మరో చారిత్రక నిర్ణయమిదన్న సీఎం


సాక్షి, హైదరాబాద్‌
రైతుల రుణమాఫీ పూర్తికాగానే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వారికి మరో వరం ప్రకటించారు. రైతులందరికీ ప్రభుత్వమే ఉచితంగా ఎరువులను సరఫరా చేస్తుందని ప్రకటించారు. ఎరువుల కొనుగోలు కోసం ఒక్కో ఎకరానికి రూ.4 వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే దీనిని అమల్లోకి తీసుకువస్తామని.. చినుకు పడకముందే మే నెల చివరి నాటికి రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని హామీ ఇచ్చారు. రైతుల రుణమాఫీ పూర్తయిన నేపథ్యంలో గురువారం వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు ప్రగతి భవన్‌కు వచ్చారు. సీఎం కేసీఆర్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జనహితలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

‘‘దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 36 లక్షల మంది రైతులకు చెందిన 17 వేల కోట్ల రుణాలను మాఫీ చేసుకున్నం. ఇప్పుడు రైతులందరూ రుణ విముక్తులయ్యారు. నా కెంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు దేశంలోనే మరో కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతున్నాం. ఇవ్వాళ నేను చెప్పేది పెద్ద చరిత్ర అయితది. అది వింటే దేశం దేశమే ఆగమైతది. తెలంగాణలో మొత్తం 55 లక్షల మంది రైతులున్నరు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆ రైతులందరూ వాడే 26 లక్షల టన్నుల ఎరువులను పూర్తి ఉచితంగా సరఫరా చేస్తాం.. ఒక రైతు బిడ్డగా నేను రైతులకు చేయగలిగిన సేవ ఇది..’’అని ప్రకటించారు.

ఆరునూరైనా సరే అమలు చేస్తం..
ఎన్నో రకాలుగా రైతులను ఆదుకుంటే తప్ప బంగారు తెలంగాణ కాదని, రైతు బాగుపడితేనే బంగారు తెలంగాణ అవుతుందని చెప్పారు. ఆరునూరైనా సరే రైతులకు ఉచిత ఎరువులు సరఫరా కావాలని... ‘మేం బాగుపడ్డాం, ఫర్వాలేదు మేం కూడా సగం పెట్టుకుంటా’మని రైతులు అనేదాకా సరఫరా కావాలని ఆకాంక్షించారు. ఒక ఎకరానికి రెండు దుక్కిమందు బస్తాలు, రెండు      మిగతా 0వ పేజీలో u
యూరియా బస్తాలు కలిపి ఎకరానికి రూ.4 వేలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఐదెకరాలున్న రైతులకు ప్రభుత్వమే రూ.20 వేల వరకు ఇస్తుందన్నారు. ‘‘ఎరువులకు సరిపడా నేనిస్తా.. పురుగు మందులు, విత్తనాలు మాత్రం మీరే కొనుక్కోవాలి..’’అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. విత్తనాలపై సబ్సిడీ కొనసాగుతుందని చెప్పారు.

లంచాలు, పైరవీలు ఉండనివ్వం..
ఉచిత ఎరువుల పథకం నిజాయతీగా అమలు కావాలని, పైరవీకారులకు తావు లేకుండా రైతులే అందుకు సహకరించాలని కేసీఆర్‌ సూచించారు. ఏటా చినుకు పడకముందే మే నెలలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలోనే డబ్బు వేస్తామని చెప్పారు. 55 లక్షల మంది రైతులకు ఏటా ఎకరానికి రూ.4,000 చొప్పున ఖాతాలో జమ చేయడం తెలంగాణలో ఒక సంప్రదాయంగా అమలు కావాలని ఆకాంక్షించారు. ‘‘మధ్యలో పైరవీకారుల్లేరు. లంచం ఇచ్చేది లేదు. దఫ్తర్‌కు పొయి తిరిగేది లేదు. దండం పెట్టేది లేదు. ఉదాహరణకు నాకో నాలుగెకరాలుంది. ఒక ఎకరం అమ్మితే అప్పటికప్పుడే ఆ వివరాలు కంప్యూటరైజ్‌ కావాలి. వెంటనే రిజిస్ట్రేషన్‌ కావాలి. తహసీల్దార్లకు, రిజిస్ట్రేషన్‌ ఆఫీసులకు ఆదేశాలు జారీ చేస్తాం. ప్రతి గ్రామంలో గ్రామ రైతు సంఘంలో రైతుల భూముల వివరాలుండాలి.

గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)ల తరహాలో ప్రతి గ్రామంలో ఈ సంఘం ఉండాలి. అందరు రైతులకు అందులో ప్రాతినిధ్యం ఉండాలి. నిజాయతీగా గ్రామంలోని రైతుల జాబితాను, ఎవరికెంత భూమి ఉందనే వివరాలను ఆ సంఘమే నమోదు చేయాలి. వాటి ఆధారంగా డబ్బులు బ్యాంకులో వేస్తాం. ఆ డబ్బుతో విత్తనాలు వేయకముందే రైతులు ఎరువులు కొనుక్కోవాలి. ఏటా మే 31లోగా డబ్బులు ఖాతాలో వేస్తాం..’’అని కేసీఆర్‌ తెలిపారు.

కోటి ఎకరాలకు నీరు పక్కా..
ఉమ్మడి రాష్ట్రంలో రైతుల పరిస్థితి దీనంగా ఉండేదని, అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునేంతవరకు వారి పరిస్థితి దిగజారిందని కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ తెచ్చుకున్నట్లుగానే కోటి ఎకరాలకు గోదావరి నీటిని తెచ్చి చూపిస్తామని.. పక్కాగా మూడు నాలుగేళ్లలో సాగునీరందిస్తామని చెప్పారు. మేడిగడ్డ నుంచి శ్రీరాంసాగర్‌ నింపుతామని, నిజాంసాగర్‌ కూడా ప్రతి ఏడాదీ నింపుకుంటామని పేర్కొన్నారు. ప్రాజెక్టులు సాకారమైతే తమకు ఓట్లెవరూ వేయరని ప్రతిపక్షాల భయపడుతున్నాయని వ్యాఖ్యానించారు. రైతులకు కరెంటు కోత ఉండదని, మండే ఎండాకాలంలోనూ 9 గంటలు సరఫరా చేస్తున్నామని తెలిపారు.

రైతులు సంఘటితం కావాలి
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని.. రైతులకు సాధ్యమైనంత ఎక్కువ ప్రయోజనం చేయాలనేదే తన ఆలోచన అని కేసీఆర్‌ చెప్పారు. ‘‘ఏ వస్తువుకైనా తయారు చేసేవాడే రేటు నిర్ణయిస్తాడు. రైతు పండించే పంటకు మాత్రం ఆ పరిస్థితి లేదు. అందుకే రైతులు సంఘటితం కావాలి. క్రాప్‌ కాలనీలు ఏర్పాటు చేసుకోవాలి. రాష్ట్రంలో ఏ పంట, ఎంతమేరకు.. ఏ ప్రాంతంలో పండించాలి.. ఎంత విస్తీర్ణంలో పండించాలో అంతే వేయాలి. ఇప్పుడు టమాటాకు రూ.70 పలుకుతోందని రైతులంతా టమాటా వేస్తే ఆ రేటు 70 పైసలకు పడిపోతుంది. అది సరైన పద్ధతి కాదు. అందుకే మార్పు రావాలి. క్రాప్‌ కాలనీలకు అవసరమైన పరిశోధన జరుగుతుంది. రైతులు విధిగా అనుసరించాలి..’’అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ కవిత, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు గంప గోవర్దన్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, షకీల్‌ తదితరులు పాల్గొన్నారు.

రిజర్వేషన్లు సాధించి తీరుతాం..
సామాజికంగా, విద్యపరంగా వెనుకబడిన ముస్లిం కులాలకు రిజర్వేషన్లు పెరిగి తీరుతాయని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ముస్లిం, మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్న ప్రకటన నేపథ్యంలో.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో మైనారిటీలు గురువారం ప్రగతిభవన్‌కు చేరుకుని కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణది గంగా జమున తెహజీబ్‌ అని.. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని పేర్కొన్నారు. రిజర్వేషన్ల పెంపుపై సందేహాలు అవసరం లేదని... తమిళనాడు తరహాలో తెలంగాణలోనూ పెంచుకుంటామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement