సిరిసంపదలు సృష్టించడం బ్రహ్మ విద్య మాత్రమే కాదు, ఒక గొప్ప కళ. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కాగానే ఆయన సొంత వ్యవసాయ క్షేత్రంలో సాలుకి ఎకరాకి కోటింజిల్లర ఆదాయం రావడం మొదలు పెట్టింది. ఆదిత్యుని కటాక్ష వీక్షణాలతో శమంతకమణి తునక ఆ క్షేత్రంలో జారిపడిందని సనాతనులు విశ్వసించారు. కాదు, హైబ్రిడ్ క్యాప్సికమ్ అనే బుంగ మిరపకాయలు విరగకాసి తద్వారా కోటికి పడగలెత్తారని చంద్రశేఖరరావు నమ్మినబంట్లు పొలికేకలు పెట్టారు. ‘కాదు.. ఇవన్నీ శాస్త్రానికి నిలవవు’ అంటూ విషయ పరిజ్ఞానం కలిగిన హేతువాదులు ఇళ్లెక్కి అరిచి మొత్తుకున్నారు. ఏది ఏమైనా వ్యవసాయ క్షేత్రాలకు ఆఖ రికి వజ్రాలు పండినా పన్నులేదని ట్యాక్స్‌వాళ్లు తేల్చి చెప్పారు. ఆ మహాపంట, ఆ ఆదాయం వాటి వెనకాల ఉన్న శక్తి యుక్తులు ఏవిటో ఈ రోజుకీ ఆయనకు తప్ప వేరేవరికీ తెలియదు. చిదంబర రహస్యంగానే మిగిలి ఉంది. ఈ శమంతకోపాఖ్యానాన్ని ఇలా ఉంచి మరికొన్ని ఆదాయ వనరుల్ని పరిశీలిద్దాం. ఆనాడు గాంధీగారికి వేసిన సాదా సీదా పూలదండని ఏ బిర్లాగారో వెయ్యి రూపాయలకు వేలంలో పాడి ఉద్యమానికి జమవేసిన సందర్భం ఉంది. కాంగ్రెస్ సభలో నెహ్రూగారి మెళ్లో పడిన నూలు దండని వెయ్యినూట పదహార్లకు సింఘానియాలు సొంతం చేసుకుని పార్టీ నిధికి జమవేశారు. అప్పటి రోజుల్లో పరోక్షంగా అవన్నీ భూరి విరాళాలు. ఇప్పుడు కేవలం ఒక ప్లేటు భోజనం. అంతే!
ఈమధ్య వేలంపాటల తాలూకు అపశ్రుతులు పేపర్ల కెక్కాయ్. మెట్రోలో జోకులై చిటపటలాడాయ్. మన అగ్ర నేతలంతా శ్రమదానాలతో లక్షలకి లక్షలు కుమ్మారని, దాన్ని సొంత పార్టీకి మంచి పనులకి ధారపోసి దానవీరం ప్రదర్శించారని వార్తలొచ్చాయ్. ఒకాయన చిన్న చిన్న బరువులు మోసి అయి దా రులకారాలు ప్రజల నుంచి గుంజాడు. కేటీఆర్ స్వయంగా కొన్ని చిన్నాచితక పనులు చేసి లక్షలు ఆర్జించి ప్రజలకి ధారపోసి, చేతికి ఎముక లేదని నిరూ పించుకున్నారు. అమ్మాయి కవిత నే తక్కువ తిన్నానా.. ఇదిగో నా కష్టార్జితం అంటూ లక్షలు గుమ్మరించి నుదుటి చెమట తుడుచుకుంది. హరీష్‌రావు పై సంగతి వేసి పెద్దరికంగా మిగిలిపోయారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్మాణాల దగ్గర ఇసుక సిమెంట్, కంకర బొచ్చెలకెత్తుకుని కేసీఆర్ లక్షలకి లక్షలు ఉద్యమ సాదరు ఖర్చులకు లోటు లేకుండా చూశారు. ఇంతవరకు బానే ఉంది. తర్వాత అసలు కథ మొదలైంది. మీ మీ శ్రమదాన ఆదాయాన్నీ లెక్కల్లో చూపించారా? దానికి పద్ధతిగా పన్ను చెల్లింపులు జరిగాయా? చెల్లించని యెడల మీ ‘ఈజీ మనీ’పై అపరాధ రుసుంతో సహా ఫలానా ఫలానా నిబం ధన కింద పన్నెందుకు వసూలు చేయరాదో చెప్పాలని కేటీఆర్ అని కూడా ఖాతరు చెయ్యకుండా ఐటీవాళ్లు తాఖీదులు జారీ చేశారు.
అసలు ఆదాయపు పన్ను వారికి ఓర్పు, సహనాలు చాలా తక్కువ. హస్తవాసి బావుండి డాక్టర్‌కి పది రూపా యలు అదనంగా వస్తే వాళ్లు సహించలేరు. వాక్శుద్ధి కలిగిన లాయర్‌కి నాల్రూపాయలు వచ్చాయని తెలిస్తే తట్టుకోలేరు. ఆఖరికి ప్రైవేట్ ట్యూషన్ మేష్టర్లని కూడా వదలరు. ఆ మధ్య అపరకర్మల మీద బాగా పిండు కుంటున్నాడని ఓ పంతుల్ని కర్మల రేవులో రెడ్ హ్యాండె డ్‌గా కాటేశారు ఇన్‌కమ్‌ట్యాక్స్ వాళ్లు. గోదాన, భూదాన సువర్ణాది షోడశ దానాలూ పరోక్షంగా పెద్ద తలకాయలకే ముడుతున్నట్టు తేల్చి పాపం ముంచేశారు. పంతులు చేసేది లేక వచ్చిన శాపనార్థాలన్నీ పెట్టాడు. ఐటీ శాఖ వారు ‘జాన్‌దేవ్’ అనేసి నోటీసులు జారీ చేసేశారు. లాటరీ వచ్చినా వాళ్లొదలరు. ‘జన్మకో శివరాత్రి మహా ప్రభో వదలండి’ అని కాళ్లావేళ్లా పడ్డా మాక్కూడా సేమ్ టు సేమ్ కదా అంటూ రూపాయికి పావలాలు పట్టేస్తారు. ఇదివరకు, ఇప్పుడు కూడా పార్టీ పెద్ద పండుగల ప్పుడు సభల్లో హుండీలు పెడతారు. కలెక్షన్లు బానే ఉంటాయ్. ఇక్కడో చమత్కారం ఉందని చెబుతారు. ‘ఏవుంది, ఓ చేత్తో పడేసి, ఇంకో చేత్తో తీసుకోవడమే.. ఈ రోజుల్లో హుండీలో వేసేది ఎవరండీ అని’ ఒకాయన వాపో యాడు. మనమే తుమ్మి మనమే చిరంజీవ అనుకోవాలి. ఎవరిని నమ్మి కరెన్సీ కట్టలిస్తాం? మళ్లీ అన్నీ పడ్డాయో లేదో తేలేదాకా టెన్షను.
ఇలా హుండీ ఆదాయాలు చూపించకపోతే తర్వాత ఏ శేషనో ఖర్చులు బైటికిలాగి లేనిపోని యాగీ చేస్తే– అదో పెద్ద తంటా. ఇవన్నీ గుప్తదానాలు. ఎవరు ఏమిచ్చారో ఎందుకిచ్చారో చెప్పక్కర్లేదు. చంద్రబాబు పదే పదే అంటు న్నట్టు బంగారు గుడ్లు పెట్టే బాతుగా ప్రతి హుండీ ఆ రోజుల్లో నిధులు సమకూర్చేది. మావూరి రచ్చబండ మీద ఒక పెద్దాయన తాజా విశేషాలు చెబుతూ, మా చంద్ర బాబుకి అయిదేళ్లనాడు ఈ సంగతి తెలిస్తేనా... అంటూ మొదలుపెట్టాడు. మొన్న మన గోడవతల చైనాలో తొమ్మిది రోజుల్లో వెయ్యి పడకల ఆసుపత్రిని, ఇంకో వారంలో ఇంకోటి నిర్మించారట. వాళ్ల దగ్గర కావల్సిన యంత్రాంగం, మంత్రాంగం ఉందిట! మనకి మాట మాత్రం తెలిస్తే మనకీ అద్భుతం జరిగేది అనగానే అంతా ఛీకొట్టారు. వాళ్లది వేరు, మనది వేరు అని నోరు మూయించారు.
శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
దానవీరులు
Published Sat, Feb 8 2020 4:28 AM | Last Updated on Sat, Feb 8 2020 4:28 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment