రాష్ట్ర బడ్జెట్ రూ.1.30 లక్షల కోట్లు!
బడ్జెట్ తయారీకి సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ వెల్లడి కావడంతో రాష్ట్ర బడ్జెట్ తయారీ వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈసారి రూ.1.25 లక్షల కోట్ల నుంచి రూ.1.30 లక్షల కోట్ల వరకు బడ్జెట్ ఉండేలా తుది కేటాయింపులు జరపాలని సీఎం సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ‘కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో రాష్ట్రంపై ఏమేరకు ప్రభావం ఉంటుంది.. కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చే అవకాశముంది’ అని సీఎం ఆరా తీశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను సీఎం తన క్యాంపు కార్యాలయంలో టీవీలో వీక్షించారు. అనంతరం ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి, సీఎస్ రాజీవ్‌శర్మ, ముఖ్య అధికారులు నర్సింగ్‌రావు, రామకృష్ణారావు, నవీన్ మిట్టల్, బీపీ ఆచార్యలతో చర్చించారు. కేంద్ర పథకాలు, కేంద్రం పన్నుల్లో రాష్ట్ర వాటా, కేంద్రం నుంచి వచ్చే ఇతర గ్రాంట్లు, తదితర అంశాలపై ప్రాథమికంగా అంచనాలు వేశారు. కేంద్ర బడ్జెట్ ప్రాధమ్యాలు, కేంద్ర కేటాయింపులతో రాష్ట్ర పథకాలపై పడే ప్రభావం గురించి సీఎం అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.