బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత
అందుకోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం: కేసీఆర్
⇒ సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థుల మెస్ చార్జీల పెంపు
⇒ అందరూ కావాలంటే వచ్చే ఏడాది బీసీ సబ్‌ప్లాన్
⇒ దళితులకు భూపంపిణీ నిరంతర ప్రక్రియ
⇒ అంబేడ్కర్ 105వ జయంతినాడు 10 వేల ఎకరాలు పంచుతాం
⇒ ఈ ఏడాదే రెండు లక్షల ‘డబుల్’ ఇళ్లు నిర్మిస్తాం
⇒ ఫీజుల పథకం కొనసాగుతుందని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. బీసీలకు సబ్ ప్లాన్ తేవడానికి తమకు ఏ మాత్రం అభ్యంతరం లేదని.. అది కావాలని అందరూ భావిస్తే వచ్చే ఆర్థిక సంవ త్సరంలోనే తీసుకొస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా రిటీలే ఉన్నారని.. ఓసీ కులాలన్నీ కలిస్తే తొమ్మి దింపావు శాతమే ఉంటారని పేర్కొన్నారు. కులానికో సబ్‌ప్లాన్ పెట్టేస్తే ఏ గొడవ ఉండదని నవ్వుతూ అన్నారు.
శుక్రవారం అసెంబ్లీలో పద్దులపై చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడారు. సంక్షేమ హాస్టళ్ల మెస్ చార్జీల పెంపునకు ఆదేశా లిచ్చామని.. ప్రస్తుతమిస్తున్న రూ.600–650ను రూ.1,000–1,100కు పెంచాలని నిర్ణయించా మని తెలిపారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో ప్రకటన చేస్తామన్నారు. ఎంబీసీ (మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్లాస్)పై ఇంకోసారి నిర్ణయం తీసు కోవాల్సి ఉందని.. అది కూడా బీసీ కమిషన్‌కు ఇచ్చి నిర్ధారణ చేయాల్సి ఉందని పేర్కొన్నారు.
భూపంపిణీ చేస్తాం..
దళితులకు ఇప్పటికే పంపిణీ చేసిన 9 వేల ఎకరాలు కాకుండా.. అంబేడ్కర్ 105వ జయం తి సందర్భంగా మరో 10 వేల ఎకరాల భూమి ని ఒక ప్యాకేజీగా దళితులకు పంచుతామని కేసీఆర్ వెల్లడించారు. భూమితోపాటు ఒక ఏడాది పెట్టుబడినీ ఇస్తామన్నారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ తనకున్న 66 ఎకరాల భూమిని దళితులకు ఇవ్వడానికి ముం దుకు వచ్చారని తెలిపారు. విదేశాల్లో, హైదరా బాద్‌లో స్థిరపడి.. ఊళ్లలో ఉన్న వ్యవసాయ భూమిని పట్టించుకోని వారు దళితులకు ఇవ్వొచ్చని.. అలాంటివారుంటే ఎమ్మెల్యేలు ఒప్పించాలని సూచించారు. భూపంపిణీ నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు.
‘ఫీజు’ కొనసాగుతుంది
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తీసుకొచ్చారని, దాన్ని తాము ఏమాత్రం మార్చకుండా అలానే అమలుచేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. రీయింబర్స్‌మెంట్ పెండింగ్‌లో ఉందంటూ కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నది వాస్తవం కాదని.. ఏ కాలేజీ అయినా సర్టిఫికెట్లు ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక విదేశాలకు వెళ్లే పేదలకు అపరిమితంగా సాయం చేస్తామని... 300 దరఖాస్తులు వస్తే 136 మందికి సాయం చేశామని కేసీఆర్ పేర్కొన్నారు. ఎన్ని వందల మంది విదేశాలకు వెళ్లాలనుకున్నా సాయం చేస్తామని తెలిపారు.
ఈ ఏడాది రెండు లక్షల ఇళ్లు..
పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, నీటిపారుదల శాఖల్లో సుమారు రూ.50 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని, అందువల్ల డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి పెద్ద కాంట్రాక్టర్లు అందుబాటులోకి రాలేదని కేసీఆర్ చెప్పారు. వారితో ఈ మధ్యే మాట్లాడామని, ఈ ఏడాది గ్రామాల్లో లక్ష ఇళ్లు, హైదరాబాద్‌లో మరో లక్ష ఇళ్లు కట్టించి ఇస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది కూడా ఇళ్లు మంజూరు చేస్తామని, ఎంత ఖర్చయినా నిర్మించి ఇస్తామని తెలిపారు. ఎవరిపైనా తమకు వివక్ష లేదని పేర్కొన్నారు. ‘దళిత క్రిస్టియన్లు కూడా ఉంటారు. కానీ రిజర్వేషన్ వంటివి దక్కవేమోనని క్రిస్టియన్లని చెప్పుకోవడానికి వెనుకాడతారు. వారికి న్యా యం జరగాలి. మతం మారినంత మాత్రాన కులం మారాల్సిన అవసరం లేదు. దళిత క్రిస్టియ న్లకు సంబంధించి కేంద్రానికి లేఖ రాస్తున్నాం. అన్ని మతాలకు సమాన గౌరవం ఇస్తున్నాం. క్రిస్టియన్లను తక్కువ చేసి చూడటంలేదు. అందరికీ లబ్ధి చేకూర్చుతాం’ అని కేసీఆర్ తెలిపారు.
హైదరాబాద్ నుంచి హజ్ వెళ్లేవారు ‘గెస్ట్ ఆఫ్ అల్లా’
‘‘ప్రపంచంలో ఎవరికీ లేని గౌరవం తెలంగాణ రాష్ట్రానికి ఉంది. ప్రపంచం మొత్తం హజ్ యాత్రకు మక్కాకు వెళ్తారు. మన నిజాం రాజు పవిత్రమైన కాబా పక్కనే రుబాత్ కట్టారు. పూర్వ హైదరాబాద్ స్టేట్ నుంచి వెళ్లి ఆ రుబాత్‌లో ఉండే వారిని గెస్ట్ ఆఫ్ అల్లా అంటారు. అలాంటి ప్రత్యేకతలు ఉండా లనే అజ్మీర్‌లో ప్రయత్నం చేస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ రెండుసార్లు రాజస్థా న్‌కు వెళ్లి అక్కడి సీఎంకు విజ్ఞప్తి చేశారు. మరోసారి వెళ్లి స్థలం కోసం ప్రయత్నిస్తారు. రెండో అధికార భాషగా ఉర్దూను అమలు చేయాలని రెండు మూడు రోజుల కిందే ఆదేశించాను. యూసుఫెన్ దర్గా, బడీ పహాడ్ దర్గా, జహంగీర్ పీర్ దర్గా.. ఇక్కడ ముస్లింల కంటే హిందువులు ఎక్కువగా వెళ్తా రు. ఔరంగజేబు గోల్కొండపై దాడి చేసే సమయంలో యూసుఫేన్ దర్గా వద్ద తలవంచాకే ఆయనకు విజయం వరించిందని అంటారు. నేను చాలా సార్లు వెళ్లాను. టీఆర్‌ఎస్ ప్రకటించినప్పుడు 2001లో యూసుఫేన్ దర్గా వద్ద పాదాభివందనం చేసి ర్యాలీగా వెళ్లాను’’ అని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
రూ.1.12 లక్షల కోట్లు
‘బడ్జెట్ లెక్కల్లో పొంతని లేదని విమర్శిస్తున్నారు. వాస్తవానికి పొంతన ఉండదు. అన్ని రాష్ట్రాలకూ అలాగే ఉంటుంది. బడ్జెట్ అంచనా, సవరించిన అంచ నా అని ఉంటుంది. ఈ ఏడాది రూ.1.07 లక్షల కోట్ల వ్యయానికి చేరుకుంటామని భావించాం. అదృష్టవశాత్తు రూ.1.12 లక్షల కోట్లకు చేరుకుంటున్నాం’ అని కేసీఆర్ తెలిపారు.