కొత్త జాతీయ రహదారులు 2,776 కి.మీ. | cm kcr speaks in assembly over national highways in telangana | Sakshi
Sakshi News home page

కొత్త జాతీయ రహదారులు 2,776 కి.మీ.

Published Sat, Dec 24 2016 2:10 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

కొత్త జాతీయ రహదారులు 2,776 కి.మీ. - Sakshi

70 ఏళ్లలో రానిది.. రెండున్నరేళ్లలో తెచ్చాం: సీఎం కేసీఆర్‌
ఇవి పూర్తయితే దక్షిణాదిలో మనమే టాప్‌
ఇప్పటికే ఉన్న ఎన్‌హెచ్‌ల అభివృద్ధికి 8,000 కోట్ల రూపాయలు
అటవీ, మారుమూల ప్రాంతాల్లోని రోడ్ల అభివృద్ధికి రూ.1,020 కోట్లు
హైదరాబాద్‌ చుట్టూ 338 కిలోమీటర్ల మేర రీజినల్‌ రింగ్‌ రోడ్డుకూ ఓకే
బంగారు తెలంగాణ సాధనలో మేలిమలుపు ఇది
దీనిపై శాసనసభ తరఫున కేంద్రానికి కృతజ్ఞతలు చెబుతున్నాం
అసెంబ్లీలో జాతీయ రహదారుల అంశంపై ముఖ్యమంత్రి ప్రకటన  



సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 2,776 కిలోమీటర్ల మేర 18 కొత్త జాతీయ రహదారులను (ఎన్‌హెచ్‌లు) ఏర్పాటు చేసేందుకు కేంద్రం అంగీకరించిందని సీఎం కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన ఏడు దశాబ్దాల కాలంలో తెలంగాణ వ్యాప్తంగా 2,527 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులుంటే... తమ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లలోనే 2,776 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను సాధించుకున్నామని చెప్పారు. ఇది బంగారు తెలంగాణ సాధనలో మేలిమలుపు అని, ఇది రాష్ట్రం సాధించిన గణనీయ విజయమన్నారు. శుక్రవారం శాసనసభలో ఎన్‌హెచ్‌లపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. తమ అభ్యర్థనలోని సహేతుకతను గుర్తించి పెద్ద మొత్తంలో జాతీయ రహదారులను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర శాసనసభ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.


సమైక్య పాలనలో వివక్ష..
తెలంగాణ ఏర్పడే నాటికి జాతీయ రహదారుల విషయంలో జాతీయ సగటు 2.80 కి.మీ.గా ఉంటే... ఆంధ్రప్రదేశ్‌ సగటు 3.15 కి.మీ., తెలంగాణ సగటు 2.20 కి.మీ.గా ఉందని కేసీఆర్‌ చెప్పారు. సమైక్య రాష్ట్రంలో ఎన్‌హెచ్‌ల విషయంలోనూ వివక్ష కొనసాగిందన్నారు. తాజాగా కేంద్రం మంజూరు చేసిన నూతన రహదారులు ఏర్పాటైతే రాష్ట్రంలో జాతీయ రహదారుల పొడవు 5,303 కిలో మీటర్లకు చేరుతుందని చెప్పారు. అప్పుటికి జాతీయ సగటు 3.81 కిలోమీటర్లుగా ఉంటే.. తెలంగాణ సగటు అంతకన్నా ఎక్కువగా 4.62 కిలోమీటర్లకు చేరుతుం దని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో జాతీయ రహదారుల విషయంలో తెలంగాణ ఇప్పటివరకూ అట్టడుగున ఉందని.. కొత్త రహదారులు ఏర్పాటైతే దక్షిణాదిలోనే అగ్రగామి అవుతుందని చెప్పారు.


రోడ్లన్నింటికీ మహార్దశ
రాష్ట్రంలో ప్రస్తుతమున్న జాతీయ రహదారులను నాలుగు లేన్లు (ఫోర్‌ లేన్‌)గా విస్తరించేందుకు కేంద్రం మరో రూ.8 వేల కోట్లను మంజూరు చేసిందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. జాతీయ రహదారుల అభివృద్ధి పనుల కోసం రూ.2,690 కోట్ల విలువైన ప్రాజెక్టులను.. రాష్ట్రంలోని ఇతర రోడ్ల అభివృద్ధి కోసం సెంట్రల్‌ రోడ్‌ ఫండ్‌ నుంచి రూ.1,020 కోట్లను మంజూరు చేసిందని వెల్లడించారు. అటవీ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి కోసం రూ.1,590 కోట్లతో పంపిన ప్రతిపాదనలకు కూడా కేంద్రం అంగీకరించిందని కేసీఆర్‌ తెలిపారు. గోదావరి నది తీరం వెంట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సారపాక నుంచి కాళేశ్వరం దాకా, ప్రాణహిత నది వెంట కాళేశ్వరం నుంచి కొమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల దాకా రోడ్ల ప్రతిపాదనలు పంపామని చెప్పారు. ఇక హైదరాబాద్‌ చుట్టూ మరో రింగ్‌రోడ్డు కోసం ప్రతిపాదనలు పంపగా... 338 కిలోమీటర్ల మేర అతి పొడవైన రీజనల్‌ రింగ్‌రోడ్డును జాతీయ రహదారుల ప్రమాణాలతో నిర్మించడానికి కేంద్రం అంగీకరించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనలపై విశాల దృక్పథంతో స్పందించి.. రహదారులు, నిధులను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు కృషి చేసిన ఆర్‌అండ్‌బీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆ శాఖ అధికారులను కేసీఆర్‌ అభినందించారు.

సీఎం చెప్పిన కొత్త జాతీయ రహదారులివే..
రహదారి                                                                                                  దూరం (కి.మీలలో)
హైదరాబాద్‌–మెదక్‌–రుద్రూరు–బోధన్‌–బాసర–భైంసా                                            248
నిజాంపేట–నారాయణఖేడ్‌–బీదర్‌                                                                        60
మద్దునూర్‌–బోధన్‌–నిజామాబాద్‌                                                                       76
హైదరాబాద్‌–మొయినాబాద్‌–చేవెళ్ల–మన్నెగూడ–కొడంగల్‌–కర్ణాటక                          135
కోదాడ–మిర్యాలగూడ–దేవరకొండ–కల్వకుర్తి–జడ్చర్ల                                              211
కరీంనగర్‌–సిరిసిల్ల–కామారెడ్డి–ఎల్లారెడ్డి–పిట్లం                                                      165
సిరిసిల్ల–సిద్ధిపేట–జనగామ–అర్వపల్లి–సూర్యాపేట                                                 184
మంచిర్యాల–చంద్రాపూర్‌ వయా ఆసిఫాబాద్, రెబ్బన                                                 90
నిర్మల్‌–మామడ–ఖానాపూర్‌–మల్లాపురం–రాయికల్‌                                               90
సూర్యాపేట–ఖమ్మం–అశ్వారావుపేట–రాజమండ్రి                                                   177
సారపాక–ఏటూరునాగారం–కాళేశ్వరం–చెన్నూరు–కౌటాల–సిర్పూర్‌                           396
మిర్యాలగూడ–పిడుగురాళ్ల–నర్సరావుపేట                                                             26
భద్రాచలం–జీలుగుమిల్లి–జంగారెడ్డిగూడెం–దేవరపల్లి                                                68
జహీరాబాద్‌–బీదర్‌–దెగ్లూర్‌                                                                               25
సంగారెడ్డి–నర్సాపూర్‌–తూప్రాన్‌–గజ్వేల్‌–జగ్‌దేవ్‌పూర్‌–భువనగిరి–చౌటుప్పల్‌            152
చౌటుప్పల్‌–ఇబ్రహీంపట్నం–ఆమనగల్‌–షాద్‌నగర్‌–చేవెళ్ల–శంకర్‌పల్లి–కంది                186
మెదక్‌–సిద్ధిపేట–ఎల్కతుర్తి                                                                             133
హైదరాబాద్‌ (ఓఆర్‌ఆర్‌)–ఘట్‌కేసర్‌–ఏదులాబాద్‌–వలిగొండ–తొర్రూరు–
నెల్లికుదురు–మహబూబాబాద్‌–ఇల్లందు–కొత్తగూడెం                                             234
వరంగల్‌–ఖమ్మం                                                                                         120
మొత్తం                                                                                                   2,776

================================================================
నాలుగు లేన్లుగా మార్చే జాతీయ రహదారులు
రహదారి                                                                                         వ్యయం (కోట్లలో)
సంగారెడ్డి–నాందేడ్‌                                                                                  2,500
సూర్యాపేట–ఖమ్మం                                                                                1,000
జగిత్యాల–కరీంనగర్‌–వరంగల్‌                                                                   2,300
మంచిర్యాల–చంద్రాపూర్‌                                                                          1,500
కోదాడ–ఖమ్మం                                                                                       700
మొత్తం                                                                                                8,000
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement