రాష్ట్రానికి మరో రెండు జాతీయ రహదారులు
మారుమూల ప్రాంతాల అనుసంధాన పథకంలో భాగంగా కేటాయించిన కేంద్రం
∙ వరంగల్–మహబూబాబాద్ మధ్య 71 కి.మీ. మేర ఒకటి
∙ కరీంనగర్–భూపాలపల్లి మధ్య 130 కి.మీ. మేర రెండోది నిర్మాణం
∙ అంచనా వ్యయం రూ.690 కోట్లు.. మంజూరుకు కేంద్రం ఆమోదం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో రెండు జాతీయ రహదారులను మంజూరు చేసింది. దాదాపు 200 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారుల నిర్మాణానికి రూ.690 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన కేంద్రం.. ఆ మేరకు నిధుల మంజూరుకు ఆమోదం ప్రకటించింది. ఇందులో కరీంనగర్ నుంచి భూపాలపల్లి జిల్లా కేంద్రం వరకు ఓ రహదారి కాగా, రెండోది వరంగల్ నుంచి మహబూబాబాద్ జిల్లా కేంద్రం వరకు నిర్మిస్తారు. దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలను సమీప పట్టణాలతో అనుసంధా నించి ఇతర జాతీయ రహదారులతో జోడించే పథకంలో భాగంగా కేంద్రం ఈ రెండు రహదారులను మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలతో సంబంధం లేకుండా వీటిని మంజూరు చేయటం విశేషం.
వరంగల్‌కు కొత్త జాతీయ రహదారి
ప్రస్తుతం వరంగల్ పట్టణం రెండు జాతీయ రహదారులతో అనుసంధానమై ఉంది. హైదరాబాద్ నుంచి ఏటూరునాగారం వరకు 163వ నంబర్ జాతీయ రహదారి, జగిత్యాల నుంచి కరీంనగర్ మీదుగా 563వ నంబర్ జాతీయ రహదారి వరంగల్‌తో జత కలుస్తుంది. ఇప్పుడు కొత్తగా వరంగల్‌తో మహబూబాబాద్‌ను జాతీయ రహదారితో అనుసంధానించి సూర్యాపేట– మహబూబా బాద్– ఖమ్మం మధ్య ఉన్న 365వ నంబర్ జాతీయ రహదారితో జత చేస్తారు. వెరసి మూడు జాతీయ రహదారుల అనుసంధానం ఏర్పడుతుంది. ఈ కొత్త రహదారి వరంగల్ లోని రంగశాయిపేటలో మొదలై చింత నెక్కొండ, నెక్కొండ, కేసముద్రం మీదుగా మహబూబాబాద్ (71 కి.మీ.)తో కలుస్తుంది.
ప్రస్తుతం రాష్ట్ర రహదారిగా ఉన్న ఆ రోడ్డు నాలుగు వరుసలతో జాతీయ రహదారిగా మారుతుంది. భూపాలపల్లి–కరీంనగర్ మధ్య ఇప్పటి వరకు మంచి రోడ్డు వసతి లేదు. భూపాలపల్లి నుంచి అన్షాస్‌పల్లి, గోర్వీడు, నేరుడుపల్లి తండ (చైనపాలక), గరిమిళ్లపల్లి, బూరపల్లి, ఎంపేడు, వావిలాల, జమ్మికుంట, వీణవంక, కరీంనగర్ రోడ్డును జాతీయ రహదారిగా మారుస్తారు. ఇది 130 కి.మీ. మేర సాగుతుంది.
కొత్త రాష్ట్రంలో 25 కొత్త రోడ్లు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ భూభాగంలో జాతీయ రహదారుల నిడివి నామమాత్రమే. ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం 23 జాతీయ రహదారులు మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలో రహదారుల పొడవు గతం కంటే రెట్టింపు అయింది. వీటి నిర్మాణాలు ఇప్పుడిప్పుడే మొదలవు తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా రెండు రోడ్లను మంజూరు చేయటంతో మొత్తం రోడ్ల సంఖ్య 25కు పెరిగింది. మొత్తంగా మూడున్నరేళ్లలో తెలంగాణకు మంజూరైన మొత్తం జాతీయ రహదారుల నిడివి 3,175 కిలోమీటర్లకు చేరుకుంది. ఈ వివరాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.