గ్రాట్యుటీ బకాయిలకు రూ.100 కోట్లు
సాక్షి, హైదరాబాద్: పదవీవిరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ బకాయిలకు మోక్షం లభించనుంది. దాదాపు రూ.100 కోట్ల బకాయిలను విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. పీఆర్సీ సిఫారసుల ప్రకారం రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ రూ.8 లక్షల నుంచి రూ.14 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం 2015లో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
2015 ఫిబ్రవరిలో ఉద్యోగుల వేతన సవరణతోపాటు ఈ నిర్ణయం ప్రకటించింది. 2014 జూన్ నుంచి పెరిగిన గ్రాట్యుటీ అమలవుతుందని స్పష్టం చేసింది. దీంతో 2014 జూన్ నుంచి 2015 ఫిబ్రవరి వరకు 9 నెలల వ్యవధిలో రిటైరైన ఉద్యోగులు కూడా పెరిగిన గ్రాట్యుటీని పొందేందుకు అర్హులయ్యారు. అయితే వారికి చెల్లించాల్సిన గ్రాట్యుటీ వ్యత్యాసాన్ని ప్రభుత్వం ఇంతకాలం పెండింగ్‌లో పెట్టింది. 2015 ఫిబ్రవరి తర్వాత రిటైరైన ఉద్యోగులందరికీ పెరిగిన గ్రాట్యుటీ మొత్తాన్ని చెల్లించిన ఆర్థిక శాఖ ఏడాదిగా పాత బకాయిల ఊసెత్తలేదు. దీంతో ఆయా నెలల్లో రిటైరైన ఉద్యోగులు తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల గ్రాట్యుటీ చెల్లింపుల ఫైలుకు ఆమోదం తెలిపారు. ఆర్థిక వెసులుబాటుకు అనుగుణంగా ఆర్థిక శాఖ ఈ నెలలోనే వీటిని చెల్లించే అవకాశాలున్నాయి.