ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోలేని దుస్థితి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2014-15 విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసి.. ఈసెట్‌లో లేటరల్ ఎంట్రీ ద్వారా 163 కాలేజీల్లో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరిన దాదాపు 3 వేల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కష్టాలు వచ్చి పడ్డాయి. విద్యాశాఖ, సంక్షేమ శాఖల నిర్లక్ష్యం వల్ల వారంతా ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోలేని దుస్థితి దాపురించింది. ఈ విషయంలో విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని విద్యార్థులు, కాలేజీల యాజమాన్యాలు శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డిని కలసి విజ్ఞప్తి చేశాయి.
అసలేం జరిగిందంటే: ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియను చేపట్టిన జేఎన్‌టీయూ... 170 కాలేజీలకు అఫిలియేషన్లను నిరాకరించింది. వసతులున్నా నిరాకరించిందంటూ ఆయా కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి. కోర్టు తీర్పు అనుసరించి సదరు కాలేజీల్లో ఇతర వర్సిటీలకు చెందిన బృందాలు మళ్లీ తనిఖీలు చేశాయి. ఆ తనిఖీ నివేదికల ఆధారంగా 163 కాలేజీల్లో 807 కోర్సులకు ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు చేపట్టడానికి వీల్లేదని పేర్కొంటూ, జేఎన్‌టీయూహెచ్ అనుబంధ గుర్తింపును నిరాకరించింది. ఈ ప్రక్రియ అంతా ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించినదే. దీంతో 2014-15 విద్యా సంవత్సరంలో ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలను చేపట్టడానికి వీల్లేకపోయింది.
ఇక ఆయా కాలేజీల్లో ద్వితీయ, తృతీయ, నాలుగో సంవత్సర కోర్సులు కొనసాగుతున్నాయి. అదే ఏడాది పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు దాదాపు 3 వేల మంది ఆయా కాలేజీల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో కన్వీనర్ కోటా కింద చేరారు. వారంతా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులే. కానీ సంక్షేమ శాఖ ఆ విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వలేదు. వారి వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టలేదు. దీంతో ఆ విద్యార్థులంతా ఈ-పాస్ వెబ్‌సైట్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి. వారి దరఖాస్తులను సాఫ్ట్‌వేర్ యాక్సెస్ చేయకుండా సంక్షేమ శాఖ బ్లాక్ చేసింది. దీంతో ద్వితీయ సంవత్సరంలో చేరిన విద్యార్థులంతా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులేనని జేఎన్‌టీయూ లేఖ రాసింది. అయినా సంక్షేమ శాఖ ఆ విద్యార్థుల దరఖాస్తులను స్వీకరించకుండా ఇబ్బందుల్లోకి నెట్టింది. దీంతో వారంతా తీవ్ర ఆందోళనలో పడ్డారు.
‘ఫీజు’ ఇబ్బందుల్లో 3 వేల మంది విద్యార్థులు
Published Sat, Jan 9 2016 2:35 AM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM
Advertisement