ఇందూరు : సంక్షేమ శాఖల్లో ‘అవార్డుల’ సంఘటన దుమారం రేపుతోంది. సీనియర్లను కాదని, పనిచేసే వారిని సైతం పక్కనబెట్టి జూనియర్లను అవార్డుకు ఎలా ఎంపిక చేస్తారని శాఖల్లో పనిచేసే ఉద్యోగులు, వసతిగృహాల వార్డెన్‌లు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే ఒకరి లోపాలను ఒకరు ఎత్తి చూపుకుంటు బండారాన్ని బయటపెట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వివాదం కాస్త చిలికి చిలికి గాలివానగా మారుతోంది. సంక్షేమంలో ఇదే అంశం హాట్ టాపిక్‌గా మారింది.
ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అహర్నిశలు కష్టపడి, విధి నిర్వహణలో బెస్ట్ అనిపించుకున్న వారికి పోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ప్రతిఏడాది ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం, జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎంపిక కాబడిన ఉద్యోగులకు ప్రభుత్వ తరపున అవార్డు అందజేస్తారు. ఈ అవార్డులను ఆగస్టు 15న మంత్రిచే, జనవరి 26న కలెక్టర్ చేతుల మీదుగా అందజేస్తారు. జిల్లా స్థాయి అధికారులు తమ శాఖలో పనిచేసే ఉద్యోగుల్లో విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసి కలెక్టర్‌కు ఒక రోజు ముందు పంపుతారు. అయితే ఈ ఎంపిక స్వార్థపరంగా, ఆర్థిక కారణంతో తెలిసిన, అనుకున్న వారికి అనుగుణంగా జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల్లో బహిరంగ విమర్శలు వస్తున్నాయి. ఒక్కో శాఖలో ఇద్దరు వార్డెన్‌లు, ఇద్దరు శాఖ ఉద్యోగులకు అవార్డులు వచ్చాయి. అయితే వార్డెన్‌లలో అర్హత లేకున్నా, స్థానికంగా ఉండి విధి నిర్వహణ సక్రమంగా చేయని ఒకరిద్దరి వార్డెన్‌లను అవార్డుకు ఎంపిక చేసినందుకు సీనియర్ వార్డెన్‌లు మండిపడుతున్నారు. అంటే తామంతా పనికి రాని వాళ్లమా..? స్థానికంగా ఉండి వసతిగృహాల్లో ఇన్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్నా మమ్మల్ని అవార్డుకు ఎంపిక చేయకపోవడానికి గల కారణాలు ఏంటనీ పలువురు వార్డెన్‌లు సంబంధిత అధికారులను ప్రశ్నిస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ నుంచి వర్కర్ స్థాయి నుంచి వచ్చిన స్థానికంగా ఉండని మారుమూల నియోజకవర్గానికి చెందిన ఓ మహిళా వార్డెన్‌కు ఏరకంగా అవార్డునిచ్చారని ఆగ్రహంతో ఉన్నారు.
కాగా బీసీసంక్షేమ శాఖ నుంచి కేవలం మహిళా వార్డెన్‌లను మాత్రమే ఎంపిక చేశారని, పురుషులను ఎంపిక చేయకపోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇంచార్జ్‌గా ఉన్న అధికారిని తన ఇష్టారాజ్యంగా అవార్డుల ఎంపిక చేశారనిఆరోపిస్తున్నారు. అలాగే సాంఘిక సంక్షేమ శాఖలో కూడా సీనియర్ వార్డెన్‌లను కాదని, ఇటు శాఖలో మొన్న వచ్చిన ఓ సూపరింటెంటెండ్‌కు అవార్డుకు ఎంపిక చేయడంతో అధికారుల తీరుపై సీనియర్ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అవార్డు పొందిన సదరు ఉద్యోగి తానే సొంతంగా ఎంపిక చేసుకుని జాబితాలో పెట్టుకున్నాడమే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటు గిరిజన సంక్షేమ శాఖలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇలా సంక్షేమ శాఖల్లో నువ్వెంత.. నేనెంత అనే విధంగా అవార్డుల వివాదం పెద్దదిగా మారుతోంది. అక్రమాలను, లోటుపాట్లను ఎత్తిచూపి, ఒకరినొకరు బండారాన్ని బయటపెట్టుకుంటున్నారు. అయితే అవార్డుల ఎంపికపై ఉద్యోగులు, వార్డెన్‌లు సంబంధిత ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లినా కొట్టి పారేసినట్లు సమాచారం అందింది. ఈ విషయంపై వార్డెన్‌ల సంఘంలోని పలువురు నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిసింది.
సంక్షేమంలో ‘అవార్డుల’ చిచ్చు
Published Wed, Jan 28 2015 10:09 AM | Last Updated on Sat, Sep 2 2017 8:25 PM