సాక్షి, హైదరాబాద్ : పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తుల గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఈ ఏడాది జూలైలో ప్రారంభమైన దరఖాస్తుల సమర్పణ గడవు ఆగస్టు నెలాఖరుతో ముగియాల్సి ఉన్నా దరఖాస్తులు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో మరికొంత సమయం పెంచాలని ప్రభుత్వాన్ని సం క్షేమ శాఖలు కోరాయి. దీంతో మరో నెల గడువును పెంచుతూ సెప్టెంబర్ నెలాఖరు వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయినప్పటికీ సంక్షేమ శాఖల అంచనాల్లో కనీసం 50 శాతం దరఖాస్తులు కూడా రాకపోవడంతో చివరి అవకాశంగా డిసెంబర్ నెలాఖరు వరకు గడువును పొడిగించిన ప్రభుత్వం... ఆ తర్వాత ఎలాంటి మార్పులుండవని, నిర్దేశించిన గడువులోగా దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించకుంటే అనర్హులవుతారని స్పష్టం చేసింది. ]
2019–20 విద్యా సంవత్సరంలో 13.45 లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా వేయగా ఇప్పటివరకు 12.05 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సంక్షేమ శాఖల గణాంకాలు చెబుతున్నాయి. మరో పది రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనుండటంతో సంక్షేమ శాఖాధికారులు కాలేజీ యాజమాన్యాలకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా గడువు తేదీని గుర్తుచేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన కాలేజీల విద్యార్థుల నుంచి ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావాల్సి ఉందని ఆయా జిల్లాల అధికారులు చెబు తున్నారు. ఈ నెల 31 తర్వాత గడువు పెంచే అవకాశం లేకపోవడంతో ఆలోగా దరఖాస్తులు సమర్పించేలా చర్యలు తీసు కోవాలని కాలేజీల యాజమాన్యాలతోపాటు విద్యార్థులకు సూచనలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment