
తెలంగాణకు ‘ఫీజుల’ భారం
* కొత్త రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ. 3,553.04 కోట్లు అవసరం
* అంచనాలు రూపొందించిన సంక్షేమ శాఖ
* ఉమ్మడి రాష్ర్టంలో ప్రస్తుతం కేటాయించిందే రూ. 4000 కోట్లు
* ఈ ఏడాది చెల్లింపులే అంతంత మాత్రం
సాక్షి, హైదరాబాద్: ఉన్నత చదువుల్లో చేరే పేద విద్యార్థులకు చేయూతనిచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తెలంగాణకు భారంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. కొత్తగా ఏర్పడుతున్న రాష్ట్రానికి ఈ పథకం కింద వేల కోట్ల బడ్జెట్‌ను భరించడం కష్టమన్న వాదన వినిపిస్తోంది. తాజాగా సంక్షేమ శాఖ రూపొందించిన అంచనాలు దీన్ని బలపరుస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ. 4,700 కోట్లు చెల్లించేందుకే ప్రభుత్వం అష్టకష్టాలు పడుతోంది. విద్యా సంవత్సరం ముగుస్తున్నా ఇప్పటి వరకు సుమారు రూ. 1,800 కోట్లను మాత్రమే విద్యార్థులకు చెల్లించింది. ఈ నేపథ్యంలో 2014- 15 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కోటా నుంచి నిధులు వెచ్చిస్తే గాని బకాయిలు తీర్చే పరిస్థితి లేదు. ఇక తెలంగాణ పది జిల్లాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్/ స్కాలర్‌షిప్పుల కింద రూ. 3,553.04 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని సంక్షేమ శాఖ అంచనా వేసింది.
సీమాంధ్రతో పోల్చితే తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కువ సంఖ్యలో ప్రైవేటు విద్యా సంస్థలు ఉండటం, రాష్ర్ట విభజన జరిగినా ఇప్పటి వరకు తెలంగాణలో చదువుతున్న సీమాంధ్ర విద్యార్థులు కూడా ఇక్కడే స్థానికులుగా మారుతుండడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అంచనాలు తయారయ్యాయి. తదనుగుణంగా తెలంగాణలో వచ్చే విద్యాసంవత్సరంలో కొత్తగా 6,20,318 మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత పొందుతారని సంక్షేమ శాఖ తేల్చింది. ఇక రెన్యువల్ చేసుకునే వారి సంఖ్య 8,68,284గా ఉంటుంది. అంటే మొత్తం 14,88,602 మంది విద్యార్థులకు వచ్చే ఏడాది ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విద్యా సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో 27.88 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీని ఆధారంగానే సీమాంధ్ర, తెలంగాణలకు విద్యార్థుల సంఖ్యను తేల్చినట్లు తెలుస్తోంది.
కాగా, వచ్చే విద్యా సంవత్సరంలో తెలంగాణకే మూడున్నర వేల కోట్లకుపైగా అవసరమని అంచనా వేయ గా.. ఇందులో బకాయిలే రూ. 1005.22 కోట్లు ఉంటాయని భావిస్తున్నారు. అదే సమయంలో సీమాంధ్రలో 15,02, 986 మంది విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్ కింద రూ. 3,644.84 కోట్లు అవసరమవుతాయని అంచనా. ఇక్కడ కూడా బకాయిల కింద రూ. 1,037.34 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఓటాన్ అకౌండ్ బడ్జెట్ నుంచి రూ. 700 కోట్లను గత విద్యా సంవత్సరం బకాయిల కింద సర్దుబాటు చేశారు. మిగ తా బడ్జెట్‌ను రెండు రాష్ట్రాలకు పంచితే వచ్చేది కూడా ఆయా రాష్ట్రాల్లో పాత బకాయిల చెల్లింపులకే సరిపోతుందని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఫీజు రీయింబర్స్‌మెంటు చెల్లింపులకు తెలంగాణ కొత్త సర్కారు చమటోడ్చాల్సి రావచ్చని అధికారులు చెబుతున్నారు.