వారి విరమణ వయస్సు పెంచుదామా?
వైద్య అధ్యాపకుల పదవీ విరమణపై కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తిని పరిశీలిస్తున్న రాష్ట్ర సర్కారు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్, డెంటల్, ఆయుష్ కళాశాలల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు సహా ఇతర వైద్య అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సును 70 ఏళ్ల వరకు పెంచాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ యోచిస్తోంది. వైద్య విద్యకు చెందిన వివిధ అంశాలపై కేంద్రం ప్రతిపాదనలు తయారు చేసింది. వాటిపై రాష్ట్రాల అభిప్రాయాన్ని కోరింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇక్కడి పరిస్థితులపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల విరమణ వయస్సు 58 ఏళ్లు. హైదరాబాద్‌లో ఉన్న నిమ్స్‌లో 60 ఏళ్లుంది.
ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటకల్లో కూడా ఇదే వయస్సు. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్తాన్‌ల లో 62 ఏళ్లు, హరియాణా, ఢిల్లీ, అస్సాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 65 కాగా బిహార్‌లో 67 ఏళ్లుంది. ఇక కేంద్ర ఉద్యో గుల ఉద్యోగ విరమణ వయస్సు 60 ఏళ్లు ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎయి మ్స్ వంటి వైద్య బోధనా సంస్థల్లో 65 ఏళ్లు. ఎంసీఐ నిబంధనల ప్రకారం వైద్య అధ్యాపకుల విరమణ వయస్సు 70 ఏళ్ల వరకు ఉండొచ్చు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కూడా ఇదే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం చేసిన తాజా ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన జరుపు తోంది. పెంపు వల్ల లాభ నష్టాలు, పదోన్నతులపై ప్రభావం వంటివి అంచనా వేస్తోంది.