generic medical shops
-
ఇక సహకార జనరిక్ మెడికల్ షాపులు
సాక్షి, అమరావతి: సొసైటీల ఆధ్వర్యంలో సహకార జన ఔషధి కేంద్రాలు రాబోతున్నాయి. ప్రజలకు అత్యంత తక్కువ ధరకు మందులను అందుబాటులో ఉంచడంతోపాటు ఆదాయ వనరులు పెంపొందించుకోవడమే లక్ష్యంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్‌ల)కు అనుబంధంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే వివిధ రకాల వ్యాపారాలతో పీఏసీఎస్‌లు లాభాల బాట పట్టాయి. ఇదే కోవలో నష్టాల్లో ఉన్న సంఘాలు తమ ఆర్థిక స్థితిని పెంచుకునే దిశగా అడుగులేస్తున్నాయి. బహుళ సేవా కేంద్రాలుగా పీఏసీఎస్‌లను తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. జనరిక్ మందుల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో గ్రామ స్థాయిలో జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వాల ఆర్థిక చేయూత తొలి దశలో జిల్లాకు ఐదు పీఏసీఎస్‌లను ఎంపిక చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 132 పీఏసీఎస్‌లతోపాటు 13 డీసీఎంఎస్‌లలో కూడా వీటిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాల పేరిట వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వీటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక చేయూత ఇవ్వనున్నాయి. ఒక్కో జన ఔషధి కేంద్రం ఏర్పాటుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల చొప్పున వెచ్చించనున్నారు. వీటిద్వారా నిరుద్యోగ యువతకు పెద్దఎత్తున ఉపాధి కల్పించడంతో పాటు గ్రామీణుల్లో ఆరోగ్య పరిరక్షణ పట్ల అవగాహన పెంపొందిస్తారు. సొసైటీల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్‌లు స్థలాలు అందుబాటులో ఉన్న 106 పీఏసీఎస్‌లలో ఒక్కొక్క చోట రూ.25 లక్షల అంచనా వ్యయంతో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నారు. స్థలాలు చూపిస్తే చాలు ఫీజుబులిటీ రిపోర్టు ఆధారంగా పైసా ఖర్చు లేకుండా డీలర్‌షిప్‌లు మంజూరుకు ఆయిల్ కంపెనీలు ముందుకొచ్చాయి. బంక్ నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నాయి. 27 పీఏసీఎస్‌లలో పెట్రోల్ బంక్‌ల ఏర్పాటుకు సంబంధిత శాఖలు ఇప్పటికే ఎన్వోసీలు ఇచ్చాయి. ఆరు చోట్ల పెట్రోల్ బంక్‌లు ప్రారంభించారు. మిగిలిన 83 పీఏసీఎస్‌ల ఆధ్వర్యం బంక్‌ల ఏర్పాటుకు అవసరమైన ఎన్వోసీలను సాధ్యమైనంత త్వరగా సాధించే దిశగా సహకార శాఖ చర్యలు చేపట్టింది. అదే బాటలో ఎంపిక చేసిన పీఏసీఎస్‌లలో జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సొసైటీల బలోపేతమే లక్ష్యం నష్టాల్లో ఉన్న సొసైటీలను లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. పెట్రోల్ బంక్‌లు ఏర్పాటుకు అవసరమైన ఎన్వోసీల జారీలో జాప్యాన్ని నివారించేందుకు సంబంధిత జిల్లాల జాయింట్ కలెక్టర్ల సమన్వయంతో ముందుకెళ్తున్నాం. పెట్రోల్ బంకులు, జన ఔషధి కేంద్రాలతో పాటు స్థానిక డిమాండ్ ఉన్న వ్యాపారాలు చేసుకునే వెసులుబాటును సొసైటీలకు కల్పిస్తున్నాం. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ, సహకార శాఖల మంత్రి -
మెట్రో స్టేషన్లలో జనరిక్ మెడికల్ షాపులు
సాక్షి హైదరాబాద్: మెట్రో స్టేషన్లలో ఇక నుంచి జనరిక్ ఔషధాలు, ఇతర ఫార్మా ఉత్పత్తులు లభించనున్నాయి. ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ , దవా దోస్త్ సంస్థతో భాగస్వామ్యం చేసుకోవడంతో మెట్రో ప్రయాణికులకు ఈ అవకాశం దక్కింది. దవా దోస్త్ సంస్థ ఏర్పాటు చేసిన తొలి హై ఫ్రీక్వెన్సీ స్టోర్‌ను ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెట్రో రైల్ ఉన్నతాధికారులు, ఇతర అతిథులు పాల్గొన్నారు. త్వరలోనే దవా దోస్త్ కేంద్రాలు అమీర్‌పేట, కెపీహెచ్బీ, హైటెక్ సిటీ, ఎంజీబీఎస్ తదితర స్టేషన్లలో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ ప్రయాణికులతో పాటుగా సందర్శకులకు ఇది సంతోషకరమైన సమాచారం. ప్రయాణికులు అత్యంత సౌకర్యవంతంగా జనరిక్ మందులు, ఇతర ఔషధ ఉత్పత్తులను ఆకర్షణీయమైన రీతిలో 15 నుంచి 80 శాతం రాయితీలలో పొందవచ్చన్నారు. ఎల్ అండ్ ఎంఆర్హెచ్ఎల్ ఎండీ అండ్ సీఈవో కెవీబీ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ మెట్రో రైల్ వద్ద దవా దోస్త్‌ను స్వాగతిస్తున్నామన్నారు. ఖైరతాబాద్ వద్ద వచ్చిన ఈ స్టోర్‌తో రాయితీ ధరలలో ప్రయాణికులు ఔషధాలు పొందవచ్చన్నారు. దవాదోస్త్ సంస్థ సీఈవో అమిత్చౌదరి మాట్లాడుతూ ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద దవా దోస్త్ ప్రారంభించడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నామన్నారు. -
కుట్ర ఆరోపణలు అవాస్తవం
న్యూఢిల్లీ: ఔషధాల ధరల విషయంలో కస్టమర్ల ప్రయోజనాలు దెబ్బతీసేలా జనరిక్ ఫార్మా సంస్థలు కుమ్మక్కయ్యాయంటూ అమెరికాలో కేసులు దాఖలు కావడాన్ని దేశీ ఫార్మా దిగ్గజాలు ఖండించాయి. ధరల నిర్ణయించడంలో కుట్ర కోణాలున్నాయన్న ఆరోపణలను డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్), వోకార్డ్, అరబిందో, గ్లెన్ మార్క్ తదితర సంస్థలు ఖండించాయి. ఈ మేరకు కంపెనీలన్నీ వేర్వేరుగా తమ వివరణను స్టాక్ ఎక్సే్చంజీలకు సమ ర్పించాయి. ఈ ఆరోపణలను దీటుగా ఎదుర్కోనున్నామని డీఆర్ఎల్ తెలిపింది. అయిదు జనరిక్ ఔషధాలకు సంబంధించి అమెరికాలోని తమ అనుబంధ సంస్థపై కుట్ర ఆరోపణలు వచ్చాయని వివరించింది. అయితే, కంపెనీ కార్యకలాపాలు, ఆర్థిక ఫలితాలపై ప్రస్తుతానికి ఈ పరిణామాల ప్రభావమేదీ ఉండబోదని స్పష్టం చేసింది. అరబిందో ఇలా... అటు మరో దిగ్గజం అరబిందో ఫార్మా కూడా తమపై దాఖలైన రెండో కేసులో ఆరోపణలను తోసిపుచ్చింది. వీటిని ఖండిస్తూ త్వరలోనే ఫెడరల్ కోర్టుకు వివరణనివ్వనున్నట్లు తెలిపింది. 116 జనరిక్ ఔషధాల ధరల విషయంలో కుమ్మక్కుగా వ్యవహరించాయంటూ 21 జనరిక్ ఔషధాల కంపెనీలు, 15 మంది వ్యక్తులపై అమెరికాలోని 49 రాష్ట్రాల అటార్నీస్ జనరల్.. కనెక్టికట్ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశాయి. రెండో కేసులో తమ సంస్థ పేరు కాకుండా అనుబంధ సంస్థ టారా ఫార్మా పేరుందని సన్ ఫార్మా వివరణనిచ్చింది. ఈ ఆరోపణలను గట్టిగా ఎదుర్కొంటామని తెలిపింది. గ్లెన్‌మార్క్ కూడా తమపై ఆరోపణలను ఖండించింది. -
సంజీవనికి సంకెళ్లు
ప్రకాశం, బేస్తవారిపేట: పేదలను ఆదుకుంటాయనుకున్న జనరిక్ మందులు ముఖం చాటేశాయి. దుకాణాల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేయడంతో పేదల ఆరోగ్యం గాలిలో దీపంగా మారింది. ప్రజలు తమ ఆరోగ్యం కోసం రోజువారీ మందు బిళ్లలకు వందల రూపాయలు ఖర్చు చేయాల్సిన వస్తుంది. బీపీ, షుగరుతో పాటు కీళ్ల, కాళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. ఈ నేపథ్యంలో సామాన్యులకు మందులు అందించాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనరిక్ మందులను వినియోగంలోకి తీసుకొచ్చాయి. దీంతో ఖర్చు తక్కువతో సాధారణ మందులు దొరుకుతాయని అంతా భావించారు. మందులను ప్రతి గ్రామంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు సైతం జారీ చేశారు. ఏర్పాటు అంతంత మాత్రమే.. మండల కేంద్రాలతో పాటు, ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో సైతం జనరిక్ మందుల షాపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా, వెలుగు, డీఆర్డీఏ అధికారులు మండల కేంద్రాల్లో మాత్రమే ఒక్కో షాపు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. జిల్లాలో 56 మండలాలు ఉండగా కేవలం 25 జనరిక్ షాపులను మాత్రమే ప్రారంభించారు. షాపులకు తాళాలు డీఆర్డీఏ, వెలుగు–మండల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించే జనరిక్ దుకాణాలు మూతపడుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. నిత్యం పర్యవేక్షించి సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు, మండల సమాఖ్య పట్టించుకోకపోవడంతో ఒక్కోటిగా మూతపడుతున్నాయి. జిల్లాలోని చీమకుర్తి, సింగరాయకొండ, పొదిలి, గిద్దలూరు, బేస్తవారిపేట మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన అన్న సంజీవని జనరిక్ మెడికల్ దుకాణాలు చాలా కాలంగా తెరచుకోవడంలేదు. అత్యంత చౌకగా.. మందుల షాపుల్లో దొరికే మందుల ధరలతో పోల్చితే జనరిక్ మందులు అత్యంత చౌకగా లభిస్తాయి. ముఖ్యంగా రోజువారీ వాడకంలో ఉన్న బీపీ, షుగర్ వ్యాధికి సంబంధించి మాత్రలు బయట మందుల షాపుల్లో అత్యధికంగా ఉంటే ఇక్కడ మాత్రం చాలా తక్కువకు లభిస్తాయి. బీపీ ట్యాబ్లెట్లు రూ.60–90 ధర ఉంటే జనరిక్‌లో రకాన్ని బట్టీ రూ.8 నుంచి రూ.18లోపు (పది మాత్రలు) లభిస్తాయి. ఇదే విధంగా క్యాల్షియం ట్యాబ్లెట్ల ధరలో రూ.60 వరకు వ్యత్యాసం ఉంటుంది. దగ్గుకు వాడే సిరప్ ధర జనరిక్‌లో రూ.15గా ఉంటే ఇదే బయట మందుల దుకాణంలో రూ.70పైగానే ఉంటోంది. ఇదే విధంగా అన్ని మందుల ధరల్లో వందల రూపాయల్లో తేడా ఉంటుంది. కొన్ని మందుల షాపుల్లో జనరిక్ మందులనే సాధారణ మందులుగా తెలియని వారికి అమ్మకాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినపడుతున్నాయి. ఈ పాపం ఏవరిది..? రోజువారీ కూలీకి వెళ్లే కార్మికులు, పేద, మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకే మందులు వస్తుండటంతో జనరిక్ మందులు బాగా ఉపయోగపడ్డాయి. ఏర్పాటు చేసిన మొదటి రెండేళ్ల కాలంలో మంచి బిజినెస్ జరిగింది. రాను రాను జనరిక్ దుకాణాలకు మందులను సరఫరా చేసే ఏజెన్సీలు తక్కువ గడువు ఉన్న మందులు సరఫరా చేయడం ప్రారంభించాయనే ఆరోపణలు వినిపించాయి. జనరిక్ దుకాణాలకు సక్రమంగా మందులు సరఫరా చేయకపోవడంతో బిజినెస్ తగ్గిపోయిందనే సాకుతో పేదల సంజీవనిలను మూత పడేలా చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల జోక్యంతో... అక్కడక్కడా అధికార పార్టీ నాయకుల జోక్యంతో తమ వర్గానికో, బంధువులకో దుకాణాలు ఇప్పించుకోవాలని పావులు కదుపుతున్నారు. జనరిక్ షాపుల సమస్యలు పరిష్కరించకుండా వదిలివేస్తున్నారు. జనరిక్ దుకాణం మూత పడిన తర్వాత లెక్కలు చూసి మరొకరిని నియమించుకోవడమో, లేక పూర్తిగా తొలగించడమో చేయాలి. కానీ అలాగే వదిలివేయడంతో షాపునకు ప్రతి నెలా బాడుగ, ఫార్మసిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్లకు జీతాలు చెల్లించాల్సి వస్తోంది. ఈ భారమంతా వెలుగు–మండల సమాఖ్య భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికార పార్టీ నాయకులు వెలుగు అధికారులపై ఒత్తిడి పెంచి నెలల తరబడి మూత పడిన దుకాణాలు తెరవకుండ, కొత్తవారిని నియమించుకునే అవకాశం ఇవ్వకపోవడంతో ప్రభుత్వానికి నష్టం జరగడమేకాకుండా, పేదలు కూడా నష్టపోతున్నారు. జనరిక్ దుకాణాన్ని మూత వేస్తున్నాం:బేస్తవారిపేటలో అన్న జనరిక్ మెడికల్ దుకాణంలో రూ. 30 వేలు మెడిసిన్‌కు, రూ. 30 వేలు నిర్వాహణ నిధులు చూపించలేదు. వచ్చిన నగదు సకాలంలో సకాలంలో బ్యాంక్‌లో చెల్లించలేదు. ఇప్పటికే మండల సమాఖ్యకు రూ.2 లక్షలు నష్టం జరగడం, నూతన ఫార్మసిస్ట్ దొరకని కారణంగా అన్న జనరిక్ దుకాణానాన్ని పూర్తిగా తొలగిస్తున్నాం.వెలుగు ఏపీఎం నాగశంకర్, బేస్తవారిపేట. -
జనరిక్ షాప్ లైసెన్స్ రద్దు
తిరుపతి (అలిపిరి) : స్విమ్స్‌లో నిర్వహిస్తున్న జనరిక్ మందుల దుకాణం పై ఔషధ నియంత్రణ శాఖ కొరడా ఝళిపించింది. మెప్మా అనుమతి లేకుండా అభ్యుదయ నగర మహిళా సమాఖ్య పేరుతో మందుల దుకాణం నిర్వహించడంపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించిన విషయం విదితమే. అనేక పరిణామాల మధ్య ఎట్టకేలకు జనరిక్ దుకాణాన్ని రద్దు చేస్తున్నట్లు ఔషధ నియంత్రణ అ«ధికారులు గురువారం ప్రకటించారు. మందుల స్టాక్ ఉంచకూడదని నిర్వాహకులనుఆదేశించారు. లైసెన్స్ రద్దు చేసి మూడు రోజులు గడుస్తున్నా మందుల స్టాక్ అలాగే ఉంచారు. టీడీపీ చోటా నాయకుల ఒత్తిళ్ల వల్ల స్విమ్స్ యాజమాన్యం ఈ దుకాణం మూసివేతకు వెనకడుగు వేస్తోందనే విమర్శలున్నాయి. స్విమ్స్‌లో జనరిక్ దుకాణం వివాదాలకు కేరాఫ్‌గా మారుతోంది. గతంలో రెడ్‌క్రాస్ సంస్థ నిర్వహించే సమయంలో అవినీతి ఆరోపణలొచ్చాయి. దీంతో దుకాణాన్ని రద్దు చేశారు. మెప్మా అనుమతి లేకుండా టీడీపీ చోటా నాయకుల సహకారంతో అభ్యుదయ నగర మహిళా సమాఖ్య పేరుతో కనీసం సభ్యు ల అనుమతి లేకుండా జనరిక్ దుకాణాన్ని 8 నెలల క్రితం ప్రారంభించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని రెండు నెలల క్రితం ఔషధ నియంత్రణ శాఖ లైసెన్స్ రద్దు చేసింది. చట్టంలోని లొసుగుల ఆధారంగా నిర్వాహకులు ఔషధ నియంత్రణ శాఖ నుంచి అనుమతి తెచ్చుకుని నెల రోజులుగా జనరిక్ షాపు నిర్వహిస్తున్నారు. వివాదం మధ్య లైసెన్స్ మంజూరు జనరిక్ దుకాణం నిర్వహణకు కోర్టు ఉత్తర్వులు ఆధారంగా డ్రగ్ అధికారులు అ«భ్యుదయ నగర మహిళా సమాఖ్యకు తిరిగి ఆగమేఘాలపై లైసెన్స్ మంజూరు చేశారు. లైసెన్స్ మంజూరుకు మెప్మా పీడీ నుంచి అనుమతి తప్పనిసరి.∙ఔషధ నియంత్రణ అధికారులు జూన్ 6న లైసెన్స్ మంజూరు చేసి 12న ఇచ్చి నట్లు మెప్మాకు లేఖ రాశారు. డ్రగ్ అధికారుల తీరుపై మెప్మా అధికారులు మండిపడ్డారు. తమకు తెలియకుండా అభ్యుదయ నగర మ హిళా సమాఖ్య పేరుతో జనరిక్ నడుపుతున్నారని సమాఖ్య వారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశా రు. దీంతో వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. విచారించి చర్యలు తీసుకోవాలని డ్రగ్ అధికా రులను కలెక్టర్ ఆదేశించారు. అధికారులు విచారించి లైసెన్స్ రద్దు చేస్తూ మూడు రోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు. -
జనరిక్.. మాయాజాలం
అధిక ధరలకు విక్రయం గుడ్‌విల్ మత్తులో వైద్యులు ధనార్జనే ధ్యేయంగా వ్యాపారులు ఏజెన్సీలకు కాసుల పంట బెల్లంపల్లి రూరల్ : ఆదిలాబాద్ జిల్లాలోని మందుల దుకాణదారులు లాభార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తుండడంతో సామాన్య ప్రజల ఆరోగ్యం అగమ్యగోచరంగా మారుతోంది. మెరుగైన వైద్యం కోసం పట్టణ ప్రాంతాలకు తరలివస్తే కొత్త సీసాలో పాత మందు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. పట్టణ ప్రాంతాలకు చెందిన వైద్యులు వేలాది రూపాయలు పరీక్షల పేరిట తీసుకోవడమే కాకుండా రోగానికి పనికొచ్చే మందులు ఇవ్వడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తూర్పు ప్రాంతంలోని మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, చెన్నూర్, కాగజ్‌నగర్, శ్రీరాంపూర్‌తోపాటు పలు మండలాల్లో మందుల షాపుల యజమానులు జనరిక్ మందులను పేరు పొందిన కంపెనీల మందుల ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జనరిక్ మందులు రోగులకు అంటగడితే 100 శాతం లాభాలను గడించవచ్చని తెలివిగా వ్యవహరిస్తున్నారు. వైద్యులు ఏ మందులు రాసినా దుకాణాల యజమానులు రోగులకు ఎక్కువ మొత్తంలో సంబంధిత జనరిక్ మందులే ఇస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో పని చేసే వైద్యులు మెడికల్ ఏజెన్సీలతో కుమ్మక్కై బ్రాండెడ్ మందులకు బదులుగా జనరిక్ మందులను రోగులకు అంటగడుతూ లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. జనరిక్ మందులను రాస్తే వైద్యులకు ఏజెన్సీ వారు పెద్ద మొత్తంలో గుడ్‌విల్‌ను అందించడమే కాకుండా మందుల దుకాణాల యజమానులకు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. అర్హత లేకున్నా దుకాణాల నిర్వహణ పట్టణాల్లో పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న మెడికల్ షాపుల నిర్వహణ మరీ అధ్వానంగా మారింది. కనీస అర్హత లేని వ్యక్తులు కూడా మందుల దుకాణాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఫార్మసి లైసెన్స్ కలిగి ఉండి నిబంధనలకు అనుగుణంగా దుకాణాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. కొంత కాలం దుకాణాల్లో పని చేసిన వారూ.. అవగాహన లేని వారూ దుకాణాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మందుల దుకాణాల నిర్వహణ, ఆస్పత్రుల పని తీరుపై సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సి ఉండగా.. ఏమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. రోగం వచ్చినా.. నొప్పి వచ్చినా పట్టణాలకే ప్రజలు అనారోగ్యానికి గురైనప్పుడు పట్టణాలకే వైద్యం నిమిత్తం వస్తుంటారు. రోగుల అత్యవసర పరిస్థితిని సొమ్ము చేసుకునేందుకు ఇక్కడి వైద్యులతో పాటు మందుల దుకాణాల యజమానులు వ్యవహరిస్తున్నారు. రోగానికి తగ్గట్లు మందులు ఇవ్వాల్సి ఉండగా జనరిక్ మందులను రాస్తున్నారనే ఆరోపణలున్నాయి. అక్షర జ్ఞానం లేని పల్లెవాసులు వారిని నమ్మి అధిక ధరలకు మందులు కొనుగోలు చేస్తున్నారు. పల్లెల్లోని ఆర్ఎంపీలు సైతం జనరిక్ మందులను రోగులకు ఇస్తున్నారు. ఎలాంటి పరిజ్ఞానం లేకుండా మందుల షాపులను నిర్వహిస్తున్న యజమానులపై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. నిబంధనలు ఏమి లేవు జనరిక్ మందులు అమ్మకూడదని ఎలాంటి నిబంధనలు లేవు. లెసైన్స్ లేకుండా ఎవరైనా మందుల షాపులను నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తే శాఖపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోం. - రాజమొగిళి, మంచిర్యాల డ్రగ్ ఇన్స్పెక్టర్ -
జనరిక్.. జాప్యం
ప్రజలకు తక్కువ ధరకు మందులను అందించటం కోసం జనరిక్ మెడికల్ షాపులను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. పెట్టుబడి భారం మాత్రం మండల, పట్టణ సమాఖ్యలపై మోపుతోంది. షాపుల ఏర్పాటులో ఉన్న ఇబ్బందుల నేపథ్యంలో సమాఖ్యలు ముందుకు రావటం లేదు. లాభనష్టాలు తామే భరించాల్సి ఉండటంతో వెనకడుగేస్తున్నాయి. మచిలీపట్నం : జిల్లాలో జనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటు మూడు అడుగులు ముందుకు... ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. రాష్ట్ర వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ రాష్ట్ర వ్యాప్తంగా 200 జనరిక్ మెడికల్ షాపులను ఏర్పాటు చేస్తామని ఇటీవల ప్రకటించారు. జిల్లాలో 15 జనరిక్ మెడికల్ షాపులను ఏర్పాటు చేయాలని, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో ఏడు, మెప్మా ఆధ్వర్యంలో పురపాలక సంఘాల్లో ఎనిమిది ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మండల కేంద్రాలైన అవనిగడ్డ, కైకలూరు, బంటుమిల్లి, గన్నవరం, పామర్రు, విస్సన్నపేట, మైలవరం ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు డీఆర్డీఏ పీడీ డి.చంద్రశేఖరరాజు తెలిపారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నట్లు మెప్మా పీడీ హిమబిందు పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్లో రూ.100 ఖరీదు చేసే మందుబిళ్లలు జనరిక్ మెడికల్ షాపుల్లో రూ.30కే అందుబాటులోకి వస్తాయి. రాయల్టీ చెల్లించని మందులను ఈ షాపుల్లో అందుబాటులో ఉంచుతారు. పెట్టుబడి భారం సమాఖ్యలపైనే... ఈ షాపుల ఏర్పాటుకు మండల, పట్టణ సమాఖ్యల ఖాతాలో ఉన్న నగదును పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఒక్కొక్క షాపు ఏర్పాటుకు ఫర్నిచర్, మందుల కోసం రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ షాపుల్లో ఫార్మాసిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్లను ఏర్పాటుచేసి ఒక్కొక్కరికి నెలకు రూ.7 వేలు వేతనంగా ఇవ్వాలని నిర్ణయించారు. ముందుకు రాని సమాఖ్యలు... మండల, పట్టణ సమాఖ్య ద్వారా రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టి షాపు తెరిస్తే సిబ్బంది జీతభత్యాలు, షాపు అద్దె, విద్యుత్ బిల్లులు తదితర అంశాల నేపథ్యంలో లాభం వచ్చినా, నష్టం వచ్చినా ఆయా సమాఖ్యలే భరించాలనే షరతు విధించారు. దీంతో జనరిక్ మెడికల్ షాపులను ఏర్పాటు చేసేందుకు సమాఖ్యలు ముందుకురావటం లేదు. ఒక్క ఉయ్యూరు పురపాలక సంఘంలోనే మందులు, ఫర్నిచర్ కొనుగోలు చేసి జనరిక్ మెడికల్ షాపును తెరిచేందుకు రంగం సిద్ధం చేశారు. మిగిలిన చోట్ల మండల, పట్టణ సమాఖ్యలతో సంప్రదింపులు జరిపే పనిలో అధికారులు ఉన్నారు. డీఆర్డీఏ ద్వారా ఏడు షాపులను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఆరు షాపులను త్వరలో ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు డీఆర్డీఏ చెబుతున్నారు. మెప్మా ద్వారా ఎనిమిది షాపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఉయ్యూరులోనే అంతా సిద్ధమైందని, మచిలీపట్నం, నూజివీడు, గుడివాడ సమాఖ్యల నుంచి దరఖాస్తులు వచ్చాయని మెప్మా పీడీ తెలిపారు. మిగిలిన నాలుగు పురపాలక సంఘాల్లో పట్టణ సమాఖ్యలు, జనరిక్ మెడికల్ షాపులను ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు స్వీకరించే పనిలో ఉన్నామని ఆమె చెబుతున్నారు. మండల కేంద్రాలు, పురపాలక సంఘాల్లో జనరిక్ మెడికల్ షాపుల కోసం గది అద్దెకు తీసుకోవాలంటే ప్రస్తుతం కనీసం నెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేలు చెల్లించాల్సి ఉంది. దీంతో పాటు కొంతమేర అడ్వాన్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇన్ని ఇబ్బందుల మధ్య మండల, పట్టణ సమాఖ్యలు ఎంతవరకు ఈ మెడికల్ షాపుల ఏర్పాటుకు ముందుకు వస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రజలందరికీ ఉపయోగపడే జనరిక్ మెడికల్ షాపులను ప్రభుత్వపరంగా ఏర్పాటు చేయకుండా ఆ బాధ్యతను మండల, పట్టణ సమాఖ్యలకు అప్పగించటం ద్వారా ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందనే వాదన ప్రజల నుంచి వినిపిస్తోంది. ఇటీవల ఇసుక రేవుల నిర్వహణను డ్వాక్రా సంఘాలకు అప్పగించి అనంతరం ఈ విధానం బాగోలేదని ప్రభుత్వమే ప్రచారం చేస్తోంది. సమాఖ్యలకు షాపుల నిర్వహణను అప్పగిస్తే ఎంతకాలం పాటు వారు ఈ షాపులను నడుపుతారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. -
ఏపీ ప్రభుత్వోద్యోగులకు 30న హెల్త్ కార్డులు
-
ఏపీ ప్రభుత్వోద్యోగులకు 30న హెల్త్ కార్డుల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులకు ఈనెల 30న హెల్త్ కార్డులు ఇవ్వనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం వెయ్యి జెనరిక్ మెడికల్ షాపులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. డిసెంబర్ నుంచి ప్రభుత్వాస్పత్రులలో పీపీపీ విధానాన్ని అమలుచేస్తామని అన్నారు. ప్రయోగాత్మకంగా గుంటూరులో కార్డియో థొరాసిక్ యూనిట్‌ను పీపీపీ విధానంలో ఏర్పాటుచేస్తామని చెప్పారు. ప్రభుత్వాస్పత్రులలో ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేస్తామని, ఇకమీదట అందరూ సమయానికి హాజరు కావాల్సిందేనని కామినేని తెలిపారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీలలో మార్పులు చేస్తామని, అనంతపురం, విజయవాడలకు కేంద్ర ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను మంజూరు చేసిందని వివరించారు. ఈనెల 30వ తేదీన ఉద్యోగులకు హెల్త్ కార్డులు పంపిణీ చేస్తామని, డిసెంబర్ నుంచి జర్నలిస్టులకూ హెల్త్ కార్డులు ఇస్తామని ఆయన అన్నారు.