ప్రజలకు తక్కువ ధరకు మందులను అందించటం కోసం జనరిక్ మెడికల్ షాపులను
ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. పెట్టుబడి భారం మాత్రం మండల, పట్టణ సమాఖ్యలపై మోపుతోంది. షాపుల ఏర్పాటులో ఉన్న ఇబ్బందుల నేపథ్యంలో సమాఖ్యలు ముందుకు రావటం లేదు. లాభనష్టాలు తామే భరించాల్సి ఉండటంతో వెనకడుగేస్తున్నాయి.
మచిలీపట్నం : జిల్లాలో జనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటు మూడు అడుగులు ముందుకు... ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. రాష్ట్ర వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ రాష్ట్ర వ్యాప్తంగా 200 జనరిక్ మెడికల్ షాపులను ఏర్పాటు చేస్తామని ఇటీవల ప్రకటించారు. జిల్లాలో 15 జనరిక్ మెడికల్ షాపులను ఏర్పాటు చేయాలని, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో ఏడు, మెప్మా ఆధ్వర్యంలో పురపాలక సంఘాల్లో ఎనిమిది ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
మండల కేంద్రాలైన అవనిగడ్డ, కైకలూరు, బంటుమిల్లి, గన్నవరం, పామర్రు, విస్సన్నపేట, మైలవరం ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు డీఆర్డీఏ పీడీ డి.చంద్రశేఖరరాజు తెలిపారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నట్లు మెప్మా పీడీ హిమబిందు పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్‌లో రూ.100 ఖరీదు చేసే మందుబిళ్లలు జనరిక్ మెడికల్ షాపుల్లో రూ.30కే అందుబాటులోకి వస్తాయి. రాయల్టీ చెల్లించని మందులను ఈ షాపుల్లో అందుబాటులో ఉంచుతారు.
పెట్టుబడి భారం సమాఖ్యలపైనే...
ఈ షాపుల ఏర్పాటుకు మండల, పట్టణ సమాఖ్యల ఖాతాలో ఉన్న నగదును పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఒక్కొక్క షాపు ఏర్పాటుకు ఫర్నిచర్, మందుల కోసం రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ షాపుల్లో ఫార్మాసిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్‌లను ఏర్పాటుచేసి ఒక్కొక్కరికి నెలకు రూ.7 వేలు వేతనంగా ఇవ్వాలని నిర్ణయించారు.
ముందుకు రాని సమాఖ్యలు...
మండల, పట్టణ సమాఖ్య ద్వారా రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టి షాపు తెరిస్తే సిబ్బంది జీతభత్యాలు, షాపు అద్దె, విద్యుత్ బిల్లులు తదితర అంశాల నేపథ్యంలో లాభం వచ్చినా, నష్టం వచ్చినా ఆయా సమాఖ్యలే భరించాలనే షరతు విధించారు. దీంతో జనరిక్ మెడికల్ షాపులను ఏర్పాటు చేసేందుకు సమాఖ్యలు ముందుకురావటం లేదు. ఒక్క ఉయ్యూరు పురపాలక సంఘంలోనే మందులు, ఫర్నిచర్ కొనుగోలు చేసి జనరిక్ మెడికల్ షాపును తెరిచేందుకు రంగం సిద్ధం చేశారు.
మిగిలిన చోట్ల మండల, పట్టణ సమాఖ్యలతో సంప్రదింపులు జరిపే పనిలో అధికారులు ఉన్నారు. డీఆర్డీఏ ద్వారా ఏడు షాపులను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఆరు షాపులను త్వరలో ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు డీఆర్డీఏ చెబుతున్నారు. మెప్మా ద్వారా ఎనిమిది షాపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఉయ్యూరులోనే అంతా సిద్ధమైందని, మచిలీపట్నం, నూజివీడు, గుడివాడ సమాఖ్యల నుంచి దరఖాస్తులు వచ్చాయని మెప్మా పీడీ తెలిపారు.
మిగిలిన నాలుగు పురపాలక సంఘాల్లో పట్టణ సమాఖ్యలు, జనరిక్ మెడికల్ షాపులను ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు స్వీకరించే పనిలో ఉన్నామని ఆమె చెబుతున్నారు. మండల కేంద్రాలు, పురపాలక సంఘాల్లో జనరిక్ మెడికల్ షాపుల కోసం గది అద్దెకు తీసుకోవాలంటే ప్రస్తుతం కనీసం నెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేలు చెల్లించాల్సి ఉంది. దీంతో పాటు కొంతమేర అడ్వాన్స్ చెల్లించాల్సి ఉంటుంది.
ఇన్ని ఇబ్బందుల మధ్య మండల, పట్టణ సమాఖ్యలు ఎంతవరకు ఈ మెడికల్ షాపుల ఏర్పాటుకు ముందుకు వస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రజలందరికీ ఉపయోగపడే జనరిక్ మెడికల్ షాపులను ప్రభుత్వపరంగా ఏర్పాటు చేయకుండా ఆ బాధ్యతను మండల, పట్టణ సమాఖ్యలకు అప్పగించటం ద్వారా ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందనే వాదన ప్రజల నుంచి వినిపిస్తోంది. ఇటీవల ఇసుక రేవుల నిర్వహణను డ్వాక్రా సంఘాలకు అప్పగించి అనంతరం ఈ విధానం బాగోలేదని ప్రభుత్వమే ప్రచారం చేస్తోంది. సమాఖ్యలకు షాపుల నిర్వహణను అప్పగిస్తే ఎంతకాలం పాటు వారు ఈ షాపులను నడుపుతారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
జనరిక్.. జాప్యం
Published Sun, Oct 11 2015 1:55 AM | Last Updated on Sun, Sep 3 2017 10:44 AM
Advertisement
Advertisement