ఏపీ ప్రభుత్వోద్యోగులకు 30న హెల్త్ కార్డుల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులకు ఈనెల 30న హెల్త్ కార్డులు ఇవ్వనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం వెయ్యి జెనరిక్ మెడికల్ షాపులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. డిసెంబర్ నుంచి ప్రభుత్వాస్పత్రులలో పీపీపీ విధానాన్ని అమలుచేస్తామని అన్నారు. ప్రయోగాత్మకంగా గుంటూరులో కార్డియో థొరాసిక్ యూనిట్ను పీపీపీ విధానంలో ఏర్పాటుచేస్తామని చెప్పారు.
ప్రభుత్వాస్పత్రులలో ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేస్తామని, ఇకమీదట అందరూ సమయానికి హాజరు కావాల్సిందేనని కామినేని తెలిపారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీలలో మార్పులు చేస్తామని, అనంతపురం, విజయవాడలకు కేంద్ర ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను మంజూరు చేసిందని వివరించారు. ఈనెల 30వ తేదీన ఉద్యోగులకు హెల్త్ కార్డులు పంపిణీ చేస్తామని, డిసెంబర్ నుంచి జర్నలిస్టులకూ హెల్త్ కార్డులు ఇస్తామని ఆయన అన్నారు.