నాసిరకం జనరిక్ మందులపై సర్కారు ఆగ్రహం
నాణ్యత పాటించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం
బ్రాండెడ్ కంపెనీలతో సమావేశానికి యోచన
సాక్షి, హైదరాబాద్: జనరిక్ మందుల దుకాణాల్లో నాసిరకం ఔషధాల విక్రయాలపై తెలంగాణ సర్కారు ఆగ్రహంతో ఉంది. వాటిపై తగు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. బ్రాండెడ్ మందులతో పోలిస్తే చాలా తక్కువ ధరకు జనరిక్ ఔషధాలను విక్రయిస్తున్నా వాటి నాణ్యతపై సందేహాలు తలెత్తడంతో వైద్య ఆరోగ్యశాఖ సమీక్షలు చేస్తుంది. అనేకచోట్ల జనరిక్ ఔషధాలు సంబంధిత రోగాలపై పనిచేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అడ్రస్ లేని కంపెనీల ఔషధాలను జనరిక్ దుకాణాల్లో పెట్టి విక్రయిస్తుండటంతో ఇతరత్రా అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది.
కేంద్రం మంజూరు చేసినా: జిల్లాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో జనరిక్ ఔషధ దుకాణాలున్నాయి. వీటిని మరింత విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. రెండు నెలల క్రితం రాష్ట్రానికి 25 జనరిక్ మందుల దుకాణాలను మంజూరు చేసింది. వాటిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాల్సి ఉంది. అవసరమైన ఔషధాలను కేంద్రమే సరఫరా చేస్తుంది. దుకాణాలను, సిబ్బందిని సమకూర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. జనరిక్ ఔషధ దుకాణాలను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని హెచ్‌ఎల్‌ఎల్ సంస్థ నిర్వహించనుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ఒప్పందం చేసుకోవాలి. అయితే ఎప్పటిలోగా ఒప్పందం కుదుర్చుకుంటారనే విషయంపై కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సర్కారుకు తాజాగా లేఖ రాసింది. కానీ వైద్య ఆరోగ్యశాఖ మాత్రం దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు. జనరిక్ దుకాణాల్లో నాసిరకం మందులు అమ్ముతున్నారనే కారణంతో తన నిర్ణయాన్ని పక్కన పెడుతోంది.
బ్రాండెడ్ జనరిక్ ఔషధాల కోసం...
అడ్రస్‌లేని కంపెనీల జనరిక్ ఔషధాలతో జనానికి అనేక సమస్యలు వస్తున్నాయని.. ప్రస్తుతం ఆయా దుకాణాల్లో విక్రయిస్తున్న నాసిరకం మందులను అడ్డుకోవాలని సర్కారు యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుమతించిన 25 జనరిక్ మందుల దుకాణాలను నెలకొల్పడానికి ముందుగా బ్రాండెడ్ ఔషధ కంపెనీలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్ కేంద్రంగా అనేక ఫార్మసీ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా బ్రాండెడ్ ఔషధాలను ఎగుమతి చేస్తున్నాయి.
తెలంగాణకు ఉన్న ఈ ప్రత్యేకతను ఉపయోగించుకోవాలని సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి బ్రాండెడ్ జనరిక్ ఔషధాలను తక్కువ ధరకు తయారు చేయాలని కోరనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రత్యేక సమావేశానికి ఏర్పాట్లు చేయాలని కోరినట్లు తెలిసింది. వారితో చర్చించిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో 25 జనరిక్ ఔషధ దుకాణాలపై ఒప్పందం కుదుర్చుకోవాలని మంత్రి భావిస్తున్నట్లు సమాచారం.