
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పశు పోషకులకు తక్కువ ధరలకే నాణ్యమైన పశువుల జనరిక్ మందులను అందించే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా వైఎస్సార్ పశు ఔషధ నేస్తం పథకాన్ని అందుబాటులోకి తెస్తున్నామని పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 52 పశు ఔషధ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. విజయవాడలోని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి జనరిక్ పశు ఔషధ కేంద్రాన్ని గురువారం మంత్రి అప్పలరాజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా మొబైల్ అంబులేటరీ క్లినిక్‌లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి జనరిక్ పశు ఔషధ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పశువులకు ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు మందుల కోసం పశు పోషకులు వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. ఆ భారం తగ్గించేందుకే ఈ స్టోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. డబ్ల్యూహెచ్ఓ సర్టిఫైడ్ జీఎంపీ క్వాలిటీ బ్రాండెడ్ డ్రగ్స్‌ను చాలా తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు.
ఒక్కో కేంద్రం రూ.4.63 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తుండగా.. 75 శాతం ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుందన్నారు. లబ్ధిదారులు కేవలం 25 శాతం వాటా చెల్లిస్తే సరిపోతుందన్నారు. పశు పోషకులు, ఔత్సాహిక వ్యాపార వేత్తలు, జాయింట్ లయబులిటీ గ్రూపులు, స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తి సంస్థలతో పాటు ఆసక్తి కల్గిన ప్రైవేటు వ్యక్తులను కూడా ఈ షాపుల ఏర్పాటుకు ప్రోత్సహిస్తామని చెప్పారు. ప్రతి జిల్లా పశు వైద్యశాలలో ఔషధ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ప్రభుత్వమే కేటాయిస్తుందన్నారు.
పశు వైద్యులు జనరిక్ మందులు మాత్రమే ప్రోత్సహించే విధంగా అవసరమైన సహకారాన్ని అందిస్తారన్నారు. అనంతరం వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను మంత్రి పరిశీలించారు. ఈ తరహా ఆస్పత్రులను రాష్ట్రంలో అవసరమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు. రాష్ట్ర పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్, అదనపు సంచాలకులు పి.సత్యకుమారి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment