స్టే విధించిన హైకోర్టు... 330 రకాల మందుల కొనుగోళ్లు వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ)లో టెండర్ వివాదం నెలకొంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 330 రకాల జనరిక్ మందుల సరఫరా ఆగిపోయింది. మందుల సరఫరాకు అధికారులు కొత్త కాంట్రాక్టు విధానాన్ని రూపొందించి ఏప్రిల్‌లో టెండర్లు పిలి చారు. టెండరు నిబంధనల ప్రకారం ఆయా కంపెనీలు మార్కెటింగ్ స్టాండర్డ్, టర్నోవర్ తదితర ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లో కొన్ని, మాన్యువల్‌గా మరి కొన్నింటినీ సమర్పించాలని సూచించారు.
ఈ మేరకు సుమారు 70 కంపెనీలు టెండర్‌లో పాల్గొన్నాయి. టెండరు తెరిచి చూశాక సుమారు 220 రకాల డ్రగ్స్‌ను ఒకే కాంట్రాక్టర్ తక్కువ ధరకు కోట్ చేసి దక్కించుకున్నారు. మాన్యువల్‌గా సమర్పించిన తమ ధ్రువపత్రాలను పరిగణనలోకి తీసుకోలేదని కొంతమంది, సదరు కాంట్రాక్టర్‌కు కట్టబెట్టేందుకు ఏకపక్షంగా వ్యవహరించారని మరో కాంట్రాక్టర్ హైకోర్టును ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన హైకోర్టు తాజాగా స్టే విధించింది. దీంతో 330 రకాల మందుల కొనుగోళ్లు నిలిచిపోయాయి.