జేసీ చేతికి సూపర్ బజార్
- కంచికి చేరిన పాలకవర్గం కథ
- మరో 2 నెలలుండగానే పదవులు రద్దు
- ‘సాక్షి’ కథనంతో ప్రకంపనలు
- వైఎస్సార్ సీపీ ఆందోళనల పర్యవశనం
సాక్షి, విశాఖపట్నం : ఈసారి వారి పప్పులుడకలేదు. మరో రెండు నెలల పదవీ కాలం ఉండగానే సూపర్‌బజార్ పాలకవర్గం రద్దయింది. కోట్లాది రూపాయల అవినీతి ఆరోపణలు.. లెక్కకు మించి అక్రమాలకు ఆలవాలమైన విశాఖ కో-ఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ లిమిటెడ్(సూపర్‌బజార్) పాలకవర్గానికి ఎట్టకేలకు చెక్‌పడింది. ప్రస్తుత పాలకవర్గానికి మరో రెండు నెలల గడువు ఉండగానే రద్దయింది. పగ్గాలు జిల్లా జాయింట్ కలెక్టర్ జె.నివాస్ చేతికి వెళ్లాయి. ఈ మేరకు సహకార శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టి.విజయ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ కథ
సూపర్‌బజార్ పాలకవర్గం మే 21వ తేదీతో ముగిసింది. కొత్త పాలకవర్గ నియామకం జరపకపోవడంతో తమ పదవీ కాలం మరో అర్నెల్ల పాటు పొడిగించాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఓ వైపు అవినీతి ఆరోపణలు.. లోకాయుక్త విచారణ నేపథ్యంలో ప్రస్తుత పాలకవర్గ పదవీ కాలాన్ని పొడిగించడానికి ఇష్టపడని అప్పటి సహకార శాఖ ప్రత్యేక కమిషనర్ మిరియాల శేషగిరిబాబు రద్దు చేసి జేసీకి పగ్గాలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
అయితే ఈ ఉత్తర్వులను తొక్కిపెట్టి మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పాలక వర్గాన్ని మరో అర్నెల్ల పాటు పొడిగిస్తూ రివైజ్డ్ జీవో జారీ చేశారు. ఈ విషయాన్ని ‘మరో ఆర్నెల్లు ఆరగించండి’ అంటూ మే 22న సాక్షిలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ప్రస్తుత పాలకవర్గం పాల్పడుతున్న అవినీతి.. అవకతవకలు.. లోకాయుక్త విచారణ తదితర పరిణామాలపై ప్రచురిత మైన ఈ పరిశోధనాత్మక కథనం సంచలనం రేపింది. ‘సాక్షి’లో ఇచ్చిన కథనంపై ప్రజల్లో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. సూపర్‌బజార్ అవినీతిపై విచారణ జరపాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ తీవ్రంగా ఖండించడంతో పాటు ద క్షిణ కో-ఆర్డినేటర్ కోలా గురువులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీల ఆధ్వర్యంలో వందలాది మంది కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేశారు.
అక్రమాలపై సమగ్ర నివేదిక
పాలకవర్గం అవినీతిపై జిల్లా యంత్రాంగం కూడా దృష్టి సారించింది. సూపర్‌బజార్‌లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై జిల్లా కో-ఆపరేటివ్ అధికారి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించారు. సహకార వ్యవస్థ నిబంధనలకు విరుద్ధంగా సూపర్‌బజార్ లో కార్యకలాపాలు సాగుతున్నాయని, కేవలం ఆర్థికపరమైన ప్రయోజనాల కోసమే నాడు తన పదవీకాలాన్ని పొడిగించాలని ప్రస్తుత పాలకవర్గం కోరినట్టుగా సదరు నివేదికలో పొందుపర్చారు.
దీంతో ప్రస్తుత పాలకవర్గ పదవీకాలాన్ని రద్దు చేసి తక్షణమే పర్సన్ ఇన్‌చార్జి(పీఐసీ)గా జేసీ నివాస్‌కు అప్పగించాలని కో-ఆపరేషన్ స్పెషల్ కమిషనర్ ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సూపర్‌బజార్ పర్సన్ ఇన్‌చార్జి బాధ్యతలను జేసీకి అప్పగిస్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టి.విజయకుమార్ జీవో నెం.691ను జారీ చేశారు. మరో రెండు నెలల పాటు పదవీ కాలం ఉండగానే ప్రస్తుత పాలకవర్గం పదవీకాలాన్ని రద్దు చేయడం చర్చనీయాంశమైంది.
ప్రభుత్వ ఆదేశాలు తక్షణమే అమలు
సూపర్‌బజార్ ప్రస్తుత పాలకవర్గ చైర్మన్ ఆర్.రామకృష్ణంరాజుపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. ప్రస్తుత పాలకవర్గం హయాంలో భారీగా అవినీతి, ఆరోపణలు వెల్లువెత్తాయి. సహకార చట్టం నియమాలకు విరుద్ధంగా పాలకవర్గం నిర్ణయాలు తీసుకోవడంతో సంస్థ ఆర్థికంగా నష్టపోతుంది. ఈ నేపథ్యంలో జిల్లా సహకార శాఖాధికారి, జిల్లా కలెక్టర్ సిఫార్సు మేరకు రామకృష్ణంరాజు పాలకవర్గాన్ని రద్దు చేస్తూ జేసీని పర్సన్ ఇన్‌చార్జిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయి.
- జి.గోవిందరావు,
మేనేజింగ్ డెరైక్టర్, సూపర్‌బజార్