దోమలపై దండయాత్ర
– సమష్టిగా విజయవంతం చేయాలి
– అధికారులకు జాయింట్ కలెక్టర్ ఆదేశం
అనంతపురం అర్బన్ : ‘డెంగీ, మలేరియా, టైఫాయిడ్ తదితర సీజనల్ వ్యాధుల నివారణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు శనివారం మెగా ర్యాలీ నిర్వహిస్తున్నాం. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి పాల్గొంటారు. సమష్టిగా విజయవంతం చేయాలి.’ అని జేసీ బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో వైద్య, ఆరోగ్య, మునిసిపల్, విద్యా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. దోమల నివారణపై ప్రజల్లో అవగాహన పెంచే ందుకు ‘దోమలపై దండయాత్ర– పరిసరాల పరిశుభ్రత’పై శనివారం ఉదయం 10 గంటలకు మెగా ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు.
ర్యాలీలో పాల్గొనే విద్యార్థులు ఉదయం తొమ్మిది గంటలకు ఆర్ట్స్ కళాశాల మైదానానికి చేరుకునేలా చూడాలన్నారు. డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, డీఈఓ అంజయ్య, ఆర్‌ఐఓ వెంకటేశ్వర్లు, కమిషనర్ చల్లాఓబుళేసు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రతి శనివారం డ్రైడే : ఇకపై ప్రతి శనివారం ప్రజలు కచ్చితంగా డ్రైడే పాటించేలా అవగాహన పెంచాలని అధికారులను జేసీ ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రత పాటించేలా చూడాలన్నారు. దోమల నివారణకు డమ్ములు, తొట్లు, కూలర్లులో నీరు రెండు రోజులకోసారి తొలగించేలా, దొమ తెరలు వాడేలా అవగాహన కల్పించాలన్నారు.