నిత్యావసర ధరలు నియంత్రణలో ఉండాలి
– అధికారులకు జాయింట్ కలెక్టర్ ఆదేశం
అనంతపురం అర్బన్ : నిత్యావసర సరుకుల ధరలు నియంత్రణలో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం ఆదేశించారు. శుక్రవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో ధరల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు ఇష్టానుసార ధరలకు విక్రయించకుండా మార్కెట్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. కందిబేడలు కిలో రూ.100 వరకు ఉందని, ఇంతకు మించి విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆహార కల్తీపై కూడా నిఘా పెట్టాలన్నారు. దాడులు నిర్వహించి ఎక్కడైనా కల్తీకి పాల్పడుతున్నట్లు గుర్తిస్తే తక్షణం కేసులు నమోదు చేయాలని చెప్పారు. జిల్లా కేంద్రంలోని ఎనిమిది ప్రభుత్వ వసతి గహాలకు రైతు బజార్ నుంచి కూరగాయలు, ఆకుకూరలు కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో అక్రమ నిలువలపై విజిలెన్స్, రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ –క్రాప్ బుకింగ్ చేయాలి
జిల్లాలో ఈ – క్రాప్ బుకింగ్ వంద శాతం చేయాలని మండల వ్యవసాయ అధికారులు, ఏఈఓ, ఎంపీఓలను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం ఎన్‌ఐసీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 4లోపు ఈ–క్రాప్ బుక్కింగ్ వంద శాతం పూర్తి చేయాలన్నారు.