home needs
-
ఇంటి శుభ్రతకై.. ఇలా చేస్తున్నారా? జాగ్రత్త!
ఇంటిని శుభ్రంగా ఉంచడం కోసం ముందుగా గుమ్మం దగ్గర ఉండే డోర్మ్యాట్ని శుభ్రం చేసుకోవడంతో ప్రారంభించాలి. ఎందుకంటే మనం ఇంట్లోకి, బయటకి తిరిగేటప్పుడు కాళ్లకు ఉండే మట్టి అంటేది డోర్ మ్యాట్కే కాబట్టి డోర్ మ్యాట్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. వారానికోసారి డోర్మ్యాట్ని మారుస్తుండాలి. అందుబాటులో ఉంచుకోవడం..– శుభ్రతకి కావాల్సిన వస్తువులన్నింటినీ మన చేతికి అందేలా ఉంచుకోవడం వల్ల సమయం కలిసొస్తుంది. పని కూడా సులువు అవుతుంది.– కిటికీలు తెరిస్తే వెలుతురుతోపాటు దుమ్ము కూడా వచ్చేస్తుంది. అందుకే కిటికీల రెక్కలను కొద్దిసేపు తెరిచి ఉంచిన తర్వాత మళ్లీ మూసేయాలి.– ఇక కిటికీ అద్దాలకీ దుమ్ము, ధూళి, సూక్ష్మజీవులు కూడా ఎక్కువగా అంటి పెట్టుకుని ఉంటాయి. అందువల్ల కిటికీలను ప్రతిరోజూ శుభ్రం చేస్తుంటే సీజనల్ అలర్జీల నుంచి దూరంగా ఉండొచ్చు.బూజు దులపటం..– ఇంటినంతా చక్కగా కడిగి శుభ్రంగా ఉంచడంతో పాటు గోడ మూలల్లో ఉన్న బూజును కూడా దులపాలి.– ఇంట్లో చెత్తని తొలగించడంలో ఏమాత్రం అజాగ్రత్త ఉండకూడదు.– ముఖ్యంగా బాత్రూమ్లో, వంటగదుల్లోనూ సూక్ష్మజీవులు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలి.– ఇంటి ముందు చెట్లు ఉంటే పరిశుభ్రమైన గాలి వస్తుంది. తేమ శాతం తగ్గుతుంది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలతో ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే సీజనల్ వ్యాధుల నుండి కొంతవరకు రక్షణ పొందవచ్చు.– ఇక ఇంటిని శుభ్రం చేయడమంటే చాలా పెద్ద సమస్య. వస్తువులను శుభ్రంగా కడిగే ముందు ఎక్కువగా దుమ్ము పేరుకునే వస్తువులను ముందుగా శుభ్రం చేసుకుంటే సగం పని అయిపోతుంది. దీనికి కింది సూచనలు పాటిస్తే సరిపోతుంది.సీలింగ్ ΄్యాన్స్..– సీలింగ్ ΄్యాన్లను తుడవకుండా ఉంటే వాటిపై దుమ్ము ఎక్కువగా చేరుతుంది. దానివల్ల ఇంట్లో ఉండే ఫర్నిచర్‌పై దుమ్ము పడుతుంది. కాబట్టి ఫ్యాన్‌ను మొదట శుభ్రం చేయాలి. కంప్యూటర్..– కంప్యూటర్, లాప్టాప్ కీబోర్డు ఎప్పటికప్పుడు శుభ్రం చే సుకోకపోతే తొందరగా పాడైపోయే అవకాశం ఉంది.టీవీ..– టీవీ స్క్రీన్‌ను ఒక శుభ్రమైన మెత్తటి బట్టతో తుడవాలి. అలాగే టీవికి ముందు వైపు కన్నా వెనుక భాగంలో ఎక్కువగా దుమ్ము ఉంటుంది. దాన్ని దులపడటం చాలా అవసరం.అద్దాలు..– ఇంట్లో ఉండే అద్దాలను, గాజు పాత్రలను శుభ్రంగా కడిగి తుడిచి పెట్టండి. ఇలా చేయటం వల్ల పాత్రలు కొత్తవిగా కనిపిస్తాయి.పక్కబట్టలు మడతపెట్టడం..– రోజంతా పని చేసిన తర్వాత వచ్చి సేదదీరేది బెడ్ మీదనే. మీ పడకగది మురిగ్గా ఉండటం చూస్తే నిద్ర కూడా సరిగా పట్టదు. కాబట్టి నిద్ర లేవగానే దుప్పటిని దులిపి మడతబెట్టాలి. బెడ్‌షీట్‌ను నీట్‌గా సర్దాలి.దుస్తుల శుభ్రం..– ఒకేసారి మొత్తం బట్టలు ఉతకాలంటే అలసట రావడం సహజమే, పైగా అందుకు ఎక్కువ సమయం కూడా పడుతుంది.– ధరించే దుస్తులలో రకాన్ని బట్టి వేటికవి విడదీసి ఉతికితే సులభంగా ఉంటుంది.చెత్తను వదిలించుకోవడం..– ఇంటిలో అనవసరమైన వస్తువులు తీసి బయట పడేసి తర్వాత అన్నిటినీ సర్దటం మంచిది.– ఈ అలవాటును అందరూ తప్పక పాటించాలి.– వాడే వస్తువులు అన్నీ అందుబాటులో ఉండేలా సర్దుకోవాలి.– టేబుల్స్ లేదా బల్లలపై తక్కువ వస్తువులుంటే వాటిని శుభ్రపర్చటం సులువవుతుంది.– ఇంటి వాకిలి దగ్గర ఉంచే షూ ర్యాక్ కూడా శుభ్రపర్చటం చాలా ముఖ్యం.– అలాగే మీకేదన్నా దాని స్థానంలో లేదు అన్పిస్తే, మళ్ళీ చేద్దాంలే అని వదిలేయకండి. అప్పటికప్పుడు చేయటం మంచిది.నిద్రించే ముందే..– మీరు ప్రతి రాత్రి పడుకునే ముందు అన్నిటినీ శుభ్రం చేసే అలవాటు చేసుకోవాలి.– ముఖ్యంగా పిల్లలకు వాళ్ల వస్తువులను సర్దేసి, వారి గదులను శుభ్రం చేసుకుని పడుకునేలా తర్ఫీదు ఇవ్వండి.– వంటగదిని కూడా శుభ్రం చేసి పడుకోటం నేర్చుకోండి.పరిసరాల పరిశుభ్రత..మీ ఇంటిని శుభ్రంగా, నీటుగా ఉంచుకోడానికి, పరిశుభ్రత అలవాట్లు చాలా ముఖ్యం. ఇది అందరి బాధ్యత. ఇంటి శుభ్రత కోసం మీరొక్కరే కాదు, కుటుంబసభ్యులు కూడా కృషి చేయాలి. అలా మీరే తర్ఫీదు ఇవ్వడం అవసరం. చిన్న పిల్లలు కదా, వాళ్లేమి చేయగలరులే అని వదిలేస్తే, తర్వాత మీరే బాధపడాల్సి ఉంటుంది కాబట్టి చిన్నప్పటినుంచి పిల్లలకు కూడా ఎక్కడ తీసిన వస్తు సామగ్రిని అక్కడ పెట్టడం అలవాటు చేయడం అవసరం.ఇవి చదవండి: తేలిగ్గా చేయగలిగే సింపుల్ ఎక్సర్సైజ్.. ఏంటో తెలుసా? -
పాతకాలం వుడెన్ వస్తువులే.. అయినా ఇంత అందంగా!
రీసైక్లింగ్ అనేదిప్పుడు గృహాలంకరణలో కొత్త ఒరవడి సృష్టిస్తోంది. కలపే కాదు ఫ్యాబ్రిక్ కూడా అందులో భాగమైంది. రీసైకిల్ వుడెన్ ఫర్నిచర్‌తోపాటు పాతకాలం వుడెన్ వస్తువులు కొద్దిపాటి మార్పుచేర్పులతో అద్భుతమైన షోపీసెస్గా అమరిపోతున్నాయి.ఇంట్లోని రకరకాల ఫ్యాబ్రిక్స్ కూడా! పలు కళాత్మక రూపాలుగా కొలువుదీరి ఇంటి హోదాను.. విలువను పెంచుతున్నాయి. ఇలా రీసైక్లింగ్ మెటీరియల్‌తో విండో బ్లైండ్స్ నుంచి ఆరుబయట అలంకారాల వరకు ప్రతీదాంట్లోనూ మనదైన సృజనను చూపించవచ్చు.విండోస్‌కి జూట్, ఆకులతో అల్లిన చాపలను ఉపయోగించవచ్చు. వెదురుతో చేసిన రకరకాల వస్తువులు, ఫర్నిచర్‌ను బాల్కనీలో అమర్చుకోవచ్చు. వీటివల్ల ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న అనుభూతి కలుగుతుంది. పర్యావరణ పరిరక్షణలో భాగమయ్యామనే ఆనందమూ మిగులుతుంది.ఇవి చదవండి: అమెరికా వీసా కోసం ‘దొంగ’ నాటకం, అడ్డంగా బుక్కైన నలుగురు భారతీయులు -
Catastrophe Insurance: మీ ఇంటికి బీమా ఉందా..?
దీపావళి రోజున హైదరాబాద్‌కు చెందిన రామన్ కుటుంబం ఓ పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. స్కై షాట్ క్రాకర్ గతితప్పి ఎనిమిదో అంతస్తులోని రామన్ అపార్ట్మెంట్లోకి దూసుకెళ్లింది. దాంతో మంటలు మొదలయ్యాయి. ఇంట్లోని ఫరి్నచర్, విలువైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, వ్రస్తాలు కాలిపోయాయి. ఒకింత అదృష్టం ఏమిటంటే రామన్ కుటుంబ సభ్యులు అందరూ ఫ్లాట్ నుంచి బయటకు వచ్చేశారు. ఎవరికీ గాయాలు కాలేదు. కానీ, ఇంట్లోని విలువైన వస్తువులు కాలిపోవడం వల్ల రూ.20 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ఇది ఊహించని నష్టం. ఇలాంటి ప్రమాదం ఏర్పడుతుందని ఎవరూ అనుకోరు. కానీ, ప్రమాదాలు అన్నవి చెప్పి రావు. అందుకే ఇంటికి, ఇంట్లోని విలువైన వాటికి బీమా ఉండాలని నిపుణులు తరచూ చెబుతుంటారు. కానీ, దీన్ని పాటించే వారు చాలా తక్కువ మందే అని చెప్పుకోవాలి. హోమ్ ఇన్సూరెన్స్ ఇంటితోపాటు, ఇంట్లోని విలువైన వస్తువులకు ప్రమాదాలు, విపత్తుల కారణంగా ఏర్పడే నష్టం నుంచి రక్షణనిస్తుంది. చౌక ప్రీమియానికే వస్తుంది. రోజుకు ఒక టీకి పెట్టేంత ఖర్చు కూడా కాదు. హోమ్ ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి అనేది వివరంగా చూద్దాం... ‘‘ప్రజలు తమ జీవిత కాల పొదుపును ఇంటి కొనుగోలు కోసం వెచి్చస్తున్నారు. మరి అంతటి విలువైన ఆస్తిని కాపాడుకునేందుకు కావాల్సిన చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ఎంతో విలువైన ఆస్తికి ఎల్లప్పుడూ రిస్క్ పొంచి ఉంటుంది’’అని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ అండర్‌రైటింగ్ , ప్రాపర్టీ క్లెయిమ్స్ చీఫ్ గౌరవ్ అరోరా తెలిపారు. నిజానికి ప్రతి 20 ఇళ్లల్లో కేవలం ఒక ఇంటికే ప్రస్తుతం బీమా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. సగటు వ్యక్తికి ఇల్లు అనేది పెద్ద పెట్టుబడి అవుతుంది. అందుకే ఆ విలువైన ఆస్తికి తప్పకుండా రక్షణ తీసుకోవాలి. ‘‘విపత్తులు రావడం అన్నది అరుదే. కానీ, వచి్చనప్పుడు వాటిల్లే నష్టం భారీగా ఉంటుంది’’అని డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ డైరెక్ట్ సేల్స్ హెడ్ వివేక్ చతుర్వేది పేర్కొన్నారు. అనుభవాలను మర్చిపోవద్దు.. జీవిత బీమా తీసుకోవాలని చాలా మంది ఏజెంట్లు అడగడం వినే ఉంటారు. కానీ, అదే స్థాయిలో హోమ్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్ కనిపించదు. దీన్ని తీసుకున్నామని, తీసుకోవాలని సూచించే వారు కూడా అరుదు. విపత్తులు, ప్రమాదాలే హోమ్ ఇన్సూరెన్స్ దిశగా అడుగులు వేయించేవిగా భావించాలి. నిజానికి ప్రకృతి విపత్తుల సమయాల్లో హోమ్ ఇన్సూరెన్స్ విక్రయాలు పెరుగుతుంటాయి. 2018లో కేరళను వరదలు తీవ్రంగా నష్టపరిచాయి. ఆ తర్వాతి ఏడాదిలో హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆదాయం 34 శాతం పెరిగింది. ఇంటి బీమా కోసం ఆసక్తి పెరిగింది. 2020లో యాంఫాన్ తుపాను పశి్చమబెంగాల్ను నష్టపరచగా ఆ తర్వాతి ఆరి్థక సంవత్సరంలో పై ప్రీమియం ఆదాయం 27 శాతం పెరగడం గమనించొచ్చు. కానీ, ఇదంతా తాత్కాలిక ధోరణిగానే ఉంటోంది. విపత్తులు లేదా ప్రమాదాలు తలెత్తినప్పుడు సహజంగా హోమ్ ఇన్సూరెన్స్ విక్రయాలు పెరుగుతుంటాయి. తిరిగి ఏడాది రెండేళ్ల తర్వాత అక్కడి ప్రజలు వాటిని మరిచిపోతుంటారు. దీంతో విక్రయాలు మళ్లీ తగ్గుతుంటాయి. ఇదే పరిస్థితి ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలోనూ కనిపిస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో వైద్య బిల్లులు గణనీయంగా పెరిగాయి. దీంతో ఆరోగ్య బీమా తీసుకునే వారిలో పెద్ద ఎత్తున పెరుగుదల కనిపించింది. ఇప్పుడు కరోనా విపత్తు బలహీనపడింది. దీంతో హెల్త్ ఇన్సూరెన్స్ విక్రయాలు తిరిగి సాధారణ స్థాయికి చేరాయి’’అని డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్‌కు చెందిన చతుర్వేది తెలిపారు. ఫ్లాట్ యజమానులు హౌసింగ్ సొసైటీ తీసుకున్న హోమ్ ఇన్సూరెన్స్‌పై ఆధారపడడం సరికాదని నిపుణుల సూచన. తమ ఫ్లాట్‌తోపాటు, అందులోని విలువైన వస్తువులకు విడిగా కవరేజీ తీసుకోవడం అన్ని విధాలుగా మెరుగైన నిర్ణయం అవుతుంది. ఇంటికి భూకంపాలు, తుపాను, వరదల ముప్పు మాత్రమే కాదు, ఎత్తయిన భవనాలు, ఖరీదైన గాడ్జెట్ల వినియోగం నేపథ్యంలో అగ్ని ప్రమాదాల ముప్పు కూడా ఉంటుందన్న విషయాన్ని గ్రహించాలి. ముంబైలో ఏటా 5,000 వరకు అగ్ని ప్రమాదాలు నమోదవుతున్నట్టు ఒక అంచనా. ఇందులో 70 శాతానికి విద్యుత్తే కారణంగా ఉంటోంది. ఢిల్లీ, బెంగళూరు తదితర పట్టణాల్లో ఏటా 2,500 మేర అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ‘‘ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్ గాడ్జెట్ల వినియోగం పెరిగిపోవడంతో, ఎలక్ట్రికల్ వైరింగ్‌పై భారం అధికమై అగ్ని ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి’’అని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ చతుర్వేది తెలిపారు. అపార్ట్మెంట్లలో అగ్ని ప్రమాదానికి సంబంధించి అలారమ్ మోగిన వెంటనే, స్ప్రింక్లర్ సిస్టమ్ నుంచి నీరు ఎంతో ఒత్తిడితో ఎగజిమ్మడం మొదలవుతుంది. ఈ నీటి కారణంగా ఇంట్లోని విలువైన గాడ్జెట్లు, ఇంటీరియర్ దెబ్బతింటాయి. కనుక అగ్ని ప్రమాదం జరగకపోయినప్పటికీ, ఇంటి యజమా ని చాలా నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అద్దె ఇంట్లో ఉంటే హోమ్ ఇన్సూరెన్స్ అవసరం లేదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ, ఇది ఎంత మాత్రం సరైనది కాదు. హోమ్ ఇన్సూరెన్స్ అన్నది కేవలం ఇంటి నిర్మాణానికి జరిగిన నష్టానికే పరిమితం కాదు. ఇంట్లోని వస్తువులు దెబ్బతింటే ఏర్పడే నష్టం నుంచి గట్టెక్కడానికి బీమా అక్కరకు వస్తుంది. దోపిడీ, దొంగతనాల వల్ల ఏర్పడే నష్టాన్ని సైతం భర్తీ చేసుకోవచ్చు. కవరేజీ చాలినంత.. హోమ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ముందు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. తమ అవసరాలకు తగిన పాలసీ కీలకం అవుతుంది. భారత్ గృహ రక్ష (బీజీఆర్) అన్నది ఐఆర్డీఏఐ ఆదేశాల మేరకు అన్ని సాధారణ బీమా సంస్థలు తీసుకొచి్చన ప్రామాణిక నివాస బీమా. ప్రకృతి విపత్తులు అయిన వరదలు, భూకంపాలతోపాటు అగ్ని ప్రమాదాలు, చెట్టు విరిగి పడడం, వాహనం డ్యాష్ ఇవ్వడం కారణంగా ఇంటికి వాటిల్లే నష్టానికి ఈ పాలసీలో పరిహారం లభిస్తుంది. శిధిలాల తొలగింపునకు, ఇంజనీరింగ్ లేదా ఆర్కిటెక్ట్ ఫీజులకు అయ్యే మొత్తాన్ని కూడా చెల్లిస్తుంది. కానీ, ఇందులో పరిమితులు కూడా ఉన్నాయి. రూ.10 లక్షలు లేదా తీసుకున్న కవరేజీలో 20 శాతం ఏది తక్కువ అయితే అంత మేరే ఈ పాలసీ కింద పరిహారం లభిస్తుంది. ఓ సాధారణ మధ్య తరగతి ఇంటికి రూ.10 లక్షలు బీమా సరిపోదు. ఇంట్లో అధిక విలువ కలిగిన వస్తువులు ఉంటే, వాటి కోసం ప్రత్యేక కవరేజీ తీసుకోవాలని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రాపర్టీ అండ్ రైటింగ్ హెడ్ గురుదీప్ సింగ్ బాత్రా సూచించారు. ఇంటి మార్కెట్ విలువ ఆధారంగా బీమా కవరేజీపై నిర్ణయానికి రావద్దు. ఇంటి నిర్మాణం దెబ్బతింటే, పునరుద్ధరించడానికి అయ్యే వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. చదరపు అడుగుకు ఎంత వ్యయం అవుతుందో ఇంజనీర్లను అడిగితే తెలుస్తుంది. ఇంట్లో విలువైన ఫిట్టింగ్‌లు ఏర్పాటు చేసుకున్న వారు, ఆ విలువను కూడా బీమా కవరేజీకి అదనంగా జోడించుకోవాలి. హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏటా ఎంతో కొంత పెరుగుతుంటుంది. కనుక ఏడాదికి కాకుండా ఒకేసారి రెండు, మూడేళ్ల కాలానికి పాలసీ తీసుకోవచ్చు. ‘‘ఇంటికి తీసుకునే బీమాని ఏటా రెన్యువల్‌కు ముందు ఆ కవరేజీని సమీక్షించుకోవాలి. ఎందుకంటే ద్రవ్యోల్బణం ప్రభావంతో ఏటా ఇంటి నిర్మాణ వ్యయం పెరిగిపోతుంటుంది. అందుకు అనుగుణంగా ఏటా నిర్ణీత శాతం మేర కవరేజీని పెంచుకోవాలి. ఏటా 10 శాతం మేర కవరేజీ పెరుగుతూ వెళ్లే వాటిని పరిశీలించొచ్చు. ఇంట్లో ఉన్న ఒక్కో పరికరం, కొనుగోలు చేసిన సంవత్సరం, మోడల్ నంబర్, దాని విలువ ఈ వివరాలన్నీ సిద్ధం చేసుకోవాలి. ఇన్సూరెన్స్ సంస్థలు ఈ వివరాల ఆధారంగానే పరిహారాన్ని నిర్ణయిస్తాయి. అవి ఎన్నేళ్ల పాటు వాడారన్న వివరాల ఆధారంగా ప్రామాణిక తరుగును అమలు చేస్తాయి. ఎలక్ట్రానిక్ పరికరాల విలువ ఏటా తగ్గుతూ ఉంటుంది. రూ.50 వేలు పెట్టి రెండేళ్ల క్రితం కొనుగోలు చేసిన వస్తువు విలువ ఇప్పుడు సగానికి తగ్గిపోతుంది. కనుక పాడైపోయిన దాని స్థానంలో కొత్తది కొనుగోలుకు అయ్యే మొత్తాన్ని బీమా సంస్థ చెల్లిస్తుందని అనుకోవద్దు. ఇంట్లో విలువైన కళాకృతులు ఉంటే, వాటికి సైతం బీమా కవరేజీ కోరుకుంటే.. సరి్టఫైడ్ ఏజెన్సీ నుంచి వ్యాల్యూషన్ సరి్టఫికెట్ తీసుకోవాలి. ఒకవేళ కళాఖండాల మొత్తం విలువ రూ.5 లక్షలు, విడిగా ఒక్కోటి విలువ రూ.లక్ష మించకపోతే వ్యాల్యూషన్ సరి్టఫికెట్ అవసరం పడదు. ఎలాంటి కవరేజీ..? ప్రతి ఇంటికి కనీసం హోమ్ ఇన్సూరెన్స్ బేసిక్ పాలసీ అయినా ఉండాలి. భూకంపాలు, పిడుగులు, తుపానులు, వడగళ్లు, వరదలు తదితర ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదం, విధ్వంసం, అల్లర్ల కారణంగా ఇంటి నిర్మాణానికి నష్టం ఏర్పడితే బేసిక్ పాలసీలో పరిహారం లభిస్తుంది. మరమ్మతులు లేదంటే తిరిగి నిర్మాణం వీటిల్లో సరైన దానికి కవరేజీనిస్తుంది. రూ.లక్ష కవరేజీకి ప్రీమియం రూ.30 వరకు ఉంటుంది. ఇక ఇంటి నిర్మాణానికి అదనంగా, ఇంట్లోని వస్తువులకు కూడా రక్షణ తీసుకోవచ్చు. ఈ తరహా కవరేజీకి ప్రతి రూ.లక్షకు గాను ప్రీమియం రూ.60 వరకు ఉంటుంది. దోపిడీ, దొంగతనాల నుంచి సైతం రక్షణ అవసరం. ఇంట్లోని ఫరి్నచర్, కళాఖండాలు, వ్రస్తాలు, గృహోపకరణాలు, గాడ్జెట్ల వంటి వాటికి దొంగతనాల నుంచి రక్షణ కోరుకుంటే ప్రతి రూ.లక్షకు రూ.200 వరకు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. ఇంట్లో గాడ్జెట్లు పనిచేయకుండా పోవడం చూస్తుంటాం. ఇలా ఉన్నట్టుండి ఇంట్లో పరికరం పనిచేయకుండా పోతే, పరస్పర అంగీకారం మేరకు పరిహారం అందించే ‘బ్రేక్‌డౌన్’ కవర్ కూడా ఉంటుంది. దీనికి ప్రీమియం రూ.లక్షకు రూ.200–300 వరకు ఉంటుంది. రుణంపై ఇంటిని తీసుకున్న వారు ఈఎంఐ ప్రొటెక్షన్ కవర్ తీసుకోవచ్చు. ఇంటి నిర్మాణం దెబ్బతిన్న సందర్భాల్లో పునరుద్ధరణ లేదా పునర్నిర్మాణం వరకు రుణ ఈఎంఐని బీమా కంపెనీ చెల్లించాలని కోరుకుంటే ఈఎంఐ ప్రొటెక్షన్ కవర్ తీసుకోవచ్చు. ఆరు నెలల ఈఎంఐ రక్షణకు ప్రీమియం రూ.2,500 వరకు ఉంటుంది. ఇంటి నిర్మాణం దెబ్బతిన్నప్పుడు అందులో ఉండే కిరాయిదారు ఖాళీ చేయాల్సి రావచ్చు. అదే జరిగితే అప్పటి వరకు ప్రతి నెలా క్రమం తప్పకుండా వస్తున్న అద్దె ఆదాయానికి బ్రేక్ పడుతుంది. ఇలా అద్దె ఆదాయాన్ని నష్టపోకుండా, బీమా సంస్థ చెల్లించేలా యాడాన్ కవర్ తీసుకోవచ్చు. దీనికి ప్రతి నెలా రూ.25వేల అద్దె చొప్పున ఆరు నెలల పాటు చెల్లించే కవర్‌కు ప్రీమియం రూ.2,000 ఉంటుంది. వ్యక్తిగత ప్రమాద బీమా ప్రత్యేకంగా ఉంటే, హోమ్ ఇన్సూరెన్స్‌తో తీసుకోవాల్సిన అవసరం లేదు. భారం తగ్గాలంటే..? హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించుకునేందుకు కొన్ని మార్గాలున్నాయి. ఇల్లు, ఇంట్లోని వస్తువులకు నష్టం వాటిల్లినప్పుడు, కొంత మొత్తాన్ని తామే భరించేట్టు అయితే ప్రీమియం తగ్గుతుంది. కొన్ని కంపెనీలే ఈ ఆప్షన్ ఇస్తున్నాయి. ఇంట్లో అన్నింటికీ బీమా అవసరం ఉండదు. బాగా పాత పడిపోయిన వాటికి, పెద్దగా వ్యాల్యూ లేని (తరుగు బాగా పడే) వాటికి బీమా అనవసరం. అగ్ని ప్రమాదం జరిగితే హెచ్చరించి, అప్రమత్తం చేసే అలారమ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే, అగ్ని ప్రమాదాన్ని అదుపు చేసే పరికరాలు ఏర్పాటు చేసుకుంటే ప్రీమియంలో 15 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. స్వయం ఉపాధిలోని నిపుణులు లేదా వ్యాపారులు అయితే హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. వేతన జీవులకు ఈ వెసులుబాటు లేదు. ఏడాదికి కాకుండా, ఏడాదికి మించి ఎక్కువ కాలానికి పాలసీ తీసుకుంటే ప్రీమియంలో 10 శాతం తగ్గింపు వస్తుంది. -
Interior Decor: ఉట్టిపడే జీవకళ! ఇలా చేశారంటే లుక్‌తో పాటు ప్రశాంతత కూడా!
గదిలో కూర్చుున్నప్పుడు ప్లెయిన్‌గా కనిపించే గోడలు, ఫర్నిచర్కేసి దృష్టి సారిస్తే.. కొన్నిసార్లు మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ, అదే రొటీన్ అయితే మాత్రం బోర్ అనిపిస్తుంది. ఏదో లోటు కనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ‘ఇదిగో ఇలా జీవకళను ఇంటికి తీసుకొచ్చేయడమే’ అంటారు అమెరికా వాసి.. ఇంటీరియర్ డిజైనర్.. మిషెల్ విలియమ్స్. కలర్స్.. కలర్స్.. బయటి వాతావరణం డల్‌గా ఉన్నప్పుడు ఇల్లు బ్రైట్‌గా కనిపించాలి. అందుకు రంగులు ఎంతగానో సహకరిస్తాయి. ఇంట్లోకి పాజిటివిటీని కూడా మోసుకువస్తాయి. అందుకు గది గోడల రంగులు మార్చేయనక్కర్లేదు. కుషన్స్, రగ్గులు, కర్టెన్స్, కార్పెట్స్.. ఇతర ఫర్నిషింగ్ ఐటమ్స్ ఏవైనా ఇంద్రధనస్సు రంగులతో కాంతిమంతంగా ఉండేవాటిని ఎంపిక చేసుకోండి. వాటిలో ప్రధానంగా పసుపు, పింక్ రంగులు ఉంటే మీ చుట్టూ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. జీవరాశి డిజైన్లతో ఉన్న ప్రింట్లు, పెయింటింగ్స్నూ అలంకరణలో భాగం చేయొచ్చు. వాల్ ట్రీట్మెంట్ ఇంటికి అతిథులు ఎవరొచ్చినా వాళ్ల చూపులు ముందుగా గది గోడల మీదకే వెళతాయి. వాళ్ల కళ్లల్లో మన చాయిస్ పట్ల ప్రశంసలు చూడాలనుకుంటే ఫొటో ఫ్రేమ్స్‌ను ఎంపిక చేసుకోవాలి. మన మదిలో పాత జ్ఞాపకాలను తట్టిలేపే ఫొటోలతో ఆ ఫ్రేమ్స్‌ను ఫిల్ చేయాలి. లైట్ల ఎంపిక ఇంట్లో కాంతి మన భావోద్వేగాలపై ప్రభావం చూపుతుంది. వర్క్‌ప్లేస్‌లో ఒక విధంగా, లివింగ్ రూమ్‌లో మరో విధంగా.. ఇలా ఒక్కో ప్లేస్‌కి తగినట్టు మనల్ని నార్మల్ మూడ్‌లో ఉంచే విధంగా లైటింగ్ ఉండాలి. అందుకు తగిన హ్యాంగింగ్ లైట్స్, టేబుల్ ల్యాంప్స్, ఫ్లోర్ ల్యాంప్స్‌ను సెట్ చేసుకోవాలి. వంటగదిలో కొత్త ప్రయోగం లాక్డౌన్ టైమ్‌లో చిన్నాపెద్దా తేడా లేకుండా వంట గదిలో కొత్త వంటకాల ప్రయోగాలు చేశారు. అప్పుడే వంటగది అలంకరణ పట్ల శ్రద్ధ పెరిగి ఉంటుంది. మన సౌకర్యం.. అభిరుచికి తగ్గట్టుగా కిచెన్ క్యాబినెట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. మైక్రోవేవ్, గ్యాస్ స్టవ్ వంటివి.. అటూ ఇటూ జరపడానికి వీలుగా ట్రాలీలుగా పెట్టుకోవాలి. శుభ్రతే ప్రధానం ఇంటి ఇంటీరియర్ ఎంత బాగున్నా శుభ్రత విషయంలో నిర్లక్ష్యం చేస్తే పెట్టిన ఎఫర్ట్స్ అంతా వృథా అవుతాయి. అందుకని ఇల్లు ఎంత తక్కువ స్పేస్‌లో ఉన్నా శుభ్రంగా ఉంచుకుంటే మన మనసు కూడా ఆహ్లాదంగా ఉంటుంది. కిచెన్ క్యాబినెట్, బాత్రూమ్ మ్యాట్స్, సోప్ డిస్పెన్సర్ సెట్స్.. వంటి వాటిని మరింత శుభ్రంగా.. పొడిగా ఉండేలా చూసుకోవాలి. చదవండి: హోమ్ క్రియేషన్స్; చీరంచు టేబుల్.. లుక్ అదుర్స్ -
పరిగిలో ఘరానా మోసం
సాక్షి, వికారాబాద్: అతి తక్కువ ధరలకే హోంనీడ్స్ ఇస్తామని చెప్పి ఘరానమోసం చేసిన ఘటన జిల్లాలోని పరిగిలో చోటుచేసుకుంది. హోంనీడ్స్ పేరుతో డబ్బులు వసూలు చేసి మోసగాళ్లు రాత్రికిరాత్రే బిచాణా ఎత్తేశారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన వ్యక్తులు పరిగిలో హోంనీడ్స్ ఇచ్చే పేరుతో ‘రోజా ట్రేడర్స్’ను నిర్వస్తున్నారు. వస్తువు విలువలో సగం డబ్బులు చెల్లించి.. వారం రోజుల తర్వాత తీసుకుంటే సగం ధరకే ఆ వస్తువులు ఇస్తామని మోసగాళ్లు నమ్మబలికారు. దీంతో వారి మాటలు నమ్మి వినియోగదారులు వేల రూపాయలు చెల్లించారు. వినియోగదారులు చెల్లించిన డబ్బులను తీసుకున్న రోజా ట్రేడర్స్ యాజమాన్యం రాత్రికిరాత్రే పరారైంది. ఈ విషయం తెలుసుకున్న బాధితులు స్థానిక పరిగి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తామని తెలిపారు. బాధితులు దాదాపు రూ.కోటి వరకు మోస పోయినట్లు అనుమానం వ్యక్తం అవుతోంది. -
నిత్యావసర ధరలు నియంత్రణలో ఉండాలి
– అధికారులకు జాయింట్ కలెక్టర్ ఆదేశం అనంతపురం అర్బన్ : నిత్యావసర సరుకుల ధరలు నియంత్రణలో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం ఆదేశించారు. శుక్రవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో ధరల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు ఇష్టానుసార ధరలకు విక్రయించకుండా మార్కెట్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. కందిబేడలు కిలో రూ.100 వరకు ఉందని, ఇంతకు మించి విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆహార కల్తీపై కూడా నిఘా పెట్టాలన్నారు. దాడులు నిర్వహించి ఎక్కడైనా కల్తీకి పాల్పడుతున్నట్లు గుర్తిస్తే తక్షణం కేసులు నమోదు చేయాలని చెప్పారు. జిల్లా కేంద్రంలోని ఎనిమిది ప్రభుత్వ వసతి గహాలకు రైతు బజార్ నుంచి కూరగాయలు, ఆకుకూరలు కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో అక్రమ నిలువలపై విజిలెన్స్, రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ –క్రాప్ బుకింగ్ చేయాలి జిల్లాలో ఈ – క్రాప్ బుకింగ్ వంద శాతం చేయాలని మండల వ్యవసాయ అధికారులు, ఏఈఓ, ఎంపీఓలను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం ఎన్ఐసీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 4లోపు ఈ–క్రాప్ బుక్కింగ్ వంద శాతం పూర్తి చేయాలన్నారు. -
కొండెక్కిన ధరలు !
ధరల కలవరం – కొనలేని.. తినలేని దుస్థితిలో సామాన్యులు – ధరల అదుపునకు ప్రభుత్వ చర్యలు శూన్యం సరుకులు కిలో రూ.ల్లో కందిపప్పు 150 శనగపప్పు 120 వేరుశనగ నూనె 120 సన్‌ఫ్లవర్ నూనె 100 పామోలిన్ 60 చింతపండు 140 ఎండుమిర్చి 160 బెల్లం 60 అనంతపురం అర్బన్ : సామాన్యులపై ధరలు దాడి చే స్తూ కలవరపెడుతున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకీ పైపైకి ఎగబాకుతుండడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నిత్యావసర సరుకుల ధరలు ఏకంగా సామాన్యులు కొనలేని.. తినలేని స్థాయికి చేరుకున్నాయి. వాటి అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. భగ్గుమంటున్న ధరలు.. కందిపప్పు, చింతపండు, ఎండు మిర్చి, వంట నూనె, బెల్లం, తదితర నిత్యావసర సరుకులు లేకుంటే కుటుంబం గడవదు. వీటి ధరల పేద వర్గాలకు అందనంతగా పైపైకి పోతున్నాయి. వీటి సెగకు సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. పేద, మధ్యతరగతి వర్గాలు తమ నెలసరి సంపాదనలో అత్యధిక మొత్తం నిత్యావసర సురుకులకే వెచ్చించాల్సి వస్తోంది. ఇక రోజువారీ కూలీ చేసుకుని కుటుంబాలను పోషించుకునే వారి పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. కందిపప్పు మొదటి రకం రూ.150 ఉండగా రెండవ రకం రూ.130 ఉంది. శనగపప్పు రెండు నెలల క్రితం వరకు రూ.84 ఉండగా ఇప్పుడు ఏకంగా రూ.120కి ఎగబాకింది. చింతపండు రూ.140 ఉంది. వేరుశనగ నూనె రూ.120, సన్‌ఫ్లవర్ నూనె రూ.100, పామోలిన్ రూ.60 వరకు ఉంది. ప్రభుత్వ చర్యలు శూన్యం.. ఒకవైపు నిత్యావసర సరుకుల ధరల అదుపు తప్పుతున్నా ప్రభుత్వం నుంచి చర్యలు శూన్యమే అయ్యాయి. ధరలను నియంత్రించేందుకు కనీస చర్యలు కూడా చేపడుతున్న దాఖలాలు లేపు. ఇది ఒక రకంగా బడా వ్యాపారులకు అనుకూలంగా మారింది. ట్రెడింగ్ బిజినెస్ ద్వారా ఇష్టారాజ్యంగా ధరలను పెంచేస్తున్నారు. అక్రమ నిల్వలపై మొక్కుబడి నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్న క్రమంలో ఒక స్థాయి వ్యాపారులు అక్రమ నిల్వలు పాల్పడుతున్నారు. నిల్వలపై అధికార యంత్రాగం మొక్కబడి దాడులతో సరిబెడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. దీంతో కొందరు వ్యాపారులు పెద్ద ఎత్తున్న కందిపప్పు, శనగ పప్పు, చింతపండు వంటి నిత్యాసర సరుకులు అక్రమంగా నిల్వ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పేదల పరిస్థితి దుర్భరం రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరల కారణంగా పేద కుటుంబాల పరిస్థితి దుర్భరంగా మారింది. రోజువారీ సంపాదన సరుకులకే వెచ్చించాల్సిన దుస్థితి నెలకొంది. ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. – చంద్రిక, ఐద్వా నాయకురాలు కడుపు నిండా తినలేని దుస్థితి పేద, మధ్యతరగతి వర్గాల వారు కడుపు నిండా తినలేని దుస్థితి నెలకొంది. నిత్యావసర వస్తువుల్లో ప్రధానమైన కందిపప్పు, చింతపండు, వంట నూనె ఇలా ప్రతి వాటి ధరల రోజు రోజుకి పెరుగుతున్నాయి. ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టకపోవడం ప్రజల పాలిటి శాపంగా మారింది. – ఈడిగ జయలక్ష్మి, మహిళ సమాఖ్య నాయకురాలు చాలా కష్టంగా ఉంది చిన్నపాటి కాంట్రాక్టు పనులు చేసుకుని మాలాంటి మధ్యతరగతి వర్గాల బతుకులు చాలా కష్టంగా ఉన్నాయి. కుటంబపోషణ భారంగా ఉంది. కొద్ది పాటి సంపాదనలో అధిక మొత్తం నిత్యావసర సరుకులకే వెచ్చించాల్సి వస్తోంది. ధరలను అదుపు చేసి పేద, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – సూరి, శారదానగర్ -
బంపర్ ఆఫర్ పేరుతో..
రూ. లక్షలు వసూలు చేసి ఉడాయించిన ముఠా లబోదిబోమంటున్న బాధితులు భువనగిరి : ప్రజల అమాయకత్వాన్ని, ఆశను ఆసరా చేసుకుని బంపర్ ఆఫర్ల పేరుతో రూ.లక్షలు వసూలు చేసి ఉడాయించిన ఓ ముఠా ఉదంతం గురువారం భువనగిరిలో వెలుగు చూసింది. జిల్లాతో పాటు ,రంగారెడ్డి జిల్లాల్లోని పలు మండలాల్లోని మారుమూల గ్రామాల్లో ఆటోల ద్వారా హోంనీడ్స్ పేరిట మోసపోయిన వారంతా భువనగిరికి చేరుకుని లబోదిబోమంటున్నారు. వివ రాలు.. 20 రోజుల క్రితం నలుగురు యువకులు శ్రీ ఆంజనేయ మార్కెటింగ్ పేరుతో పోచమ్మవాడలో ఓ ఇంట్లో అద్దెకు దిగారు. రంగు రంగుల బ్రోచర్లు తయారు చేసి ఆటోల్లో గ్రామాలకు చేరుకున్నారు. బ్రోచర్లలో స్క్రాచ్ కార్డులను పొందుపరిచారు. ఒక్కో కార్డు రూ.100కు విక్రయించారు. కార్డును స్క్రాచ్ చేయగ అందులో ఆర్డినరి కంపెనీలకు చెందిన రైస్ కుక్కర్ , మిక్సి, టేబుల్‌ఫ్యాన్, డీవీడీ, హోం థియేటర్, మిక్సర్‌గ్రైండర్‌లు బహుమతులుగా వచ్చాయి. మందుగానే ఒక్కొక్కరి వద్ద రూ.1900 వసూలు చేసి వీటిలో కేవలం 500 లోపు విలువ గల వస్తువులను ఇచ్చారు. ఈనెల 10 తేదీన భువనగిరిలో బంపర్ డ్రా తీయడం జరుగుతుందని చెప్పారు. బంపర్ డ్రాలో రిఫ్రిజిరేటర్, ఎల్సీడీ, 10 గ్రాముల బంగారం, ల్యాప్‌ట్యాప్, వాషింగ్ మెషీన్‌లభిస్తాయని చెప్పడంతో పెద్ద ఎత్తున వారివద్ద స్క్రాచ్ కార్డులు కొన్నారు. ఇలా మోసగాళ్లు యాదగిరిగుట్ట, యాదగిరిపల్లి, మోత్కూరు, ఆత్మకూర్, వడాయిగూడెం, ముగ్దుంపల్లి, కొండమడుగు, మాదాపురం, అవుషాపురం, వలిగొండ తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున స్క్రాచ్ కార్డులు విక్రయించి రూ.లక్షలు దండుకున్నారు. అయితే తమకు స్క్రాచ్ కార్డులో వచ్చిన ఫ్యాన్లు ఇవ్వకుండా కేవలం రైస్‌కుక్కర్‌ను మాత్రమే ఇచ్చిన వారు మిగతా వస్తువులతో పాటు బంపర్ ఫ్రైజ్ కూడా ఇస్తామని చెప్పిన ప్రకారం వివిధ గ్రామాల నుంచి కార్డులు తీసుకువచ్చారు. తీరా ఇక్కడి వచ్చి చూస్తే మోసగాళ్లు ఇంటికి తాళం వేసి ఎప్పుడో ఉడాయించారు. దీంతో తాముమోసపోయామని ఆగ్రహించిన వారంత తీవ్ర దూషణలకు దిగారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమకు జరిగిన మోసాన్ని వివరించి న్యాయం చేయాలని పోలీస్‌లను కోరారు. 10వ తేదీ రమ్మన్నారు ఆగస్టులో మాయింటికి వచ్చారు. బంపర్ ఆఫర్ ఉందని చెప్పి రూ.1900 తీసుకుని స్క్రాచ్ కార్డు ఇచ్చారు. అందులో ఫ్యాన్ వచ్చింది.కానీ రూ. 400ల కుక్కర్ ఇచ్చారు. ఇదేమిటని అడిగితే 10వ తేదీ భువనగిరిలో బంపర్ డ్రా తీస్తారు. ఆ రోజు అక్కడివస్తే ఫ్యాన్ లేదా మిగిలిన 1500లు ఇస్తామని నమ్మబలికారు. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఎవరూ లేరు. తనలాంటి వారెందరో మోసపోయారు. - మారగోని మల్లయ్య, వలిగొండ -
నాసిరకం వస్తువులతో టోకరా..!
చిత్తూరు: లాటరీ పద్ధతిలో ప్రజలకు నాసిరకం హోమ్ నీడ్స్ అమ్ముతూ ఓ వ్యాపారి దొరికి పోయాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా రామసముద్రంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. కార్తికేయ హోంనీడ్స్ పేరుతో లాటరీల్లో వస్తువులు అమ్మేవాడు. రోజూలాగే గురువారం కూడా వ్యాపారం చేయడానికి వచ్చాడు. అయితే నాసిరకం వస్తువులు అమ్ముతున్నాడని గమనించిన స్థానికులు ఆందోళనకు దిగారు. ఆయనకు తగిన గుణపాఠం చెప్పారు. -
ఉచితానికి ఆంక్షలు..!
భద్రాచలం, న్యూస్‌లైన్ ప్రజా సంక్షేమం పేరిట ప్రభుత్వం హడావిడిగా పథకాలు ప్రవేశపెడుతున్నప్పటికీ వాటిని అర్హులైన వారు వినియోగించుకునేందుకు సవాలక్ష ఆంక్షలు విధిస్తోంది. దీంతో వీటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పథకం అమల్లో భాగంగా నెలకు 50 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే దళిత, గిరిజనులకు ఉచితంగా సరఫరా చేయాలని ఆదేశించింది. దీంతో అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. అయితే ఇటీవల పొందిన కుల ధ్రువీకరణ పత్రం జిరాక్స్ ప్రతులపై గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి ఇస్తేనే ఉచిత విద్యుత్‌కు అర్హులనే నిబంధన విధించడంపై లబ్ధిదారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గృహావసరాలకు సంబంధించి 7.15 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో ఇటీవల తీసిన రెండు నెలల రీడింగ్‌ను పరిగణలోకి తీసుకొని 48 వేల మంది ఎస్టీలు, 25,300 మంది ఎస్సీలు ఉచిత విద్యుత్‌కు అర్హులుగా ట్రాన్స్‌కో అధికారులు లెక్క తేల్చారు. ఈ జాబితాలోనూ లోటుపాట్లను సరిచేసేందుకు మరింత కసర త్తు చేస్తున్నారు. అయితే హడావిడిగా జాబితా తయారు చేయటంతో అర్హులైన పలువురు లబ్ధిదారులకు జాబితాలో చోటు లేకుండా పోయిందనే విమర్శలు ఉన్నాయి. భద్రాచలం డివిజన్ పరిధిలోని 12 మండలాలను పరిశీలిస్తే.. ఇక్కడ 1,29,087 గృహావసరాల కనెక్షన్లు ఉండగా ఇందులో ఎస్సీ, ఎస్టీలు 35 వేల వరకు ఉన్నారు. వీరిలో 6,698 ఎస్టీ, 2,941 మంది ఎస్సీ వినియోగదారులు మాత్రమే ఉచిత విద్యుత్‌కు అర్హులుగా తేలినప్పటికీ.. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లోని గిరిజన గూడేల్లో ఎవరూ 50 యూనిట్లకు మించి వినియోగించే పరిస్థితి లేదని ఆ శాఖ అధికారులే అంగీకరిస్తున్నారు. ఇలా వాస్తవంగా పరిశీలిస్తే ఈ రెండు వర్గాలకు చెందిన అర్హుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది. దీంతో లబ్ధిదారుల నుంచి వ్యతిరేకత రాకుండా ట్రాన్స్‌కో అధికారులు మరోమారు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. 50 యూనిట్ల పరిమితితో భారీ కోత... నెలకు 50 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకే ఈ పథకం వర్తిస్తుంది. ఆపైన ఒక్క యూనిట్ వినియోగించినా అర్హత కోల్పోతారు. ఇలా రెండు నెలలకోమారు తీసే మీటర్ రీడింగ్ ఆధారంగా అధికారులు జాబితా సిద్ధం చేస్తారు. అయితే ఇది పెద్ద ప్రహసనంగా మారే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులే అంగీకరిస్తున్నారు. ఈ లెక్కన వేలాది మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు ఈ పథ కాన్ని వినియోగించుకునే పరిస్థితి లేకుండా పోతుంది. 50కి మించి ఒక్క యూనిట్ ఎక్కువైనా బిల్లు చెల్లించాల్సిందేనని అధికారులు చెపుతండటంతో గిరిజనులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కుల ధ్రువీకరణతో కొత్త సమస్యలు.. సబ్‌ప్లాన్ పథకం కింద ఉచిత విద్యుత్ పొందేందుకు అర్హులైన వారు తహశీల్దార్‌చే ఇటీవల జారీచేసిన కుల ధ్రువీకరణ పత్రం జిరాక్స్ ప్రతులపై గెజిటెడ్ అధికారి సంతకం చేయించి ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇస్తేనే ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకునేప్పుడు కుల ధ్రువీకరణ పత్రం ఇచ్చినప్పటికీ మళ్లీ ఇప్పుడు కావాలని మెలిక పెట్టడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గెజిటెడ్ అధికారులు ధ్రువీకరించిన జిరాక్స్ ప్రతులను ట్రాన్స్‌కో, మండల పరిషత్ అధికారులు మరోసారి పరిశీలించాల్సి ఉంటుంది. ఇప్పటికే విద్యుత్ కనెక్షన్ల జాబితాలో కులాల ఆధారంగా లెక్క ఉన్నప్పటికీ మళ్లీ ఇటువంటి నిబంధనలు పెట్టడంపై లబ్ధిదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిధుల మంజూరులోనూ కోత... సబ్‌ప్లాన్ అమలుకు నిధుల కొరత లేదని ప్రభుత్వం చెపుతున్నప్పటికీ ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. జిల్లాలోని అర్హులైన ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఉచిత్ విద్యుత్ వర్తింపజేసేందుకు ఈ డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు రూ.6.19 కోట్లు అవసరమని ట్రాన్స్‌కో అధికారులు నివేదించారు. కానీ రూ.2,25,57,000 మాత్రమే మంజూరయ్యాయి. ఇవి కూడా ఎస్సీ లబ్ధిదారులకే విడుదల చేశారు. ఎస్టీలకు సంబంధించి నయాపైస కూడా ఇంకా మంజూరు కాలేదు. ఎస్టీ లబ్ధిదారులను గుర్తించేందుకు ఐటీడీఏ అధికారులు సమగ్ర సర్వేకు సిద్ధమైన నేపథ్యంలోనే నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని సమాచారం. దీంతో ఇప్పట్లో ఈ పథకాన్ని వినియోగించే పరిస్థితి లేదని గిరిజన లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ అని పాలకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండటంతో ఇప్పటికే అనేక గ్రామాల్లో లబ్ధిదారులు బిల్లులు చెల్లించటం మానేశారు. దీంతో ట్రాన్స్‌కో అధికారులు కనెక్షన్లు కట్ చేస్తున్నారు. భద్రాచలం మండలంలో గోగుబాకలో కొంతమంది బిల్లులు కట్టలేదనే సాకుతో మొత్తం గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో తేరుకున్న అధికారులు మరుసటి రోజు సరఫరా చేశారు. ఉచిత విద్యుత్ అని ప్రభుత్వం చెపుతుంటే అధికారులు ఇలా వ్యవహరించడమేంటని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్పష్టమైన వైఖరి ప్రకటించి అర్హులందరికీ వర్తింపజేయాలని దళిత, గిరిజన సంఘాల వారు కోరుతున్నారు.