కొండెక్కిన ధరలు !
ధరల కలవరం
– కొనలేని.. తినలేని దుస్థితిలో సామాన్యులు
– ధరల అదుపునకు ప్రభుత్వ చర్యలు శూన్యం
సరుకులు కిలో రూ.ల్లో
కందిపప్పు 150
శనగపప్పు 120
వేరుశనగ నూనె 120
సన్‌ఫ్లవర్ నూనె 100
పామోలిన్ 60
చింతపండు 140
ఎండుమిర్చి 160
బెల్లం 60
అనంతపురం అర్బన్ : సామాన్యులపై ధరలు దాడి చే స్తూ కలవరపెడుతున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకీ పైపైకి ఎగబాకుతుండడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నిత్యావసర సరుకుల ధరలు ఏకంగా సామాన్యులు కొనలేని.. తినలేని స్థాయికి చేరుకున్నాయి. వాటి అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోంది.
భగ్గుమంటున్న ధరలు..
కందిపప్పు, చింతపండు, ఎండు మిర్చి, వంట నూనె, బెల్లం, తదితర నిత్యావసర సరుకులు లేకుంటే కుటుంబం గడవదు. వీటి ధరల పేద వర్గాలకు అందనంతగా పైపైకి పోతున్నాయి. వీటి సెగకు సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. పేద, మధ్యతరగతి వర్గాలు తమ నెలసరి సంపాదనలో అత్యధిక మొత్తం నిత్యావసర సురుకులకే వెచ్చించాల్సి వస్తోంది. ఇక రోజువారీ కూలీ చేసుకుని కుటుంబాలను పోషించుకునే వారి పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. కందిపప్పు మొదటి రకం రూ.150 ఉండగా రెండవ రకం రూ.130 ఉంది. శనగపప్పు రెండు నెలల క్రితం వరకు రూ.84 ఉండగా ఇప్పుడు ఏకంగా రూ.120కి ఎగబాకింది. చింతపండు రూ.140 ఉంది. వేరుశనగ నూనె రూ.120, సన్‌ఫ్లవర్ నూనె రూ.100, పామోలిన్ రూ.60 వరకు ఉంది.
ప్రభుత్వ చర్యలు శూన్యం..
ఒకవైపు నిత్యావసర సరుకుల ధరల అదుపు తప్పుతున్నా ప్రభుత్వం నుంచి చర్యలు శూన్యమే అయ్యాయి. ధరలను నియంత్రించేందుకు కనీస చర్యలు కూడా చేపడుతున్న దాఖలాలు లేపు. ఇది ఒక రకంగా బడా వ్యాపారులకు అనుకూలంగా మారింది. ట్రెడింగ్ బిజినెస్ ద్వారా ఇష్టారాజ్యంగా ధరలను పెంచేస్తున్నారు.
అక్రమ నిల్వలపై మొక్కుబడి
నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్న క్రమంలో ఒక స్థాయి వ్యాపారులు అక్రమ నిల్వలు పాల్పడుతున్నారు. నిల్వలపై అధికార యంత్రాగం మొక్కబడి దాడులతో సరిబెడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. దీంతో కొందరు వ్యాపారులు పెద్ద ఎత్తున్న కందిపప్పు, శనగ పప్పు, చింతపండు వంటి నిత్యాసర సరుకులు అక్రమంగా నిల్వ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
పేదల పరిస్థితి దుర్భరం
రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరల కారణంగా పేద కుటుంబాల పరిస్థితి దుర్భరంగా మారింది. రోజువారీ సంపాదన సరుకులకే వెచ్చించాల్సిన దుస్థితి నెలకొంది. ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది.
– చంద్రిక, ఐద్వా నాయకురాలు
కడుపు నిండా తినలేని దుస్థితి
పేద, మధ్యతరగతి వర్గాల వారు కడుపు నిండా తినలేని దుస్థితి నెలకొంది. నిత్యావసర వస్తువుల్లో ప్రధానమైన కందిపప్పు, చింతపండు, వంట నూనె ఇలా ప్రతి వాటి ధరల రోజు రోజుకి పెరుగుతున్నాయి. ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టకపోవడం ప్రజల పాలిటి శాపంగా మారింది.
– ఈడిగ జయలక్ష్మి, మహిళ సమాఖ్య నాయకురాలు
చాలా కష్టంగా ఉంది
చిన్నపాటి కాంట్రాక్టు పనులు చేసుకుని మాలాంటి మధ్యతరగతి వర్గాల బతుకులు చాలా కష్టంగా ఉన్నాయి. కుటంబపోషణ భారంగా ఉంది. కొద్ది పాటి సంపాదనలో అధిక మొత్తం నిత్యావసర సరుకులకే వెచ్చించాల్సి వస్తోంది. ధరలను అదుపు చేసి పేద, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– సూరి, శారదానగర్