భద్రాచలం, న్యూస్‌లైన్
ప్రజా సంక్షేమం పేరిట ప్రభుత్వం హడావిడిగా పథకాలు ప్రవేశపెడుతున్నప్పటికీ వాటిని అర్హులైన వారు వినియోగించుకునేందుకు సవాలక్ష ఆంక్షలు విధిస్తోంది. దీంతో వీటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పథకం అమల్లో భాగంగా నెలకు 50 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే దళిత, గిరిజనులకు ఉచితంగా సరఫరా చేయాలని ఆదేశించింది. దీంతో అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. అయితే ఇటీవల పొందిన కుల ధ్రువీకరణ పత్రం జిరాక్స్ ప్రతులపై గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి ఇస్తేనే ఉచిత విద్యుత్‌కు అర్హులనే నిబంధన విధించడంపై లబ్ధిదారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా గృహావసరాలకు సంబంధించి 7.15 లక్షల కనెక్షన్‌లు ఉన్నాయి. ఇందులో ఇటీవల తీసిన రెండు నెలల రీడింగ్‌ను పరిగణలోకి తీసుకొని 48 వేల మంది ఎస్టీలు, 25,300 మంది ఎస్సీలు ఉచిత విద్యుత్‌కు అర్హులుగా ట్రాన్స్‌కో అధికారులు లెక్క తేల్చారు. ఈ జాబితాలోనూ లోటుపాట్లను సరిచేసేందుకు మరింత కసర త్తు చేస్తున్నారు. అయితే హడావిడిగా జాబితా తయారు చేయటంతో అర్హులైన పలువురు లబ్ధిదారులకు జాబితాలో చోటు లేకుండా పోయిందనే విమర్శలు ఉన్నాయి. భద్రాచలం డివిజన్ పరిధిలోని 12 మండలాలను పరిశీలిస్తే.. ఇక్కడ 1,29,087 గృహావసరాల కనెక్షన్‌లు ఉండగా ఇందులో ఎస్సీ, ఎస్టీలు 35 వేల వరకు ఉన్నారు. వీరిలో 6,698 ఎస్టీ, 2,941 మంది ఎస్సీ వినియోగదారులు మాత్రమే ఉచిత విద్యుత్‌కు అర్హులుగా తేలినప్పటికీ.. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లోని గిరిజన గూడేల్లో ఎవరూ 50 యూనిట్లకు మించి వినియోగించే పరిస్థితి లేదని ఆ శాఖ అధికారులే అంగీకరిస్తున్నారు. ఇలా వాస్తవంగా పరిశీలిస్తే ఈ రెండు వర్గాలకు చెందిన అర్హుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది. దీంతో లబ్ధిదారుల నుంచి వ్యతిరేకత రాకుండా ట్రాన్స్‌కో అధికారులు మరోమారు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు.
50 యూనిట్ల పరిమితితో భారీ కోత...
నెలకు 50 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకే ఈ పథకం వర్తిస్తుంది. ఆపైన ఒక్క యూనిట్ వినియోగించినా అర్హత కోల్పోతారు. ఇలా రెండు నెలలకోమారు తీసే మీటర్ రీడింగ్ ఆధారంగా అధికారులు జాబితా సిద్ధం చేస్తారు. అయితే ఇది పెద్ద ప్రహసనంగా మారే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులే అంగీకరిస్తున్నారు. ఈ లెక్కన వేలాది మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు ఈ పథ కాన్ని వినియోగించుకునే పరిస్థితి లేకుండా పోతుంది. 50కి మించి ఒక్క యూనిట్ ఎక్కువైనా బిల్లు చెల్లించాల్సిందేనని అధికారులు చెపుతండటంతో గిరిజనులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
కుల ధ్రువీకరణతో కొత్త సమస్యలు..
సబ్‌ప్లాన్ పథకం కింద ఉచిత విద్యుత్ పొందేందుకు అర్హులైన వారు తహశీల్దార్‌చే ఇటీవల జారీచేసిన కుల ధ్రువీకరణ పత్రం జిరాక్స్ ప్రతులపై గెజిటెడ్ అధికారి సంతకం చేయించి ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇస్తేనే ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకునేప్పుడు కుల ధ్రువీకరణ పత్రం ఇచ్చినప్పటికీ మళ్లీ ఇప్పుడు కావాలని మెలిక పెట్టడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గెజిటెడ్ అధికారులు ధ్రువీకరించిన జిరాక్స్ ప్రతులను ట్రాన్స్‌కో, మండల పరిషత్ అధికారులు మరోసారి పరిశీలించాల్సి ఉంటుంది. ఇప్పటికే విద్యుత్ కనెక్షన్‌ల జాబితాలో కులాల ఆధారంగా లెక్క ఉన్నప్పటికీ మళ్లీ ఇటువంటి నిబంధనలు పెట్టడంపై లబ్ధిదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
నిధుల మంజూరులోనూ కోత...
సబ్‌ప్లాన్ అమలుకు నిధుల కొరత లేదని ప్రభుత్వం చెపుతున్నప్పటికీ ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. జిల్లాలోని అర్హులైన ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఉచిత్ విద్యుత్ వర్తింపజేసేందుకు ఈ డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు రూ.6.19 కోట్లు అవసరమని ట్రాన్స్‌కో అధికారులు నివేదించారు. కానీ రూ.2,25,57,000 మాత్రమే మంజూరయ్యాయి. ఇవి కూడా ఎస్సీ లబ్ధిదారులకే విడుదల చేశారు. ఎస్టీలకు సంబంధించి నయాపైస కూడా ఇంకా మంజూరు కాలేదు. ఎస్టీ లబ్ధిదారులను గుర్తించేందుకు ఐటీడీఏ అధికారులు సమగ్ర సర్వేకు సిద్ధమైన నేపథ్యంలోనే నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని సమాచారం. దీంతో ఇప్పట్లో ఈ పథకాన్ని వినియోగించే పరిస్థితి లేదని గిరిజన లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ అని పాలకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండటంతో ఇప్పటికే అనేక గ్రామాల్లో లబ్ధిదారులు బిల్లులు చెల్లించటం మానేశారు. దీంతో ట్రాన్స్‌కో అధికారులు కనెక్షన్‌లు కట్ చేస్తున్నారు. భద్రాచలం మండలంలో గోగుబాకలో కొంతమంది బిల్లులు కట్టలేదనే సాకుతో మొత్తం గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో తేరుకున్న అధికారులు మరుసటి రోజు సరఫరా చేశారు. ఉచిత విద్యుత్ అని ప్రభుత్వం చెపుతుంటే అధికారులు ఇలా వ్యవహరించడమేంటని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్పష్టమైన వైఖరి ప్రకటించి అర్హులందరికీ వర్తింపజేయాలని దళిత, గిరిజన సంఘాల వారు కోరుతున్నారు.
ఉచితానికి ఆంక్షలు..!
Published Wed, Dec 25 2013 4:38 AM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM
Advertisement
Advertisement