రాంనగర్: ఈనెల 14న నిర్వహించే ఎంసెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జేసీ ఎన్.సత్యనారాయణ తెలిపారు. మంగళవారం అదనపు జాయింట్ కలెక్టర్ చాంబర్‌లో ఎంసెట్ నిర్వహణపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇంజినీరింగ్, మెడిసిన్ ఎంసెట్ పరీక్షలకోసం37 కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇంజినీరింగ్ పరీక్ష ఉదయం 10గంటల నుండి ఒంటి గంట వరకు, మెడిసిన్ మధ్యాహ్నం 2-30 గంటల నుండి 5-గంటల వరకు జరుగుతుందని ఆయన చెప్పారు. నల్లగొండలో ఇంజినీరింగ్‌కు 15 పరీక్షా కేంద్రాలు, కోదాడలో 7 పరీక్షా కేంద్రాలు, మెడిసిన్‌కు నల్లగొండలో 9 పరీక్షా కేంద్రాలు, కోదాడలో 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఇంజినీరింగ్ పరీక్షకు 10329 మంది విద్యార్ధులు, మెడిసిన్‌కు 7045 మంది విద్యార్ధులు హాజరవుతారని ఆయన తెలిపారు.
ఆర్టీసీ కార్మికులు సమ్మెలో వున్నందున ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్ధులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.
ప్రతి మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్ నుంచి నల్లగొండలోని ఎన్జీ కాలేజీ వరకు, కోదాడలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్ వరకు ఇంజనీరింగ్ విద్యార్ధుల సౌకర్యార్ధం ఉదయం 6గంటల నుంచి, మెడిసిన్ విద్యార్ధులకు ఉదయం 11గంటల నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. నల్లగొండలోని ఎన్జీ కాలేజీ నుంచి పరీక్షా కేంద్రాలకు, కోదాడలో ప్రభుత్వ బాలుర హైస్కూల్ నుండి పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు జేసీ తెలిపారు. మండల కేంద్రాల నుండే కాకుండా విద్యార్ధులు అధికంగా వున్న ప్రాంతాల నుంచి నల్లగొండకు, కోదాడకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన వివరించారు. ఈ బస్సులు సంబంధిత మండలాల పోలీస్ స్టేషన్ల నుండి బయలుదేరి బస్టాండు మీదుగా నిర్ధేశించిన ప్రాంతాలకు వెళతాయని ఈ బస్సులకు ఎంసెట్-2015 అని ప్రత్యేక బ్యానర్లు, స్టిక్కర్లు ఉంటాయని ఆయన తెలిపారు.
అంతరాయం లేకుండా...
పరీక్షా కేంద్రాలకు నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యే విధంగా చూడాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద గ ట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. సెంటర్స్ దగ్గర 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు జిరాక్స్ షాప్‌లను కూడ విధిగా మూసి ఉంచేట్లు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వేసవి దృష్ట్యా పరీక్షల కేంద్రాల వద్ద మంచినీరు, ఫస్ట్‌ఎయిడ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి అదనపు జేసీ నిరంజన్, డీఆర్వో రవినాయక్, ఎంసెట్ కో-ఆర్డినేటర్ నాగేందర్‌రెడ్డి, రవాణాశాఖ డిప్యూటీ కమీషనర్ చంద్రశేఖర్, ఆర్‌ఐవో ప్రకాశ్, నల్లగొండ ఆర్డీవో వెంకటాచారి, డీఎస్పీ రాములునాయక్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్, విద్యుత్ శాఖాధికారులు పాల్గొన్నారు.
కోదాడకు ఉచిత బస్సులు- ఎమ్‌వీఐ శ్రీనివాస్‌రెడ్డి
కోదాడ టౌన్ : ఎంసెట్ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థుల కోసం పలు పట్టణాల నుంచి కోదాడకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు కోదాడ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరెడ్డి తెలిపారు. మిర్యాలగూడెం, సూర్యాపేట, హుజూర్‌నగర్ బస్టాండ్‌లనుంచి ఇంజినీరింగ్ విద్యార్ధుల కోసం ఉదయం 7:30 గంటలకు, మెడిసిన్ విద్యార్ధుల కోసం మధ్యాహ్నం 12:30 గంటలకు ఉచిత బస్సులు బయలుదేరుతాయని తెలిపారు.
కోదాడ బస్టాండ్ నుంచి కేఆర్‌ఆర్ కళాశాలకు, ఇతర సెంటర్లకు ఉదయం 7:30 నుండి 8:45 వరకు ఉచిత బస్సులు ఉంటాయని తెలిపారు. సమ్మెతో సంబంధం లేకుండా ఇంజనీరింగ్ కళాశాలల నిర్వాహకులు కల్పిస్తున్న ఈ ఉచిత సౌకర్యంపై ఇబ్బందులు ఉంటే 96186 51213 నెంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు. సెంటర్ల వివరాల్లో ఇబ్బం దులు ఉంటే కోదాడ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ సెంటర్ సహాయం తీసుకోవాలని రీజినల్ కో-ఆర్డినేటర్ తెలిపారు.
ఎంసెట్‌కు ఏర్పాట్లు పూర్తి
Published Wed, May 13 2015 12:23 AM | Last Updated on Sun, Sep 3 2017 1:54 AM
Advertisement
Advertisement