సమావేశంలో మాట్లాడుతున్న జేసీ–2 మార్కండేయులు
ఒంగోలు టౌన్: జిల్లాలో మలేరియా నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్–2 మార్కండేయులు ఆదేశించారు. ప్రతి ఏటా జూన్ నుంచి నవంబర్ వరకు మలేరియా కేసులు నమోదవుతుంటాయని, ఈ కాలంలో యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో బుధవారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. మలేరియా వ్యాధి నివారణ, చికిత్సలపై అవగాహన పెంపొందించడం ద్వారా దానిని నియంత్రించవచ్చన్నారు. 2027 నాటికి మలేరియా రహిత దేశంగా భారత్‌ను ప్రకటించాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు.
ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లాలో 1,15,358 రక్తనమూనాలు సేకరించగా అందులో 70మందికి మలేరియా ఉన్నట్లు తేలిందన్నారు. నల్లమల అటవీప్రాంతం, చీమకుర్తి గనుల ప్రాంతాల్లో ఎక్కువగా మలేరియా కేసులు నమోదవుతున్నందున, ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మలేరియా అంతానికి మేమంతా సిద్ధం అనే నినాదంతో ముందుకు వెళ్లాలన్నారు. ఇందుకోసం గ్రామాలు, పట్టణాల్లో దోమలు వృద్ధి చెందకుండా ప్రతి శుక్రవారం డ్రై డే పాటించేలా ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఖాళీ ప్రదేశాలు, క్వారీల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే దోమల లార్వాలు చల్లి ఆయిల్ బాల్స్ వేయించాలని ఆదేశించారు. నీళ్ల ట్యాంకులు, నీరు నిల్వ ఉన్న పాత్రలపై మూతలు వేసి ఉంచాలన్నారు. వినియోగంలో లేని బావులను మూసివేయించాలన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాలను సంబంధిత ఎంపీడీఓల వద్ద అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మలేరియా నివారణలో అంగన్‌వాడీలు, స్వయం సహాయక సంఘాలు, సాధికారమిత్రలను భాగస్వాములను చేయాలన్నారు. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో మలేరియా వ్యాధి నివారణకు మందులు సిద్ధంగా ఉంచుకోవాలని మార్కండేయులు ఆదేశించారు. సమావేశంలో జోనల్ మలేరియా అధికారి ఉమామహేశ్వరి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి రాజ్యలక్ష్మి, జిల్లా మలేరియా అధికారి నాగేంద్రయ్య, అడిషనల్ డీఎంహెచ్‌ఓ శకుంతల, డీఆర్‌డీఏ పీడీ మురళి, జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ ఆనంద్‌కుమార్, జెడ్పీ డిప్యూటీ సీఈఓ సాయికుమారి, డీఈఓ సుబ్బారావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ మర్ధన్‌ఆలీ, రిమ్స్ సూపరింటెండెంట్ రాజేశ్వరరావు, ఐసీడీఎస్ పీడీ కార్యాలయ సూపరింటెండెంట్ హైమావతి, డీపీఓ కార్యాలయ ఏఓ జయలక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment