Malaria prevention
-
పటిష్ట చర్యలతో విషజ్వరాలను కట్డడి చేశాం: మంత్రి రజనీ
సాక్షి, అమరావతి: విషజ్వరాలతో మరణాలు రాష్ట్రంలో సంభవించలేదని, విషజ్వరాలను సమర్థవంతంగా కట్టడి చేయగలిగామని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజనీ ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం.. వైద్యారోగ్య శాఖల నాడు-నేడు స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆమె ప్రసంగించారు. గత ప్రభుత్వంలో(2015-19 మధ్య) 74 వేలకు పైగా మలేరియా కేసులు నమోదు అయ్యాయి. కానీ, ఈ ప్రభుత్వంలో నాలుగు వేల కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. భారీ వర్షాలు, వరదలు పొటెత్తినా కూడా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుని విషజ్వరాలను రికార్డు స్థాయిలో కట్టడి చేయగలిగామని విడదల రజనీ తెలియజేశారు. ప్రాణాంతకంగా మారుతున్న మలేరియా కట్టడి కోసం కూడా చర్యలు తీసుకున్నామని ఆమె తెలిపారు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్న ఆమె.. ఆరోగ్య శ్రీ పథకాన్ని గత ప్రభుత్వం నీరుగార్చిందని, కానీ.. జగనన్న ప్రభుత్వం మాత్రం డెంగ్యూ, మలేరియాలను ఆరోగ్యశ్రీలో చేర్చిందని చెప్పుకొచ్చారు. అదే విధంగా విష జ్వరాల నియంత్రణకు జిల్లా స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించడం, ప్రత్యేక బృందాల క్యాంపులను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆమె లేవనెత్తారు. గత ప్రభుత్వం దోమలపై దండయాత్ర పేరుతో చాలా ఆర్భాటాలు.. ప్రజాధనాన్ని దుబారా చేసిందని మంత్రి రజనీ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆనాడూ ‘దోమలపై దండయాత్ర’ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రకటనను సైతం ఆమె చదివి వినిపించారు. సంధ్య ఘటనపై స్పందిస్తూ.. చింతూరు మండలానికి చెందిన చిన్నారి సంధ్య మృతి ఘటన బాధాకరం. వాస్తవానికి.. వైరల్ డిసీజ్‌తో చిన్నారి మృతి చెందింది. ఈ విషయాన్ని వైద్యులు ఇచ్చిన రిపోర్టులతో పాటు ఉన్నతాధికారులు ఇచ్చిన నివేదికలు కూడా ఇచ్చారని ఆమె ప్రతులు చూపించారు. పొరుగు రాష్ట్రానికి సంధ్య కుటుంబం వెళ్లిందని టీడీపీ విమర్శిస్తోందని.. భద్రాచలం పరిధిలో అందుబాటులో ఉంది కాబట్టే సంధ్య కుటుంబం అక్కడికి వెళ్లిందని మంత్రి రజనీ తెలిపారు. ఈ ఘటనపై కూడా టీడీపీ సభ్యులు రాజకీయం చేయడం సరికాదని, ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి విడదల రజనీ మండిపడ్డారు. ఇదీ చదవండి: పారిశ్రామిక పరుగులపై సీఎం జగన్ ఏమన్నారంటే.. -
World Malaria Day: ‘మలేరియా’తో జరపైలం.. నిర్లక్ష్యం చేస్తే
సాక్షి, మహబూబ్‌నగర్: జ్వరమే కదా అని తేలిగ్గా తీసుకుంటే అది మలేరియా కావచ్చు. ప్రాణాంతకంగా మారొచ్చు. సరైన సమయంలో సరైన చికిత్స తీసుకుంటే ప్రమాదం నుంచి బయటపడొచ్చు. కానీ వ్యాధి బారినపడకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలు అత్యంత ముఖ్యం. సోమవారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. వ్యాధి ఇలా సోకుతుంది.. ఎనాఫిలిస్ అనే ఆడదోమ కుట్టినప్పుడు మనిషి శరీరంపై ప్లాస్మోడియం పొరసైట్ అనే పరాన్నజీవిని వదులుతుంది. దోమకాటు వల్ల ఏర్పడిన రంధ్రంలో నుంచి మనిషి రక్తంలోకి పరాన్నజీవి ప్రవేశించి విస్తరిస్తుంది. ఈ పరాన్నజీవి రక్తంలోని రోగనిరోధక వ్యవస్థగా ఉన్న ఎర్ర రక్తకణాలపై దాడి చేస్తుంది. దీనిమూలంగా మనిషికి రోజువిడిచి రోజు జ్వరం సోకుతుంది. సరైన సమయంలో సరైన చికిత్స తీసుకొని పక్షంలో రోగనిరోధక వ్యవస్థ దెబ్బతిని రోగికి ప్రాణాంతకమవుతుంది. సుమారు 20రకాల ఎనాఫిలిస్‌దోమలు మలేరియా వ్యాప్తికి కారణమవుతున్నాయి. మలేరియా వ్యాధికి ప్రపంచంలో ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపేరం, ప్లాస్మోడియం మలేరియా, ప్లాస్మాడియం ఓవేల్ అనే నాలుగు రకాల పరాన్నజీవులు వ్యాధి తీవ్రతకు కారణమవుతున్నాయి. మనదేశంలో ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం, పాల్సిపేరం అనే రెండు రకాల పరాన్నజీవులు కారణమవుతున్నాయి. వీటిలో ప్లాస్మోడియం పాల్సిపేరు అనే పరాన్నజీవి మలేరియా వ్యాధి తీవ్రతను పెంచి ప్రాణాంతకంగా మారుతోంది. నిరు నిల్వ ఉండే సంపులు, ఇతర నీటి పాత్రలు మురుగునీటి నిల్వ ప్రదేశాలు వ్యాధికారక దోమలకు ప్రధాన కేంద్రాలుగా మారుతాయి. వీటిలో దోమలు ఆవాసాలు ఏర్పాటు చేసుకుని గుడ్లుపెట్టి సంతానోత్పత్తి చేస్తాయి. ఇవి పెరిగి వ్యాధికారకంగా మారతాయి. నివారణ మార్గాలివి.. మలేరియా వ్యాధి రాకుండా నివారించడానికి ఎటువంటి టీకా మందులు లేవు. కేవలం దోమ కాటు నుంచి రక్షించుకోవడమే ప్రధాన మార్గం. మురుగు నిల్వ ఉన్న ప్రదేశాల్లో కాలిన ఇంజిన్‌ఆయిల్, కిరోసిన్, డీడీటీ పౌడర్‌ను పిచికారీ చేయాలి. 5మి.లీ టెమిపాస్ 50శాతం ఇసీ మందును 10లీటర్ల నీటిలో కలిపి మురుగు కాల్వలు, వర్షపు నీటి గుంతలు, బోర్లు, నల్లాల వద్ద ఏర్పడే నీటి గుంతల, ఖాళీ చేయలేని నీటినిల్వ సంపులు, డ్రమ్ములలో పంచాయతీ సిబ్బంది పిచికారీ చేయాలి. ఈ ద్రావణం తినుబండారాలపై పడకుండా చర్యలు తీసుకోవాలి. కూలర్లు, పూలకుండీలు, నీటి డ్రమ్ములు, వాటర్ ట్యాంకుల్లో లార్వా పెరుగుతుంది. వీటిలో నీటిని మారుస్తూ ఉండాలి. సంపులపై ట్యాంకులపై మూతలు పెట్టాలి. వారానికి ఒకసారైనా శుభ్రం చేయడం వల్ల లార్వా ఉంటే చనిపోతుంది. పాతటైర్లు, పాత్రలు, కొబ్బరి చిప్పలు వంటివి పరిసరాల్లో ఉండకుండా చూసుకోవాలి. పడుకునే సమయంలో దోమతెరలు వాడాలి. దోమలను తరిమి వేసే కాయిల్స్ వంటివి ఉపయోగించాలి. ఇంట్లో కర్టెన్లు తరచూ మారుస్తూ ఉండాలి కిటికీలకు జాలీలను అమర్చుకోవడం ద్వారా దోమలు ఇంట్లోకి రాకుండా చాలావరకు నివారించవచ్చు. కలుషిత నీటి ముప్పును ఎదుర్కొనేందుకు కాచి వడబోసిన నీటిని తాగటం చాలా అవసరం. ఫిల్టర్లు వాడటం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. కాచి చల్లార్చి వడబోసిన నీళ్లే ఎక్కువ సురక్షితం. -
మలేరియా కట్టడి చర్యలు భేష్
మద్దిలపాలెం(విశాఖ తూర్పు): మలేరియా పేరు చెబితేనే విశాఖ మన్యం గడగడలాడేది. వ్యాధులు సీజన్ ప్రారంభమైతే ఏజెన్సీలో వైద్య, ఆరోగ్యశాఖ యంత్రాంగంలో అలజడి రేపేది. అలాంటి మలేరియా కట్టడికి తీసుకుంటున్న చర్యలు సత్ఫాలివ్వడంతో వ్యాధి తీవ్రతతోపాటు, మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో మలేరియా కేసుల సంఖ్య 56 శాతం తగ్గాయి. ఏటా ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మలేరియాను అంతం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచం దృష్టికి తీసుకు రావడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. తొలిసారిగా 2008లో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నిర్వహించారని జిల్లా మలేరియా అధికారి వై.మణి తెలిపారు. దీనికి సంబంధించి ఆమె అందించిన వివరాలు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2024 నాటికి మలేరియా కేసులు నమోదు పూర్తిగా తగ్గి పోవాలని సంకల్పించింది. దీనిలో భాగంగా 2020 నుంచి 2024 వరకూ ఏడాదికి ఒక థీమ్‌తో చర్యలు చేపడుతోంది. ఈ ఏడాది మలేరియా భారాన్ని తగ్గించడం, జీవితాలను రక్షించడం అనే థీమ్‌తో చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా 2030 నాటికి మలేరియా నిర్మూలనే లక్ష్యం. గణనీయంగా తగ్గిన కేసులు ఉమ్మడి విశాఖ జిల్లాలో రెండేళ్లుగా మలేరియా కేసులతోపాటు, మరణాలు గణనీయంగా తగ్గాయి. కేసులు నమోదు 56 శాతానికి తగ్గింది. 2021 లో 239 కేసులు నమోదుకాగా, 2022 లో ఇప్పటి వరకూ 105 కేసులు నమోదయ్యాయి. (చదవండి: దంపుడు బియ్యానికి c/o కొండబారిడి) -
రాష్ట్ర వైద్య శాఖకు మరో జాతీయ పురస్కారం
సాక్షి, అమరావతి: మలేరియా నిర్మూలనలో అత్యుత్తమ పనితీరు ప్రదర్శించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు జాతీయ స్థాయిలో మరో గుర్తింపు లభించింది. ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక పాజిటివ్ కేసుకు మించకుండా ఉండేలా మలేరియాను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృతమైంది. దీంతో మన రాష్ట్రం ప్రీ ఎలిమినేషన్ దశ (కేటగిరీ–2) నుంచి ఎలిమినేషన్ దశ (కేటగిరీ–1)కు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి చేతుల మీదుగా రాష్ట్ర కమ్యూనికబుల్ డిసీజస్ అడిషనల్ డైరెక్టర్ రామిరెడ్డి అవార్డును సోమవారం అందుకోనున్నారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతో మలేరియా నిర్మూలనకు ప్రభుత్వం గత మూడేళ్లుగా నిరంతరాయంగా చేసిన కృషి చేస్తోంది. 2018లో 6,040 కేసులు నమోదు కాగా క్రమంగా తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది 1,139కి కేసులు తగ్గాయి. 2021లో 75,29,994 రక్త నమూనాలను పరిశీలించగా 1,139 మందికి మలేరియా సోకినట్లు నిర్ధారణయింది. మలేరియా కేసులు వెలుగు చూసిన హైరిస్క్ ప్రాంతాలలో ఏటా ఇళ్లలో దోమల నిరోధం కోసం ఇండోర్ రెసిడ్యుయల్ (ఐఆర్ఎస్) కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. గత ఏడాది మొత్తం 9.22 లక్షల జనాభా కలిగిన 3,027 గ్రామాలలో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించారు. మలేరియా కేసుల నిరోధక కృషిలో భాగంగా గత ఏడాది ప్రభుత్వం అన్ని ఆరోగ్య కేంద్రాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లలో దోమల నియంత్రణకు తలుపులు, కిటికీలకు మెష్లను ఏర్పాటు చేసింది. ‘ఫ్రై డే–డ్రై డే’ పేరుతో అన్ని గ్రామ, వార్డు సచివాలయాలలో దోమల కట్టడి, మలేరియా నిరోధం కోసం వైద్య, మునిసిపల్, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో కృషి చేస్తున్నాయి. ఈ చర్యల ఫలితంగా ఏడాది ఇప్పటివరకూ కేవలం 117 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇదే స్ఫూర్తితో రాష్ట్రాన్ని మలేరియా రహిత (కేటగిరీ–0) చేయడానికి కృషి చేస్తామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ జె.నివాస్ తెలిపారు. -
మలేరియాకు సరికొత్త విరుగుడు!
హైదరాబాద్: మలేరియా ఒకప్పుడు ప్రాణాంతక వ్యాధి.. అయితే ఇప్పుడు అన్ని రకాల మందులు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఆ మందులు ఎక్కువగా వాడితే మలేరియా పరాన్నజీవులు నిరోధకతను పెంచుకుంటాయి. అందుకోసమే ఈ నిరోధకతను కూడా అడ్డుకునేందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రయోగాలు చేసి వినూత్నమైన మందును కనుగొన్నారు. మలేరియా వ్యాధికి కారణమైన ప్లాస్మోడియం వైవాక్స్ వంటి పరాన్నజీవుల్లోని డీఎన్ఏలో మెలికలు తిరిగి ఉన్న పోగులు (డీఎన్ఏ డబుల్ స్ట్రాండ్) విడిపోవడం వల్ల సాధారణంగా అవి మరణిస్తాయి. అయితే ఆ పోగులు విడిపోకుండా ఉండేందుకు ప్రాథమికంగా హోమోలాగస్ రీకాంబినేషన్ అనే ప్రక్రియ ద్వారా ఆ పోగుల మరమ్మతు చేసుకుంటాయి. ఇక్కడ పీఎఫ్‌రాడ్ 51 అనే రీకాంబినేజ్ అనే ఎంజైమ్‌ను ఆ పరాన్నజీవి వాడుకుంటుంది. ఇక్కడే శాస్త్రవేత్తలు తమ దృష్టిని సారించారు. ఈ మరమ్మతు ప్రక్రియను అడ్డుకుంటే పరాన్నజీవుల జీవిత కాలం తగ్గుతుందని, మలేరియా కోసం వాడే మందుల నిరోధకత తగ్గుతుందని భావించారు. ఇందుకోసం బీవో2 అనే ఓ మందును కనిపెట్టారు. ఇది పీఎఫ్‌రాడ్ 51 ఎంజైమ్ పనిని సమర్థంగా అడ్డుకోగలిగిందని హెచ్‌సీయూ ప్రొఫెసర్ మృణాల్‌కంటి భట్టాచార్య వివరించారు. అనేక మందులకు నిరోధకతను పెంచుకున్న ప్లాస్మోడియం జాతికి చెందిన డీడీ2, త్రీడీ7 అనే మరో ప్లాస్మోడియం జాతి పరాన్న జీవుల ఎదుగుదలను పరిశోధన కేంద్రంలోని సంవర్ధనంలో సమర్థంగా అడ్డుకుందని తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు జర్నల్ ఆఫ్ బయోలాజికల్ కెమిస్ట్రీ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. అయితే ఈ మందును తొలుత జంతువులపై ప్రయోగించి, వచ్చిన ఫలితాల ఆధారంగా మానవులపై ప్రయోగించనున్నారు. పరిశోధన బృందంలో ప్రతాప్ వైద్యమ్, దిబ్యేందు దత్తా, నిరంజన్ సంత్రమ్, ప్రొఫెసర్ సునందభట్టాచార్యలు కీలక పాత్ర పోషించారు. -
మలేరియా నివారణకు చర్యలు తీసుకోవాలి
ఒంగోలు టౌన్: జిల్లాలో మలేరియా నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్–2 మార్కండేయులు ఆదేశించారు. ప్రతి ఏటా జూన్ నుంచి నవంబర్ వరకు మలేరియా కేసులు నమోదవుతుంటాయని, ఈ కాలంలో యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో బుధవారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. మలేరియా వ్యాధి నివారణ, చికిత్సలపై అవగాహన పెంపొందించడం ద్వారా దానిని నియంత్రించవచ్చన్నారు. 2027 నాటికి మలేరియా రహిత దేశంగా భారత్‌ను ప్రకటించాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లాలో 1,15,358 రక్తనమూనాలు సేకరించగా అందులో 70మందికి మలేరియా ఉన్నట్లు తేలిందన్నారు. నల్లమల అటవీప్రాంతం, చీమకుర్తి గనుల ప్రాంతాల్లో ఎక్కువగా మలేరియా కేసులు నమోదవుతున్నందున, ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మలేరియా అంతానికి మేమంతా సిద్ధం అనే నినాదంతో ముందుకు వెళ్లాలన్నారు. ఇందుకోసం గ్రామాలు, పట్టణాల్లో దోమలు వృద్ధి చెందకుండా ప్రతి శుక్రవారం డ్రై డే పాటించేలా ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఖాళీ ప్రదేశాలు, క్వారీల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే దోమల లార్వాలు చల్లి ఆయిల్ బాల్స్ వేయించాలని ఆదేశించారు. నీళ్ల ట్యాంకులు, నీరు నిల్వ ఉన్న పాత్రలపై మూతలు వేసి ఉంచాలన్నారు. వినియోగంలో లేని బావులను మూసివేయించాలన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాలను సంబంధిత ఎంపీడీఓల వద్ద అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మలేరియా నివారణలో అంగన్వాడీలు, స్వయం సహాయక సంఘాలు, సాధికారమిత్రలను భాగస్వాములను చేయాలన్నారు. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో మలేరియా వ్యాధి నివారణకు మందులు సిద్ధంగా ఉంచుకోవాలని మార్కండేయులు ఆదేశించారు. సమావేశంలో జోనల్ మలేరియా అధికారి ఉమామహేశ్వరి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి రాజ్యలక్ష్మి, జిల్లా మలేరియా అధికారి నాగేంద్రయ్య, అడిషనల్ డీఎంహెచ్ఓ శకుంతల, డీఆర్డీఏ పీడీ మురళి, జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ ఆనంద్‌కుమార్, జెడ్పీ డిప్యూటీ సీఈఓ సాయికుమారి, డీఈఓ సుబ్బారావు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ మర్ధన్ఆలీ, రిమ్స్ సూపరింటెండెంట్ రాజేశ్వరరావు, ఐసీడీఎస్ పీడీ కార్యాలయ సూపరింటెండెంట్ హైమావతి, డీపీఓ కార్యాలయ ఏఓ జయలక్ష్మి పాల్గొన్నారు. -
మలేరియా నివారణకు చర్యలు
కూనవరం: జిల్లాలో మలేరియా నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామని డీఎంఓ రాంబాబు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని క్లస్టర్ ఆస్పత్రిని సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 959 హ్యాబిటేషన్లలో యుద్ధప్రాతిపదికన స్ప్రేయింగ్ పనులు చేపట్టనున్నామని అన్నారు. జ్వరాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని, వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మలేరియా జ్వరంగా నిర్ధారణ అయితే వైద్య సిబ్బంది పర్యవేక్షణలో చికిత్స పొందాలని సూచించారు. ప్రతి బుధవారం, శనివారం ఇమ్యూనైజేషన్ రోజుల్లో మలేరియా డే నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. మలేరియా నివారణకు సంబంధించి వైద్యాధికారులకు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చామని, మలేరియా కిట్స్, మందులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. దోమ తెరలకు ప్రతిపాదనలు.. మలేరియా నివారణ ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాకు 3.50లక్షల దోమ తెరలు అవసరం ఉందని, ఆ మేరకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామని డీఎంఓ తెలిపారు. అవి రాగానే మారుమూల గ్రామాల్లో పంపిణీ చేస్తామని అన్నారు. ప్రతీ పీహెచ్సీ పరిధిలో నెట్వర్క్ సిస్టమ్ ఏర్పాటు చేశామని, ఆశా వర్కర్లకు మొబైల్ ఫోన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి ఏరియాలో హెల్త్‌అసిస్టెంట్, వైద్యసిబ్బందిని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచామన్నారు. 1-5 సంవత్సరాల లోపు పిల్లలు, గర్భిణిల్లో రిస్క్ కేసులు, మలేరియా పాజిటివ్ కేసులు ఉంటే తక్షణం చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. గోదావరి వరదల సమయంలో ప్రత్యేకంగా వైద్యసిబ్బందిని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. కూనవరం క్లస్టర్ ఆస్పత్రి పరిధిలో 106 గ్రామాల్లో స్ప్రేయింగ్ పనులు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.