మలేరియా నివారణకు చర్యలు
కూనవరం: జిల్లాలో మలేరియా నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామని డీఎంఓ రాంబాబు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని క్లస్టర్ ఆస్పత్రిని సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 959 హ్యాబిటేషన్లలో యుద్ధప్రాతిపదికన స్ప్రేయింగ్ పనులు చేపట్టనున్నామని అన్నారు.
జ్వరాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని, వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మలేరియా జ్వరంగా నిర్ధారణ అయితే వైద్య సిబ్బంది పర్యవేక్షణలో చికిత్స పొందాలని సూచించారు. ప్రతి బుధవారం, శనివారం ఇమ్యూనైజేషన్ రోజుల్లో మలేరియా డే నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. మలేరియా నివారణకు సంబంధించి వైద్యాధికారులకు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చామని, మలేరియా కిట్స్, మందులు అందుబాటులో ఉన్నాయని అన్నారు.
దోమ తెరలకు ప్రతిపాదనలు..
మలేరియా నివారణ ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాకు 3.50లక్షల దోమ తెరలు అవసరం ఉందని, ఆ మేరకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామని డీఎంఓ తెలిపారు. అవి రాగానే మారుమూల గ్రామాల్లో పంపిణీ చేస్తామని అన్నారు. ప్రతీ పీహెచ్‌సీ పరిధిలో నెట్‌వర్క్ సిస్టమ్ ఏర్పాటు చేశామని, ఆశా వర్కర్లకు మొబైల్ ఫోన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి ఏరియాలో హెల్త్‌అసిస్టెంట్, వైద్యసిబ్బందిని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచామన్నారు. 1-5 సంవత్సరాల లోపు పిల్లలు, గర్భిణిల్లో రిస్క్ కేసులు, మలేరియా పాజిటివ్ కేసులు ఉంటే తక్షణం చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.
గోదావరి వరదల సమయంలో ప్రత్యేకంగా వైద్యసిబ్బందిని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. కూనవరం క్లస్టర్ ఆస్పత్రి పరిధిలో 106 గ్రామాల్లో స్ప్రేయింగ్ పనులు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.