కుల వివక్షతను రూపుమాపాలి
దుర్కి(బీర్కూర్) : కుల వివక్షతను రూపు మాపడానికి ప్రతిఒక్కరూ సహకరించాలని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ రాజారం కోరారు. శనివారం మండలంలోని దుర్కిలో నిర్వహించిన సివిల్ రైట్స్‌డే సందర్భంగా ఆయన మాట్లాడారు. హోటళ్లలో రెండుగ్లాసుల పద్ధతి, జోగిని వ్యవస్థ, బాల్య వివాహాలు, వరకట్నం లాంటి నేరాలకు పాల్పడితే చట్టప్రకారం శిక్షార్హులవుతారన్నారు. రాజ్యాంగం అందరికి సమాన హక్కులు కల్పించిందని, చట్టం ప్రకారం అందరూ సమానులేనని తెలిపారు. అంటరానితనం మహా పాపమన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఇతర అణగారిన వర్గాలకు సమాజంలో సమాన అవకాశాలు కల్పించాలన్నారు. దళితులు ఆత్మన్యూనత భావాన్ని వీడి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగాలని సూచించారు. అంతకు ముందు అధికారులు దళితులతో కలిసి మందిరంలో పూజలు నిర్వహించారు. గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలకు పండ్ల మొక్కలను ఏజేసీ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, తహసీల్దార్ కి ష్ట్యానాయక్, ఎంపీడీవో భరత్‌కుమార్, ఎస్సై రాజ్‌భరత్‌రెడ్డి, ఎంపీపీ మల్లెల మీనా, జెడ్పీటీసీ సభ్యుడు కిషన్, కో–ఆప్షన్ సభ్యులు మజీద్ తదితరులు పాల్గొన్నారు.