శ్రీశైలానికి జేసీ పాదయాత్ర
ఆత్మకూరురూరల్: కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ బుధవారం సాయంత్రం సతీ సమేతంగా శ్రీశైలానికి పాదయాత్రతో వెళ్లారు. ఆయన తన వాహనంలో సాయంత్రం వెంకటాపురం చేరుకుని అక్కడ నుంచి వాహనాన్ని వెనక్కు పంపి కాలి బాట మార్గం పట్టారు. వెంకటాపురం నుంచి గోషాయి కట్ట మీదుగా రాత్రి 7.30 గంటలకు ఆయన నాగలూటి చెంచు గూడెం చేరుకున్నారు. నాగలూటి వీరభధ్రాలయం వద్ద స్వామి వారిని దర్శించుకుని రాత్రి భోజనాన్ని ముగించి పెచెర్వు వైపుగా మెట్ల మార్గం గుండా సాగిపోయారు. అర్ధరాత్రి పెచ్చెర్వు చేరుకుని జేసి దంపతులు అక్కడ విశ్రమించే అవకాశం ఉంది. వెంట ఎలాంటి సెక్యూరిటీ లేకుండా, మంది మార్బలం లేకుండా జేసీ దంపతులు భక్తి పూర్వకంగా పాదయాత్రన వెళ్లడాన్ని పలువురు ఆసక్తిగా గమనించారు.