సాక్షి, విశాఖ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ భూకుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఎన్‌వోసీ ఉల్లంఘనుల్లో డిప్యూటీ కలెక్టర్, ఆ పైస్థాయి అధికారులు కూడా ఉండటంతో వారి అరెస్ట్‌లకు రంగం సిద్ధమైంది. సిట్ సభ్యురాలు, జిల్లా జాయింట్ కలెక్టర్ సృజన నిన్న (సోమవారం) ఇందుకు సంబంధించిన వివరాలు విలేకరులకు వెల్లడించారు. వచ్చేవారం అరెస్టులు ఉంటాయని తెలిపారు.
సిట్‌కు మరో రెండు నెలల గడువు
ఎన్‌వోసీల విచారణ పూర్తయేందుకు మరో నెల రోజుల సమయం పడుతుందని జేసీ తెలిపారు. సిట్ దర్యాప్తుపై పూర్తిస్థాయి నివేదికలు తయారు చేసేందుకు సమయం పట్టే అవకాశాలు ఉన్నందున మరో రెండు నెలల సమయం కోరినట్లు చెప్పారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, త్వరలో ఉత్తర్వులు వస్తాయన్నారు.
20మందిపై క్రిమినల్ కేసులు...!
సిట్ పరిధిలో వచ్చిన 337 అర్జీల్లో 260 అర్జీలపై దర్యాప్తు పూర్తయింది. తహసీల్దారు కార్యాలయాల్లో రికార్డుల పరిశీలన సమయంలో రెవెన్యూ అధికారులతో పాటు పోలీసులు కూడా పరిశీలించారని జేసీ తెలిపారు. వారిలో 48మందిపై శాఖాపరమైన చర్యలు, 20మందిపై క్రిమినల్ కేసులు నమోదుకు సిఫార్సు చేశామన్నారు. ఈ 48మందిలో వీఆర్వోల స్థాయి నుంచి డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకూ ఉన్నారన్నారు. ఇప్పటివరకూ విచారించిన 260 ఫిర్యాదుల్లో ప్రభుత్వానికి సంబంధించిన 2వేల ఎకరాల భూములు ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్నట్లు గుర్తించామని, వాటిని త్వరలో స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. సిట్ పరిగణనలోకి తీసుకున్న 2,500 ఫిర్యాదుల్లో సుమారు 1300 ఫిర్యాదులకు సంబంధించి రిపోర్టులను ఎమ్మార్వోల నుంచి తీసుకున్నామన్నారు. వారిచ్చిన ప్రతి రిపోర్టును చదువుతామని, అందులో ఏమైనా లోపాలుంటే మళ్లీ తిప్పి పంపిస్తామని చెప్పారు.
రాష్ట్రంలో తొలిసారి
22(ఎ) లో భూముల వివరాల సవరణ కోసం ప్రజలు అధికారుల చుట్టూ తిరుగుతున్నారని, వారి బాధలను అర్థం చేసుకుని 22(ఎ) సవరణ, యూఎల్‌సీ ఎన్‌వోసీ అనుమతి మీ సేవ ద్వారా పొందేందుకు అవకాశం కల్పించామని జేసీ తెలిపారు. ఇది రాష్ట్రంలో మొదటిసారిగా విశాఖ జిల్లాలో ప్రారంభిస్తున్నామని, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారని చెప్పారు. 22(ఎ) కు సంబంధించి పాత, కొత్త లిస్టులు ఉన్నాయని, అయితే గతంలో పాత లిస్ట్ పంపించడం వల్ల కొన్ని సమస్యలు వచ్చాయన్నారు. ప్రస్తుతం కొత్త లిస్టును అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.
రికార్డుల స్వచ్ఛీకరణ బాధ్యత వీఆర్వోలదే
గతంలో రికార్డుల మార్పుచేర్పులు వీఆర్వోలకు తెలిసే జరిగాయి. కాబట్టి ప్రస్తుతం రికార్డుల స్వచ్ఛీకరణ వారి బాధ్యతగా తీసుకొని సరైన సమాచారాన్ని పొందుపరచాలి. లేదంటే గతంలో రికార్డులు మార్పుచేర్పులకు కారణమైన వాటిపై విచారణ చేస్తానని వారిని హెచ్చరించారు. స్వచ్ఛీకరణకు సహకరిస్తే పాత తప్పులను విడిచిపెడతామని వారికి చెప్పామన్నారు. అందువల్ల ప్రస్తుతం బాగా జరుగుతోందన్నారు. రోజుకు 50 నుంచి 60 ఎకరాల భూములకు సంబంధించి స్వచ్ఛీకరణ చేస్తున్నామని తెలిపారు. జిల్లాల్లో 27 మండలాల్లో 128 పంచాయతీల్లో ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు.
పత్రాల జారీలో జాప్యం వహిస్తే నోటీసులే...
మీ సేవా ద్వారా నెల రోజుల్లో పత్రాలను జారీ చేయాలి. అలా చేయని అధికారులకు నోటీసులు ఇస్తున్నాం. ఒక తహసీల్దారు, నలుగురు ఆర్‌ఐవోలు, నలుగురు వీఆర్వోలకు నోటీసులు జారీ చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment