visakha land scam
-
కబ్జాలను అడ్డుకుంటే కక్ష సాధింపా?
సాక్షి, అమరావతి: కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు ప్ర యత్నిస్తుంటే కక్ష సాధింపు చర్య అంటూ టీడీపీ గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. విశాఖలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకోలేదని చెప్పే దమ్ము, ధైర్యం టీడీపీకి ఉందా? అని ప్రశ్నిం చారు. చంద్రబాబు పాలనలో రూ.వేలకోట్ల విలువై న భూములను కాజేశారన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి మంగళవారం మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలకు చెందిన గీతం సంస్థ, తాజాగా పల్లా శ్రీనివాసరావు ప్రభుత్వ భూములను ఆక్రమించుకో లేదని టీడీపీ చెప్పగలదా? అని ప్రశ్నించారు. అంబటి ఇంకా ఏమన్నారంటే.. కబ్జా నిజమని మీ మంత్రే చెప్పలేదా? టీడీపీ హయాంలోనే వారు నమ్మే ఓ పత్రిక విశాఖ భూ కుంభకోణంపై అనేక కథనాలు వెలువరించింది. నాడు చంద్రబాబు హయాంలో మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు దీనిపై స్పందిస్తూ... ‘విశాఖలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల అండదండలతో భూదందా యథేచ్ఛగా సాగుతోంది. భూ బకాసురులు విచ్చలవిడిగా ఆక్రమిస్తున్నారు. భూ దోపిడీదారులను తన్నడానికి విశాఖ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మంత్రి పదవినైనా వదులుకోడానికి సిద్ధపడే ఈ నిజాన్ని నిర్భయంగా చెబుతున్నా’ అని ప్రకటించారు. 379 గ్రామాలకు సంబంధించిన భూ రికార్డులు గల్లంతయ్యాయని అప్పుడు జిల్లా కలెక్టరే చెప్పారు. వాళ్ల ప్రభుత్వంలో వారే లక్ష ఎకరాలకు సంబంధించిన ఎఫ్‌ఎంబీలు గల్లంతు చేశారు. ఇది టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్న వ్యక్తే చెప్పారు. విశాఖను కాజేసిన చంద్రబాబు విశాఖలో భీమిలి, హైవే పక్కన, కసింకోట, గాజువాక, ఎస్.రాయవరం ప్రాంతాల్లో వక్ఫ్ భూములను కాజేసిన చరిత్ర టీడీపీదే. పెందుర్తి, ఆనందపురం, భీమిలి ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ పేరుతో కబ్జాకు స్కెచ్ వేశారు. ఆ భూములు తమవి కావని శ్రీనివాస్ చెబుతుంటే చంద్రబాబుకు బాధ ఎందుకు? గతేడాదిగా 250 భూ ఆక్రమణల పై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపి దాదాపు 430.80 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. వీటి విలువ రూ.4,291 కోట్లు. టీడీపీ నేత శ్రీనివాస్ ఆక్రమణల విలువ రూ.791 కోట్లు. మొత్తం కలిపి రూ.5,082 కోట్ల విలువైన భూములను కాపాడి వెలికితీశారు. విశాఖ కబ్జా నగరంగా ఉండాలా? లేక మహానగరంగా తీర్చిదిద్దాలో చంద్రబాబు జవాబు చెప్పాలి. -
కొనసాగుతున్న కబ్జా ప్రకంపనలు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: విశాఖపట్నంలో భూకబ్జాల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కుటుంబసభ్యుల చెరలో ఉన్న భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై తెలుగుదేశం నాయకులు గగ్గోలు పెడుతున్నారని మంత్రులు, ప్రజాప్రతినిధులు సోమవారం ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతల తీరును ఎండగట్టారు. ఆక్రమణదారులు ఎంతటివారైనా వదిలేదిలేదని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. కబ్జాకు గురైన భూముల్ని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. లోకేశ్ తోడల్లుడికి చెందిన గీతం యూనివర్సిటీ కబ్జాచేసిన భూముల విలువే రూ.వెయ్యికోట్లని ఎమ్మెల్యే అమర్నాథ్ తెలిపారు. మరోవైపు తాను భూములు ఆక్రమించలేదన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు.. తన తమ్ముడి ఆక్రమణలపై మీడియా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. అడ్డూఅదుపు లేకుండా ప్రభుత్వ భూముల కబ్జా విశాఖపట్నంలో వేలకోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయని ఆనాడు టీడీపీ ప్రభుత్వమే సిట్ వేసిందని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తోందన్నారు. ఆనాడు అధికారాన్ని అడ్డంపెట్టుకుని యథేచ్ఛగా వేలకోట్ల విలువైన ప్రభుత్వ భూముల్ని టీడీపీ నేతలు ఆక్రమించారని చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఎక్కువమంది టీడీపీ నేతలు ఆక్రమణదారులు కావటంతో అప్పటి ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరించిందన్నారు. విశాఖలో టీడీపీ ఆక్రమణలకు అడ్డూఅదుపు లేకుండా సాగాయన్నారు. ఆక్రమిత భూముల్ని స్వాధీనం చేసుకోవాలన్న కృతనిశ్చయంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఆక్రమణదారులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. విశాఖలో టీడీపీ నేతలు ఆక్రమించినవి ప్రభుత్వ భూములని రికార్డులే చెబుతున్నాయని గుర్తుచేశారు. అందుకే ప్రభుత్వం వాటిని న్యాయబద్ధంగా తన ఆధీనంలోకి తీసుకుంటోందన్నారు. టీడీపీ నేతల ఘనకార్యాలు బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. ఆక్రమిత భూముల గురించి టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు అర్థంలేనివని చెప్పారు. ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకుంటే అది కక్షపూరితం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ట్రస్టీగా ప్రజల ఆస్తులను కాపాడటంలో ప్రభుత్వం సమర్థంగా వ్యవహరిస్తోందని చెప్పారు. అధికారులు నిగ్గు తేల్చారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అండదండలతో విశాఖ కేంద్రంగా ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున భూకబ్జాలు, భూకుంభకోణాలకు పాల్పడ్డారని పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ విశాఖ పార్లమెంటు అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కుటుంబం ఆధీనంలో ప్రభుత్వ భూములున్నట్లు అధికారులు నిగ్గుతేల్చారని, వాటిని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి, అధికారులకు ఉందని చెప్పారు. విశాఖలో సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్ధరాత్రి షెడ్లను కూల్చేశారని కొందరు టీడీపీ నేతలు ఆక్రమణదారులకు వత్తాసుపలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ నేతలు ఆక్రమించుకున్న రూ.4,776 కోట్ల విలువైన సుమారు 430 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి మంచి సంకల్పంతో చేపట్టిన ఆక్రమిత భూముల స్వాధీన మహాయజ్ఞానికి అన్ని పార్టీలు మద్దతు తెలపాలన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు భూకుంభకోణాలపై పరస్పరం ఆరోపణలు చేసుకున్నారని గుర్తుచేశారు. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో ఎస్టేట్, ఈనాం భూములను టీడీపీకి చెందిన కొందరు ఆక్రమించుకున్నారని, వాటిని స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని చెప్పారు. విశాఖను పరిపాలన రాజధాని చేసి తీరతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, సమన్వయకర్త కె.కె రాజు, పార్టీ నాయకుడు అక్కరమాని వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు. కబ్జాకు సూత్రధారి చంద్రబాబే.. విశాఖలో భూదోపిడీ, ప్రభుత్వ భూముల కబ్జాకు సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబేనని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. విశాఖలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. లోకేశ్ తోడల్లుడికి చెందిన గీతం యూనివర్సిటీ కబ్జాచేసిన దాదాపు రూ.వెయ్యి కోట్ల విలువైన 40 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని గుర్తుచేశారు. రుషికొండలో యథేచ్ఛగా ప్రభుత్వ భూములను కబ్జా చేసిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు లాంటి వారు ఇప్పుడు తమ సహచరుల్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆయన కుటుంబసభ్యులు ఆక్రమించుకున్న భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందే తప్ప దీన్లో కక్షసాధింపు ఏమీ లేదన్నారు. హుద్‌హుద్ తుపాను సమయంలో విశాఖలో లక్ష ఎకరాలకు సంబంధించిన రికార్డులు పోయాయని చెబుతున్నారని, అసలు అప్పుడు గాలులే తప్ప లాకర్లలో ఉన్న భూరికార్డులు తడిసిపోయే విధంగా వర్షం పడలేదని చెప్పారు. అప్పటి భూరికార్డులు ఎలా మాయమయ్యాయో చంద్రబాబుకే తెలియాలన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖ అభివృద్ధికి రాత్రిబంవళ్లు పనిచేస్తుంటే టీడీపీ నేతలు ఓర్వలేక విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారన్నారు. నేను ఎక్కడా ఆక్రమించలేదు – టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గాజువాక నియోజకవర్గంలో అధికారులు స్వాధీనం చేసుకున్న ఆక్రమిత భూములు తనవి కాదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చెప్పారు. విశాఖపట్నంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను భూములు ఆక్రమించినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకొంటానని చెప్పారు. గాజువాక నియోజకవర్గంలోని సర్వే నం.33/4లో తన స్థలం పక్కన ఉన్న రాస్తా తనకు మాత్రమే పనికొస్తుందని, అది ఎవరికీ ఉపయోగపడదని, దాన్ని తనకు అప్పగిస్తే.. బదులుగా ఎక్కడైనా స్థలం ఇస్తానని గతంలోనే దరఖాస్తు చేసుకున్నానని, అధికారులు స్పందించలేదని పేర్కొన్నారు. అధికారులు స్పందించకపోతే.. ఆ భూముల్ని మీరెలా వినియోగించుకుంటారని మీడియా ప్రశ్నించగా.. సమాధానం దాటవేశారు. సర్వే నం.33/2లో తన స్థలం పక్కన చెరువు బంద ఉందని, దాన్ని తాను ఆక్రమించకుండానే ఆక్రమించేసినట్లు చూపించారని చెప్పారు. చట్టం ప్రకారం కుటుంబ భూముల్లో తన వాటా 1/7 మాత్రమేనన్నారు. తుంగ్లాం రెవెన్యూ గ్రామం పరిధిలో తన సోదరుడు పల్లా శంకరరావు పేరుతో ఉన్న ఆక్రమిత భూముల స్వాధీనంపై మాత్రం పల్లా శ్రీనివాసరావు నోరు మెదపకుండానే మీడియా సమావేశం ముగించేశారు. -
విశాఖ భూ కుంభకోణం: సిట్ గడువు పొడిగింపు
సాక్షి, అమరావతి: విశాఖ భూముల వ్యవహారంపై సిట్ గడువు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 28 నాటికి ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాల్సిందిగా సిట్‌ను ప్రభుత్వం ఆదేశించింది. 2019 అక్టోబరు 17న విశాఖ, పరిసర మండలాల్లో భూముల కొనుగోళ్ల వ్యవహారంపై ప్రభుత్వం.. సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కోవిడ్ లాక్‌డౌన్‌తో సిట్ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది. లాక్డౌన్ అనంతరం 2020 జూన్ 10 నుంచి తిరిగి సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. ఫిబ్రవరి 28 నాటికి నివేదిక సమర్పించాల్సిందిగా సిట్‌కు ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. -
రాష్ట్రానికి చంద్రన్న వైరస్ పట్టింది..
-
రాష్ట్రానికి చంద్రన్న వైరస్ పట్టింది..
సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌లా రాష్ట్రానికి చంద్రన్న వైరస్ పట్టిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... చంద్రన్న వైరస్‌కు ఆయన బతికున్నంత కాలం మందు దొరకదని విమర్శించారు. చంద్రబాబు ఎక్కడుంటే అక్కడ నాశనం, వినాశనం, విధ్వంసం అని పేర్కొన్నారు. విశాఖ భూ కుంభకోణంలో టీడీపీ తమపై రాద్ధాంతం చేస్తోందని.. టీడీపీ హయాంలోనే వేల ఎకరాలు కబ్జా అయ్యాయని పేర్కొన్నారు. లేనిపోని ఆరోపణలతో బురదచల్లేందుకు టీడీపీ యత్నిస్తుందని అమర్నాథ్ మండిపడ్డారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసే ఆలోచన టీడీపీకి లేదని ధ్వజమెత్తారు. నిజ నిర్థారణ కమిటీ విశాఖలో కాదని.. అమరావతిలో వేసుకోవాలన్నారు. ‘చంద్రబాబుకు అన్ని జిల్లాల అభివృద్ధి అవసరం లేదా.. కేవలం 3 గ్రామాల అభివృద్ధే కావాలా..? విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌పై టీడీపీ స్టాండ్ ఏమిటీ’ అని ప్రశ్నించారు. సిగ్గు లేకుండా టీడీపీ నేతలు తమపై ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు ఏ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఇష్టం లేదన్నారు. విశాఖ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని తప్పుడు ప్రచారాలు చేసి ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలపై విషం కక్కుతారా అంటూ అమర్నాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
ఐదో రోజు కొనసాగుతున్న సిట్ ఫిర్యాదులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ భూ కుంభకోణంపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆధ్వర్యంలో ఫిర్యాధుల స్వీకరణ నేటితో ఐదో రోజుకు చేరుకుంది. సిట్ చీఫ్ విజయ్ కుమార్, సిట్ సభ్యులు అనురాధ, జస్టిస్ భాస్కర్‌రావు మంగళవారం ఫిర్యాదుల స్వీకరణను పరిశీలించారు. సిట్ చైర్మన్ విజయకుమార్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. గత నాలుగు రోజులుగా 661 ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. సిట్ పరిధిలోకి రాని ఫిర్యాదులను కూడా పూర్తిగా పరిశీలిస్తున్నామని తెలిపారు. భూ అక్రమాలు, రికార్డులు ట్యాంపరింగ్ ఫిర్యాదులను కూడా సిట్ పరిధిలోకి చేరుస్తున్నామని వెల్లడించారు. సిట్ ద్వారా బాధితులకి భరోసా కల్పించాలన్నదే.. సిట్ ఉద్దేశమని చెప్పారు. ఈ నెల 7వ తేదీ వరకు సిరిపురం చిల్డ్రన్ ఎరీనా ప్రాంగణంలో ఫిర్యాదులు స్వీకరిస్తామని వివరించారు. నవంబర్ 8వ తేది నుంచి ఇరిగేషన్ గెస్ట్‌హౌస్ వద్ద సిట్ కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరిస్తామని, ఫిర్యాదులలో వచ్చిన వాటిని పరిశీలించి అవసరమైతే క్షేత్రస్ధాయిలో తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులపై మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని అన్నారు. ప్రతి ఒక్కరికి ఒక నంబర్ కేటాయిస్తున్నామని.. ఫిర్యాదు సంఖ్య ఆధారంగా స్టేటస్ తెలుస్తుందన్నారు. సిట్ పరిధిలోకి రాని వాటిపై ఏ విధంగా న్యాయం జరుగుతుందనే అంశంపై బాధితులకు ముందుగానే సూచనలిస్తామని సిట్ సభ్యులు అనురాధ, భాస్కర రావు అన్నారు. కాగా సోమవారం నుంచి ఫిర్యాదుదారుల తాకిడి పెరిగిందని తెలిపారు. భీమునిపట్నం, పెందుర్తి, గాజువాక, విశాఖ రూరల్ మండలాల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. సిట్‌కు వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికపుడు పరిశీలించి, ఫిర్యాదుదారులకు న్యాయం జరుగుతుందనే భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. -
విశాఖ భూ కుంభకోణంపై విచారణ ప్రారంభం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: విశాఖపట్నం జిల్లాలో జరిగిన భూ కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు శ్రీకారం చుట్టింది. ‘సిట్’ సభ్యులు... రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వైవీ అనూరాధ, జిల్లా సెషన్స్ కోర్టు రిటైర్డ్ జడ్జి టి. భాస్కర్ రావు శుక్రవారం విశాఖపట్నం చేరుకుని భూ కుంభకోణంపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం నగరంతోపాటు 13 మండలాల పరిధిలో జరిగిన అతి పెద్ద భూ కుంభకోణం సంచలనం రేపిన విషయం విదితమే. దీనిపై కేంద్ర నేర పరిశోధన సంస్థ (సీబీఐ)తో విచారణ జరిపించాలని అన్ని రాజకీయ పక్షాలు డిమాండ్ చేసినా చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. సిట్ సమరి్పంచిన నివేదికను కూడా బయట పెట్టలేదు. ఈ నేపథ్యంలో...రికార్డుల తారుమారు ద్వారా ప్రయివేటు వ్యక్తులు సొంతం చేసుకున్న ప్రభుత్వ భూములను స్వా«దీనం చేసుకోవడం, దోషులను శిక్షించడం లక్ష్యాలుగా వైఎస్ జగన్ సర్కారు రిటైర్డు ఐఏఎస్ అధికారి డాక్టర్ విజయ్ కుమార్ నేతృత్వంలో ‘సిట్’ను నియమించింది. మొదటి రోజు ఆశించిన స్థాయిలో ఫిర్యాదులు అందాయని సిట్ సభ్యులు తెలిపారు. వారంలో ఇంకా భారీగా ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉందని ‘సిట్’ అధినేత డాక్టర్ విజయ్ కుమార్ ‘సాక్షి’కి ఫోన్లో తెలిపారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు తొలిరోజు టీడీపీకి చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే సత్యన్నారాయణవర్మలపై ఫిర్యాదులందాయి. తొలిరోజు వచ్చిన ఫిర్యాదులు 79 తొలిరోజు మొత్తం 79 ఫిర్యాదులు రాగా, ఇందులో 14 సిట్, 65 నాన్ సిట్ ఫిర్యాదులుగా విభజించారు. ఏడో తేదీ వరకూ విశాఖలోని ఉడా చిల్డ్రన్ థియేటర్లో ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఈనెల 8,9 తేదీల్లో అదే వేదికగా ప్రజాప్రతినిధులు, సాధారణ ప్రజలు విచారణకు సూచనలు, సలహాలు కూడా ఇవ్వవచ్చు. సందేహాల నివృత్తి, సహాయం కోసం టోల్ ఫ్రీ ఫోన్ నంబర్ 1800 425 00002 లేదా 0891–2590100 నంబరులో సంప్రదించవచ్చు. -
విశాఖ భూ కుంభకోణాలపై సిట్ విచారణ షురూ
సాక్షి, విశాఖపట్టణం : టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణాలను విచారించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ శుక్రవారం నుంచి తన విచారణను ప్రారంభించింది. విచారణ బృందానికి మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ విజయ్ కుమార్ నేతృత్వం వహిస్తుండగా, మాజీ ఐఏఎస్ అధికారిణి అనూరాధ, రిటైర్డ్ జడ్జి భాస్కరరావు సభ్యులుగా ఉన్నారు. అక్టోబరు 26న సిట్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం నవంబర్ ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు సిరిపురంలోని వుడా చిల్డ్రన్స్ ఎరీనా థియేటర్ వద్ద బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 వరకు ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఫిర్యాదుల స్వీకరణకు పదమూడు బృందాలను నియమించగా, ఒక్కో బృందంలో డిప్యూటీ తహసీల్దార్, ఇద్దరు సహాయకులు ఉంటారు. బాధితులు వివరాలను సిట్ రూపొందించిన నిర్ణీత ఫార్మాట్లోనే ఇవ్వాల్సి ఉంటుంది. ఫార్మాట్‌తో పాటు ఆధారాలను సిట్ ఏర్పాటు చేసిన టేబుల్ వద్ద అందజేయాలి. బాధితులకు సహాయంగా ఆరు హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. 13 మండలాలకు ఒకటి చొప్పున 13 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఫిర్యాదుదారు దరఖాస్తుతో పాటు భూమికి సంబంధించిన దస్తావేజుల జిరాక్స్ కాపీలను జతచేయాలి. ఒరిజినల్స్ సైతం తీసుకెళ్లి, అధికారులకు చూపించాలి. నేరుగా ఫిర్యాదు చేయడానికి ఇష్టపడని వారికోసం ప్రత్యేకంగా ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేస్తున్నారు. విశాఖలోనే కాకుండా దేశ, విదేశాల్లో ఉండే ఎన్నారైల కోసం vizagcollectorate.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదులను స్వీకరించనున్నారు. బాధితుల అనుమానాల నివృత్తికి 1800-42500002, 0891-2590100 నంబర్లను ఏర్పాటు చేశారు. -
విశాఖ భూ కుంభకోణంపై సిట్ విచారణ
-
విశాఖ భూ కుంభకోణంపై ఫిర్యాదు చేయండిలా
సాక్షి, విశాఖపట్నం: విశాఖ భూ కుంభకోణంపై నవంబరు ఒకటి నుంచి ఏడవ తేది వరకు ఫిర్యాదులు స్వీకరిస్తామని శనివారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పబ్లిక్ నోటీసు విడుదల చేసింది. అదేవిధంగా నవంబరు 8న ప్రజా ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. నేరుగా వచ్చి ఫిర్యాదు చేయలేని వారు.. ఆన్లైన్ మాధ్యమం ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎంతటి వారైనా అవసరాన్ని బట్టి విచారణ చేపడతామని ఇదివరకే సిట్ చీఫ్ విజయ్ కుమార్ చెప్పారు. సిరిపురం చిల్డ్రెన్ ఎరీనాలొ ఉదయం 10 గంటల నుంచి అందిన ఫిర్యాదులను పరిశీలించి విచారణ చేపడతామన్నారు. విచారణ సందర్భంగా సిట్ బృందానికి ఏలేరు గెస్ట్ హౌజ్‌లో బస ఏర్పాట్లు చేసినట్లు స్థానిక అధికారులు తెలిపారు. -
విశాఖ భూ కుంభకోణంపై ఫిర్యాదుకు తేదిలు ఖరారు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ భూ కుంభకోణంపై నవంబరు ఒకటి నుంచి ఏడవ తేది వరకు ఫిర్యాదులు స్వీకరిస్తామని బుధవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చీఫ్ విజయ్ కుమార్ అన్నారు. ఫిర్యాదులు స్వీకరించడానికి విశాఖ వీఎంఆర్డీఏ ఆడిటోరియంలో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నేరుగా వచ్చి ఫిర్యాదు చేయలేని వారు ఆన్లైన్ మాధ్యమం ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎంతటి వారైనా అవసరాన్ని బట్టి విచారణ చేపడతామని అన్నారు. గత సిట్ నివేదిక తమకు అందిందని, అందులోని అంశాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. విశాఖ భూ కుంభకోణంలో భూముల ట్యాంపరింగ్‌పై కూడా దృష్టి సారిస్తామని ఈ సందర్భంగా విజయ్ కుమార్ తెలిపారు. మూడు నెలలలో విచారణ పూర్తి చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్దేశించిందని, గడువు సరిపోకపోతే పెంచాలని ప్రభుత్వాన్ని కోరతామని ఆయన పేర్కొన్నారు. -
‘కొందరికి కాళ్లూ..చేతులూ ఆడటం లేదు’
సాక్షి, విశాఖపట్నం: విశాఖ భూ కుంభకోణాలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మళ్లీ సిట్ ఏర్పాటు చేయటంతో కొందరికి కాళ్లూ,చేతులూ ఆడటం లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం వ్యాఖ్యానించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..భీమిలిలో సామాన్య ప్రజల ఆస్తులకు ఎసరు పెట్టి.. రికార్డులను తారుమారు చేశారన్నారు. లక్ష ఎకరాల ప్రభుత్వ భూములు టాంపర్ అయ్యాయని అప్పటి కలెక్టర్ వ్యాఖ్యానించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. భూ కుంభకోణం వలన విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు కూడా భూ కుంభకోణాలు జరిగాయని పదేపదే ఆరోపించేవారన్నారు. ప్రభుత్వం వేసిన సిట్ విచారణకు సహకరించడంతో పాటు, బాధితులందరూ ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. విశాఖ నగర పాలక సంస్థకు చెందిన రూ.150 కోట్ల నిధులను పసుపు-కుంకుమ పథకానికి చంద్రబాబు నాయుడు తరలించారని ఆరోపించారు. దీనిపై కూడా విచారణ జరిపించాలని జగన్నాథం డిమాండ్ చేశారు. -
‘ఎంతటి వారినైనా విడిచి పెట్టేది లేదు’
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో జరిగిన భూకుంభ కోణంలో ప్రమేయమున్న ఎంతటి వారినైనా విడిచి పెట్టేది లేదని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. భారీ స్థాయిలో ల్యాండ్ ట్యాంపరింగ్ జరిగిందని, ఈ కుంభకోణంలో టీడీపీ నేతలే ఎక్కువ ఉన్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై సిట్ విచారణ పూర్తి స్థాయిలో జరుగుతుందని మంత్రి వెల్లడించారు. సిట్ విచారణ ప్రజలకు నమ్మకం కలిగేలా పారదర్మకంగా ఉంటుందని తెలిపారు. ఇది కక్ష సాధింపు చర్యలు కావని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో సిట్ వేసినప్పడు బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎవరైతే దోషులుగా ఉన్నారో వారే ఇప్పుడు సిట్‌ను స్వాగతిస్తున్నామని అంటున్నారని, ఇది చాలా సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. మద్యం పాలసీపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, ఈ నేపథ్యంలో బయట రాష్టం నుంచి కూడా మద్యం రాకుండా కట్టడి చేస్తామని మంత్రి తెలిపారు. -
విశాఖ భూ స్కాంపై పునర్విచారణ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన విశాఖపట్నం భూ కుంభకోణంలో అక్రమాలను వెలికితీయ డంతోపాటు దోషులను నిగ్గుతేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చంద్రబాబు సర్కారు హయాంలో విశాఖపట్నం జిల్లాలో భూ రికార్డుల మాయం.. ట్యాంపరింగ్ ద్వారా లక్ష కోట్ల రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయన్న విషయం తెలిసిందే. రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక రాజధాని అయిన విశాఖలో జరిగిన ఈ భారీ భూకుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని అన్ని రాజకీయ పక్షాలు అప్పట్లో డిమాండు చేశాయి. ఈ స్కామ్‌లో పాత్రధారులు, సూత్రధారులు అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని ఓ మంత్రి, పలువురు ఎమ్మెల్యేలేనని మీడియాలో పతాక శీర్షికల్లో వార్తలు వచ్చాయి. అధికార పార్టీలోని ఒక మంత్రి కూడా ఇదే విధమైన ఆరోపణలు బహిరంగంగానే చేశారు. నాటి సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌పై కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలొచ్చాయి. దీంతో సీబీఐకి కేసును అప్పగిస్తే ప్రభుత్వ పెద్దల బండారం బయటపడుతుందనే భయంతో విశాఖ పోలీస్ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు జరిపిస్తున్నట్లు చంద్రబాబు హడావుడిగా ప్రకటించారు. అప్పటి రెవెన్యూ మంత్రి, ఉప ముఖ్యమంత్రి అయిన కేఈ కృష్ణమూర్తి విశాఖ వెళ్లి ఈ కుంభకోణానికి సంబంధించిన ఫిర్యాదులను వ్యక్తిగతంగా స్వీకరిస్తామని కూడా ప్రకటించారు. కానీ, ఆ మర్నాడే ఆయన పర్యటన వాయిదా పడేలా చంద్రబాబు ‘సిట్’ ప్రకటించారు. దీంతో ‘సిట్’ గురించి తనకు తెలీదని కేఈ స్వయంగా ప్రకటించడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చింది. మరోవైపు.. 2014లో సంభవించిన హుద్‌హూద్ తుపానులో రికార్డులు కొట్టుకుపోయాయంటూ కేసును నీరుగార్చేందుకు అప్పటి సర్కారు పెద్దలు యత్నించి అభాసుపాలయ్యారు. అయితే, తుపాను 2014లో సంభవిస్తే 2017 వరకూ రికార్డులు కొట్టుకుపోయినట్లు గుర్తించలేదా? అన్న ప్రశ్నకు వారి వద్ద సమాధానం కరువైంది. నాడు ‘సిట్’కు పరిమితులు ఇదిలా ఉంటే.. ‘సిట్’ దర్యాప్తులో నిజాలు వెలుగుచూడకుండా అప్పటి ప్రభుత్వం అనేక పరిమితులు విధించింది. జిల్లా మొత్తానికి సంబంధించిన ఈ స్కామ్‌పై దర్యాప్తును కేవలం రెండు మూడు మండలాలకే పరిమితం చేసింది. అలాగే, ఈ బాగోతాన్ని పక్కదోవ పట్టించేందుకు 2004 నాటి నిరభ్యంతర పత్రాలనూ ‘సిట్’ పరిధిలోకి తెచ్చింది. కాగా, సీఎం కుటుంబంతోపాటు మంత్రులపై అభియోగాలున్నందున రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అధికారులతో దర్యాప్తు జరిపిస్తే వాస్తవాలు బయటకు రావని, సీబీఐతోనే దర్యాప్తు జరిపించాలని అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్‌తోపాటు బీజేపీ, సీపీఐ, సీపీఎం.. ప్రజా సంఘాలు డిమాండు చేశాయి. అలాగే, అసైన్డ్ భూములను కొనుగోలు చేసి విశాఖపట్నం పట్టణాభివృద్ధి సంస్థ (వుడా)కు భూ సమీకరణ కింద ఇచ్చి వందల కోట్ల విలువైన భూమిని అప్పట్లో ఒక టీడీపీ నేత కొట్టేశారని కూడా ఆధారాలతో సహా వార్తలొచ్చాయి. వీటన్నింటినీ చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా.. మధురవాడలోని 178, కొమ్మాదిలోని 92 ఎకరాలకు సంబంధించిన 25 రికార్డులు మాత్రమే టాంపరింగ్ అయినట్లు ‘సిట్’ అధికారులు ప్రకటించి తూతూమంత్రంగా నివేదికను సమర్పించారు. దీనిని కేబినెట్ ఆమోదించినట్లు చంద్రబాబు వెల్లడించినప్పటికీ ఆ నివేదికను మాత్రం బహిర్గతం చేయలేదు. పక్కా ఆధారాలతోనే పునర్విచారణ ఈ నేపథ్యంలో.. భీమిలీ, మధురవాడ తదితర ప్రాంతాల్లో అత్యంత విలువైన భూముల రికార్డులను తారుమారు చేసి సొంతం చేసుకున్నట్లు ఒక మంత్రితోపాటు కొందరు టీడీపీ ఎమ్మెల్యేలపై పక్కా ఆధారాలున్నా వారి పేర్లు దోషుల జాబితాలో లేకుండా తప్పించినట్లు తీవ్రమైన ఆరోపణలున్నాయి. అందువల్ల ఈ బాగోతంపై మరోసారి ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా నిష్పక్షపాతంగా లోతైన విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలన్న సదుద్దేశంతో నిజాయితీ గల ఐఏఎస్, లేదా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో దీనిని జరిపించాలని భావిస్తున్నట్లు తెలిసింది. -
సూత్రధారులకు క్లీన్చిట్
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖపట్నం భూ కుంభకోణంపై విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నివేదిక ఎట్టకేలకు మంత్రివర్గం ముందుకొచ్చింది. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొం టున్న అధికార పార్టీకి చెందిన కీలక సూత్రధారులకు ‘సిట్’ క్లీన్చిట్ ఇచ్చేసింది. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన అనుచరులు, అధికార టీడీపీ ఎమ్మెల్యేలు పీలా గోవింద్, పల్లా శ్రీనివాస్, బండారు సత్యనారాయణ మూర్తి, పంచకర్ల రమేశ్, వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేశ్‌తోపాటు ఇతర నేతల పాత్ర ఉన్నట్లు వచ్చిన ఫిర్యాదులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి నారా లోకేశ్ కనుసన్నల్లోనే విశాఖ భూకుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. సిట్ సిఫార్సుల అమలుకు కమిటీ విశాఖ భూముల కుంభకోణంపై ‘సిట్’ విచారణ జరిపి, సమర్పించిన 300 పేజీల నివేదికను 9 నెలల తర్వాత మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. భూకుంభకోణంపై గ్రేహౌండ్స్ డీఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల దర్యాప్తు బృందం ఆరు నెలలపాటు విచారించి, ప్రభుత్వానికి 9 నెలల క్రితమే నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో సిట్ చేసిన సిఫార్సులను అమలు చేసేందుకు కేబినెట్ తాజాగా రెవెన్యూ, సాధారణ పరిపాలన, న్యాయ శాఖ కార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేసింది. నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని ఆదేశించింది. విశాఖ భూకుంభకోణంతో టీడీపీ ప్రజాప్రతినిధులకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేసేలా సిట్ పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. పలువురు అధికారులు, కిందిస్థాయి సిబ్బంది, ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక మాజీ మంత్రి, పలువురు కిందిస్థాయి నేతలను బాధ్యులుగా గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. మంత్రి గంటాకు సంబంధం లేదట! విశాఖ భూకుంభకోణంలో మంత్రి గంటా శ్రీనివాసరావు పాత్ర ఉందని పెద్దఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో మంత్రి గంటా కీలకంగా వ్యవహరించారని, ఆయన అనుచరులు పెద్దఎత్తున కబ్జాలకు పాల్పడ్డారని మంత్రివర్గంలో సీనియర్ సభ్యుడైన చింతకాయల అయ్యన్నపాత్రుడు స్వయంగా ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా అధికారులకు అందజేశారు. విశాఖ భూకుంభకోణాన్ని బయటపెట్టింది మంత్రి అయ్యన్నపాత్రుడే కావడం గమనార్హం. అయితే, మంత్రి గంటా, ఆయన అనుచర బృందానికి భూముల అవకతవకలు, ట్యాంపరింగ్‌తో సంబంధం లేదని ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో సిట్ దర్యాప్తు సమయంలోనే తేల్చింది. దాన్నే నివేదిక రూపంలో ప్రభుత్వానికి సమర్పించింది. దీంతో వేలాది ఎకరాల భూముల ట్యాంపరింగ్‌కు సూత్రధారులైన మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన అనుచరులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు క్లీన్చిట్ లభించినట్లయింది. ప్రతిపక్ష నేతలను ఇరికించిన వైనం తన సహచర మంత్రి భూకబ్జాలకు పాల్పడినట్లు స్వయంగా మరో మంత్రే ఫిర్యాదు చేసి, ఆధారాలిచ్చినా లెక్కచేయని సిట్ ప్రతిపక్షానికి చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరును నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. ధర్మాన తన కుమారుడి పేరుతో భూములు కొన్నారని, ఇందులో అవకతవకలు జరిగాయని సిట్ పేర్కొన్నట్లు సమాచారం. మరికొందరు స్థానిక ప్రతిపక్ష నేతల పేర్లను ప్రైవేటు వ్యక్తులుగా చెబుతూ నివేదికలో ప్రస్తావించినట్లు తెలిసింది. భూకబ్జాలకు పాల్పడిన అధికార పార్టీ నేతలను వదిలేసి, ఈ వ్యవహారంతో సంబంధం లేని వ్యక్తుల పేర్లను చేర్చడం ఏమిటని పలువురు విమర్శిస్తున్నారు. కొన్ని రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలి విశాఖ భూకుంభకోణానికి సంబంధించి ముగ్గురు కలెక్టర్లు, నలుగురు జాయింట్ కలెక్టర్లు, 10 మంది డీఆర్ఓలు, 14 మంది ఆర్డీఓలు, 109 మంది ఇతర అధికారులపై కేసులు నమోదు చేయాలని సిట్ తన నివేదికలో ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు సమాచారం. వీరిలో పలువురు అధికారులను సస్పెండ్ చేయాలని, కొందరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించడంతోపాటు కొన్ని రిజిష్ట్రేషన్లను రద్దు చేయాలని సిట్ సిఫార్సు చేసింది. అధికారులు, ఉద్యోగులకు సంబంధించి 49 కేసులు, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి 50 కేసులు, సివిల్ వ్యవహారాలకు సంబంధించి 134 అంశాల్లో చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సిట్ నివేదికను 9 నెలల తర్వాత మంత్రివర్గ సమావేశంలో ఆమోదించడం, అందులో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును పేరును చేర్చి, ఆ విషయాన్ని మీడియాకు లీక్ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూ రికార్డుల పటిష్టత కోసం ‘సిట్’ సిఫార్సులు - 10,000 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు కబ్జాలు, వివాదాల్లో చిక్కుకున్నట్లు సిట్ గుర్తించింది. - 68 నిరభ్యంతర పత్రాల్లో(ఎన్‌ఒïసీలు) 55 ఎన్ఓసీలను అడ్డగోలుగా జారీ చేశారని గుర్తించారు. విశాఖపట్నంలో స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికుల పేరిట అడ్డగోలుగా భూ కేటాయింపులు జరిగాయని నిర్ధారణకు వచ్చారు. - వీరికి కేటాయించిన భూముల్లో ఖాళీగా ఉన్న 70 శాతానికి పైగా భూములను ఏ విధంగా వెనక్కి తీసుకోవాలో సూచిస్తూ సిఫార్సు చేసింది. - ఏళ్ల తరబడి కొనసాగుతున్న రెవెన్యూ చట్టంలోని లొసుగులను నియంత్రించడంలో ప్రభుత్వాల ఉదాసీనత వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని సిట్ తన నివేదికలో పేర్కొంది. - ప్రైవేటు భూముల క్రయవిక్రయాల్లో మోసాలను అరికట్టాలంటే సింగపూర్ తరహా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని సిఫార్సు చేసింది. - సింగపూర్‌లో ప్రభుత్వ, ప్రైవేటు భూములన్నీ నేరుగా గూగుల్‌తో అనుసంధానమవుతాయి. ఏ భూమి ఎవరి పేరిట ఉంది, అంతకముందు ఎవరి పేరిట ఉండేది అనే వివరాలన్నీ గూగుల్‌లో ఉంటాయి. భూమిని ఆన్లైన్లో విక్రయానికి పెడితే.. కొనుగోలు చేసేవారు రికార్డులను, భూమిని పరిశీలించి ఆన్లైన్లోనే పేమెంట్ చేస్తారు. వెంటనే సదరు భూమి గూగుల్ ద్వారా కొనుగోలుదారుడి పేరిట రిజిస్ట్రేషన్ అవుతుంది. - భూముల రీ సర్వే జరపాలని సిట్ సిఫార్సు చేసింది. ఆర్థిక భారం అయినప్పటికీ ప్రత్యేక విభాగాన్ని, సిబ్బందిని ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి సర్వే చేయాలని సూచించింది. - గ్రామాల్లో రికార్డులను పరిరక్షించేందుకు రికార్డు అసిస్టెంట్ నేతృత్వంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సిట్ పేర్కొంది. - రెవెన్యూ చట్టాలు, అమలు తీరుతెన్నులపై రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని సూచించింది. - ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ అధికారులు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గుతూ పెద్ద ఎత్తున రికార్డుల ట్యాంపరింగ్, భూకబ్జాలను ప్రోత్సహించారని సిట్ తన నివేదికలో తప్పుపట్టింది. భూకుంభకోణంపై వైఎస్సార్సీపీ పోరుబాట విశాఖ భూ కుంభకోణం ఓ సంచలనం. సరిగ్గా 9 నెలల క్రితం వెలుగు చూసిన రికార్డుల ట్యాంపరింగ్ బాగోతం రాష్ట్రాన్ని కుదిపేసింది. సరిగ్గా అదే సమయంలో ముదుపాక భూముల ఉదంతం.. ఆ వెంటనే లక్ష ఎకరాలకు సంబంధించిన రికార్డుల గల్లంతు వ్యవహారం కలకలం రేపాయి. విశాఖ భూకుంభకోణంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర విపక్షాలు, వామపక్ష పార్టీలు ఆందోళన బాట పట్టాయి. గతేడాది జూన్ 22న విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన మహాధర్నాలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. అధికార టీడీపీ నేతలు తిన్నదంతా వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే కక్కిస్తామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి, పార్టీ నేతలంతా ముదుపాక భూములను పరిశీలించారు. బాధితులకు అండగా నిలిచారు. రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించి విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. మరోవైపు సేవ్ విశాఖ అంటూ వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున ఉద్యమించింది. దీంతో నష్టనివారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జూన్ 20న ‘సిట్’ ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. సిట్ తన విచారణను జూన్ 28న ప్రారంభించింది. సిట్‌కు అందిన 2,875 ఫిర్యాదుల్లో మూడొంతులు అధికార పార్టీ నేతలపైనే ఉన్నాయి. వీటిలో 333 ఫిర్యాదులను సిట్ తన పరిధిలోకి తీసుకొని, మిగిలిన వాటిని రెవెన్యూ శాఖకు అప్పగించింది. ఆరు నెలలపాటు సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో వందలాది డాక్యుమెంట్లు, వేలాది భూ రికార్డులను పరిశీలించింది. ఈ ఏడాది జనవరి 29న తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. 9 నెలలుగా ఈ నివేదిక వెలుగు చూడలేదు. చివరకు మంగళవారం కేబినెట్లో దీన్ని ఆమోదించారు. సిట్ నివేదికలో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై చర్యలకు ఎలాంటి సిఫార్సులు లేవని, ప్రతిపక్ష నేతల పేర్లే ఎక్కువగా ఉన్నాయంటూ ప్రభుత్వం లీకులివ్వడం గమనార్హం. -
విశాఖ భూ కుంభకోణంపై చర్యలు నిల్
-
పెద్దల అరెస్టుకు రంగం సిద్ధం...
సాక్షి, విశాఖ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ భూకుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఎన్వోసీ ఉల్లంఘనుల్లో డిప్యూటీ కలెక్టర్, ఆ పైస్థాయి అధికారులు కూడా ఉండటంతో వారి అరెస్ట్‌లకు రంగం సిద్ధమైంది. సిట్ సభ్యురాలు, జిల్లా జాయింట్ కలెక్టర్ సృజన నిన్న (సోమవారం) ఇందుకు సంబంధించిన వివరాలు విలేకరులకు వెల్లడించారు. వచ్చేవారం అరెస్టులు ఉంటాయని తెలిపారు. సిట్‌కు మరో రెండు నెలల గడువు ఎన్వోసీల విచారణ పూర్తయేందుకు మరో నెల రోజుల సమయం పడుతుందని జేసీ తెలిపారు. సిట్ దర్యాప్తుపై పూర్తిస్థాయి నివేదికలు తయారు చేసేందుకు సమయం పట్టే అవకాశాలు ఉన్నందున మరో రెండు నెలల సమయం కోరినట్లు చెప్పారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, త్వరలో ఉత్తర్వులు వస్తాయన్నారు. 20మందిపై క్రిమినల్ కేసులు...! సిట్ పరిధిలో వచ్చిన 337 అర్జీల్లో 260 అర్జీలపై దర్యాప్తు పూర్తయింది. తహసీల్దారు కార్యాలయాల్లో రికార్డుల పరిశీలన సమయంలో రెవెన్యూ అధికారులతో పాటు పోలీసులు కూడా పరిశీలించారని జేసీ తెలిపారు. వారిలో 48మందిపై శాఖాపరమైన చర్యలు, 20మందిపై క్రిమినల్ కేసులు నమోదుకు సిఫార్సు చేశామన్నారు. ఈ 48మందిలో వీఆర్వోల స్థాయి నుంచి డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకూ ఉన్నారన్నారు. ఇప్పటివరకూ విచారించిన 260 ఫిర్యాదుల్లో ప్రభుత్వానికి సంబంధించిన 2వేల ఎకరాల భూములు ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్నట్లు గుర్తించామని, వాటిని త్వరలో స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. సిట్ పరిగణనలోకి తీసుకున్న 2,500 ఫిర్యాదుల్లో సుమారు 1300 ఫిర్యాదులకు సంబంధించి రిపోర్టులను ఎమ్మార్వోల నుంచి తీసుకున్నామన్నారు. వారిచ్చిన ప్రతి రిపోర్టును చదువుతామని, అందులో ఏమైనా లోపాలుంటే మళ్లీ తిప్పి పంపిస్తామని చెప్పారు. రాష్ట్రంలో తొలిసారి 22(ఎ) లో భూముల వివరాల సవరణ కోసం ప్రజలు అధికారుల చుట్టూ తిరుగుతున్నారని, వారి బాధలను అర్థం చేసుకుని 22(ఎ) సవరణ, యూఎల్సీ ఎన్వోసీ అనుమతి మీ సేవ ద్వారా పొందేందుకు అవకాశం కల్పించామని జేసీ తెలిపారు. ఇది రాష్ట్రంలో మొదటిసారిగా విశాఖ జిల్లాలో ప్రారంభిస్తున్నామని, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారని చెప్పారు. 22(ఎ) కు సంబంధించి పాత, కొత్త లిస్టులు ఉన్నాయని, అయితే గతంలో పాత లిస్ట్ పంపించడం వల్ల కొన్ని సమస్యలు వచ్చాయన్నారు. ప్రస్తుతం కొత్త లిస్టును అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. రికార్డుల స్వచ్ఛీకరణ బాధ్యత వీఆర్వోలదే గతంలో రికార్డుల మార్పుచేర్పులు వీఆర్వోలకు తెలిసే జరిగాయి. కాబట్టి ప్రస్తుతం రికార్డుల స్వచ్ఛీకరణ వారి బాధ్యతగా తీసుకొని సరైన సమాచారాన్ని పొందుపరచాలి. లేదంటే గతంలో రికార్డులు మార్పుచేర్పులకు కారణమైన వాటిపై విచారణ చేస్తానని వారిని హెచ్చరించారు. స్వచ్ఛీకరణకు సహకరిస్తే పాత తప్పులను విడిచిపెడతామని వారికి చెప్పామన్నారు. అందువల్ల ప్రస్తుతం బాగా జరుగుతోందన్నారు. రోజుకు 50 నుంచి 60 ఎకరాల భూములకు సంబంధించి స్వచ్ఛీకరణ చేస్తున్నామని తెలిపారు. జిల్లాల్లో 27 మండలాల్లో 128 పంచాయతీల్లో ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. పత్రాల జారీలో జాప్యం వహిస్తే నోటీసులే... మీ సేవా ద్వారా నెల రోజుల్లో పత్రాలను జారీ చేయాలి. అలా చేయని అధికారులకు నోటీసులు ఇస్తున్నాం. ఒక తహసీల్దారు, నలుగురు ఆర్ఐవోలు, నలుగురు వీఆర్వోలకు నోటీసులు జారీ చేశామన్నారు. -
‘చంద్రబాబు అహంకారంతో మాట్లాడుతున్నారు’
-
‘చంద్రబాబు అహంకారంతో మాట్లాడుతున్నారు’
విశాఖ : చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తన ఆస్తి ఎంతో చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు ఆస్తి అమాంతం పెరిగిందని, రెండెకరాల ఆస్తి కాస్తా ఇప్పుడు లక్షల కోట్లకు ఎలా అయ్యిందని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు దమ్ముంటే ఆయన ఆస్తులతో ముందుకు రావాలని...ప్రజాకోర్టులో తేల్చుకుందామని సవాల్ విసిరారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ముఖ్యమంత్రి అహంకారంతో మాట్లాడుతున్నారని, ఆయన పాలన అంతా శంకుస్థాపనలకే పరిమితం తప్ప, ప్రారంభోత్సవాలు లేవని ఆయన ఎద్దేవా చేశారు. ప్రపంచంలో మేటి రాజధాని అంటూ ప్రజలకు లేనిపోని ఆశలు కల్పిస్తూ మాటలతో కాలం గడుపుతున్నారే తప్ప.... అధికారంలోకి వచ్చి 39 నెలలవుతున్నా ఇంతవరకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు తన ధనదాహం, ప్రచార ఆర్భాటం కోసం ప్రజలను మోసం చేస్తున్నాడని బొత్స మండిపడ్డారు. రాజధాని డిజైన్లకు ఇంజినీర్లను కాదని సినిమా వాళ్లను సంప్రదించడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రం ఎటు వెళ్తోందని, ఏమిటీ మేధావి తనమని బాబుపై నిప్పులు చెరిగారు. తమకీ రంగంలో ప్రాధాన్యత లేదని సినిమా డైరెక్టర్లు చెబుతుంటే బాబు వాళ్ల సలహాల కోసం వెంపర్లాడడంలో ఉద్దేశ్యమేంటని ప్రశ్నించారు. ప్రజల అవకాశాలను క్యాష్ చేసుకోవడానికే బాబు ఇలాంటి చీఫ్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని, ముఖ్యమంత్రికి ఇది తగదని బొత్స హితవు పలికారు. ముఖ్యమంత్రి తీరును చూసి మేధావులు, నిపుణులు, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. చంద్రబాబుకు ఎంత సేపు తన స్వార్థ ప్రయోజనాలే తప్ప.... దేశంలో మేటి రాజధానిగా ఏపీని చేయాలన్న చిత్తశుద్ధి లేదన్నారు. ఏనాడైతే సింగపూర్ కంపెనీకి సమగ్ర నివేదిక తయారుచేయడానికి ఇచ్చారో ఆరోజే బాబు డొల్లతనం బయటపడిందన్నారు. రాష్ట్రంలో దురదృష్టకర పరిణామాలు ఉన్నాయన్నారు. చంద్రబాబు అండ్ కో తమ ధన దాహం కోసం విశాఖ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీశారన్నారు. విశాఖ భూ కుంభకోణాలపై సిట్ వేసి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఫిర్యాదులపై సిట్ ఏం చేస్తుందో వెల్లడించాలని అన్నారు. -
సిట్‌కు ఎమ్మెల్యే విష్ణుకుమార్ వినతిపత్రం
విశాఖ : బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు శనివారం సిట్ అధికారులను కలిశారు. విశాఖ భూ కుంభకోణంపై ‘సిట్’ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు... ముదుపాక, చిట్టివలస, రాజవరం, మాధవధారలో జరిగిన భూ కబ్జాలు, ట్యాంపరింగ్‌పై సిట్ చీఫ్ వినిత్ బ్రిజిలాల్‌కు వినతి పత్రం అందచేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎమ్మెల్యేల సిఫారస్సులతో ప్రభుత్వ లాయర్లను నియమించడం సరికాదన్నారు. వారికి సరైన పరిజ్ఞానం ఉంటే పర్వాలేదని, లేకుంటే ప్రభుత్వ భూములు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానంలో ఉన్న న్యాయమూర్తుల సలహాలు తీసుకుని, కోర్టు పరిధిలో ఉన్న భూకేసులను ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా పరిష్కరించాలన్నారు. సుమారు 2వేల ఫిర్యాదులు అందాయంటే ఏ స్థాయిలో భూ దందాలు జరిగాయో అర్థం అవుతుందన్నారు. -
‘సిట్ పై మాకు నమ్మకం లేదు’
విశాఖపట్నం: విశాఖ భూకబ్జాలపై సీబీఐ విచారణ జరపాల్సిందేనని వైఎస్సార్ సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. సిట్ పై తమకు నమ్మకం లేదని, ముమ్మాటికి సీబీఐ దర్యాప్తు జరగాల్సిందేనన్నారు. భూకబ్జాలతో సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ కు సంబంధం ఉందన్నారు. పోలీసులతో విచారణ చేయిస్తే ఏం న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. కలెక్టర్ రోజుకో తీరుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. -
విశాఖ భూకబ్జాలపై సిట్ విచారణ ప్రారంభం
విశాఖ : విశాఖ భూ దందాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన విచారణను బుధవారం నుంచి ప్రారంభించింది. భూ ట్యాంపరింగ్, ఆక్రమణలు సంబంధించిన ఫిర్యాదుల్ని నాలుగు విధానాలుగా స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా సీపీ యోగానంద్ మాట్లాడుతూ భూముల రికార్డుల ట్యాంపరింగ్, అందుకు సహకరించిన అధికారులు, ట్యాంపరింగ్‌కు పాల్పడ్డ వ్యక్తులపై విచారణ జరుపుతామని తెలిపారు. బాధితులు నేరుగా తమను కలవొచ్చని, ఫిర్యాదుల కోసం కలెక్టరేట్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విచారణ కొనసాగిస్తామన్నారు. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్, జాయింట్ కలెక్టర్ జి.సృజన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. -
ఏపీలో అరాచకపాలన : బొత్స
పశ్చిమ గోదావరి : ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన సాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు దుర్మార్గపు పాలనకు ప్రజలే చరమగీతం పాడతారని ధ్వజమెత్తారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నాటి స్వర్ణయుగం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే సాధ్యమని పేర్కొన్నారు. పోలవరం పేరుతో చంద్రబాబు అండ్ కో కోట్ల రూపాయలు దోచుకుందని బొత్స నిప్పులు చెరిగారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే విశాఖపట్నం భూ కుంభకోణం జరిగిందన్నారు. -
ఆక్రమణలపై అఖిల పక్షం కన్నెర్ర
విశాఖపట్నం : భూ నేరగాళ్ల అసలు మజిలీలా మారిన విశాఖపట్నాన్ని కాపాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహాధర్నాలో అఖిల పక్షం నినదించింది. వైఎస్ఆర్ సీపీ నేతలతో పాటు వివిధ పార్టీల నాయకులు గురువారం మహాధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. కబ్జాకోరుల బారి నుంచి భూబాధితులను కాపాడేందుకు వైఎస్ జగన్‌తో కలిసి పోరాటం సాగిస్తామని తెలిపారు. భవిష్యత్తులో జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని జోస్యం చెప్పగా.. అక్రమాలకు పాల్పడుతున్న చంద్రబాబు సహా.. టీడీపీ నేతలంతా జైలు ఊచలు లెక్కపెట్టే రోజులు దగ్గరపడ్డాయని వ్యాఖ్యానించారు. అంగుళం భూమి కూడా కబ్జాదారుల పరం కాకుండా పోరాటం సాగిస్తామని సేవ్ విశాఖ వేదిక సాక్షిగా స్పష్టం చేశారు. చంద్రబాబే ప్రథమ ముద్దాయి : గుడివాడ అమర్నాథ్ (వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు) టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖలో ఉన్న పేద రైతుల భూములతో పాటు ప్రభుత్వ, అసైన్డ్, దేవుడి భూములు ఇలా కన్ను పడిన ప్రతి భూమిని కూడా ఆక్రమించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మూడేళ్లుగా టీడీపీ చేస్తున్న దౌర్జన్యాలు పెరిగిపోయాయి. పేద రైతాంగానికి చెందిన భూములు, దేవుడు మాన్యాల్ని, చెట్టుని, పుట్టని గట్టుని మాయం చేసేస్తున్నారు. లక్ష ఎకరాల భూ కుంభకోణంలో సీఎం చంద్రబాబు ప్రథమ ముద్దాయిగా మారారు. సీఎంతో పాటు ప్రభుత్వంలో ఉన్న వారంతా కుమ్మక్కై భూ దోపిడీకి పాల్పడ్డారు. ప్రజలకు అండగా వైఎస్సార్ సీపీ నిలబడి పోరాడుతుంది. మహాధర్నాకు పోటీగా మహాసంకల్పం చేస్తామని టీడీపీ ప్రకటించింది. అది మహా సంకల్పం కాదు.. మహా సంకల్ప దీక్ష. చంద్రబాబు నుంచి టిడీపీ కార్యకర్త వరకూ ప్రతి ఒక్కరూ జైలుకి వెళ్లే రోజులు దగ్గర పడ్డాయి. భూ కబ్జాదారుల్ని బేడీలేసి నడిపించాలి : సీహెచ్ నరసింగరావు (సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు) రాష్ట్రంలో ఇదో ప్రధాన సమస్యగా మారింది. హెల్త్ హబ్, ఎడ్యుకేషన్ హబ్, ఐటీ హబ్‌గా విశాఖను మారుస్తానని ప్రతిసారీ చెప్పిన చంద్రబాబు.. చివరికి భూకబ్జాల హబ్‌గా మార్చేశారు. కాపాడాల్సిన మంత్రులు ఎమ్మెల్యేలే భూ కబ్జాలకు పాల్పడుతుంటే.. ప్రజలకు అండగా నిలబడాల్సిన సీఎం సిట్ వేసి చేతులు దులిపేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మిర్చి రైతులు ధర అడిగితే బేడీలు వేసుకొని తీసుకెళ్లారు. మరి ప్రభుత్వ, పేదల భూమలు దోచుకుంటున్న వారిని ఏం చెయ్యాలి. ఈ భూకబ్జాదారులందర్నీ బేడీలేసి నడిపించుకుంటూ తీసుకెళ్లాలి. ప్రజలు ఇంతలా ఉద్యమిస్తుంటే.. స్థానిక ఎంపీ నోరుమెదపకపోవడం గర్హనీయం. దీనిపై జగన్ నేతృత్వంలో ప్రజా ఉద్యమం నిర్మించాలి. అఖిలపక్షమంతా కలిసి పోరాడితేనే.. ప్రజలకు న్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన లేనట్లుంది : స్టాలిన్ (సీపీఐ జిల్లా కార్యదర్శి) వందల ఎకరాల భూముల్ని అధికారం అడ్డం పెట్టుకొని వేల ఎకరాల ప్రభుత్వ భూముల్ని కాజేశారు. వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌తో ధర్నా నిర్వహించిన వైఎస్ జగన్‌కు అభినందనలు. మూడేళ్ల నుంచి విశాఖలో ఏరకమైన రక్షణ భూములకు లేదు. కొమ్మాది, భీమిలి, మధురవాడలో ఎక్కడా ప్రభుత్వ భూమిని వదల్లేదు. రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసిన టీడీపీ రాష్ట్ర మాజీ సైనికోద్యోగ సంఘ అధ్యక్షుడు ఎం.రామకృష్ణ జైలుకి వెళ్లాడు. వేల కోట్ల రూపాయల విలువైన దసపల్లా భూములు ప్రైవేటు చేతుల్లోకి వెళ్లినా సీఎంకు చీమకుట్టినట్లైనా లేదు. ఇవన్నీ చూస్తుంటే.. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన జరుగుతుందా లేదా అన్నది అర్థం కావడం లేదు. కబ్జా కాండలో దోషులు సిట్ ద్వారా వెలుగులోకిరారు కాబట్టి సీబీఐ విచారణ చేపట్టాలని సీపీఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం. భూములు ఆక్రమించిన వారికి పుట్టగతులుండవ్ : కరణం ధర్మశ్రీ, (చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే) విశాఖలో జరుగుతున్న భూ దందాలో సీఎంకు చందాలు వెళ్తున్నాయి. చాపకింద నీరులా.. రికార్డులు ట్యాంపరింగ్ చేస్తూ.. భూములు దోచుకుంటున్నారు. ఒక మంత్రికి హామీ.. మరో మంత్రికి లేమి. వారిద్దరి మధ్య వచ్చింది సునామీ. ఈ సునామీలో పేదల భూములు గల్లంతయ్యాయి. కానీ ఈ పనంతా చేసింది టీడీపీ మంత్రులే. ముదపాక, అచ్యుతాపురం, కొమ్మాది, మధురవాడ.. భూములు ఎక్కడ ఉంటే అక్కడ స్కాములు జరుగుతున్నాయి. టీడీపీ నేతల అక్రమాల వెన్ను విరిచే కార్యక్రమానికి మహ«ధర్నా శ్రీకారం చుట్టాం. పేదల భూముల్ని ఆక్రమించిన వారికి పుట్టగతులుండవు. టీడీపీ నేతలు ఊచలు లెక్కపెడతారు. 2019లో జగన్ ముఖ్యమంత్రి : బంగారి (బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు) చంద్రబాబుకి ఏ జిల్లా ప్రజలు ఇవ్వని మెజారిటీని విశాఖ పట్నం కట్టబెడితే.. చంద్రబాబు మాత్రం తన అవినీతి మార్కుని చూపిస్తున్నారు. విశాఖను టీడీపీ విలాసాలకు వాడుకుంటోంది. రైతులు, ప్రభుత్వం, మాజీ సైనికులు తేడా లేకుండా.. భూమలు దోచుకుంటున్నారు. ఇలాంటి నీతిమాలిన కార్యక్రమాలు ఏ సీఎం హయాంలోనూ జరగలేదు. ప్రజలకు న్యాయం జరిగే వరకూ జగన్‌తో పోరాడతాం. 2019లో జగన్ ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబుకి ప్రజల ఉసురు తగులుతుంది. అలుసిస్తే ఇంటిని కూడా లాక్కుంటారు : అన్నంరెడ్డి అదీప్‌రాజు (పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఖాళీ జాగా కనిపిస్తే చాలు దాన్ని ఎలా కబ్జా చెయ్యాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. ఈ భూ కబ్జాల నుంచి విశాఖను కాపాడేందుకు వైఎస్సార్ సీపీ పోరాటం సాగిస్తుంది. పెందుర్తి నియోజకవర్గంలో ముదపాక భూముల్ని ఎలా దోచుకోవాలని ప్రయత్నిస్తున్నారో.. రాష్ట్రమంతటా తెలుసు. కానీ.. సదరు టీడీపీ నేతలు మాత్రం కర్జా కాండ కొనసాగిస్తున్నారు. ఇలా కొనసాగితే.. మన ఇంటిని కూడా లాక్కునే పరిస్థితి వస్తుంది. అందుకే.. లక్షల ఎకరాలను దోచుకున్న టీడీపీకి బుద్ధి చెబుదాం. భూ దందాలకు అడ్డు చెప్పేందుకు ఏకతాటిపై ఉద్యమిద్దాం.ప్రభుత్వం బారినుంచి భూముల్ని కాపాడుదాం బాబు హయాంలో భూదందాలు : బొడ్డేటి ప్రసాదరావు (యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త) వైఎస్సార్ పాలనలో విశాఖపట్నం ఎలా ఉంది.. చంద్రబాబు పాలనలో జిల్లా ఎలా భ్రష్టుపట్టిందో ప్రజలంతా గమనిస్తున్నారు. భూదందాలు సాగిస్తూ.. అందినకాడికి దోచుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు.. అందరూ మూకుమ్మడిగా భూబకాసురుల అవతారమెత్తి దోచుకుతింటున్నారు. భూసేకరణ పేరుతో ప్రభుత్వ భూముల్ని దోచుకుంటున్నారు. అందుకే.. విశాఖ జిల్లాను కాపాడేందుకు నడుంబిగిద్దాం. దోచుకోడానికే అధికారం : గొల్ల బాబూరావు (మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి) విశాఖలో గజం స్థలం కూడా పేదల పేరున ఉండకుండా చేసేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ నేతల ఈ దోపిడికి పాల్పడుతున్నారు. నారా లోకేష్ నాయకత్వంలోనే చంద్రబాబు పనిచేస్తున్నారు. అందరూ దోచుకుతినండంటూ అధికారాలు జారీ చేసినట్లు సాగుతోంది ఈ భూదందా. ఎవ్వర్నీ ఉపేక్షించం. అధికారం లోకి వచ్చిన వెంటనే.. తిన్నదంతా కక్కిస్తాం.. జైలు ఊచలు లెక్కెట్టిస్తాం. వైఎస్సార్‌లా జగన్ పోరాడాలి : బీశెట్టి బాబ్జి (లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు) విశాఖ పట్నంలో జరిగిన అవినీతిపై ఇంత పెద్ద రంకె వేస్తుంటే.. చంద్రబాబుకి వినిపించడం లేదా.? మహానాడులో ఇద్దరు ఆటో డ్రైవర్లు మాట్లాడుకుంటూ చంద్రబాబు ఏ సబ్జెక్టుపైనైనా అనర్గళంగా మాట్లాడతారని అంటే.. మరో ఆటో డ్రైవర్ మా ఆవిడ సబ్జెక్ట్ లేకపోయినా.. ఏకధాటిగా మాట్లాడగలదు అని అన్నారు. చంద్రబాబు పరిస్థితి ఇలా ఉంది. నిజంగా మనస్సాక్షి ఉంటే.. జరుగుతున్న అక్రమాల్లో చంద్రబాబు, మంత్రుల హస్తం లేదని కనకమహాలక్ష్మి సాక్షిగా ప్రమాణం చెయ్యాలి. టీడీపీ అధికారంలోకి వచ్చాక రైతు పూర్తిగా నష్టపోయాడు. ఆముదాలవలస, తుమ్మపాల చక్కెర కర్మాగారాలు మూతపడ్డాయి. మార్కెట్లో పరిస్థితి సైతం బాలేదు. రాష్ట్రం కబ్జాదారులు, కుంభకోణాలతో అట్టుడికిపోతోంది. దీనికి ప్రధాన కారణమైన టీడీపీ ప్రభుత్వంపై అఖిలపక్షం పోరాడుతుంది. మడమతిప్పని నాయకుడు వైఎస్సార్. ఆయనలా మడం తిప్పకుండా జగన్ పోరాటం సాగించాలి. జైలుకెళ్లక తప్పదు : మళ్ల విజయప్రసాద్ (వైఎస్సార్సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త) లక్షల ఎకరాల భూముల్ని దోచుకున్నారు. అధికారులతో కుమ్మక్కై.. మంత్రులు, ఎమ్మెల్యేలు దందాలకు పాల్పడుతున్నారు. సిగ్గూ ఎగ్గూ లేకుండా.. నిరుపేద భూముల్ని సైతం లాక్కుంటూ రోడ్డున పడేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే నిరుపేదలందరికీ ఇళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. దొంగలు, దోపిడీదారులంతా జైలుకి వెళ్లి ఊచలు లెక్కపెట్టుకునే రోజులు మరెంతో దూరంలో లేవు. బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయి : కోలా గురువులు (వైజాగ్ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త) విశాఖలో జరుగుతున్న భూదందాలో ప్రతి ఎమ్మెల్యే, మంత్రులతో పాటు పసుపు చొక్కా వేసుకున్న ప్రతి ఒక్కరి హస్తం ఉంది. 21వ వార్డులో పార్కు పేరుతో ఉన్న భూమిని తన బినామీకి కట్టబెట్టిన ఎమ్మెల్యే వాసుపల్లి చేసిన ఘనకార్యాన్ని ప్రజలందరూ చూస్తున్నారు. ఫిషింగ్ హార్బర్ తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సైకోలా ప్రవర్తిస్తున్న వాసుపల్లి వ్యవహారాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. ఇదే తరహాలో ప్రతి ఒక్క టీడీపీ నేత దందాలు సాగిస్తున్నాను. త్వరలోనే వీరందరికీ బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. రానున్నది జగనన్న పాలన. సిట్ తో సాక్ష్యాలకు చెల్లు చీటీ : తైనాల విజయ్‌కుమార్ (వైస్సార్సీపీ ఉత్తర నియోజకవర్గ కన్వీనర్) ప్రభుత్వాన్ని కదిలించేలా ధర్నా జరిగింది. హామీలు నెరవేర్చకుండా, ఓటుకు నోటు కేసుకోసం ప్రత్యేక హోదాను ఢిల్లీలో తాకట్టుపెట్టిన ఘనత చంద్రబాబుకే సాధ్యం. లక్ష ఎకరాల భూమి కబ్జా అయ్యిందంటూ స్వయానా కలెక్టర్ వెల్లడించినా.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేకపోవడం వెనుక ఆంతర్యమేమిటి. మళ్లీ.. కొద్ది రోజులు పోయాక అదే కలెక్టర్ 270 ఎకరాలు మాత్రమే కబ్జాకు గురయ్యాయని చెప్పడం చూస్తుంటే.. సిట్ వేసినా ఫలితం లేదని స్పష్టమవుతోంది. గోదావరి పుష్కరాల్లో 29 మంది ఎందుకు చనిపోయారో ఇంతవరకు చెప్పలేకపోయిన సిట్.. ఈలక్షల ఎకరాల్లో దోషులుగా ఉన్న టీడీపీ నేతల గురించి ఇంకే బయటపెడుతుంది. చంద్రబాబు అవినీతిని ప్రోత్సహిస్తున్నారు : తిప్పల నాగిరెడ్డి (గాజువాక నియోజకవర్గ సమన్వయ కర్త) భూముల్ని కాపాడుకోకపోతే.. మనం తలదాచుకుంటున్న ఇంటిని కూడా ఆక్రమించేసి రోడ్డున పడేసే ఘనులు టీడీపీలో ఉన్నారు. మూడేళ్లుగా ఇదే పనిలో నిమగ్నమయ్యారే తప్ప పాలన విషయంలో మాత్రం అడుగు కూడా వెయ్యిలేకపోయారు. దోచుకోవడం దాచుకోవడమే పని అయ్యింది. కోట్లాది రూపాయలు దోచుకొని ఓటుకి 5 వేలు ఇచ్చి నోరూ వాయిలేని లోకేష్‌ని సీఎంగా చెయ్యాలని చూస్తున్నారు. నేను తింటున్నాను.. మీరు కూడా తినండంటూ చంద్రబాబు అవినీతిని ప్రోత్సహిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక.. ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుంది. కబ్జాదారుల్ని తరిమి తరిమి కొడదాం : వంశీకృష్ణ శ్రీనివాస్ (తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త) ఎన్నికల ముందు రాబందుల రాజ్యమా.. ప్రశాంత వాతావరణమా అంటూ టిడీపీ నేతలు ప్రగల్భాలు పలికారు. తీరా అధికారంలోకి వచ్చాక.. వారే భూరాంబదుల్లా మారి విశాఖను ప్రశాంతవాతావరణానికి దూరం చేసేశారు. మూడేళ్ల నుంచీ అదే పనిలో సిద్ధహస్తులుగా మారిపోయారు. చంద్రబాబు, లోకేష్ సహా.. అందరూ ఇందులో పాత్రధారులే. లోకేష్‌ని సీఎం ను చేసేందుకు విశాఖను దోచుకుతింటున్నారు. ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా చేస్తున్న వారంతా జైలుకు వెళ్లే రోజులు ఎంతో దూరంలో లేవు. అందరం నడుం బిగించి.. కబ్జాదారుల్ని తరిమి తరిమి కొడదాం. -
సీబీఐ అయితే తన్ని లోపల వేస్తుంది
-
సీబీఐ అయితే తన్ని లోపల వేస్తుంది: వైఎస్ జగన్
విశాఖపట్నం: అన్యాయాన్ని ఎత్తిచూపేందుకే మహాధర్నా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. ఈ ధర్నాతోనైనా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బుద్ధి రావాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి, మంత్రులు, కలెక్టర్లు రెవెన్యూ అధికారులు కలిసి మాఫియాగా మారారని ధ్వజమెత్తారు. భూములను విచ్చలవిడిగా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో చోటుచేసుకున్న పెద్ద మొత్తం భూకుంభకోణంపై వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో గురువారం ‘సేవ్ విశాఖ’ మహాధర్నా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇసుకవేస్తే రాలనంత స్థాయిలో జనాలు తమ గోడును వినిపించుకునేందుకు వచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ముదపాకలో ల్యాండ్ పూలింగ్ పేరుతో భారీగా అసైన్డ్ భూములను కొట్టేసే ప్లాన్ చేశారని చెప్పారు. అందులో భాగంగానే లక్ష ఆరు వేల ఎకరాల సర్వే నెంబర్లు కనిపించడం లేదని కలెక్టర్ కొత్త కథ చెబుతున్నారని, హుదుద్‌లో రికార్డులు పోయాయని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల తర్వాత ఈ విషయం గుర్తొచ్చిందా అని నిలదీశారు. 16,375 ఫీల్డ్ మెజర్మెంట్ పుస్తకాలు కనిపించడం లేదని కలెక్టర్ అంటున్నారని, అంటే లక్ష ఆరువేల ఎకరాలకు సంబంధించిన సర్వే నెంబర్లు కనిపించలేదని, హుద్‌హుద్ వచ్చినప్పుడు పోయాయని అంటున్నారని, మూడేళ్ల తర్వాత ఇలాంటి ప్రకటనలు చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. హుదుద్‌లో కలెక్టర్ భవనాలు ఎగిరిపోలేదని, సునామీలాగా నీరు రాలేదని, తాను 11 రోజులు ఇక్కడే ఉండి అన్ని ప్రాంతాలు తిరిగినట్లు గుర్తు చేశారు. హుదుద్‌లో వచ్చింది గాలి వాన మాత్రమే అని చెప్పారు. రెవెన్యూ రికార్డులు ఎలా అంటే మార్చుకునేందుకే ఈ కట్టుకథలన్నీ కలెక్టర్ చెబుతున్నారని, దాదాపు 23 వేల ఎకరాలు కబ్జా అయ్యాయని ప్రభుత్వ లెక్కలే చెబుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఒక్క అంగుళం భూమిని కూడా పోనివ్వమని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. దగ్గరుండి కబ్జా చేయించారు జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరరావు దగ్గరుండి భూములన్నింటినీ కబ్జా చేయించారని, ఆయన బంధువు భాస్కరరావు తనకు సంబంధం లేని భూములను తన పేరిట రిజిస్టర్ చేసుకొని పేదల కాలనీలో భూములను బ్యాంకుల్లో కుదవపెట్టి లోన్లు తీసుకున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమానికి స్వయంగా ప్రభుత్వాధికారులే సహకరిస్తున్నారని ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు. గంటకు ఇంత నారా లోకేశ్‌కు ఇంత అని డబ్బులు పంచుకుంటున్నారని ధ్వజమెత్తారు. గంట సాక్షాత్తు ఒక మంత్రి అని మరో మంత్రి అయ్యన్న పాత్రుడు విశాఖలో భూదందా జరుగుతోందని ముందునుంచే చెప్పారని, అలాగే, శ్రీకాకుళం నుంచి వచ్చి ఇక్కడ భూములు కబ్జా చేస్తుంటే కాపాడుకునే పరిస్థితి లేకుండా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. కలెక్టరే స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో కుమ్మక్కై లోకేశ్‌తో చేతులు కలిపి అందరు కలసి భూదందాలు చేస్తుంటే సామాన్యుడు ఎక్కడికి వెళ్లాలని మండిపడ్డారు. నేడు ధర్నా జరుగుతుందని, తాను వస్తున్నానని, కంప్యూటర్లలో కొన్ని భూములు లెక్కలు సరి చేశారని చెప్పిన వైఎస్ జగన్ తాను వస్తే ఒక బటన్ రాకుంటే మరో కంప్యూటర్ బటన్ నొక్కుతున్నారని దుయ్యబట్టారు. ఎంవీవీఎస్ మూర్తి చంద్రబాబుకు బంధువు ‘గీతం కాలేజీల యజమాని ఎంవీవీఎస్ మూర్తి చంద్రబాబుకు బంధువు. రిషీ కొండలో 55 ఎకరాలు కబ్జా చేశారు. అవి ప్రభుత్వ భూములు. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల కోసం ఉంచిన భూములు. వాటిని కబ్జా చేసి తనకు ఇవ్వాలని చంద్రబాబును కోరగానే వెంటనే కేబినెట్ ద్వారా అర్పించేశారు. ఆ భూములు విలువ వెయ్యికోట్లు. అలాగే, రాజీవ్ స్వగృహ కోసం మహానేత వైఎస్ 7 ఎకరాలు ఇస్తే వాటిని కబ్జా చేశారు. ఆ భూముల విలువ రూ.100 కోట్లు. గతంలో ఉన్న కలెక్టర్ భూములు కబ్జా అవుతున్నాయని చెబుతున్నా సొంత బంధువులకు చంద్రబాబు వేలకోట్లు ధారా దత్తం చేస్తున్నారంటే విశాఖలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు’ అని వైఎస్జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. గంటానే బినామీలతో కొనుగోలు చేయించారు విశాఖ శివారుల్లో భీమిలీ నియోజకవర్గంలో 358 ఎకరాల అసైన్డ్ భూములు గంటా బినామీలతో కొనుగోలు చేయించి పూలింగ్ పేరిట జీవోలు ఇప్పించారని, ఆ భూములు కొనడం నేరం అని తెలిసినా కొనొచ్చని లోకేశ్ ద్వారా జీవోలు ఇప్పించారని మండిపడ్డారు. మదుపాకలో 950 ఎకరాలు బండారు సత్యనారాయణ దగ్గరుండి తక్కువ ధరకు కొనుగోలుచేసి కోట్లకు అమ్ముకునే కార్యక్రమం మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దస్పల్లా భూములు వివాదంలో ఉన్నాయని, అందులో టీడీపీ ఆఫీసు కట్టిస్తున్నారంటే వాటిని కబ్జా చేశారా? చంద్రబాబు నాయుడు అని నిలదీశారు. విశాఖ మీద ప్రేమ ఉందని చెప్పి ఇక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ తొలగించి భోగాపురంలో కొత్త ఎయిర్పోర్ట్ తెస్తారని చంద్రబాబు చెబుతున్నారని, కానీ, ఆ ఎయిర్పోర్ట్ వచ్చేది మాత్రం టీడీపీ నేతల భూములు ఉన్నచోటేనని చెప్పారు. పేదలంతా వణికిపోతున్నారు.. చంద్రబాబు హయాంలో కేబినెట్ మీటింగ్ జరిగితే అసైన్డ్ భూములు ఉన్న పేదలంతా వణికిపోతున్నారని వైఎస్ జగన్ అన్నారు. పేదవాడిని దోచేసుకో... పెద్దవాళ్లతో కుమ్మక్కవ్వు అన్నదే చంద్రబాబు సిద్ధాంతమని అన్నారు. చంద్రబాబుకు, ఆయన పార్టీకి విశాఖ జిల్లా చాలా చేసిందని.... అలాంటి విశాఖకు చంద్రబాబు ఏం చేశారని జగన్ నిలదీశారు. సీబీఐ అయితే తన్ని లోపల వేస్తుంది విశాఖపట్నం జిల్లాలో ఏవైనా పేదవాడి భూములు ఉన్నాయంటే ఆ భూములపై పెద్దవాడి కన్నుపడుతుందని, పేదలంతా వణికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘తొలుత బహిరంగ విచారణ అన్నారు.. వేలమంది వస్తారేమోనని భయపడి.. సిట్ తో చేస్తారంట. సిట్‌లో ఉన్న అధికారులంతా చంద్రబాబు కింద పనిచేసేవారు. చేసింది నువ్వు.. నీ కొడుకు.. నీమంత్రులు, నీ రెవెన్యూ అధికారులు అయినప్పుడు సిట్ రిపోర్టు ఏమొస్తుంది. సీతమ్మ వారిని ఎత్తుకొని పోవడం సరేనా అని రావణుడు కుంభకర్ణుడితో దర్యాప్తు చేయిస్తే ఏం లాభం హనుమంతుడితో వేయిస్తే గానీ తన్ని లోపల వేస్తాడు. అలాగే, సీబీఐ దర్యాప్తు వేస్తే చంద్రబాబును, లోకేష్‌ను, మంత్రులు, అధికారులను తన్ని లోపల వేస్తారు’ అని వైఎస్ జగన్ చురకలు అంటించారు. సీబీఐ విచారణకు 20 ఏళ్లు పడుతుందని చంద్రబాబు అంటున్నారని, ఆలస్యం అవుతందని వేయడం లేదా లేక 20 ఏళ్లు జైలుకు వెళ్లాల్సి వస్తుందని వేయడం లేదా చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి అంగుళం తిరిగి ఇస్తాను చంద్రబాబు కేబినెట్ సమావేశం పెడితే పేదవాళ్లను దోచుకో పెద్ద వాళ్లతో కుమ్మక్కుకా అని మంత్రులతో చెబుతున్నారని దుయ్యబట్టారు. ‘విశాఖపట్నం మీ పార్టీకి చాలా చేసింది. మీరు విశాఖపట్నానికి ఏం చేశారు? విశాఖకు స్కాములు, అవినీతి, దోచుకునే కార్యక్రమం బహుమతులుగా ఇచ్చారు. ముఖ్యమంత్రి అంటే సాధారణంగా అంతా భయపడుతుంటారు.. అన్యాయం చేయకూడదనుకుంటారు. చంద్రబాబే మాఫియాలా... కానీ, కాపాడాల్సిన చంద్రబాబే ఒక మాఫియాగా తయారై దోచుకుని తింటుంటే అధికారులేం చేస్తారు? పొరుగు దేశంలో ఉన్నవాళ్లు మన భూములు లాక్కుంటే కాపాడుకునే యత్నం చేసేట్లుగానే మన భూములు లాక్కుంటున్న ఈ ప్రభుత్వాన్ని బంగాళఖాతంలోకలిపేయాలి. ఒక భరోసా ఇస్తున్నా. ఒక్క అంగుళం కూడా పోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా పోరాడుతుంది. మనం ఎంత పోరాటం చేసినా విజయం రాకుంటే బాధపడొద్దు.. ఏడాదిన్నర తర్వాత మన పాలనే వస్తుంది. ప్రతి అంగుళం తిరిగి ప్రతి పేదవాడికి ఇస్తాను. ఇప్పుడు అన్యాయాలు చేస్తున్న వారందని అప్పుడు జైలులో వేస్తాం’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. మరిన్ని వార్తలు... ‘సేవ్ విశాఖ’ ధర్నాకు పోలీసుల అడ్డంకులు ‘పోలీసులతో కొట్టిస్తామని భయపెట్టారు’ ‘ఎవరినీ వదలిపెట్టం, అందరి భరతం పడతాం’ ‘విశాఖను భూకబ్జాల హబ్‌గా మార్చారు’ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘విశాఖను భూకబ్జాల హబ్‌గా మార్చారు’
విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖను భూకబ్జాల హబ్‌గా మార్చారని సీపీఎం జిల్లా కార్యదర్శి నర్సింగరావు విమర్శించారు. ‘సేవ్ విశాఖ’ మహాధర్నాలో పాల్గొన్న పాల్గొన్న ఆయన.. దేశంలోనే అతిపెద్ద భూస్కాం విశాఖలో జరిగిందన్నారు. లక్షలాది ఎకరాల భూములను తెలుగుదేశం పార్టీ నేతలు లాక్కున్నారని నర్సింగరావు మండిపడ్డారు. పేదల భూములను కొల్లగొట్టినవారికి బేడీలు వేయాలన్నారు. ఓ వైపు బీజేపీ ఎంపీ విష్ణుకుమార్ రాజు కబ్జాల గురించి మాట్లాడుతుంటే.. విశాఖ ఎంపీ హరిబాబు మాత్రం మాట్లాడటం లేదని నర్సింగరావు విమర్శించారు. అధికారపార్టీ నేతల భూకబ్జాలపై అన్ని పార్టీలతో కలిసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామన్నారు బీఎస్పీ నేత బంగారి మాట్లాడుతూ.. చంద్రబాబు విశాఖను అత్తారిల్లులా వాడుకుంటున్నారని విమర్శించారు. పేదలు, బడుగులతో పాటు.. మాజీ సైనికుల భూములను సైతం వదలకుండా తెలుగుదేశం పార్టీ నేతలు కబ్జా చేశారని అన్నారు. ఎవరి భూములు వారికి దక్కేవరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. -
వెనక్కుతగ్గని అయ్యన్నపాత్రుడు
విశాఖపట్నం సిటీ: విశాఖ భూ కుంభకోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణలో ఏ పార్టీ నేత పట్టుబడినా శిక్ష పడాల్సిందేనని ఆర్అండ్బీ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు బుధవారం చెప్పారు. ‘సిట్’ బృందానికి ప్రజలు వాస్తవాలివ్వాలని సూచించారు. ఉన్న భూములను ఎలా కాపాడడంతోపాటు భూ కుంభకోణాల నుంచి విశాఖను రక్షించాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు సిట్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ‘సిట్’ వేసినా ప్రతిపక్షాలు ధర్నాలంటూ హడావుడి చెయ్యడం సరికాదన్నారు. విచారణలో ప్రజలకు న్యాయం జరగకపోతే ధర్నా చేపట్టాలని సూచించారు. కుంభకోణాన్ని నీరుగార్చే ఉద్దేశం టీడీపీకి లేదని, ఒకవేళ అదే ఉద్దేశం ఉంటే ‘సిట్’ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్నారు. కాగా, టీడీపీ నేతలపై మీడియా ముఖంగా ఆరోపణలు చేసి పార్టీని, ప్రభుత్వాన్ని అయ్యన్నపాత్రుడు ఇరుకునపెడుతున్నారని ఇటీవల మంత్రి గంటా శ్రీనివాసరావు.. సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య విభేదాల పరిష్కారానికి త్రిసభ్య ఏర్పాటు చేయాలని కూడా టీడీపీ నిర్ణయించింది. ఇంత జరిగినా అయ్యన్నపాత్రుడు వెనక్కుతగ్గకపోవడం గమనార్హం. -
నేడు ‘సేవ్ విశాఖ’ మహాధర్నా
పాల్గొననున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి - భూ ఆక్రమణలపై గళం విప్పేందుకు బాధితులు సిద్ధం - ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ విజయసాయిరెడ్డి సాక్షి, విశాఖపట్నం: అధికార పార్టీకి చెందిన కబ్జారాయుళ్ల కబంధహస్తాల్లో చిక్కుకున్న విశాఖ నగరాన్ని రక్షించేందుకు ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ గురువారం నిర్వహించే ‘సేవ్ విశాఖ’ మహాధర్నాకు తరలివచ్చేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. టీడీపీ నేతల భూ కబ్జాల వల్ల రూ. కోట్ల విలువైన భూములను ఎలా కోల్పోయామో చెప్పుకునేందుకు ఇదే సరైన వేదికగా బాధితులంతా భావిస్తున్నారు. జీవీఎంసీ ఎదుట గాంధీ బొమ్మ వద్ద జరిగే ధర్నాలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటారు. వైఎస్ జగన్ ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో బయల్దేరి 9.30 గంటలకు విశాఖ చేరుకుంటారు. విశాఖ భూ కుంభకోణంపై సీబీఐతో విచారించాలనే డిమాండ్‌తో నిర్వహిస్తున్న ‘సేవ్ విశాఖ’ మహాధర్నాలో ప్రసంగిస్తారు. అనంతరం ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకుంటారు. సాయంత్రం 4.30 గంటలకు విమానంలో హైదరాబాద్ తిరిగి వెళ్తారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. విశాఖ మహాధర్నా ఏర్పాట్లను వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, తలశిల రఘురాం, పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తదితరులు బుధవారం పరిశీలించారు. ఆందోళనలో తాము కూడా పాలుపంచుకుంటామని ఇతర విపక్షాలు, ప్రజాసంఘాలు ప్రకటించాయి. గద్దల్లా వాలుతున్న అధికార పార్టీ నేతలు రాష్ట్ర ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖలో కాస్తంత ఖాళీ జాగా కన్పిస్తే చాలు టీడీపీ నేతలు వాలిపోతున్నారు. గత మూడేళ్లలో లక్ష కోట్లకు పైగా విలువైన భూములను కైంకర్యం చేశారన్న ఆరోపణలున్నాయి.భూ రికార్డుల ట్యాంపరింగ్ కుంభకోణంలో అధికార పార్టీ పెద్దలహస్తం ఉన్నట్టు తేటతల్లమవుతోంది. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు లోకేశ్‌తో, జిల్లాకు చెందిన ఓ మంత్రి పాత్రపై సీబీఐ విచారణ జరపాలని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నా పట్టించుకోకుండా సిట్‌తో దర్యాప్తునకు ఆదేశించటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీబీఐ విచారణ కోసం వైఎస్సార్ సీపీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి విపక్షాలన్నింటినీ ఏకతాటిìపైకి తెచ్చింది. అఖిలపక్షం ఆధ్వర్యంలో పెందుర్తి మండలం ముదుపాక గ్రామంలో పర్యటించింది. ల్యాండ్ పూలింగ్ మాటున బలవంతంగా భూములు లాక్కోవడంతో రోడ్డున పడ్డ బాధితులకు అండగా నిలిచింది. ఈ భూకుంభకోణాన్ని జాతీయ స్థాయిలో చర్చకు తెచ్చింది. -
ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త ఎత్తుగడ
హైదరాబాద్ : విశాఖ భూముల వ్యవహారంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘సేవ్ విశాఖ’ పేరుతో మహాధర్నాకు సిద్ధమైన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త ఎత్తుగడ వేశారు. ఆరోపణలు చేసిన మంత్రి అయ్యన్నపాత్రుడుతో ప్రెస్ మీట్ పెట్టించారు. వైఎస్ జగన్ ధర్నాపై విమర్శలకు అయ్యన్నను చంద్రబాబు ప్రయోగించారు. ఆరోపణలు చేసిన తానే ఎలా ప్రెస్‌మీట్ పెడతానంటూ అయ్యన్న తన అనుచరుల వద్ద మల్లగుల్లాలు పడ్డారు. అయితే విధిలేని పరిస్థితుల్లో అధినేత ఒత్తిడికి తలొగ్గక తప్పలేదని మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రెస్‌మీట్ పెట్టేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. కాగా సిట్ నేతృత్వంలో నిఖార్సు అయిన విచారణ జరుగుతుందని ఆయనతో చంద్రబాబు చెప్పించే యత్నం చేశారు. అయ్యన్నను అస్త్రంగా.. అయ్యన్నపాత్రుడు ప్రెస్మీట్లో మాట్లాడుతూ... ‘విశాఖ భూముల కబ్జా గురించి మొదట స్పందించింది నేనే. నా తర్వాత మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడారు. మేమిద్దరం మాట్లాడాకే కేబినెట్లో చర్చించి ముఖ్యమంత్రి చంద్రబాబు సిట్ వేశారు. కబ్జాలకు పాల్పడిన నేతల పేర్లు ఉంటే సిట్‌ను కలిసి విపక్ష నేతలు ఇవ్వాలి. అన్యాయం జరిగిన ప్రజలు కూడా సిట్‌కు తమ ఆవేదనను తెలియచేయాలి. భూ కబ్జాలపై వైఎస్ జగన్ ధర్నా చేయాల్సిన అవసరం లేదు.’ అని అన్నారు. -
‘స్టీల్ సిటీని స్టోలెన్ సిటీగా మార్చారు’
విశాఖపట్నం: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కనుసన్నల్లోనే విశాఖలో భూ కుంభకోణం జరిగిందని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి ఆరోపించారు. విశాఖపట్నంలో రూ. 2 నుంచి 3 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... లక్ష ఎకరాలు టీడీపీ నాయకులు ఆక్రమించారని అన్నారు. భూ కబ్జాలతో విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని, టీడీపీలో అధికారంలోకి వచ్చాక దోపిడీకి గురైన నగరంగా మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్ సిటీని స్టోలెన్ సిటీగా మార్చారని వాపోయారు. విశాఖలో జరిగింది పార్టనర్షిప్ సమ్మిట్ కాదు, అది సెటిల్మెంట్ సమ్మిట్.. కబ్జాల సమ్మిట్ అని వ్యాఖ్యానించారు. భూ కబ్జాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో నిష్పక్షపాత విచారణ సాధ్యం కాదన్నారు. తూతూ మంత్రంగా సిట్ దర్యాప్తు జరుగుతోందని, దీనివల్ల ఫలితం ఉండదని అన్నారు. ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలపై ఆరోపణలు ఉన్నప్పుడు సర్కారు నియమించిన సిట్ విచారణ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. సీబీఐ విచారణ జరిపితేనే దోషులు బయటకు వస్తారని పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. భూముల అక్రమాల్లో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన బావమరిది భాస్కరరావు, గంటా అల్లుడు ప్రశాంత్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, పీలా గోవింద్, బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేశ్‌బాబు, అనిత, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి ప్రమేయముందని ఆరోపించారు. టీడీపీ నాయకుల భూకబ్జాలకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు. చట్టవ్యతిరేకంగా భూములు కొల్లగొట్టినవారిని వదిలిపెట్టబోమని, 2019 తర్వాత వారంతా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. అన్యాయంగా ఆక్రమించుకున్న భూములను వెనక్కు తీసుకుంటామని విజయసాయిరెడ్డి తెలిపారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావును చట్టవ్యతిరేకంగా తొలగించారని ఆయన అన్నారు. -
సీబీఐ ఎంక్వైరీకి ఇస్తే 20 ఏళ్లు పడుతుంది
విశాఖ భూకుంభకోణంపై సీఎం సాక్షి, అమరావతి: సీబీఐ ఎంక్వైరీకి ఇస్తే 20 ఏళ్లు పడుతుంది, ఆధారాలు ఉంటే తీసుకురండి... మరుసటి రోజే చర్యలు తీసుకుంటామని విశాఖ భూ కుంభకో ణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం ముఖ్యమంత్రి సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ భూముల కుంభకోణంపై సీబీఐ విచారణ కోరారు కదా అని ఓ విలేకరి ప్రశ్నించగా పై విధంగా స్పందించారు. ప్రతిపక్షాలు దీనిని రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎవరి వద్ద ఏ ఆధారాలు ఉన్నా వాటిని వెంటనే ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో 24 ప్రాజెక్టులను వచ్చే మార్చిలోపులో పూర్తిచేస్తామన్నారు. స్మార్ట్ వాటర్‌గ్రిడ్ తయారు చేయడం లక్ష్యమని చెప్పారు. ప్రతిపక్షం విమర్శలకు భయపడి ఉంటే గోదావరి నీళ్ళు కృష్ణాకు తెచ్చేవాళ్ళం కాదన్నారు. పులిచింతల ప్రాజెక్టును ఆగస్టులో జాతికి అంకితం చేస్తామని చెబుతూ మొత్తం 24 ప్రాజెక్టులను ఎప్పుడు ప్రారంభించేది వివరించారు. కైజాలా యాప్ ద్వారా ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల ఫొటోలు తీసి పంపిస్తే అటువంటి వారికి అవార్డులు ఇవ్వాని నిర్ణయించినట్లు తెలిపారు. -
సీబీఐ విచారణకు ఆదేశించాలి
చంద్రబాబుకు బొత్స డిమాండ్ సాక్షి, హైదరాబాద్ : విశాఖపట్టణం భూ కుంభకోణంపై సిట్ దర్యాప్తును ఆదేశించిన తీరు చూస్తూంటే దొంగ చేతికే తాళాలు ఇచ్చి నట్లుగా ఉందని ఈ భారీ కుంభకోణంలో సిట్ విచారణతో ప్రయోజనం ఏ మాత్రం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. కచ్చితంగా ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయని, ఇందులో సూత్రధారులు, పాత్రధారుల బండారం బయట పడుతుందని ఆయన అన్నారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కుంభకోణాన్ని ఓవైపు తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నం చేస్తూనే మరో వైపు సిట్ వేయడం చూస్తూంటే ఈ అంశంపై ప్రజలతో పాటు మంత్రులు, టీడీపీ భాగస్వామి అయిన బీజేపీ నేతల్లో కూడా అనేక అనుమానాలు నెలకొని ఉన్నాయన్నారు. -
సిట్ విచారణలో అన్నీ తేలతాయి: చంద్రబాబు
అమరావతి: విశాఖపట్టణం భూ కుంభకోణం వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ 276 ఎకరాల భూముల రికార్డులు ట్యాంపర్ అయ్యాయన్నారు. కానీ, ఎక్కడా వాటిపై లావాదేవీలు జరగలేదని చంద్రబాబు తెలిపారు. ట్యాంపరింగ్‌కు పాల్పడ్డ 25మంది ఫోటోలతో పాటు వివరాలు ఉన్నాయని, సిట్ విచారణలో అన్నీ తేలతాయన్నారు. ల్యాండ్ పూలింగ్‌లో అక్రమాలకు పాల్పడితే రద్దు చేశామని, ఆధారాలు ఉంటే సిట్‌కు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. కాగా అక్రమాలపై ప్రశ్నించినందుకు ప్రతిపక్షంపై ముఖ్యమంత్రి ఎదురుదాడికి దిగారు. సీబీఐ విచారణ అడుగుతున్న వారివద్ద ఆధారాలు ఉన్నాయ అంటూ ఎదురు ప్రశ్నించారు. సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తూ 20ఏళ్ల సమయం పడుతుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. పనిలో పనిగా మంత్రి గంటా శ్రీనివాసరావుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. గంటా అడిగితే నేను సీబీఐ విచారణ వేయాలా అని వ్యాఖ్యలు చేశారు. విశాఖలో వందల ఎకరాల భూములు కబ్జా అవ్వడం, స్వయంగా మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అనిత, బండారు సత్యనారాయణ మూర్తి, పంచకర్ల రమేష్‌బాబు తదితర నేతలపై ఆరోపణలు వెల్లువెత్తడం తెలిసిందే. ఈ కుంభకోణం మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి డైరెక్షన్లో మంత్రి లోకేష్ సారథ్యంలోనే జరిగినట్లు విపక్షాలు, మేధావులు, మాజీ ఉన్నతాధికారులు, అధికారులు దుయ్యబడుతున్నారు. విశాఖ జిల్లాకే చెందిన సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు మీడియా సమావేశంలోనే ఈ భూముల కబ్జాపై వాస్తవాలు వెల్లడించారు. మరోవైపు విశాఖ భూ కుంభకోణంపై సీబీసీఐడీ, సీబీఐ లేదా జట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రికి గంటా శ్రీనివాసరావు లేఖ రాసిన విషయం తెలిసిందే. -
వారిని బాబు సర్కార్ గాలికొదిలేసింది: రఘవీరా
హైదరాబాద్‌సిటీ: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మండిపడ్డారు. కౌలు రైతులను చంద్రబాబు సర్కార్ గాలికొదిలేసిందని ఆయన విమర్శించారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ఠ్రంలో 5 లక్షల హెక్టార్ల వరిసాగు తగ్గిందని ఆరోపించారు. నకిలీ విత్తనాలు రాజ్యమేలుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా కూడా లేదన్నారు. వారం లోపల రైతు సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే సోమవారం నుంచి జిల్లా కలెక్టరేట్ల ముందు నిరసనలు చేపడతామని హెచ్చరించారు. రాజధానిలో మొదలైన కబ్జాలు ఇప్పుడు రాష్ట్రం అంతా విస్తరించాయన్నారు. విశాఖలో వేల కోట్ల రూపాయల భూములను సీఎం కుమారుడు లోకేష్, మంత్రులు దొచుకుంటున్నారని ఆరోపించారు. హుద్‌హుద్ తుఫాన్ లో కొట్టుకు పోయిన భూముల డాక్యుమెంట్స్ ను టీడీపీ నేతలు తమ అక్రమాలకు ఉపయోగించుకుంటున్నారని అన్నారు. ఒక్క విశాఖలోనే రూ.లక్ష కోట్ల భూకుంభకోణం జరిగిందని, సిట్ ను రెండు గ్రామాల స్కామ్ కు పరిమిత చేస్తూ.. కేసు నీరుగారుస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సిట్ తో జరిగేది శూన్యమన్నారు. హైకోర్టు పర్యవేక్షణ లో సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయాలని లేదంటే సీబీఐతో విచారణ చేయించాలని అడిగారు. విశాఖ కలెక్టర్ పై సీఎం వత్తిడి చేస్తున్నారని, చినబాబు జ్యోక్యంతో కలెక్టర్ స్వేచ్చగా వ్యవహరించలేక పోతున్నారని చెప్పారు. మా దగ్గర ఉన్న ఆధారాలను రేపు కలెక్టర్ కు ఇస్తామని తెలిపారు. ఈ విషయంపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను తండ్రీ కుమారులు, పాతర వేస్తున్నారని ఆరోపించారు. -
భూ కుంభకోణాలపై చర్చ జరపాలి
చంద్రబాబుకు బీజేపీ ఎమ్మెల్సీ సోము లేఖ సాక్షి, రాజమహేంద్రవరం: విశాఖపట్నంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న భూ కుంభకోణాలపై అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబుకు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విజ్ఞప్తి చేశారు. విశాఖ భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపి ప్రజలకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం కలిగించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆదివారం సీఎంకు రాసిన లేఖలోని వివరాలను రాజమహేంద్రవరంలో విలేకర్లకు వెల్లడించారు. తల్లిగా కొలిచే భూమిని సేకరించి కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి కోట్ల రూపాయలు రుణాలుగా తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అల్లుడు ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి రూ.వేల కోట్ల విలువైన భూములు ఆక్రమించుకోవడం విస్మయం కలిగిస్తోందన్నారు. విశాఖ భూ కుంభకోణంలో రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు స్వయంగా సీబీఐ విచారణ కోరినప్పుడు ఇక ఇబ్బందేముందని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో విశాఖలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలిస్తే, ఆ పార్టీ వారు ఇక్కడ మకాం వేస్తారని, ఇక్కడి భూములు ఆక్రమించుకుంటారని చేసిన ప్రచారమే తమ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపునకు ప్రధాన కారణమని సోము వీర్రాజు అన్నారు. అప్పుడు ఎన్నికల్లో అలా ప్రచారం చేసినవారే ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా భూములు ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. -
విశాఖ భూ కుంభకోణంపై సిట్ విచారణ
అమరావతి : విశాఖ జిల్లా మధురవాడ, కొమ్మాది ప్రాంతాల్లో భూముల రికార్డులు తారుమారు(టాంపరింగ్) అయినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైందని డీజీపీ నండూరి సాంబశివరావు స్పష్టం చేశారు. భూ కుంభకోణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సోమవారం నుంచి దర్యాప్తు చేపడుతుందని చెప్పారు. భూముల అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం నిర్వహించిన సమావేశంలో సిట్ దర్యాప్తు, రికార్డుల టాంపరింగ్‌పై తీసుకోవాల్సిన చర్యలను వివరించారని డీజీపీ చెప్పారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో డీజీపీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సిట్ విచారణకు ముందే తాము ప్రాథమిక సమాచారం సేకరించామని చెప్పారు. భూముల రికార్డుల తారుమారు, అక్రమాలపై ఇప్పటికే మూడు కేసులు నమోదు అయ్యాయన్నారు. మధురవాడ, కొమ్మాది ప్రాంతాలకు చెందిన భూములకు సంబంధించి 25 రికార్డులు తారుమారు(టాంపరింగ్) జరిగినట్టు గుర్తించమన్నారు. మధురవాడలో 178 ఎకరాలు, కొమ్మాదిలో 92 ఎకరాలు మొత్తం 270 ఎకరాలకు సంబంధించిన రికార్డులు తారుమారు చేశారని చెప్పారు. వాటిలో 265 ఎకరాలు ప్రభుత్వ భూములు కాగా, మరో 5 ఎకరాలు ప్రైవేటు భూములు అన్నారు. వన్‌బి రికార్డుల్లో టాంపరింగ్ చేసినట్టు గుర్తించిన 29 మంది జాబితాను కూడా డీజీపీ మీడియాకు విడుదల చేశారు. భూముల రికార్డులు తారుమారైనట్టు తేలిందని, అయితే ఆ భూములను ఎవరూ ఆక్రమించలేదని, రిజిస్ట్రేషన్(ఈసీ)లో కూడా ఎవరి పేర్లు లేవని గుర్తించామన్నారు. బ్యాంకు రుణాల కోసమే ఇలా చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నామని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు చెప్పిన భూ కుంభకోణానికి రికార్డుల టాంపరింగ్‌కు సంబంధంలేదని, ఆయన ఇచ్చే ఆధారాలను బట్టి ఆ దిశగా కూడా దర్యాప్తు చేపడతామని స్పష్టం చేశారు. సిట్ లోతైన విచారణలో ఇంకా అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. రెండు నెలల్లో నివేదిక.. గతంలో సీబీఐ డీఐజీగా పనిచేసిన 2001 బ్యాచ్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు నేతృత్వం వహిస్తారన్నారు. ఆయనతోపాటు విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ సృజన, ఆర్డీవో విజయసారధి, మరో అధికారి ఈ టీమ్‌లో సభ్యులుగా ఉంటారని డీజీపీ చెప్పారు. రెండు నెలల్లో ఈ బృందం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేలా దర్యాప్తు చేస్తుందన్నారు. భూముల రికార్డులను ఆన్లైన్ చేయడంలో భాగంగా ఇటీవల విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ టాంపరింగ్ జరిగిన విషయాన్ని గుర్తించి ఫిర్యాదు చేశారని చెప్పారు. అయితే భూముల రికార్టులు ఎందుకు టాంపరింగ్ చేశారు? ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఎప్పటి నుంచి జరిగింది? అనే వివరాలు సిట్ దర్యాప్తులో తేలనుందని చెప్పారు. సిట్ అధికారులకు సమాచారం అన్ని కోణాల్లో అందించేలా వాట్సాప్ గ్రూప్, మెయిల్ వంటి వాటిని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. రాజకీయ పార్టీలు, ప్రజలు, మీడియా, బాధితులు ఎవరైనా తమ వద్ద ఉన్న సమాచారాన్ని సిట్‌కు అందించి దర్యాప్తునకు సహకరించాలని డీజీపీ కోరారు. భూముల వ్యవహారాన్ని వివాదం చేసి విశాఖకు ఉన్న మంచి పేరును చెడగొట్టవద్దని ఆయన సూచించారు. -
రాష్ట్రం మరోసారి విడిపోతుంది: సీపీఐ
విజయవాడ: విశాఖపట్టణం భూకుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయవాడలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. వేల కోట్ల రూపాయల భూకుంభకోణంలో అధికార పార్టీ నేతలూ ఆరోపణలు ఎదుర్కొంటున్నందున దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. రాజధానిలో మరో 14వేల ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని.. గతంలో సేకరించిన భూమిలో ఇంకా నిర్మాణాలు చేపట్టకపోగా.. మళ్లీ భూసేకరణ ఎందుకని ప్రశ్నించారు. అభివృద్ధి అంతా ఒకేచోట జరుగుతుందని అభిప్రాయ పడ్డారు. మిగిలిన ప్రాంతాలను విస్మరిస్తే రాష్ట్రం మరోసారి విడిపోయే ప్రమాదం ముందని ఆందోళన వ్యక్తం చేశారు. -
ఈ నెల 22న విశాఖలో మహాధర్నా: బొత్స
తిరుపతి: చంద్రబాబు సర్కార్ భూ దందాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమరభేరి మోగించింది. ఈ నెల 22న విశాఖలో అఖిలపక్షంతో కలిసి మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. శనివారం ఆయన తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ మహాధర్నాలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. భూములు కనిపిస్తే టీడీపీ నేతలు రాంబందుల్లా వాలుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భూ కబ్జాలపై తమ పోరాటం ఆగదని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలను హింసించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. విశాఖలో భూ దందాలు, కబ్జాలు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, స్థానిక నేతల కనుసన్నల్లోనే జరుగుతోందని ఆయన విమర్శించారు. అలాగే అన్యాయాన్ని నిలదీస్తే ప్రతిపక్షం అభివృద్ధికి ఆటంకం కలిగిస్తోందని విమర్శలు చేస్తున్నారని బొత్స అన్నారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని బొత్స విమర్శించారు. ఏ ఒక్క వర్గం కూడా ప్రభుత్వం పట్ల సంతృప్తిగా లేదన్నారు. చంద్రబాబువి మాటలే కానీ, చేతల్లో శూన్యమని ఎద్దేవా చేశారు. ఇటువంటి ప్రభుత్వాన్ని మునుపెన్నడూ చూడలేదని ఆయన అన్నారు. అలాగే పార్టీ నేత వెల్లంపల్లి నివాసంపై దాడి ఘటనపై ముఖ్యమంత్రి స్పందించాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. -
గంటా లేఖ వెనుక చంద్రబాబు!
విశాఖ భూకుంభకోణాన్ని నీరుగార్చే యత్నం మంత్రి గంటా లేఖ అందులో భాగమేనంటున్న టీడీపీ వర్గాలు సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో వేల కోట్ల రూపాయల విలువైన భూముల కబ్జా వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త డ్రామాకు తెరలేపారా? అకస్మాత్తుగా మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి లేఖ రాయడం ఇందులో భాగమేనా? తెలుగుదేశం పార్టీలోనే కాకుండా ఇతర వర్గాల్లోనూ ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. స్థానిక మంత్రి, అధికార పార్టీ నేతలతో పాటు స్వయంగా తన ప్రమేయం, తన కుమారుడు లోకేష్ ప్రమేయంపై ఆరోపణలు వెల్లువెత్తుతూ విపక్షాలు పోరాటాలు ఉధృతం చేస్తున్న తరుణంలో ఈ వ్యవహారాన్ని పార్టీలోని మంత్రుల మధ్య వివాదంగా మార్చి ప్రజల దృష్టిని మళ్లించడం, కుంభకోణాన్ని క్రమేణా పక్కదారి పట్టించే వ్యూహంలో భాగంగానే ఈ లేఖ డ్రామాను తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది. విశాఖలో వందల ఎకరాల భూములు కబ్జా అవ్వడం, స్వయంగా మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అనిత, బండారు సత్యనారాయణ మూర్తి, పంచకర్ల రమేష్‌బాబు తదితర నేతలపై ఆరోపణలు వెల్లువెత్తడం తెలిసిందే. ఈ కుంభకోణం మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి డైరెక్షన్లో మంత్రి లోకేష్ సారథ్యంలోనే జరిగినట్లు విపక్షాలు, మేధావులు, మాజీ ఉన్నతాధికారులు, అధికారులు దుయ్యబడుతున్నారు. విశాఖ జిల్లాకే చెందిన సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు మీడియా సమావేశంలోనే ఈ భూముల కబ్జాపై వాస్తవాలు వెల్లడించారు. భీమునిపట్నంతో సహా విశాఖలోని పలు ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతోనే భూముల కబ్జాలు జరుగుతున్నాయని ఆయన కుండబద్దలు కొట్టారు. లక్ష ఎకరాల వరకు ప్రభుత్వ భూములు కనిపించకుండా పోయాయని, రికార్డులు మాయం చేశారని, కొన్ని చోట్ల రికార్డులను తారుమారుచేశారని స్వయంగా జిల్లా కలెక్టర్ కూడా ప్రకటించారు. ఇంతలా తనపైనే భూముల కబ్జాపై రచ్చ జరుగుతున్నా నోరు విప్పని మంత్రి గంటా అకస్మాత్తుగా బుధవారం సీఎంకు లేఖ రాయడంతో పాటు దాన్ని మీడియాకు లీకు చేశారు. మంత్రి అయ్యన్నపాత్రుడు తనపై చేస్తున్న ఆరోపణల వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటోందని అందులో ఏకరవు పెట్టారు. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న గంటా ఇలా లేఖరాయడం సీఎం వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. మంత్రుల మధ్య వివాదంగా మార్చి భూముల కబ్జా వ్యవహారాన్ని పక్కదారి పట్టించేలా... జనంలో భూములపై చర్చ కాకుండా మంత్రుల విభేదాలపై చర్చ జరిగేలా చేసి ప్రజల దృష్టిని మరల్చాలన్న ఉద్దేశంతోనే ఈ లేఖను తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోందంటున్నారు. విశాఖ భూ కుంభకోణాలపై బహిరంగ విచారణ చేస్తామని మంత్రి కేఈ కృష్ణమూర్తి స్వయంగా ప్రకటించడంతో ప్రభుత్వాధినేత తీవ్ర చిక్కుల్లో పడ్డారు. బహిరంగ విచారణ సాగితే ఈ వ్యవహారం మొత్తం బట్టబయలవుతుందని భావించి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)తో విచారణ అంటూ కొత్త డ్రామాకు తెరలేపారు. మరోవైపు వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే గంటా ద్వారా లేఖను తెరపైకి తెచ్చారంటున్నారు. -
ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారు?
విశాఖపట్నం: విశాఖలో భూకబ్జాలపై సిట్ కాదు.. సీబీఐతో దర్యాప్తు జరపాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. ఈ అక్రమాల్లో పోలీసులు, రెవెన్యూ అధికారుల పాత్ర ఉందని స్వయంగా అయ్యన్నపాత్రుడే చెప్పారని, ఆ అధికారులుండే కమిటీతో విచారణ ఎలా జరిపిస్తారని ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖ భూకుంభకోణంలో మంత్రి గంటా శ్రీనివాసరావు పాత్ర ఉందని అందరూ చర్చించుకుంటున్నారని.. ఆయన వెనుక చంద్రబాబు, లోకేశ్ ఉన్నారని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయల విలువైన భూములు కబ్జాకు గురయ్యాయని ఆరోపించారు. భూముల రికార్డులు పోయిన విషయాన్ని కలెక్టరే అంగీకరించారని చెప్పారు. ఇంత పెద్ద కుంభకోణంపై తూతూమంత్రంగా విచారణ జరిపిస్తారా అని ప్రశ్నించారు. ఓఆర్ఆర్పై ఆరోపణలు వస్తే వైఎస్ రాజశేఖరరెడ్డి సీబీఐ దర్యాప్తు జరిపించారని గుర్తు చేశారు. భూముల కబ్జాపై సీబీఐ విచారణ జరిపించేందుకు భయమేందుకని నిలదీశారు. హైదరాబాద్ మియాపూర్ భూకుంభకోణంపై తెలంగాణ టీడీపీ నేతలు సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారని, ఇక్కడేమో సిట్ దర్యాప్తు జరుపుతారా అని అడిగారు. ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. అధికారుల ముసుగులో టీడీపీ నేతలు వైట్‌కాలర్ నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో విచ్చలవిడిగా దోటుకుంటున్నారని ధ్వజమెత్తారు. మొత్తం భూకబ్జాలను బయటపెట్టినా ఎందుకు స్పందించడం లేదన్నారు. పేదలకు న్యాయం జరిగే వరకు పోరాడతామని అమర్నాథ్ స్పష్టం చేశారు. -
విశాఖనూ మేసేశారు...
►పెను ‘భూ’కంపంతో విశాఖ వణికిపోతోంది. ►ప్రకృతిలో భాగమైన భూమాతను చెరబట్టేందుకు ►రాజకీయ బేహారులు సృష్టించిన భూదందాల విలయమిది. ►డీ పట్టాలు, పోరంబోకు, ఈనాం, భూదాన భూములు.. ఇలా దేన్నీ వదల్లేదు. ►వాటి అనుభవదారులు, యజమానులపై సకల మాయోపాయాలు ప్రయోగించారు. ►రూ.లక్షల కోట్ల విలువైన భూ కుంభకోణాలు... చరిత్రలో కనీవినీ ఎరుగని దోపిడీకి పాల్పడిన టీడీపీ నేతలు ► అధికారులను పావులు చేసి వేల ఎకరాలు కబ్జా ► ప్రభుత్వ భూములు తనఖా పెట్టి రుణాలు, ఎగవేతలు ► లక్ష ఎకరాల భూముల రికార్డులు గల్లంతు ► హుద్‌హుద్‌లో కొట్టుకుపోయాయని మాయమాటలు ► సూత్రధారులు ప్రభుత్వ పెద్దలే ► పాత్రధారులు జిల్లా నేతలు ► బుధవారం నాటి విశాఖ పర్యటనలో ► ఓ మంత్రి ఆద్యంతం కలెక్టర్‌తో మంతనాలు ► ఆనక భూ కుంభకోణాలే జరగలేదని కలెక్టర్ ప్రకటన ► నిండా ముంచేశారని బాధిత రైతుల ఆవేదన అడ్డగోలుగా.. అధికారం అండతో ఖాళీగా కనిపించిన భూమినల్లా కబ్జా చేసేశారు. ఓటేసిన వారిని వెన్నుపోటు పొడిచారు. బడుగుల పొట్ట కొట్టి తమ బొక్కసాలు నింపుకొన్నారు. ఇదంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే సాగింది. వారే స్కెచ్ వేశారు.. అధికారుల మెడపై కత్తి పెట్టి అమలు చేయించారు. సామాన్యుడు నెత్తీనోరూ బాదుకున్నా వినలేదు. తరతరాలుగా ఆదరువుగా ఉన్న భూముల నుంచి వారిని ఈడ్చి పారేశారు. వీఆర్వో మొదలు తహసీల్దార్ వరకు అందరినీగుప్పిట పెట్టుకుని కబ్జాకాండ సాగించారు. రాష్ట్ర చరిత్రలోనే కనీ వినీ ఎరుగని భూదోపిడీకి పాల్పడ్డారు. ప్రభుత్వ పెద్దల సహకారం లేకుండా ఇంత భారీ కుంభకోణం జరగడం అసంభవం అని రెవెన్యూ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. విశాఖపట్నం : టీడీపీ అధికారంలోకి రావడంతోనే విశాఖలో భూ దోపిడీకి బీజం పడింది. విభజన తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖను లక్ష్యంగా చేసుకున్నారు. ఆర్థిక రాజధానిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళతామని బీరాలు పలికిన అధికార పార్టీ ప్రముఖులు.. భూ మాఫియాకు ద్వారాలు తెరిచి పాతాళానికి నెట్టేశారు. ముఖ్యనేత సహకారం, చినబాబు ప్రత్యక్ష ప్రమేయంతో కబ్జాకు రాచబాట వేసుకున్నారు. నగరానికి ఈ చివర.. ఆ చివర పాగా వేశారు. రికార్డులు తారుమారు చేయడం.. సాధ్యం కాకపోతే బలవంతంగా లాక్కోవడం.. ఇదీ వారి దందా.. ల్యాండ్ పూలింగ్ ముసుగు కూడా ఈ మాఫియా ఆగడాలను బాగా కవర్ చేసింది. పూలింగ్‌లో భూములు పోతాయని బడుగు జనాలను బెదిరించడం.. కారుచౌకగా వారి భూములను లాక్కోవడం.. తిరిగి వాటినే ప్రభుత్వానికి ఎక్కువ ధరకు ఇవ్వడం ద్వారా వందల కోట్ల రూపాయలు దండుకున్నారు. భీమిలి, ఆనందపురం, విశాఖ రూరల్, పెందుర్తి మండలాల్లో ఇలాంటి భూ మాఫియా అక్రమాలు కోకొల్లలు. ‘సాక్షి’ ప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో పర్యటించినప్పుడు బాధితులు వెల్లడించిన విషయాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఒకరి బ్యాంకు ఖాతా నుంచి మరొకరి బ్యాంకు ఖాతాకు డబ్బు బదిలీ అయినంత ఈజీగా భూ రికార్డులు మారిపోయాయి. పచ్చిగా చెప్పాలంటే.. రైతు తన భూమిలో సాగు చేస్తుండగానే.. అక్కడ తహశీల్దార్ కార్యాలయాల్లో ఆ భూమి వేరొకరికి ధారాదత్తం అయిపోయింది. సొంతదారు భూమిలో ఉండగానే మరొకరు వచ్చి.. ఇది తనదని దబాయించే దారుణ పరిస్థితులు విశాఖ శివార్లలో రాజ్యమేలుతున్నాయి. తిమ్మిని బమ్మి చేసిన గంటా బంధువు విశాఖ భూముల కుంభకోణంలో మంత్రి గంటా శ్రీనివాసరావు బంధువు పరుచూరి వెంకట భాస్కరరావు కీలక పాత్ర పోషించారు. ప్రత్యూష కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన భాస్కరరావు రుణం కోసం ఇండియన్ బ్యాంకుకు భూములు కుదవ పెట్టాడు. ఆనందపురం మండలం వేములవలస గ్రామంలో 122 – 11లో 726 చదరపు గజాల భూమి, సర్వే నంబర్122–8, 9, 10, 11, 12, 13, 14, 15లలో 4.33 ఎకరాల భూములు, సర్వే నంబర్ 124–1, 2, 3, 4లలో 0.271 ఎకరాలు భూములు భాస్కరరావు కుదవపెట్టిన వాటిలో ఉన్నాయి. ఇందులో ప్రధానంగా సర్వే నంబర్ 122/9ని పరిశీలిస్తే మొత్తం 59 సెంట్ల భూమిని జాతీయ రహదారి విస్తరణ కోసం ప్రభుత్వం సేకరించింది. ప్రభుత్వం తీసుకునే సమయానికి ముందు ఇక్కడ కేవలం 7 సెంట్ల భూమి మాత్రమే పరుచూరి భాస్కరరావు పేరిట నమోదై ఉంది. మిగిలిన భూమి పూర్వం నుంచి ప్రభుత్వ భూమిగానే ఉంది. రోడ్డు విస్తీర్ణం కోసం సేకరించిన తర్వాత ప్రస్తుతం రికార్డుల్లో ఇది ప్రభుత్వ భూమిగానే నమోదై ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఒక్క సెంటు భూమి కూడా భాస్కరరావు పేరిట లేదు. ► సర్వే నంబర్ 122/10లో 47 సెంట్ల జిరాయితీ భూమి ఉండేది. ఈ భూమిని పూర్తిగా ఎన్‌హెచ్ విస్తరణలో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. రికార్డుల్లో ప్రస్తుతం ప్రభుత్వ భూమిగానే నమోదై ఉంది. ఇక్కడ కూడా భాస్కరరావు పేరిట ఒక్క గజం భూమి కూడా లేదు. ► సర్వే నంబర్ 122 – 11లో 66 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. దీంట్లో కూడా 60 సెంట్ల భూమి కోరాడ అచ్చమ్మ ఆక్రమణలో ఉన్నట్టుగా రికార్డుల్లో స్పష్టంగా ఉంది. మిగిలిన ఆరు సెంట్ల భూమి కూడా ప్రభుత్వ మిగులు భూమిగానే చూపిస్తున్నారు. కోరాడ అచ్చమ్మ ఆక్రమణలో ఉన్న 60 సెంట్ల భూమిలో ప్రస్తుతం బలహీన వర్గాల కాలనీ ఉంది. అంటే ఇక్కడ ఒక్క సెంట్ భూమి కూడా పరుచూరి భాస్కరరావు పేరిట లేదని అర్థమవుతోంది. ► సర్వే నంబర్..122/12లో 1.04 ఎకరాల భూమిలో భాస్కరరావు పేరిట 30 సెంట్ల భూమి నమోదై ఉంది. మిగిలిన భూమి ప్రభుత్వానిది. కాగా, భాస్కరరావుకు చెందిన 30 సెంట్లలో 8 సెంట్ల భూమి ఎన్‌హెచ్ విస్తరణ కోసం ప్రభుత్వం సేకరించిన భూమిలో ఉంది. కానీ ఇక్కడ ఉన్న 1.04 ఎకరాల భూమిని కూడా తనదిగానే చూపించి బ్యాంకుకు కుదవపెట్టారు. ఇలా తనవి కాని భూములనే కాదు.. ప్రభుత్వం సేకరించిన భూములను కూడా గ్యారెంటీ కింద బ్యాంకుల్లో కుదవపెట్టి రూ. కోట్ల రుణం పొందారు. ఇక్కడ విచిత్రమేమిటంటే ఎన్‌హెచ్ విస్తరణ కోసం భూసేకరణ చేసిన సంవత్సరం 2003. ప్రత్యూష కంపెనీ ఏర్పడిన సంవత్సరం 2005. రుణం పొందిన సంవత్సరం 2006. అంటే 2003 భూసేకరణలో కోల్పోయిన భూములను 2006లో రుణం కోసం కుదవపెట్టిన ఆస్తుల్లో చూపడం గమనార్హం. ఇక్కడ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. 2003లో భూసేకరణ తర్వాత రికార్డుల్లో ప్రభుత్వం ఎంత భూమి సేకరించింది. మిగిలిన భూమిలో ఎవరి పేరిట ఎంత భూమి ఉందన్న వివరాలు అడంగల్, ఎఫ్‌ఎంబీలలో నమోదు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. రెవెన్యూ అధికారుల నిర్లిప్తత భాస్కరరావుకు కలిసొచ్చింది. ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలచుకొని భూసేకరణలో కోల్పోయిన భూములను సైతం భాస్కరరావు తెలివిగా బ్యాంకులో కుదవపెట్టి రుణాలు పొందారు. మరో పక్క ప్రభుత్వ భూములను కూడా తనవిగా ఏమార్చి రుణాలు పొందడం గమనార్హం. కాగా, మంత్రి గంటా, ఆయన బంధువు భాస్కరరావు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి 1100 ఎకరాలు కబ్జా చేసినట్లు అధికార వర్గాల సమాచారం. ఇందులో మంత్రి లోకేశ్‌కూ వాటా ఉండబట్టే ఈ వ్యవహారం పెద్దది కాకుండా చక్రం తిప్పుతుండటం ప్రత్యక్షంగా కనిపిస్తోంది. బుధవారం విశాఖలో ఓ చిన్న కార్యక్రమానికి హాజరైన లోకేశ్ ఆద్యంతం కలెక్టర్‌తో మంతనాలు సాగిస్తూ భూ కుంభకోణాన్ని ఎలా పక్కదారి పట్టించారో మార్గనిర్దేశం చేశారు. లోకేశ్ అక్కడి నుంచి బయలు దేరిన వెంటనే.. విశాఖలో ఎలాంటి భూకుంభకోణాలు జరగలేదని కలెక్టర్ ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. సీఎం, మంత్రులు సూత్రధారులు విశాఖ జిల్లాలో భూ దందాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా అధికార టీడీపీ వారే. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అయన తనయుడు, మంత్రి లోకేశ్, మరో మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిపై ప్రజలు, రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. టీడీపీకే చెందిన మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, బీజేపీ శాసనసభాపక్ష నేత ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు సందర్భం వచ్చినప్పుడల్లా ఈ వ్యవహారంపై ఆరోపణలను గుప్పిస్తున్నారు. మంత్రి గంటా బంధువులు, అనుచరులపై వస్తున్న ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. బ్యాంకులకు ఎగనామం పెట్టిన వ్యవహారంలో గంటా సమీప బంధువు పరుచూరి భాస్కరరావు వ్యవహారం ఇటీవలే రచ్చకెక్కింది. భీమిలి ప్రాంతంలో ఏ రైతునడిగినా.. భాస్కరరావుపై ఆరోపణలు చేస్తున్నారు. అధికారులను చెప్పుచేతల్లో పెట్టుకొని తమ పొట్టకొట్టారని, టీడీపీకి ఓటు వేసిన వారినే దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేతిలో అధికారులు.. అడ్డగోలుగా దందాలు టీడీపీ అధికారంలోకి రాగానే జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు ముందుగా దృష్టి పెట్టింది రెవెన్యూ శాఖపైనే. ఆర్డీవో, తహసీల్దార్ల పోస్టుల్లో తాము చెప్పింది చెప్పినట్లు చేసే వారిని నియమించుకున్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చే నాటికి విశాఖ ఆర్డీవోగా ఉన్న మురళిని కొనసాగించాలని మంత్రి గంటా శ్రీనివాసరావు గట్టి పట్టుపట్టారు. మరో మంత్రి అయ్యన్న పాత్రుడు మాత్రం ఆయన్ను బదిలీ చేయాల్సిందేనని ప్రభుత్వ పెద్దల వద్ద డిమాండ్ చేశారు. అయ్యన్న మంత్రాంగమే ఫలించి మురళి బదలీ అయినప్పటికీ గంటా మరో విధంగా చక్రం తిప్పారు. కొన్ని రోజులపాటు పోస్టు ఖాళీగా ఉండే విధంగా తన పరపతి ఉపయోగించారు. ఆ తర్వాత కొన్ని నెలలకు ఇప్పుడున్న వెంకటేశ్వర్లును ప్రభుత్వం ఆర్డీవోగా నియమించింది. ఆ తర్వాత గంటా వర్గానికి రెవెన్యూ యంత్రాగం సాగిలపడిందనే వాదనలు ఉన్నాయి. అనుకున్నదే తడవుగా రికార్డులు పుట్టించడం, అవసరమైతే వాటిని తారుమారు చేయడం, కావాల్సిన పేరు మీద పట్టాలు పుట్టించడం.. ఇలా ఒకటేమిటి జరగని అక్రమమంటూ లేదని సాక్ష్యాలతో సహా బట్టబయలవుతున్నాయి. ఆ సీట్లు .. అక్రమాల పుట్టలు భీమిలి, ఆనందపురం, విశాఖ రూరల్ తహశీల్దార్ కార్యాలయాలు మూడేళ్లుగా పచ్చనేతల పాలిట కల్పవృక్షాలుగా మారిపోయాయి. అక్రమాల పుట్టలుగా తయారయ్యాయి. వీటి పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు వీటికి ఏమాత్రం తీసిపోవు. ప్రధానంగా భీమిలి తహసీల్దార్ కార్యాలయంలో మూడేళ్లలో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఇక్కడ పని చేసిన వారు, బదిలీపై వెళ్లిన వారిలో చాలా మంది ఏసీబీ కేసుల్లో, అక్రమాస్తుల కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. ఇక్కడ పని చేస్తున్న కాలంలో ఓ తహసీల్దార్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. తర్వాత వచ్చిన ఇద్దరు తహసీల్దార్లు ఎక్కువకాలం కొనసాగలేదు. ఆ తర్వాత వచ్చిన బీటీవీ రామారావు అవినీతి, అక్రమాల్లో రికార్డులు సృష్టించారని చెప్పొచ్చు. దాదాపు రూ.100 కోట్ల మేర అక్రమంగా ఆస్తులు సంపాదించారని ఏసీబీ సోదాల్లో బయటపడింది. రికార్డుల్లో యజమాని ఫొటో తొలగించి ఇంకుపోసిన సంఘటనలు రామారావు హయాంలోనే జరిగాయి. భీమిలి సమీపంలోని చిప్పాడకు చెందిన 37 ఎకరాల వ్యవహారంలో జరిగిన అవకతవకలు ఎవరినైనా షాక్‌కు గురి చేస్తాయి. పూసపాటి సీతారామారాజు అనే వ్యక్తి తన హక్కుల కోసం విజయనగరం మన్సాస్ ట్రస్ట్‌తో దశాబ్దాల కాలంగా పోరాటం చేస్తున్న సమయంలోనే.. ఈ భూమి కలిదిండి రమాదేవి పేరిట బదిలీ అయిపోయింది. ఈమె వెంటనే మరొకరికి విక్రయించేశారు. మన్సాస్ ట్రస్టు ఇచ్చినట్లుగా చెబుతున్న ఎన్వోసీ ఆధారంగా ఈ భూముల రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. రాష్ట్రంలో ఎన్వోసీ ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేసిన ఘటన ఇదేనని స్వయంగా రెవెన్యూ వర్గాలే చెబుతున్నాయి. ఈ ఒక్క స్కాం విలువే సుమారు రూ.40 కోట్లుపైగా ఉంటుంది. ఇది తహసీల్దార్ రామారావు హయాంలో జరిగిన ఓ కుంభకోణం మాత్రమే. 59 రోజులపాటు చార్జి ఇవ్వని తహసీల్దార్ విశాఖ రూరల్ తహసీల్దార్ కార్యాలయం కూడా అక్రమాల గని. ఇక్కడ తహసీల్దార్‌గా పని చేసిన లాలం సుధాకర్ నాయుడు విశాఖ జెడ్పీ చైర్పర్సన్ లాలం భవానీకి స్వయాన మరిది. టీడీపీ నేత లాలం భాస్కరరావుకు స్వయాన సోదరుడు. మంత్రి గంటాకు, అతని వర్గానికి అత్యంత అనుకూలంగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకున్నారనే అభియోగాలు సుధాకర్ నాయుడుపై ఉన్నాయి. ఆయన ఆస్తులపై దాడులు చేయాలన్న డిమాండ్లు చాలా కాలంగా వివిధ రాజకీయ, ప్రజాపక్షాల నుంచి వస్తున్నాయి. ఇంతటి ఘనుడైన సుధాకర్ నాయుడును విశాఖ రూరల్ తహసీల్దారుగా బదిలీ చేసిన తర్వాత దాదాపు 59 రోజులపాటు ‘కీ’ అప్పగించలేదు. రెవెన్యూ రికార్డులు, డిజిటల్ సిగ్నేచర్‌కు సంబంధించి ఈ కంప్యూటర్ కీ ఉంటేనే పని సాధ్యం. కొత్త తహసీల్దార్ వచ్చినా 59 రోజులపాటు కీ అప్పగించకపోవడం వెనక చాలా వ్యవహారాలు నడిచాయన్న విమర్శలు గట్టిగా వినిపించాయి. ఈయన తరువాత వచ్చిన శంకర్రావు అనే తహశీల్దార్‌కు కూడా గతంలో సస్పెండ్ అయిన చరిత్ర ఉంది. ఇలాంటి వ్యక్తిని మళ్లీ విశాఖకు తీసుకురావడం విమర్శలకు దారి తీయడంతో తిరిగి ఆయన్ను శ్రీకాకుళం జిల్లాకు పంపారు. ఆ తర్వాత సుధాకర్ నాయుడే ఇన్చార్జిగా వ్యవహరించారు. పది రోజుల కిందట జరిగిన బదిలీల్లో సదరు సుధాకర్‌నాయుడును విశాఖకు ఆనుకునే ఉన్న పెందుర్తి తహసీల్దార్‌గా నియమించడం గమనార్హం. తహసీల్దార్ కార్యాలయాలు అధికార పార్టీ నేతల చేతుల్లో చిక్కుకున్నాయనడానికి సుధాకర్ నాయుడు వ్యవహారమే ఉదాహరణ. వీరే ఇంత సంపాదిస్తే.. ఇక వారు? ఏసీబీ దాడిలో ఓ తాహసీల్దార్ 100 కోట్ల రూపాయల ఆస్తులతో పట్టుబడ్డారంటే అంతా నివ్వెరపోయారు. వీరే ఇంతగా సంపాదిస్తే వీరి వెనుక ఉండి దందాలు నడిపించిన ప్రభుత్వ పెద్దలు ఎన్ని వేల కోట్లు.. కాదు.. కాదు.. లక్షల కోట్లు వెనకేసుకుని ఉంటారో స్పష్టమవుతోంది. ఒక్క విశాఖ జిల్లాలోనే వ్యవహారం లక్షల కోట్లలో ఉంటే, ఇంకా బయట పడని వ్యవహారాలు ఇతర జిల్లాల్లో ఇంకెన్ని ఉన్నాయో అని జనం చర్చించుకుంటున్నారు. అధికారులను పావుగా వాడుకుంటూ.. వారితో తప్పులు చేయిస్తూ.. వందల కోట్లు వెనకేసుకోవడమే ‘పెద్దలు’ పనిగా పెట్టుకున్నారు. విశాఖలో ఈ పెద్దలకు పావుగా మారిన తహసీల్దార్ల వివరాలు ఇలా ఉన్నాయి.. 1. ఎస్.సిద్ధయ్య (2014 – 15) : ఓ ప్రజాప్రతినిధికి రూ.12 లక్షలు ఇచ్చి భీమిలిలో పోస్టింగ్ ఇప్పించుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నాడు. వచ్చిన తొమ్మిది నెలల వ్యవధిలోనే భీమిలి మండలం లక్ష్మీపురంలో ఒక రైతుకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వడానికి రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. 2.ఎం.ఎ.మనోరంజని (ఆరు నెలలే పని చేశారు) : ఈమె విజయనగరం జిల్లా సాలూరు కోర్టులో నక్సలైట్ల చేతిలో హతమైన ఎస్ఐ ముద్దాడ గాంధీ భార్య. ఆ తర్వాత భీమిలి నుంచి బదలీపై వెళ్లిపోయారు. 3. బి.టి.వి.రామారావు(2015 – 17) : భీమిలి మండలంలోని పలువురు రైతులకు చెందిన భూములను వెబ్‌ల్యాండ్‌లో పేర్లు మార్చడం, డి.పట్టా భూములు, ఎండోమెంట్ భూములు, మాజీ సైనికుల భూముల రికార్డులు మార్చి మంత్రి అనుచరుడైన పరుచూరి భాస్కరరావు తదితరులకు కట్టబెట్టడంలో వివాదాస్పదుడయ్యారు. ఈయన ఏడాదిన్నర కాలంలోనే రూ.100 కోట్లు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. దీంతో ఇటీవల ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు. 4. సుమతీబాయి (పద్మనాభం మండలం – 2014 నుంచి ఇప్పటి వరకు) : గతంలో ఒకసారి లంచం తీసుకున్న కేసులో ఏసీబీకి పట్టుబడ్డారు. 2015లో మండలంలోని బి.తాళ్లవలస పంచాయతీలో ఉన్న 427 ఎకరాల నీలయమ్మ సత్రం భూములను బినామీ రైతుల పేర్లతో వన్–బిలు, పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేశారు. అనంతరం పట్టాల ద్వారా ఈ భూములను మంత్రి గంటా అండ్ కో కొనుగోలు చేసేందుకు స్కెచ్ వేశారు. ఈలోగానే ఎండోమెంట్ అధికారులు మేలుకుని ఎండోమెంట్ భూములను రైతులకు పట్టాలుగా ఇవ్వకూడదని కోర్టును ఆశ్రయించారు. 5.ఎస్వీ అంబేద్కర్ (ఆనందపురం మండలం – 2014 నుంచి ) : మంత్రి గంటాకు నమ్మినబంటు అనే ప్రచారం ఉంది. టీడీపీ భీమిలి నియోజకవర్గ కన్వీనర్, మంత్రి గంటా బంధువు పరుచూరి భాస్కరరావు, ఆ పార్టీ నేతలు కోరాడ రాజబాబు, కోరాడ నాగభూషణరావు, బంటుపల్లి మణిశంకరనాయుడుల కనుసన్నల్లోనే ఈయన పనిచేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. మండలంలో యథేచ్ఛగా భూకబ్జాలు, బంజరు, డి.పట్టా భూముల ఆక్రమణలు జరిగిపోతున్నా నిద్ర నటిస్తున్నారన్న అపవాదును మూట కట్టుకున్నాడు. -
లక్ష ఎకరాలు మాయం చేశారు: బొత్స
విశాఖ : విశాఖలో సంచలనం రేపుతున్న భూ కబ్జాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్తో పాటు కాంగ్రెస్, సీపీఎం, లోక్‌సత్తా, జనసేన, ప్రజసంఘాలు, మేథావులు పాల్గొన్నారు. టీడీపీ పాలనలో జరుగుతున్న భూ కుంభకోణాలు, కబ్జాలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... ఈ భూ కుంభకోణం వెనుక పెద్దల పాత్ర ఉందని, ప్రభుత్వంపై ఆరోపణలు వస్తే వాటిపై విచారణకు సిద్ధంగా ఉండాలని అన్నారు. భూ కుంభకోణం జరిగిందని సాక్షాత్తూ మంత్రే చెబుతున్నారు. ఒక మంత్రిపై మరో మంత్రి ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించాలన్నారు. విశాఖ భూములపై డేగల్లా వచ్చి వాలిపోతున్నారని బొత్స వ్యాఖ్యానించారు. హుద్‌హుద్ తుఫానులో రికార్డులు కొట్టుకు పోయాయని చిన్నపిల్లలకు చెప్పినట్లు కథలు చెప్పడం విడ్డూరమన్నారు. ఈ భూ దందాలపై వీధి పోరాటాలకు దిగాల్సిన అవసరం ఉందని బొత్స సత్యనారాయణ పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయన్నారు. విశాఖలో లక్ష ఎకరాలు మాయం చేశారని అన్నారు. దసపల్లా బూముల్లో టీడీపీ కార్యాలయం ఎలా కట్టారని ఆయన ప్రశ్నించారు. ఈ భూ కబ్జాపై సీబీఐ విచారణ జరిగేలా రాజకీయా పార్టీలు పోరాటాలు చేయాలని వైఎస్ఆర్ సీపీ రాజ్యసభ ఎంపీ విజయ్ సాయిరెడ్డి అన్నారు. బహిరంగ విచారణతో వాస్తవాలు వెలుగులోకి రావన్నారు. లక్ష ఎకరాల కబ్జా జరిగిందని కలెక్టరే స్వయానా చెప్పారని, అయితే లోకేశ్‌తో మంతనాలతో అనంతరం జిల్లా కలెక్టర్ మాట మార్చారన్నారు. -
‘వారిద్దరు చంద్రబాబుకు పెట్టుబడిదారులు’
విజయవాడ: విశాఖలో భూకబ్జాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేశ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సీబీఐ విచారణ జరిపితే పెదబాబు, చినబాబు, మంత్రుల పాత్ర బయటపడుతుందని అన్నారు. ఇద్దరు బాబుల కనుసన్నల్లోనే భూకబ్జాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా టీడీపీ నేతలు భూకబ్జాలకు పాల్పడుతున్నారని, సీబీఐ విచారణ జరిగితేనే వాస్తవాలు వెల్లడవుతాయన్నారు. భూముల వ్యవహారంలో చంద్రబాబు పాత్ర ఏమిటనేది తేలాలన్నారు. స్వయంగా మంత్రి అన్నయ్యపాత్రుడే కబ్జాల గురించి చెబుతున్నారని తెలిపారు. టీడీపీ మాయాగాళ్లు ఎక్కడికక్కడ భూములు కబ్జా చేస్తున్నారని అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి తెలంగాణలో అరెస్ట్ అయ్యారని తెలిపారు. చంద్రబాబుకు దీపక్ రెడ్డి, గోల్డ్‌స్టోన్ ప్రసాద్ పెట్టుబడిదారులని ఆరోపించారు. -
‘లంచాల రూపంలో కోట్లాది రూపాయలు’
అమరావతి: విశాఖ జిల్లాలో భూబకాసురులు పెట్రేగిపోతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. విశాఖ రూరల్, భీమునిపట్నం మండలాల్లో వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం సీఎం చంద్రబాబుకు ఒక లేఖ రాశారు. మధురవాడలో 10 ఎకరాల ప్రభుత్వ భూమికి టీడీపీ నాయకుడు మదమంచి రామకృష్ణ తప్పుడు పట్టా సృష్టించి అమ్మేశారని ఆరోపించారు. కోట్లాది రూపాయలు లంచాల రూపంలో చేతులు మారాయని చెప్పారు. విశాఖ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో మధురవాడ, కొమ్మాది ప్రాంతాలకు సంబంధించిన భూ రికార్డులు టాంపరింగ్ అయినట్లు జిల్లా కలెక్టర్ పత్రికాముఖంగా చెప్పారని వివరించారు. ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు. భూబకాసురులపై, సహకరించిన ప్రభుత్వ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకు వినియోగించాలని సూచించారు. -
నేను హోంమంత్రినైతే భూ కబ్జాదారుల తొక్కతీస్తా
విశాఖపట్నం : తాను హోం మంత్రినైతే విశాఖ జిల్లాలో భూకబ్జాదారుల తొక్కతీస్తానని భారతీయ జనతాపార్టీ శాసనసభాపక్ష నాయకుడు, విశాఖ ఉత్తర నియజకవర్గ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యానించారు. విశాఖలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ, భూ కుంభకోణమంతా నగరం సమీపంలోని భీమిలి ప్రాంతం చుట్టూనే తిరుగుతోందన్నారు. జిల్లా అంతటా అక్రమాలు ఉన్నా... భీమిలిలో భూ దందా పతాకస్థాయికి చేరిందన్నారు. ఆ నియోజకవర్గంలో విచ్చలవిడిగా భూ కుంభకోణం జరిగిందని అందరూ చెబుతున్నా.. ఎవరూ పెద్ద వాళ్ల పేర్లు బయటకు చెప్పడం లేదన్నారు. పక్కా ఆధారాలు తన వద్ద లేవు కాబట్టే తాను పేర్లు బయటపెట్టడం లేదని, అయితే అక్రమాలు జరిగిన మాట వాస్తవమని ఆయన స్పష్టం చేశారు. సీబీఐ విచారణ జరిగితే గానీ వాస్తవాలు బయటకు రావని అన్నారు. భీమిలి ల్యాండ్ ఫూలింగ్‌తో పాటు జిల్లాలో జరిగిన భూ కుంభకోణాలు, రికార్డుల ట్యాంపరింగ్‌పై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. భీమిలి, ముదపాక ప్రాంతాల్లో వుడా ల్యాండ్ పూలింగ్ పేరిట జరిగిన వందల రూ.కోట్ల కుంభకోణంపై తాను ఎన్నిసార్లు మొత్తుకున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదో అర్ధం కావడం లేదన్నారు. అధికారుల్లోనూ కొంతమంది అవినీతిపరులు ఉన్నప్పటికీ, రాజకీయ నేతల అండ లేకుండా రికార్డుల ట్యాంపరింగ్ చేసేంతటి ధైర్యం వారికి ఉండదని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. అయ్యన్న వ్యాఖ్యల ఆధారంగా విచారణ చేపట్టాలి: పురందేశ్వరి ఇతర ప్రాంతాల నుంచి విశాఖ వచ్చిన నేతలే భూ దందాలకు పాల్పడుతున్నారంటూ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యల ఆధారంగా ప్రభుత్వం విచారణ చేపట్టాలని కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి డిమాండ్ చేశారు. విశాఖలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో జరిగిన భూ కుంభకోణాలపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించాలన్నారు.