
ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త ఎత్తుగడ
హైదరాబాద్ : విశాఖ భూముల వ్యవహారంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘సేవ్ విశాఖ’ పేరుతో మహాధర్నాకు సిద్ధమైన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త ఎత్తుగడ వేశారు. ఆరోపణలు చేసిన మంత్రి అయ్యన్నపాత్రుడుతో ప్రెస్ మీట్ పెట్టించారు. వైఎస్ జగన్ ధర్నాపై విమర్శలకు అయ్యన్నను చంద్రబాబు ప్రయోగించారు.
ఆరోపణలు చేసిన తానే ఎలా ప్రెస్‌మీట్ పెడతానంటూ అయ్యన్న తన అనుచరుల వద్ద మల్లగుల్లాలు పడ్డారు. అయితే విధిలేని పరిస్థితుల్లో అధినేత ఒత్తిడికి తలొగ్గక తప్పలేదని మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రెస్‌మీట్ పెట్టేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. కాగా సిట్ నేతృత్వంలో నిఖార్సు అయిన విచారణ జరుగుతుందని ఆయనతో చంద్రబాబు చెప్పించే యత్నం చేశారు.
అయ్యన్నను అస్త్రంగా..
అయ్యన్నపాత్రుడు ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ... ‘విశాఖ భూముల కబ్జా గురించి మొదట స్పందించింది నేనే. నా తర్వాత మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడారు. మేమిద్దరం మాట్లాడాకే కేబినెట్‌లో చర్చించి ముఖ్యమంత్రి చంద్రబాబు సిట్ వేశారు. కబ్జాలకు పాల్పడిన నేతల పేర్లు ఉంటే సిట్‌ను కలిసి విపక్ష నేతలు ఇవ్వాలి. అన్యాయం జరిగిన ప్రజలు కూడా సిట్‌కు తమ ఆవేదనను తెలియచేయాలి. భూ కబ్జాలపై వైఎస్ జగన్ ధర్నా చేయాల్సిన అవసరం లేదు.’ అని అన్నారు.