సూత్రధారులకు క్లీన్‌చిట్‌ | SIT Report Approved by State Cabinet On Visakha land scam | Sakshi
Sakshi News home page

విశాఖపట్నం భూకుంభకోణం.. సూత్రధారులకు క్లీన్‌చిట్‌

Published Wed, Nov 7 2018 4:00 AM | Last Updated on Wed, Nov 7 2018 10:36 AM

SIT Report Approved by State Cabinet On Visakha land scam - Sakshi

విశాఖలో భూముల కుంభకోణానికి సంబంధించి గత ఏడాది జూన్‌ 9న సాక్షిలో ప్రచురితమైన కథనం క్లిప్పింగ్‌

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖపట్నం భూ కుంభకోణంపై విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నివేదిక ఎట్టకేలకు మంత్రివర్గం ముందుకొచ్చింది. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొం టున్న అధికార పార్టీకి చెందిన కీలక సూత్రధారులకు ‘సిట్‌’ క్లీన్‌చిట్‌ ఇచ్చేసింది. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన అనుచరులు, అధికార టీడీపీ ఎమ్మెల్యేలు పీలా గోవింద్, పల్లా శ్రీనివాస్, బండారు సత్యనారాయణ మూర్తి, పంచకర్ల రమేశ్, వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేశ్‌తోపాటు ఇతర నేతల పాత్ర ఉన్నట్లు వచ్చిన ఫిర్యాదులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి నారా లోకేశ్‌ కనుసన్నల్లోనే విశాఖ భూకుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. 

సిట్‌ సిఫార్సుల అమలుకు కమిటీ 
విశాఖ భూముల కుంభకోణంపై ‘సిట్‌’ విచారణ జరిపి, సమర్పించిన 300 పేజీల నివేదికను 9 నెలల తర్వాత మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. భూకుంభకోణంపై గ్రేహౌండ్స్‌ డీఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల దర్యాప్తు బృందం ఆరు నెలలపాటు విచారించి, ప్రభుత్వానికి 9 నెలల క్రితమే నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో సిట్‌ చేసిన సిఫార్సులను అమలు చేసేందుకు కేబినెట్‌ తాజాగా రెవెన్యూ, సాధారణ పరిపాలన, న్యాయ శాఖ కార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేసింది. నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని ఆదేశించింది. విశాఖ భూకుంభకోణంతో టీడీపీ ప్రజాప్రతినిధులకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేసేలా సిట్‌ పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. పలువురు అధికారులు, కిందిస్థాయి సిబ్బంది, ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక మాజీ మంత్రి, పలువురు కిందిస్థాయి నేతలను బాధ్యులుగా గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. 

మంత్రి గంటాకు సంబంధం లేదట! 
విశాఖ భూకుంభకోణంలో మంత్రి గంటా శ్రీనివాసరావు పాత్ర ఉందని పెద్దఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో మంత్రి గంటా కీలకంగా వ్యవహరించారని, ఆయన అనుచరులు పెద్దఎత్తున కబ్జాలకు పాల్పడ్డారని మంత్రివర్గంలో సీనియర్‌ సభ్యుడైన చింతకాయల అయ్యన్నపాత్రుడు స్వయంగా ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా అధికారులకు అందజేశారు. విశాఖ భూకుంభకోణాన్ని బయటపెట్టింది మంత్రి అయ్యన్నపాత్రుడే కావడం గమనార్హం. అయితే, మంత్రి గంటా, ఆయన అనుచర బృందానికి భూముల అవకతవకలు, ట్యాంపరింగ్‌తో సంబంధం లేదని ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో సిట్‌ దర్యాప్తు సమయంలోనే తేల్చింది. దాన్నే నివేదిక రూపంలో ప్రభుత్వానికి సమర్పించింది. దీంతో వేలాది ఎకరాల భూముల ట్యాంపరింగ్‌కు సూత్రధారులైన మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన అనుచరులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు క్లీన్‌చిట్‌ లభించినట్లయింది. 

ప్రతిపక్ష నేతలను ఇరికించిన వైనం 
తన సహచర మంత్రి భూకబ్జాలకు పాల్పడినట్లు స్వయంగా మరో మంత్రే  ఫిర్యాదు చేసి, ఆధారాలిచ్చినా లెక్కచేయని సిట్‌ ప్రతిపక్షానికి చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరును నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. ధర్మాన తన కుమారుడి పేరుతో భూములు కొన్నారని, ఇందులో అవకతవకలు జరిగాయని సిట్‌ పేర్కొన్నట్లు సమాచారం. మరికొందరు స్థానిక ప్రతిపక్ష నేతల పేర్లను ప్రైవేటు వ్యక్తులుగా చెబుతూ నివేదికలో ప్రస్తావించినట్లు తెలిసింది. భూకబ్జాలకు పాల్పడిన అధికార పార్టీ నేతలను వదిలేసి, ఈ వ్యవహారంతో సంబంధం లేని వ్యక్తుల పేర్లను చేర్చడం ఏమిటని పలువురు విమర్శిస్తున్నారు. 

కొన్ని రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలి 
విశాఖ భూకుంభకోణానికి సంబంధించి ముగ్గురు కలెక్టర్లు, నలుగురు జాయింట్‌ కలెక్టర్లు, 10 మంది డీఆర్‌ఓలు, 14 మంది ఆర్డీఓలు, 109 మంది ఇతర అధికారులపై కేసులు నమోదు చేయాలని సిట్‌ తన నివేదికలో ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు సమాచారం. వీరిలో పలువురు అధికారులను సస్పెండ్‌ చేయాలని, కొందరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించడంతోపాటు కొన్ని రిజిష్ట్రేషన్లను రద్దు చేయాలని సిట్‌ సిఫార్సు చేసింది. అధికారులు, ఉద్యోగులకు సంబంధించి 49 కేసులు, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి 50 కేసులు, సివిల్‌ వ్యవహారాలకు సంబంధించి 134 అంశాల్లో చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సిట్‌ నివేదికను 9 నెలల తర్వాత మంత్రివర్గ సమావేశంలో ఆమోదించడం, అందులో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును పేరును చేర్చి, ఆ విషయాన్ని మీడియాకు లీక్‌ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

భూ రికార్డుల పటిష్టత కోసం ‘సిట్‌’ సిఫార్సులు 
- 10,000 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు కబ్జాలు, వివాదాల్లో చిక్కుకున్నట్లు సిట్‌ గుర్తించింది. 
68 నిరభ్యంతర పత్రాల్లో(ఎన్‌ఒïసీలు) 55 ఎన్‌ఓసీలను అడ్డగోలుగా జారీ చేశారని గుర్తించారు. విశాఖపట్నంలో స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికుల పేరిట అడ్డగోలుగా భూ కేటాయింపులు జరిగాయని నిర్ధారణకు వచ్చారు. 
వీరికి కేటాయించిన భూముల్లో ఖాళీగా ఉన్న 70 శాతానికి పైగా భూములను ఏ విధంగా వెనక్కి తీసుకోవాలో సూచిస్తూ సిఫార్సు చేసింది. 
ఏళ్ల తరబడి కొనసాగుతున్న రెవెన్యూ చట్టంలోని లొసుగులను నియంత్రించడంలో ప్రభుత్వాల ఉదాసీనత వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని సిట్‌ తన నివేదికలో పేర్కొంది. 
- ప్రైవేటు భూముల క్రయవిక్రయాల్లో మోసాలను అరికట్టాలంటే సింగపూర్‌ తరహా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని సిఫార్సు చేసింది.
సింగపూర్‌లో ప్రభుత్వ, ప్రైవేటు భూములన్నీ నేరుగా గూగుల్‌తో అనుసంధానమవుతాయి. ఏ భూమి ఎవరి పేరిట ఉంది, అంతకముందు ఎవరి పేరిట ఉండేది అనే వివరాలన్నీ గూగుల్‌లో ఉంటాయి. భూమిని ఆన్‌లైన్‌లో విక్రయానికి పెడితే.. కొనుగోలు చేసేవారు రికార్డులను, భూమిని పరిశీలించి ఆన్‌లైన్‌లోనే పేమెంట్‌ చేస్తారు. వెంటనే సదరు భూమి గూగుల్‌ ద్వారా కొనుగోలుదారుడి పేరిట రిజిస్ట్రేషన్‌ అవుతుంది. 
భూముల రీ సర్వే జరపాలని సిట్‌ సిఫార్సు చేసింది. ఆర్థిక భారం అయినప్పటికీ ప్రత్యేక విభాగాన్ని, సిబ్బందిని ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి సర్వే చేయాలని సూచించింది. 
గ్రామాల్లో రికార్డులను పరిరక్షించేందుకు రికార్డు అసిస్టెంట్‌ నేతృత్వంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సిట్‌ పేర్కొంది. 
రెవెన్యూ చట్టాలు, అమలు తీరుతెన్నులపై రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని సూచించింది. 
ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ అధికారులు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గుతూ పెద్ద ఎత్తున రికార్డుల ట్యాంపరింగ్, భూకబ్జాలను ప్రోత్సహించారని సిట్‌ తన నివేదికలో తప్పుపట్టింది. 

భూకుంభకోణంపై వైఎస్సార్‌సీపీ పోరుబాట 
విశాఖ భూ కుంభకోణం ఓ సంచలనం. సరిగ్గా 9 నెలల క్రితం వెలుగు చూసిన రికార్డుల ట్యాంపరింగ్‌ బాగోతం రాష్ట్రాన్ని కుదిపేసింది. సరిగ్గా అదే సమయంలో ముదుపాక భూముల ఉదంతం.. ఆ వెంటనే లక్ష ఎకరాలకు సంబంధించిన రికార్డుల గల్లంతు వ్యవహారం కలకలం రేపాయి. విశాఖ భూకుంభకోణంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో సహా ఇతర విపక్షాలు, వామపక్ష పార్టీలు ఆందోళన బాట పట్టాయి. గతేడాది జూన్‌ 22న విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన మహాధర్నాలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. అధికార టీడీపీ నేతలు తిన్నదంతా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే కక్కిస్తామని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి, పార్టీ నేతలంతా ముదుపాక భూములను పరిశీలించారు. బాధితులకు అండగా నిలిచారు. రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించి విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు.

మరోవైపు సేవ్‌ విశాఖ అంటూ వైఎస్సార్‌సీపీ పెద్ద ఎత్తున ఉద్యమించింది. దీంతో నష్టనివారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జూన్‌ 20న ‘సిట్‌’ ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. సిట్‌ తన విచారణను జూన్‌ 28న ప్రారంభించింది. సిట్‌కు అందిన 2,875 ఫిర్యాదుల్లో మూడొంతులు అధికార పార్టీ నేతలపైనే ఉన్నాయి. వీటిలో 333 ఫిర్యాదులను సిట్‌ తన పరిధిలోకి తీసుకొని, మిగిలిన వాటిని రెవెన్యూ శాఖకు అప్పగించింది. ఆరు నెలలపాటు సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో వందలాది డాక్యుమెంట్లు, వేలాది భూ రికార్డులను పరిశీలించింది. ఈ ఏడాది జనవరి 29న తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. 9 నెలలుగా ఈ నివేదిక వెలుగు చూడలేదు. చివరకు మంగళవారం కేబినెట్‌లో దీన్ని ఆమోదించారు. సిట్‌ నివేదికలో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై చర్యలకు ఎలాంటి సిఫార్సులు లేవని, ప్రతిపక్ష నేతల పేర్లే ఎక్కువగా ఉన్నాయంటూ ప్రభుత్వం లీకులివ్వడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement