ఫిర్యాదులు స్వీకరిస్తున్న అధికారులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: విశాఖపట్నం జిల్లాలో జరిగిన భూ కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు శ్రీకారం చుట్టింది. ‘సిట్’ సభ్యులు... రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వైవీ అనూరాధ, జిల్లా సెషన్స్ కోర్టు రిటైర్డ్ జడ్జి టి. భాస్కర్ రావు శుక్రవారం విశాఖపట్నం చేరుకుని భూ కుంభకోణంపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం నగరంతోపాటు 13 మండలాల పరిధిలో జరిగిన అతి పెద్ద భూ కుంభకోణం సంచలనం రేపిన విషయం విదితమే. దీనిపై కేంద్ర నేర పరిశోధన సంస్థ (సీబీఐ)తో విచారణ జరిపించాలని అన్ని రాజకీయ పక్షాలు డిమాండ్ చేసినా చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. సిట్ సమరి్పంచిన నివేదికను కూడా బయట పెట్టలేదు. ఈ నేపథ్యంలో...రికార్డుల తారుమారు ద్వారా ప్రయివేటు వ్యక్తులు సొంతం చేసుకున్న ప్రభుత్వ భూములను స్వా«దీనం చేసుకోవడం, దోషులను శిక్షించడం లక్ష్యాలుగా వైఎస్ జగన్ సర్కారు రిటైర్డు ఐఏఎస్ అధికారి డాక్టర్ విజయ్ కుమార్ నేతృత్వంలో ‘సిట్’ను నియమించింది. మొదటి రోజు ఆశించిన స్థాయిలో ఫిర్యాదులు అందాయని సిట్ సభ్యులు తెలిపారు. వారంలో ఇంకా భారీగా ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉందని ‘సిట్’ అధినేత డాక్టర్ విజయ్ కుమార్ ‘సాక్షి’కి ఫోన్‌లో తెలిపారు.
టీడీపీ మాజీ ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు
తొలిరోజు టీడీపీకి చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే సత్యన్నారాయణవర్మలపై ఫిర్యాదులందాయి.
తొలిరోజు వచ్చిన ఫిర్యాదులు 79
తొలిరోజు మొత్తం 79 ఫిర్యాదులు రాగా, ఇందులో 14 సిట్, 65 నాన్ సిట్ ఫిర్యాదులుగా విభజించారు. ఏడో తేదీ వరకూ విశాఖలోని ఉడా చిల్డ్రన్ థియేటర్‌లో ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఈనెల 8,9 తేదీల్లో అదే వేదికగా ప్రజాప్రతినిధులు, సాధారణ ప్రజలు విచారణకు సూచనలు, సలహాలు కూడా ఇవ్వవచ్చు. సందేహాల నివృత్తి, సహాయం కోసం టోల్ ఫ్రీ ఫోన్ నంబర్ 1800 425 00002 లేదా 0891–2590100 నంబరులో సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment