గంటా లేఖ వెనుక చంద్రబాబు! | chandrababu behind ganta srinivasa rao letter | Sakshi
Sakshi News home page

గంటా లేఖ వెనుక చంద్రబాబు!

Published Thu, Jun 15 2017 9:33 AM | Last Updated on Tue, Sep 5 2017 1:42 PM

గంటా లేఖ వెనుక చంద్రబాబు!

గంటా లేఖ వెనుక చంద్రబాబు!

విశాఖ భూకుంభకోణాన్ని నీరుగార్చే యత్నం
మంత్రి గంటా లేఖ అందులో భాగమేనంటున్న టీడీపీ వర్గాలు


సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో వేల కోట్ల రూపాయల విలువైన భూముల కబ్జా వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త డ్రామాకు తెరలేపారా? అకస్మాత్తుగా మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి లేఖ రాయడం ఇందులో భాగమేనా? తెలుగుదేశం పార్టీలోనే కాకుండా ఇతర వర్గాల్లోనూ ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. స్థానిక మంత్రి, అధికార పార్టీ నేతలతో పాటు స్వయంగా తన ప్రమేయం, తన కుమారుడు లోకేష్‌ ప్రమేయంపై ఆరోపణలు వెల్లువెత్తుతూ విపక్షాలు పోరాటాలు ఉధృతం చేస్తున్న తరుణంలో ఈ వ్యవహారాన్ని పార్టీలోని మంత్రుల మధ్య వివాదంగా మార్చి ప్రజల దృష్టిని మళ్లించడం, కుంభకోణాన్ని క్రమేణా పక్కదారి పట్టించే వ్యూహంలో భాగంగానే ఈ లేఖ డ్రామాను తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది.

విశాఖలో వందల ఎకరాల భూములు కబ్జా అవ్వడం, స్వయంగా మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అనిత, బండారు సత్యనారాయణ మూర్తి, పంచకర్ల రమేష్‌బాబు తదితర నేతలపై ఆరోపణలు వెల్లువెత్తడం తెలిసిందే. ఈ కుంభకోణం మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి డైరెక్షన్‌లో మంత్రి లోకేష్‌ సారథ్యంలోనే జరిగినట్లు విపక్షాలు, మేధావులు, మాజీ ఉన్నతాధికారులు, అధికారులు దుయ్యబడుతున్నారు. విశాఖ జిల్లాకే చెందిన సీనియర్‌ మంత్రి అయ్యన్నపాత్రుడు మీడియా సమావేశంలోనే ఈ భూముల కబ్జాపై వాస్తవాలు వెల్లడించారు. భీమునిపట్నంతో సహా విశాఖలోని పలు ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతోనే భూముల కబ్జాలు జరుగుతున్నాయని ఆయన కుండబద్దలు కొట్టారు.

లక్ష ఎకరాల వరకు ప్రభుత్వ భూములు కనిపించకుండా పోయాయని, రికార్డులు మాయం చేశారని, కొన్ని చోట్ల రికార్డులను తారుమారుచేశారని స్వయంగా జిల్లా కలెక్టర్‌ కూడా ప్రకటించారు. ఇంతలా తనపైనే భూముల కబ్జాపై రచ్చ జరుగుతున్నా నోరు విప్పని మంత్రి గంటా అకస్మాత్తుగా బుధవారం సీఎంకు లేఖ రాయడంతో పాటు దాన్ని మీడియాకు లీకు చేశారు. మంత్రి అయ్యన్నపాత్రుడు తనపై చేస్తున్న ఆరోపణల వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటోందని అందులో ఏకరవు పెట్టారు. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న గంటా ఇలా లేఖరాయడం సీఎం వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది.

మంత్రుల మధ్య వివాదంగా మార్చి భూముల కబ్జా వ్యవహారాన్ని పక్కదారి పట్టించేలా... జనంలో భూములపై చర్చ కాకుండా మంత్రుల విభేదాలపై చర్చ జరిగేలా చేసి ప్రజల దృష్టిని మరల్చాలన్న ఉద్దేశంతోనే ఈ లేఖను తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోందంటున్నారు. విశాఖ భూ కుంభకోణాలపై బహిరంగ విచారణ చేస్తామని మంత్రి కేఈ కృష్ణమూర్తి స్వయంగా ప్రకటించడంతో ప్రభుత్వాధినేత తీవ్ర చిక్కుల్లో పడ్డారు. బహిరంగ విచారణ సాగితే ఈ వ్యవహారం మొత్తం బట్టబయలవుతుందని భావించి, స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌)తో విచారణ అంటూ కొత్త డ్రామాకు తెరలేపారు. మరోవైపు వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే గంటా ద్వారా లేఖను తెరపైకి తెచ్చారంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement