‘చంద్రబాబు అహంకారంతో మాట్లాడుతున్నారు’
విశాఖ : చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తన ఆస్తి ఎంతో చెప్పాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు ఆస్తి అమాంతం పెరిగిందని, రెండెకరాల ఆస్తి కాస్తా ఇప్పుడు లక్షల కోట్లకు ఎలా అయ్యిందని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు దమ్ముంటే ఆయన ఆస్తులతో ముందుకు రావాలని...ప్రజాకోర్టులో తేల్చుకుందామని సవాల్ విసిరారు.
విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ముఖ్యమంత్రి అహంకారంతో మాట్లాడుతున్నారని, ఆయన పాలన అంతా శంకుస్థాపనలకే పరిమితం తప్ప, ప్రారంభోత్సవాలు లేవని ఆయన ఎద్దేవా చేశారు. ప్రపంచంలో మేటి రాజధాని అంటూ ప్రజలకు లేనిపోని ఆశలు కల్పిస్తూ మాటలతో కాలం గడుపుతున్నారే తప్ప.... అధికారంలోకి వచ్చి 39 నెలలవుతున్నా ఇంతవరకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.
చంద్రబాబు తన ధనదాహం, ప్రచార ఆర్భాటం కోసం ప్రజలను మోసం చేస్తున్నాడని బొత్స మండిపడ్డారు. రాజధాని డిజైన్లకు ఇంజినీర్లను కాదని సినిమా వాళ్లను సంప్రదించడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రం ఎటు వెళ్తోందని, ఏమిటీ మేధావి తనమని బాబుపై నిప్పులు చెరిగారు. తమకీ రంగంలో ప్రాధాన్యత లేదని సినిమా డైరెక్టర్లు చెబుతుంటే బాబు వాళ్ల సలహాల కోసం వెంపర్లాడడంలో ఉద్దేశ్యమేంటని ప్రశ్నించారు. ప్రజల అవకాశాలను క్యాష్ చేసుకోవడానికే బాబు ఇలాంటి చీఫ్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని, ముఖ్యమంత్రికి ఇది తగదని బొత్స హితవు పలికారు.
ముఖ్యమంత్రి తీరును చూసి మేధావులు, నిపుణులు, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. చంద్రబాబుకు ఎంత సేపు తన స్వార్థ ప్రయోజనాలే తప్ప.... దేశంలో మేటి రాజధానిగా ఏపీని చేయాలన్న చిత్తశుద్ధి లేదన్నారు. ఏనాడైతే సింగపూర్ కంపెనీకి సమగ్ర నివేదిక తయారుచేయడానికి ఇచ్చారో ఆరోజే బాబు డొల్లతనం బయటపడిందన్నారు. రాష్ట్రంలో దురదృష్టకర పరిణామాలు ఉన్నాయన్నారు. చంద్రబాబు అండ్ కో తమ ధన దాహం కోసం విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీశారన్నారు. విశాఖ భూ కుంభకోణాలపై సిట్ వేసి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఫిర్యాదులపై సిట్ ఏం చేస్తుందో వెల్లడించాలని అన్నారు.