
ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారు?
విశాఖపట్నం: విశాఖలో భూకబ్జాలపై సిట్ కాదు.. సీబీఐతో దర్యాప్తు జరపాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ డిమాండ్ చేశారు. ఈ అక్రమాల్లో పోలీసులు, రెవెన్యూ అధికారుల పాత్ర ఉందని స్వయంగా అయ్యన్నపాత్రుడే చెప్పారని, ఆ అధికారులుండే కమిటీతో విచారణ ఎలా జరిపిస్తారని ప్రశ్నించారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖ భూకుంభకోణంలో మంత్రి గంటా శ్రీనివాసరావు పాత్ర ఉందని అందరూ చర్చించుకుంటున్నారని.. ఆయన వెనుక చంద్రబాబు, లోకేశ్ ఉన్నారని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయల విలువైన భూములు కబ్జాకు గురయ్యాయని ఆరోపించారు. భూముల రికార్డులు పోయిన విషయాన్ని కలెక్టరే అంగీకరించారని చెప్పారు. ఇంత పెద్ద కుంభకోణంపై తూతూమంత్రంగా విచారణ జరిపిస్తారా అని ప్రశ్నించారు. ఓఆర్‌ఆర్‌పై ఆరోపణలు వస్తే వైఎస్ రాజశేఖరరెడ్డి సీబీఐ దర్యాప్తు జరిపించారని గుర్తు చేశారు.
భూముల కబ్జాపై సీబీఐ విచారణ జరిపించేందుకు భయమేందుకని నిలదీశారు. హైదరాబాద్ మియాపూర్ భూకుంభకోణంపై తెలంగాణ టీడీపీ నేతలు సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారని, ఇక్కడేమో సిట్ దర్యాప్తు జరుపుతారా అని అడిగారు. ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. అధికారుల ముసుగులో టీడీపీ నేతలు వైట్‌కాలర్ నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో విచ్చలవిడిగా దోటుకుంటున్నారని ధ్వజమెత్తారు. మొత్తం భూకబ్జాలను బయటపెట్టినా ఎందుకు స్పందించడం లేదన్నారు. పేదలకు న్యాయం జరిగే వరకు పోరాడతామని అమర్‌నాథ్ స్పష్టం చేశారు.