
‘వారిద్దరు చంద్రబాబుకు పెట్టుబడిదారులు’
విజయవాడ: విశాఖలో భూకబ్జాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేశ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సీబీఐ విచారణ జరిపితే పెదబాబు, చినబాబు, మంత్రుల పాత్ర బయటపడుతుందని అన్నారు. ఇద్దరు బాబుల కనుసన్నల్లోనే భూకబ్జాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా టీడీపీ నేతలు భూకబ్జాలకు పాల్పడుతున్నారని, సీబీఐ విచారణ జరిగితేనే వాస్తవాలు వెల్లడవుతాయన్నారు. భూముల వ్యవహారంలో చంద్రబాబు పాత్ర ఏమిటనేది తేలాలన్నారు. స్వయంగా మంత్రి అన్నయ్యపాత్రుడే కబ్జాల గురించి చెబుతున్నారని తెలిపారు. టీడీపీ మాయాగాళ్లు ఎక్కడికక్కడ భూములు కబ్జా చేస్తున్నారని అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి తెలంగాణలో అరెస్ట్ అయ్యారని తెలిపారు. చంద్రబాబుకు దీపక్ రెడ్డి, గోల్డ్‌స్టోన్ ప్రసాద్ పెట్టుబడిదారులని ఆరోపించారు.