టీడీపీ సుద్దులన్నీ బీసీ నేతలకు మాత్రమేనా? | KSR Comment On Gouthu Latchanna Statue Inauguration Episode | Sakshi
Sakshi News home page

టీడీపీ సుద్దులన్నీ బీసీ నేతలకు మాత్రమేనా?

Published Fri, Dec 20 2024 6:55 PM | Last Updated on Fri, Dec 20 2024 7:14 PM

KSR Comment On Gouthu Latchanna Statue Inauguration Episode

తెలుగుదేశం పార్టీ రాను రాను మరీ సంకుచితమైన రాజకీయ పార్టీగా మారిపోతోంది. రాజకీయాలన్నీ ఎన్నికల సమయానికి మాత్రమేనని ఆ తరువాత అందరూ కలిసి పని చేయాలని సుద్దులు చెప్పిన చంద్రబాబు ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. దివంగత నేత గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ సందర్భంగా గౌడ సంఘం నిర్వహించిన సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేతలు, రాష్ట్ర మంత్రులు ఒకే వేదికను పంచుకోవడాన్ని ఆ పార్టీ నేతలు పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. నూజివీడులో జరిగిన ఈ కార్యక్రమానికి సొంత నియోజకవర్గం కావడంతో పార్థసారథి, లచ్చన్న మనవరాలిగా శిరీష వెళ్లారు. వైఎస్సార్‌సీపీ నేతలు జోగి రమేశ్‌ కూడా హాజరయ్యారు. 

అంతే.. టీడీపీ నేతలు జోగి రమేష్ వేదిక పంచుకోవడమే తప్పని, పార్ధసారథిలో వైఎస్సార్‌సీపీ వాసనలు పోలేదని, శిరీష తప్పు చేశారని టీడీపీ కులోన్మాదులు, లోకేష్‌ మెప్పుకోసం తాపత్రాయ పడుతున్న నేతలు పెద్ద ఇష్యూ చేసేశారు. అక్కడితో ఆగనూ లేదు. అదేదో పెద్ద నేరం అన్నట్లు టీడీపీ నాయకత్వం పార్ధసారథి, శిరీష్ లతో క్షమాపణ చెప్పించింది. ఎంత దారుణం! వారు కూడా తమ ఆత్మగౌరవాన్ని వదలుకుని చంద్రబాబుకు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌లకు క్షమాపణ చెప్పేశారు. అయినా సరే టీడీపీ నేతలు కొందరు పార్దసారథిని విమర్శలతో ట్రోల్ చేశారు. దీంతో ఆయన తాను ఎంత చిత్తశుద్దితో పని చేస్తున్నా టార్గెట్ బాధపడడం చూస్తే తెలుగుదేశం పార్టీలో ఉన్మాదం ఈ స్థాయికి చేరిందా? అన్న ప్రశ్న వస్తుంది. దీన్ని కులోన్మాదం అనాలా? లేక ఇంకేమైనానా? బీసీ వర్గానికి చెందిన నేతలు మాత్రమే ఇలా కలవకూడదని ఏమైనా టీడీపీ ఆంక్షలు పెట్టిందా? ఎందుకంటే.. కమ్మ, కాపు, రెడ్డి తదితర అగ్రవర్ణాలలోని టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ వారితో, ఇతర పార్టీల నేతలతో కలిసి తిరిగినా, సభలలో మాట్లాడినా, వ్యాపారాలు చేసినా అభ్యంతరం వ్యక్తం కావడం లేదు. 

గతంలో చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన జోగి రమేష్‌ను ఆహ్వానిస్తారా? అంటూ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వంటి వారు విరుచుకుపడ్డారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు అప్పట్లో ఆనాటి సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం చెబుతానంటూ నాటి మంత్రి జోగి రమేష్ చంద్రబాబుకు ఇంటికి వెళ్లారు. టీడీపీ నేతలు దీన్నే ఒక పెద్ద దాడిగా ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చాక జోగిపై కేసు కూడా పెట్టేశారు. 

అంతమాత్రాన ఆయన ఇలాంటి సభలలో పాల్గొనకూడదని అంటే దానిని ఉన్మాదం అనక ఏమంటాం? విశేషం ఏమిటంటే టీడీపీకి మద్దతు ఇచ్చే కొందరు విశ్లేషకులు కూడా చాలా పెద్ద ఘోరం జరిగిందని టీవీలలో ఇంగితం లేకుండా మాట్లాడారు. ఈనాడు పత్రిక అయితే నీచాతినీచంగా పార్థసారథి, శిరీషల ఫోటోలు వేసి ‘ఇంగితం ఉందా’ అని, కనీస ఇంగితం లేకుండా వార్త రాసింది. ఈనాడు మీడియా స్థాయి అబద్ధాలు చెబుతోందని ఇంతకాలం విమర్శించుకున్నాం కానీ.. దాని స్థాయి అట్టడుగుకు చేరిందనేందుకు ఇదో నిదర్శనంగా నిలుస్తుంది. 

చంద్రబాబు నాయుడు ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండేవారు. ఎన్.టిఆర్. తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు పార్టీలోకి రాలేదు. సినిమాలలో నటించే వారికి రాజకీయం ఏమి తెలుసు అని విమర్శలు కూడా చేశారు. కాని 1983లో టీడీపీ అధికారంలోకి రావడంతోనే బాబు పార్టీ మారిపోయారు. టీడీపీలో చేరిపోయారు. చంద్రబాబుకు పార్టీ సభ్యత్వం ఇవ్వద్దని కొందరు  సీనియర్ నేతలు అన్నా, ఎన్.టి.ఆర్. వారికేదో చెప్పి పార్టీలోకి తీసుకున్నారు. తాజా పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు ఎన్‌.టి.ఆర్‌కు ఇంగితం లేదనుకోవాలా?  పార్టీలో గ్రూపు నడిపి, చివరికి ఎన్.టి.ఆర్.పదవికే ఎసరు పెట్టిన చంద్రబాబును ఏమనాలి? ఆ సమయంలో చంద్రబాబును ఎన్.టి.ఆర్. పలురకాలుగా దూషించిన వీడియోలు ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాయి. ఎన్టీఆర్‌కు విలువల్లేవని విమర్శించిన నోటితోనే చంద్రబాబు తాము ఆయన వారసులమని కూడా ప్రకటించుకున్నారు. ఇంగితం లేనిది ఎవరికి?

ఎన్‌.టి.ఆర్‌. బతికున్నంత కాలంలో అసభ్యకరమైన కార్టూన్లూ, నగ్న కేరికేచర్లు ప్రచురించిన ఈనాడు మరణానంతరం అవసరమైనప్పుడల్లా ఆయన్ను యుగపురుషుడని కొనియాడుతూ కథనాలు రాసింది. ఇక్కడ కూడా ఇంగితం లేనిది ఎవరికి? తన రాజకీయ జీవితం మొత్తం కప్పగెంతులేసిన చంద్రబాబు ఎవరెవరిని ఎప్పుడు దూషించింది.. అదే నోటితో ఎలా పొగిడిందీ తెలియందెవరికి? అందులో ఎవరికీ ఇంగితం జ్ఞాపకం రాకపోవడమే రాజకీయ వైచిత్రి! ఇవన్నీ మరచి కేవలం జోగి రమేష్‌తో ఒక వేదిక పంచుకున్నందుకు పార్థసారథి, శిరీషలకు ఇంగితం లేదని ధ్వజమెత్తుతున్నారు. లచ్చన్న ఒక కుల నాయకుడా అని వీరు తెలివిగా ప్రశ్నిస్తున్నారు. 

ఈ ప్రమాణం అన్ని కుల సంఘాలకూ వర్తింపజేస్తున్నారా మరి? కమ్మ కుల సంఘం మీటింగ్‌లో ఎన్.టి.ఆర్. విగ్రహాన్ని మాత్రమే ఎందుకు పెట్టుకుంటున్నారు? చంద్రబాబునే ఎందుకు పొగుడుతున్నారు. కాంగ్రెస్ లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు ఆ కుల మీటింగ్‌లోకి హాజరైతే తప్పు లేదా? అంతెందుకు మాజీ మంత్రి పుల్లారావు, మరి కొందరు టీడీపీ నేతలు గుంటూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి వ్యాపారాలు చేస్తుండే వారు అంటారు. వంగవీటి రంగ హత్య గురించి బాబుకు ముందే తెలుసన్న తీవ్ర విమర్శలతో చేగొండి హరిరామయ్య పుస్తకం రాస్తే దాని ఆవిష్కరణ సభకు టీడీపీ, వైఎస్సార్‌సీపీ, బీజేపీ పక్షాల నేతలందరూ హాజరయ్యారే.... టీడీపీ అప్పుడు ఎవరితోనూ  క్షమాపణ చెప్పించ లేదే! 

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పుట్టిన రోజు వేడకులకు రష్యా వెళ్లిన వారిలో టీడీపీ వారు కూడా ఉన్నారంటారు అంతేకాదు... టీడీపీ, వైఎస్సార్‌సీపీ నేతలు కొందరు కలిసి జూదమాడతారట. వీటికి రాని అభ్యంతరం లచ్చన్న విగ్రహావిష్కరణ సభకు వైఎస్సార్‌సీపీ నేత హాజరైతే  వచ్చిందా? రెడ్డి జన సంఘం సభలకు కూడా వివిధ పార్టీల వారు హాజరవుతుంటారు. అంతెందుకు! లచ్చన్న మరణం తర్వాత జరిగిన ఒక కార్యక్రమంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, బీవీ రాఘవులుతో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు.  అంటే చంద్రబాబు తప్పు చేసినట్లేనా? 

ఎన్నికల తర్వాత అంతా రాష్ట్రం కోసమే ఆలోచించాలని, ఎన్నికల సమయంలోనే రాజకీయాలు అని చంద్రబాబు తరచుగా ప్రచారం చేసేవారు.ఇప్పుడు ఇలా ఎందుకు వ్యవహరించినట్లు? అంటే తన కుమారుడు, మంత్రి లోకేష్ కేవలం అవగాహన రాహిత్యంతో పార్థసారథి, శిరీషలపై ఆగ్రహం వ్యక్తం చేస్తే, దానిని ఆమోదించి చంద్రబాబు కూడా మాట్లాడారా? తెలిసో, తెలియకో లోకేష్ మాట్లాడి ఉంటే సరిచేయాల్సిన పెద్దరికం చంద్రబాబుదే అవుతుంది కదా? అది కూడా చేయలేక పోయారంటే బాబు ఎంత నిస్సహాయంగా ఉంటున్నది అర్థం చేసుకోవచ్చు. 

జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర ఖజానాకు మేలు చేసే లక్ష్యంతో రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్‌గా నవయుగ సంస్థను తప్పించి మెగా సంస్థను ఎంపిక చేశారు. దీన్ని చంద్రబాబుసహా పలువురు టీడీపీ నేతలు విమర్శించారు. కానీ ఇప్పుడు అదే మెగా సంస్థ అధినేత కృష్ణారెడ్డితో కలిసి చంద్రబాబు టూర్ చేస్తున్నారు. కృష్ణారెడ్డి స్వస్థలమైన డోకిపర్రులోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి చంద్రబాబు వెళ్లారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు కృష్ణారెడ్డి మంచివాడైపోయారా? మామూలుగా అయితే ఎవరూ వెళ్లవద్దని అనరు. కాని నూజివీడు ఘటన తర్వాత ఇవన్ని ప్రశ్నలు  అవుతాయి.   

2019 కి ముందు ఎన్ని ఘటనలు జరిగాయి. ప్రస్తుతం అలయ్ బలయ్ అంటున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు అప్పట్లో ఎన్ని మాటలు అనుకున్నారు. మళ్లీ అదే  పవన్ కళ్యాణ్ కోసం చంద్రబాబు ఎంత తాపత్రయపడింది తెలుసు కదా? అలాగే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు, లోకేష్ లను ఎన్నేసి మాటలు అన్నారు. అసలు తన తల్లినే  దూషించారని టీడీపీపై ఆరోపించారు. కాని ఏ ఇంగితం పెట్టుకుని మళ్లీ కలిశారని అంటే ఏమి చెబుతాం. బీజేపీతో తేడా వచ్చాక బీజేపీ అధ్యక్ష హోదాలో తిరుపతి వచ్చిన అమిత్ షాపై టీడీపీ వారు రాళ్లు వేశారు. ప్రధాని మోడీని చంద్రబాబు, బాలకృష్ణ తదితరులు దూషించారు. 

దేశ ప్రధానిని పట్టుకుని టెర్రరిస్టు, పెళ్లాన్ని ఏలుకోలేని వాడు అంటూ పరుష పదాలతో మాట్లాడిన వీరు, తర్వాత కాలంలో మోడీ అంత గొప్పవాడు లేడని చెబుతున్నారు. అమిత్ షా అప్పాయింట్ మెంట్ కోసం రోజుల తరబడి డిల్లీలో ఎదురు చూశారు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు స్వయంగా లోకేష్ డిల్లీ వెళ్లి, తన పెద్దమ్మ సాయంతో అమిత్ షాను కలిసి వచ్చారే! ఇందులో ఎవరికి ఇంగితం ఉన్నట్లు?ఎవరికి లేనట్లు? చంద్రబాబు ఎవరినైనా ఏమైనా అనవచ్చు. ఎవరితోనైనా జట్టు కట్టవచ్చు? అది గొప్పతనం. ఆయన తిడితే అంతా తిట్టాలి. ఆయన పొగిడితే అంతా పొగడాలి. ఎటు తిరిగి ఆయన చేతిలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి భజన మీడియా ఉంది కనుక ఏమి చేసినా చెల్లిపోతోంది.

పార్థసారథి తండ్రి కెపి రెడ్డయ్య గతంలో కాంగ్రెస్, టీడీపీలలో పనిచేశారు. ఎంపీగా పీవీ నరసింహారావు ప్రభుత్వాన్ని కాపాడడానికి మరి కొందరితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. అప్పట్లో రెడ్డయ్యపై టీడీపీ వారు ఆరోపణలు చేసేవారు. అయినా రెడ్డయ్య వాటన్నిటిని ధీటుగా ఎదుర్కునేవారు. రెడ్డయ్య నోటికి అంతా భయపడే పరిస్థితి ఉండేదని చెబుతారు. ఇప్పుడు ఆయన కుమారుడు పార్థసారథి కూడా ఒకరకంగా అదే ఆత్మగౌరవ సమస్యను ఎదుర్కుంటున్నారు. కాంగ్రెస్ లోను, ఇప్పుడు టీడీపీలోను మంత్రిగా ఉన్నారు. శిరీష తండ్రి గౌతు శివాజి కూడా ఆరుసార్లు టీడీపీ ఎమ్మెల్యే. అలాంటి కుటుంబానికి చెందిన శిరీషను టీడీపీ నాయకత్వం అవమానించి క్షమాపణ కోరుతుందా?

ఒకప్పుడు సమరసింహా రెడ్డి మంత్రిగా ఏదో కాకతాళీయంగా మరో మంత్రి కటారి ఈశ్వరకుమార్‌తో మాట్లాడుతూ బీసీలా..వంకాయలా అని  అన్నారు. అది కాంగ్రెస్ లో పెద్ద దుమారం రేపింది. చంద్రబాబు నాయుడు గత టరమ్ లో బీసీ నేతలు కొందరు సచివాలయానికి వస్తే దేవాలయంవంటి ఇక్కడకు వచ్చి ప్రశ్నిస్తారా? అని మండిపడ్డారు. మరో సందర్భంలో మత్యకారులను ఉద్దేశించి తోకలు కట్ చేస్తానని అనడం వివాదాస్పదమైంది. ఈ మధ్యనే  కాకినాడ సీపోర్టు యజమాని కేవీ రావు పై అభియోగాలు చేస్తూ లేఖ రాసిన సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూడా టీడీపీ కులోన్మాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కున్నారు. 

అవమానాలకు గురి కావల్సి వచ్చింది. టీడీపీ బీసీ నేతలు ఇలాంటి వాటిని భరిస్తుండడం విశేషం. కనీసం ధైర్యంగా తాము తప్పు చేయలేదని చెప్పలేకపోతున్నారు. మరో వైపు జగన్ బీసీలకు అత్యంత గౌరవం ఇచ్చి ఎన్నడూ లేని విధంగా వారికి నాలుగు రాజ్యసభ సీట్లు ఇచ్చి గౌరవించారు. వారిలో ముగ్గురు పార్టీని వీడడం దురదృష్టకరం. తమను గౌరవించేవారు కావాలో, లేక అవమానించేవారు కావాలో బీసీ నేతలే నిర్ణయించుకోవాలి.


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement