
సాక్షి, విశాఖపట్నం: విశాఖ భూ కుంభకోణాలపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మళ్లీ సిట్ ఏర్పాటు చేయటంతో కొందరికి కాళ్లూ,చేతులూ ఆడటం లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం వ్యాఖ్యానించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..భీమిలిలో సామాన్య ప్రజల ఆస్తులకు ఎసరు పెట్టి.. రికార్డులను తారుమారు చేశారన్నారు. లక్ష ఎకరాల ప్రభుత్వ భూములు టాంపర్ అయ్యాయని అప్పటి కలెక్టర్ వ్యాఖ్యానించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. భూ కుంభకోణం వలన విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు కూడా భూ కుంభకోణాలు జరిగాయని పదేపదే ఆరోపించేవారన్నారు. ప్రభుత్వం వేసిన సిట్ విచారణకు సహకరించడంతో పాటు, బాధితులందరూ ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. విశాఖ నగర పాలక సంస్థకు చెందిన రూ.150 కోట్ల నిధులను పసుపు-కుంకుమ పథకానికి చంద్రబాబు నాయుడు తరలించారని ఆరోపించారు. దీనిపై కూడా విచారణ జరిపించాలని జగన్నాథం డిమాండ్ చేశారు.