
వెనక్కుతగ్గని అయ్యన్నపాత్రుడు
విశాఖపట్నం సిటీ: విశాఖ భూ కుంభకోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణలో ఏ పార్టీ నేత పట్టుబడినా శిక్ష పడాల్సిందేనని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు బుధవారం చెప్పారు. ‘సిట్’ బృందానికి ప్రజలు వాస్తవాలివ్వాలని సూచించారు. ఉన్న భూములను ఎలా కాపాడడంతోపాటు భూ కుంభకోణాల నుంచి విశాఖను రక్షించాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు సిట్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.
‘సిట్’ వేసినా ప్రతిపక్షాలు ధర్నాలంటూ హడావుడి చెయ్యడం సరికాదన్నారు. విచారణలో ప్రజలకు న్యాయం జరగకపోతే ధర్నా చేపట్టాలని సూచించారు. కుంభకోణాన్ని నీరుగార్చే ఉద్దేశం టీడీపీకి లేదని, ఒకవేళ అదే ఉద్దేశం ఉంటే ‘సిట్’ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్నారు.
కాగా, టీడీపీ నేతలపై మీడియా ముఖంగా ఆరోపణలు చేసి పార్టీని, ప్రభుత్వాన్ని అయ్యన్నపాత్రుడు ఇరుకునపెడుతున్నారని ఇటీవల మంత్రి గంటా శ్రీనివాసరావు.. సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య విభేదాల పరిష్కారానికి త్రిసభ్య ఏర్పాటు చేయాలని కూడా టీడీపీ నిర్ణయించింది. ఇంత జరిగినా అయ్యన్నపాత్రుడు వెనక్కుతగ్గకపోవడం గమనార్హం.