సిట్‌కు ఎమ్మెల్యే విష్ణుకుమార్ వినతిపత్రం
విశాఖ : బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు శనివారం సిట్ అధికారులను కలిశారు. విశాఖ భూ కుంభకోణంపై ‘సిట్’ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు... ముదుపాక, చిట్టివలస, రాజవరం, మాధవధారలో జరిగిన భూ కబ్జాలు, ట్యాంపరింగ్‌పై సిట్ చీఫ్ వినిత్ బ్రిజిలాల్‌కు వినతి పత్రం అందచేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎమ్మెల్యేల సిఫారస్సులతో ప్రభుత్వ లాయర్లను నియమించడం సరికాదన్నారు. వారికి సరైన పరిజ్ఞానం ఉంటే పర్వాలేదని, లేకుంటే ప్రభుత్వ భూములు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానంలో ఉన్న న్యాయమూర్తుల సలహాలు తీసుకుని, కోర్టు పరిధిలో ఉన్న భూకేసులను ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా పరిష్కరించాలన్నారు. సుమారు 2వేల ఫిర్యాదులు అందాయంటే ఏ స్థాయిలో భూ దందాలు జరిగాయో అర్థం అవుతుందన్నారు.