విశాఖ భూ స్కాంపై పునర్విచారణ | Special investigation team on Visakha Land Scam | Sakshi
Sakshi News home page

విశాఖ భూ స్కాంపై పునర్విచారణ

Published Tue, Sep 10 2019 5:07 AM | Last Updated on Tue, Sep 10 2019 5:07 AM

Special investigation team on Visakha Land Scam - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన విశాఖపట్నం భూ కుంభకోణంలో అక్రమాలను వెలికితీయ డంతోపాటు దోషులను నిగ్గుతేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చంద్రబాబు సర్కారు హయాంలో విశాఖపట్నం జిల్లాలో భూ రికార్డుల మాయం.. ట్యాంపరింగ్‌ ద్వారా లక్ష కోట్ల రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయన్న విషయం తెలిసిందే. రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక రాజధాని అయిన విశాఖలో జరిగిన ఈ భారీ భూకుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని అన్ని రాజకీయ పక్షాలు అప్పట్లో డిమాండు చేశాయి. ఈ స్కామ్‌లో పాత్రధారులు, సూత్రధారులు అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని ఓ మంత్రి, పలువురు ఎమ్మెల్యేలేనని మీడియాలో పతాక శీర్షికల్లో వార్తలు వచ్చాయి. అధికార పార్టీలోని ఒక మంత్రి కూడా ఇదే విధమైన ఆరోపణలు బహిరంగంగానే చేశారు. నాటి సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌పై కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలొచ్చాయి. దీంతో సీబీఐకి కేసును అప్పగిస్తే ప్రభుత్వ పెద్దల బండారం బయటపడుతుందనే భయంతో విశాఖ పోలీస్‌ కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు జరిపిస్తున్నట్లు చంద్రబాబు హడావుడిగా ప్రకటించారు. అప్పటి రెవెన్యూ మంత్రి, ఉప ముఖ్యమంత్రి అయిన కేఈ కృష్ణమూర్తి విశాఖ వెళ్లి ఈ కుంభకోణానికి సంబంధించిన ఫిర్యాదులను వ్యక్తిగతంగా స్వీకరిస్తామని కూడా ప్రకటించారు. కానీ, ఆ మర్నాడే ఆయన పర్యటన వాయిదా పడేలా చంద్రబాబు ‘సిట్‌’ ప్రకటించారు. దీంతో ‘సిట్‌’ గురించి తనకు తెలీదని కేఈ స్వయంగా ప్రకటించడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చింది. మరోవైపు.. 2014లో సంభవించిన హుద్‌హూద్‌ తుపానులో రికార్డులు కొట్టుకుపోయాయంటూ కేసును నీరుగార్చేందుకు అప్పటి సర్కారు పెద్దలు యత్నించి అభాసుపాలయ్యారు. అయితే, తుపాను 2014లో సంభవిస్తే 2017 వరకూ రికార్డులు కొట్టుకుపోయినట్లు గుర్తించలేదా? అన్న ప్రశ్నకు వారి వద్ద సమాధానం కరువైంది. 

నాడు ‘సిట్‌’కు పరిమితులు
ఇదిలా ఉంటే.. ‘సిట్‌’ దర్యాప్తులో నిజాలు వెలుగుచూడకుండా అప్పటి ప్రభుత్వం అనేక పరిమితులు విధించింది. జిల్లా మొత్తానికి సంబంధించిన ఈ స్కామ్‌పై దర్యాప్తును కేవలం రెండు మూడు మండలాలకే పరిమితం చేసింది. అలాగే, ఈ బాగోతాన్ని పక్కదోవ పట్టించేందుకు 2004 నాటి నిరభ్యంతర పత్రాలనూ ‘సిట్‌’ పరిధిలోకి తెచ్చింది. కాగా, సీఎం కుటుంబంతోపాటు మంత్రులపై అభియోగాలున్నందున రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అధికారులతో దర్యాప్తు జరిపిస్తే వాస్తవాలు బయటకు రావని, సీబీఐతోనే దర్యాప్తు జరిపించాలని అప్పట్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌తోపాటు బీజేపీ, సీపీఐ, సీపీఎం.. ప్రజా సంఘాలు డిమాండు చేశాయి. అలాగే, అసైన్డ్‌ భూములను కొనుగోలు చేసి విశాఖపట్నం పట్టణాభివృద్ధి సంస్థ (వుడా)కు భూ సమీకరణ కింద ఇచ్చి వందల కోట్ల విలువైన భూమిని అప్పట్లో ఒక టీడీపీ నేత కొట్టేశారని కూడా ఆధారాలతో సహా వార్తలొచ్చాయి. వీటన్నింటినీ చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా.. మధురవాడలోని 178, కొమ్మాదిలోని 92 ఎకరాలకు సంబంధించిన 25 రికార్డులు మాత్రమే టాంపరింగ్‌ అయినట్లు ‘సిట్‌’ అధికారులు ప్రకటించి తూతూమంత్రంగా నివేదికను సమర్పించారు. దీనిని కేబినెట్‌ ఆమోదించినట్లు చంద్రబాబు వెల్లడించినప్పటికీ ఆ నివేదికను మాత్రం బహిర్గతం చేయలేదు. 

పక్కా ఆధారాలతోనే పునర్విచారణ
ఈ నేపథ్యంలో.. భీమిలీ, మధురవాడ తదితర ప్రాంతాల్లో అత్యంత విలువైన భూముల రికార్డులను తారుమారు చేసి సొంతం చేసుకున్నట్లు ఒక మంత్రితోపాటు కొందరు టీడీపీ ఎమ్మెల్యేలపై పక్కా ఆధారాలున్నా వారి పేర్లు దోషుల జాబితాలో లేకుండా తప్పించినట్లు తీవ్రమైన ఆరోపణలున్నాయి. అందువల్ల ఈ బాగోతంపై మరోసారి ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా నిష్పక్షపాతంగా లోతైన విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలన్న సదుద్దేశంతో నిజాయితీ గల ఐఏఎస్, లేదా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులతో దీనిని జరిపించాలని భావిస్తున్నట్లు తెలిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement