నేను హోంమంత్రినైతే భూ కబ్జాదారుల తొక్కతీస్తా
విశాఖపట్నం : తాను హోం మంత్రినైతే విశాఖ జిల్లాలో భూకబ్జాదారుల తొక్కతీస్తానని భారతీయ జనతాపార్టీ శాసనసభాపక్ష నాయకుడు, విశాఖ ఉత్తర నియజకవర్గ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యానించారు. విశాఖలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ, భూ కుంభకోణమంతా నగరం సమీపంలోని భీమిలి ప్రాంతం చుట్టూనే తిరుగుతోందన్నారు. జిల్లా అంతటా అక్రమాలు ఉన్నా... భీమిలిలో భూ దందా పతాకస్థాయికి చేరిందన్నారు.
ఆ నియోజకవర్గంలో విచ్చలవిడిగా భూ కుంభకోణం జరిగిందని అందరూ చెబుతున్నా.. ఎవరూ పెద్ద వాళ్ల పేర్లు బయటకు చెప్పడం లేదన్నారు. పక్కా ఆధారాలు తన వద్ద లేవు కాబట్టే తాను పేర్లు బయటపెట్టడం లేదని, అయితే అక్రమాలు జరిగిన మాట వాస్తవమని ఆయన స్పష్టం చేశారు. సీబీఐ విచారణ జరిగితే గానీ వాస్తవాలు బయటకు రావని అన్నారు.
భీమిలి ల్యాండ్ ఫూలింగ్‌తో పాటు జిల్లాలో జరిగిన భూ కుంభకోణాలు, రికార్డుల ట్యాంపరింగ్‌పై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. భీమిలి, ముదపాక ప్రాంతాల్లో వుడా ల్యాండ్ పూలింగ్ పేరిట జరిగిన వందల రూ.కోట్ల కుంభకోణంపై తాను ఎన్నిసార్లు మొత్తుకున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదో అర్ధం కావడం లేదన్నారు. అధికారుల్లోనూ కొంతమంది అవినీతిపరులు ఉన్నప్పటికీ, రాజకీయ నేతల అండ లేకుండా రికార్డుల ట్యాంపరింగ్ చేసేంతటి ధైర్యం వారికి ఉండదని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు.
అయ్యన్న వ్యాఖ్యల ఆధారంగా విచారణ చేపట్టాలి: పురందేశ్వరి
ఇతర ప్రాంతాల నుంచి విశాఖ వచ్చిన నేతలే భూ దందాలకు పాల్పడుతున్నారంటూ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యల ఆధారంగా ప్రభుత్వం విచారణ చేపట్టాలని కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి డిమాండ్ చేశారు. విశాఖలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో జరిగిన భూ కుంభకోణాలపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించాలన్నారు.