సాక్షి, విశాఖ: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు రాజీనామా చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు సోమవారం సాయంత్రమే రాజీనామా లేఖను పంపించారు. ఈ అంశంపై బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు స్పందించారు. హరిబాబు రాజీనామా వెనుక రాజకీయ కోణాలు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. పార్టీ నియమాలకు కట్టుబడి ఆయన రాజీనామా చేశారన్నారు. ఆయన సమర్థవంతుడైన నాయకుడని కితాబిచ్చారు. మరోవైపు పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతిపై విచారణ చేయాలన్న తన వ్యాఖ్యాలకు కట్టుబడి ఉన్నట్టు ఆయన తెలిపారు. పట్టిసీమ అక్రమాలపై ఇతర పార్టీలు స్పందించాలి ఆయన కోరారు.
కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని కంభంపాటి హరిబాబును ఎవరు ఒత్తిడి తేలేదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్ కిశోర్ స్పష్టం చేశారు. పార్టీ ఆలోచనకు అనుగుణంగానే హరిబాబు నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తోందన్నారు. దీనికి వెసులుబాటు కల్పిస్తూనే హరిబాబు రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికలకు సన్నద్దం కావడానికి ఆయన స్వచ్ఛందంగానే రాజీనామా చేశారని పేర్కొన్నారు. త్వరలోనే అమిత్ షా కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment